వేప పిండిలో 2-3శాతం నత్రజని, 1శాతం భాస్వరం, 1.4 పొటాష్ పోషకాలుంటాయి. బాగా మాగి నేల రాలిన పండ్లను సేకరించి గింజల్ని వేరుచేసి ఎండబెట్టి నిల్వ చేసుకుని కషాయం తీసిన తర్వాత, శుద్ధి చేసిన వేప నూనె, బూజులేని వేప పిండిని సస్యరక్షణలో వాడుకోవచ్చు. వర్షాధార ప్రాంతాల్లోని వేప గింజల్లో అజాడిరాక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల చీడపీడల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
గింజలతో కషాయం తయారీ
మంచి వేపకాయలను సేకరించి, కాయలపై పొట్టు, తీసి, గింజలను ఎండబెట్టి దాచుకోవాలి.
అవసరమైనప్పుడు వీటిని నలగగొట్టి నీటిలో 1,2 రో జులు నానబెట్టి వడబోసి పైర్లపై స్ప్రే చేసుకోవాలి.
ఉదాహరణకు 10కిలోల వేప గింజలను నలగ గొట్టి లేదా గ్రైండర్‌లో రుబ్బి 5, 6 లీటర్ల నీటిలో 1, 2రోజులు నానబెట్టి గుడ్డతో వడబోసి 200లీటర్ల నీటిలో కలిపి ద్రావకాన్ని తయారుచేసుకుని ఎకరం చేనుపై స్ప్రే చేస్తే చీడపీడలను నివారించవచ్చు.
ఒకవేళ కాయల నుంచి గింజలను తీయడం కుదరనపుడు 20కిలోల వేప వేపకాయలను వాడుకొని పైన పేర్కొన్న విధంగా ద్రావణాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు.
లాభాలు...
సాగులో వేప పిండిని వాడటం వల్ల వేరు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు.
150 నుంచి 200కిలోల వేప పిండిని ఎకరం విస్తీర్ణంలో దమ్ములో వేస్తే వరిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడును అరికట్టవచ్చు.
వేప మందును చల్లితే పురుగులు ఆహారాన్ని తీసుకోలేవు. ఆకలితో శుష్కించి మరణిస్తాయి.
వేప మందులు వికర్షకాలుగా పనిచేస్తాయి.
పురుగుల్లో గుడ్లు పెట్టే శక్తి సన్నