వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు   | Neem Products .. Insecticides | Sakshi
Sakshi News home page

వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు

Published Tue, Mar 20 2018 7:56 AM | Last Updated on Tue, Mar 20 2018 7:56 AM

Neem Products .. Insecticides - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జగిత్యాల అగ్రికల్చర్‌: వేప చెట్టును నీడనిచ్చే చెట్టుగానే కాకుండా, వేప ఉత్పత్తులు అద్భుత కీటకనాశనులుగా పనిచేస్తున్నాయి. పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల నివారణకు పురుగుమందులకు బదులు, వేప పిండి, వేప నూనెలు వాడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వేప ఉత్పత్తులు, వాటి పనితీరుపై పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త  వెంకటయ్య వివరించారు.

వృక్ష సంబంధ రసాయనాలు అంతర్భాగమే..
సమగ్ర సస్యరక్షణ విధానంలో భాగంగా వృక్ష సంబంధ రసాయనాలు వాడటం జరుగుతుంది.  ఉష్ణమండలపు వృక్షం అయిన వేప మన ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. పంటలను నాశనం చేసే 200 కీటకాలను వేప ఉత్పత్తులు అదుపు చేస్తాయి. వేప ఉత్పత్తులు వ్యవసాయంలో చక్కటి ఎరువుగా, ధాన్యం నిల్వ చేసే పదార్థంగా, పురుగు మందుల తయారీకి, నేరుగా పురుగులను అదుపు చేయడానికి, బయోమాస్‌ తయారీకి, పశువుల మేతగా, నేల కొత అరికట్టడానికి, భూములు చౌడుబారి పోకుండా, పర్యావరణంలో ఆక్సిజన్‌ లభ్యతను మెరుగుపరచడానికి, పక్షి స్థావరాలుగా, వాయు నిరోధకంగా.. చాల  ప్రయోజనాలు ఉన్నాయి.

వేపలో రసాయనాలు
వేపలో లిమినాయిడ్స్‌ అనే తొమ్మిది రసాయనాలు ఉన్నాయి. వీటిలో అజాడిరక్టిన్, శలానిన్, నింబిన్, నింబిడిన్, మిలియాంట్రియోల్‌ ముఖ్యమైనవి. పోట్టు తీసిన ప్రతీ గ్రాము వేప గింజలో 2 నుంచి 4 మిల్టీగ్రాముల అజాడిరాక్టిన్‌ ఉంటుంది. వర్షం, తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగే వేప గింజల్లో అజాడిరాక్టిన్‌ తక్కువగా ఉంటుంది.

సస్యరక్షణ చర్యలు..
1930లో వేపపిండిని వరి, చెరకు పంటల్లో కాండం తొలుచు పురుగులు, చెదల నివారణకు వాడారు. 1937లో మిడతల దండు నివారణకు వేపాకుల రసాన్ని వాడినట్లుగా తెలుస్తోంది. వేప మందులు పిచికారీ చేస్తే పంటలపై కీటకాలు దరిచేరవు. వేపలోని చెడువాసన వల్ల కీటకాలు వికర్షింపబడతాయి. అజాడిరాక్టిన్‌ కీటకాన్ని లద్దెపురుగు దశ నుంచి కోశస్థ దశకు, రెక్కల పురుగు దశకు చెరకుండా అడ్డుకుంటుంది. దీంతో, వివిధ కంపెనీలు వేప సంబంధిత పురుగుమందులను మార్కెట్లో వివిద రూపాల్లో అమ్ముతున్నారు. వేపమందు దీపపు పురుగులు, పేను, తెల్ల ఈగలు, పిండి పురుగులు, తామర పురుగులు మొదలగు వాటిన్నింటినీ అదుపు చేస్తుంది. రైతులు పొలం గట్లపై, బంజరు భూముల్లో వేప చెట్లను విస్తారంగా పెంచితే ప్రత్యక్షంగా వచ్చే అదాయంతోపాటు, పరోక్షంగా పురుగుమందులు కూడా వచ్చినట్లే. 

వేప నూనె తయారీ..
వేప గింజలను చెట్టు నుంచి రాలిన వెంటనే సేకరించాలి. రాలిన గింజలను దాదాపు 12 గంటలపాటు ఆరబెట్టి, ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. గింజల్లో తేమ 7 శాతం ఉండేలా చూసుకోవాలి. గోనెసంచుల్లో నింపి తేమ తగలకుండా భద్రపరచాలి. వేప గింజల నుంచి పలుకులను వేరు చేసి, గ్రైండర్‌లో పొడి చేసి కొద్ది కొద్దిగా> నీటిని కలుపుతూ పేస్టులాగా తయారైన దాన్ని మూట కట్టి ఒక గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత రెండు చేతులతో గట్టిగా నొక్కితే వేప నూనె బయటకు వస్తుంది. పంటలపై పిచికారీ చేయుటకు 10–20 మి.లీ వేపనూనెను లీటర్‌ నీటిలో కలిపి 10 గ్రాముల సబ్బు జతచేసి బాగా కలిపిన తర్వాత పిచికారీ చేయాలి.

వేప కషాయం తయారీ..
సాధారణంగా 5 శాతం ద్రావణాన్ని సిఫారసు చేస్తారు. కాబట్టి 50 గ్రా. వేప పలుకుల పొడిని ఒక లీటర్‌ నీటికి కలిపి ఒక రోజంతా నానబెట్టి, మరునాడు వడపోసి, సబ్బుపొడిని కలిపి పిచికారీ చేయాలి. పంటలపై పురుగుల కషాయంలోని ఆవిరిని పీల్చడం వల్ల పురుగుల శరీరంలో గ్రంథులు సక్రమంగా పనిచేయక చనిపోతాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement