Neem products
-
వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు
జగిత్యాల అగ్రికల్చర్: వేప చెట్టును నీడనిచ్చే చెట్టుగానే కాకుండా, వేప ఉత్పత్తులు అద్భుత కీటకనాశనులుగా పనిచేస్తున్నాయి. పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల నివారణకు పురుగుమందులకు బదులు, వేప పిండి, వేప నూనెలు వాడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వేప ఉత్పత్తులు, వాటి పనితీరుపై పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వెంకటయ్య వివరించారు. వృక్ష సంబంధ రసాయనాలు అంతర్భాగమే.. సమగ్ర సస్యరక్షణ విధానంలో భాగంగా వృక్ష సంబంధ రసాయనాలు వాడటం జరుగుతుంది. ఉష్ణమండలపు వృక్షం అయిన వేప మన ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. పంటలను నాశనం చేసే 200 కీటకాలను వేప ఉత్పత్తులు అదుపు చేస్తాయి. వేప ఉత్పత్తులు వ్యవసాయంలో చక్కటి ఎరువుగా, ధాన్యం నిల్వ చేసే పదార్థంగా, పురుగు మందుల తయారీకి, నేరుగా పురుగులను అదుపు చేయడానికి, బయోమాస్ తయారీకి, పశువుల మేతగా, నేల కొత అరికట్టడానికి, భూములు చౌడుబారి పోకుండా, పర్యావరణంలో ఆక్సిజన్ లభ్యతను మెరుగుపరచడానికి, పక్షి స్థావరాలుగా, వాయు నిరోధకంగా.. చాల ప్రయోజనాలు ఉన్నాయి. వేపలో రసాయనాలు వేపలో లిమినాయిడ్స్ అనే తొమ్మిది రసాయనాలు ఉన్నాయి. వీటిలో అజాడిరక్టిన్, శలానిన్, నింబిన్, నింబిడిన్, మిలియాంట్రియోల్ ముఖ్యమైనవి. పోట్టు తీసిన ప్రతీ గ్రాము వేప గింజలో 2 నుంచి 4 మిల్టీగ్రాముల అజాడిరాక్టిన్ ఉంటుంది. వర్షం, తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగే వేప గింజల్లో అజాడిరాక్టిన్ తక్కువగా ఉంటుంది. సస్యరక్షణ చర్యలు.. 1930లో వేపపిండిని వరి, చెరకు పంటల్లో కాండం తొలుచు పురుగులు, చెదల నివారణకు వాడారు. 1937లో మిడతల దండు నివారణకు వేపాకుల రసాన్ని వాడినట్లుగా తెలుస్తోంది. వేప మందులు పిచికారీ చేస్తే పంటలపై కీటకాలు దరిచేరవు. వేపలోని చెడువాసన వల్ల కీటకాలు వికర్షింపబడతాయి. అజాడిరాక్టిన్ కీటకాన్ని లద్దెపురుగు దశ నుంచి కోశస్థ దశకు, రెక్కల పురుగు దశకు చెరకుండా అడ్డుకుంటుంది. దీంతో, వివిధ కంపెనీలు వేప సంబంధిత పురుగుమందులను మార్కెట్లో వివిద రూపాల్లో అమ్ముతున్నారు. వేపమందు దీపపు పురుగులు, పేను, తెల్ల ఈగలు, పిండి పురుగులు, తామర పురుగులు మొదలగు వాటిన్నింటినీ అదుపు చేస్తుంది. రైతులు పొలం గట్లపై, బంజరు భూముల్లో వేప చెట్లను విస్తారంగా పెంచితే ప్రత్యక్షంగా వచ్చే అదాయంతోపాటు, పరోక్షంగా పురుగుమందులు కూడా వచ్చినట్లే. వేప నూనె తయారీ.. వేప గింజలను చెట్టు నుంచి రాలిన వెంటనే సేకరించాలి. రాలిన గింజలను దాదాపు 12 గంటలపాటు ఆరబెట్టి, ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. గింజల్లో తేమ 7 శాతం ఉండేలా చూసుకోవాలి. గోనెసంచుల్లో నింపి తేమ తగలకుండా భద్రపరచాలి. వేప గింజల నుంచి పలుకులను వేరు చేసి, గ్రైండర్లో పొడి చేసి కొద్ది కొద్దిగా> నీటిని కలుపుతూ పేస్టులాగా తయారైన దాన్ని మూట కట్టి ఒక గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత రెండు చేతులతో గట్టిగా నొక్కితే వేప నూనె బయటకు వస్తుంది. పంటలపై పిచికారీ చేయుటకు 10–20 మి.లీ వేపనూనెను లీటర్ నీటిలో కలిపి 10 గ్రాముల సబ్బు జతచేసి బాగా కలిపిన తర్వాత పిచికారీ చేయాలి. వేప కషాయం తయారీ.. సాధారణంగా 5 శాతం ద్రావణాన్ని సిఫారసు చేస్తారు. కాబట్టి 50 గ్రా. వేప పలుకుల పొడిని ఒక లీటర్ నీటికి కలిపి ఒక రోజంతా నానబెట్టి, మరునాడు వడపోసి, సబ్బుపొడిని కలిపి పిచికారీ చేయాలి. పంటలపై పురుగుల కషాయంలోని ఆవిరిని పీల్చడం వల్ల పురుగుల శరీరంలో గ్రంథులు సక్రమంగా పనిచేయక చనిపోతాయి. -
వేపసాయం!
వేప పిండిలో 2-3శాతం నత్రజని, 1శాతం భాస్వరం, 1.4 పొటాష్ పోషకాలుంటాయి. బాగా మాగి నేల రాలిన పండ్లను సేకరించి గింజల్ని వేరుచేసి ఎండబెట్టి నిల్వ చేసుకుని కషాయం తీసిన తర్వాత, శుద్ధి చేసిన వేప నూనె, బూజులేని వేప పిండిని సస్యరక్షణలో వాడుకోవచ్చు. వర్షాధార ప్రాంతాల్లోని వేప గింజల్లో అజాడిరాక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల చీడపీడల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. గింజలతో కషాయం తయారీ మంచి వేపకాయలను సేకరించి, కాయలపై పొట్టు, తీసి, గింజలను ఎండబెట్టి దాచుకోవాలి. అవసరమైనప్పుడు వీటిని నలగగొట్టి నీటిలో 1,2 రో జులు నానబెట్టి వడబోసి పైర్లపై స్ప్రే చేసుకోవాలి. ఉదాహరణకు 10కిలోల వేప గింజలను నలగ గొట్టి లేదా గ్రైండర్లో రుబ్బి 5, 6 లీటర్ల నీటిలో 1, 2రోజులు నానబెట్టి గుడ్డతో వడబోసి 200లీటర్ల నీటిలో కలిపి ద్రావకాన్ని తయారుచేసుకుని ఎకరం చేనుపై స్ప్రే చేస్తే చీడపీడలను నివారించవచ్చు. ఒకవేళ కాయల నుంచి గింజలను తీయడం కుదరనపుడు 20కిలోల వేప వేపకాయలను వాడుకొని పైన పేర్కొన్న విధంగా ద్రావణాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. లాభాలు... సాగులో వేప పిండిని వాడటం వల్ల వేరు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. 150 నుంచి 200కిలోల వేప పిండిని ఎకరం విస్తీర్ణంలో దమ్ములో వేస్తే వరిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడును అరికట్టవచ్చు. వేప మందును చల్లితే పురుగులు ఆహారాన్ని తీసుకోలేవు. ఆకలితో శుష్కించి మరణిస్తాయి. వేప మందులు వికర్షకాలుగా పనిచేస్తాయి. పురుగుల్లో గుడ్లు పెట్టే శక్తి సన్నగిల్లుతుంది. గుడ్లు పొదగవు. లార్వా దశ ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది. పురుగు సంతతి పెరగదు. మేలు చేసే సహజక్రిమి శత్రువులు, పరాన్న జీవులకు ఎలాంటి హానీ ఉండదు. ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లుకోవచ్చు. వేప ఉత్పత్తులను ఎప్పుడు చల్లాలి..? పైరు విత్తిన 15, 30, 40 రోజుల్లో చల్లుకోవాలి. రెక్కల పురుగు దశ, గుడ్డు దశ, మొదటి లార్వా దశల్లో చల్లితేనే వేప నూనె సమర్థవంతంగా పురుగులను నివారిస్తుంది. పెరిగిన పురుగులపై వేప నూనె ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. సాయంత్రం పూట పొలంలో ఎగిరే రెక్కల పురుగులు కనిపించినపుడు, ఆకులపై గుడ్ల సముదాయాన్ని గమనించినపుడు మరోసారి, పిల్ల లార్వా దశలో ఉన్నపుడు ఇంకోసారి.. ఇలా మూడుసార్లు వేప నూనె చల్లితే పురుగులను నివారించవచ్చు. వేప నూనెను చల్లితే పురుగు చావదు కానీ పైరును ఆశించదు. ఇతర ప్రయోజనాలు... వేప పిండిని యూరియాలో కలిపి వాడితే 50శాతం యూరియాను ఆదా చేయవచ్చు. 2-3 కిలోల వేప నూనెను 50కిలోల యూరియాలో బాగా కలిపి 12గంటల తర్వాత పైరుపై చల్లితే యూరియా త్వరగా కరిగిపోకుండా చాలా రోజులపాటు చేనుకు అందుతుంది. చేపలు, రొయ్యల చెరువుల్లో వేపపిండి, వేపనూనె వాడితే వాటికి వచ్చే వ్యాధులు తగ్గుతాయి. నాచు పెరగదు. వారానికోసారి వేపనూనె చల్లి ఇంట్లో, దొడ్డిలో, కోళ్లఫారాల్లో దోమలు, గోమార్లు, నల్లుల బెడదలను నివారించుకోవచ్చు. నకిలీలపై దృష్టి పెట్టండి... ఎంపిక చేసిన చెట్టు నుంచి నాణ్యమైన వేప కాయలను సేకరించుకొని, గింజలు తీసేసి ఎండబెట్టి రైతులే నిల్వ చేసుకొని అవసరమున్నప్పుడు పైర్లపై వాడుకోవడం ఉత్తమం. ఇప్పటికే వాణిజ్యపరంగా ఎన్నో రకాల వేప సంబంధ ఉత్పత్తులు అనేక పేర్లతో మార్కెట్లోకి వచ్చాయి. నకిలీలపై దృష్టిసారించి నాణ్యతను గమనించి వాడుకోవాలి.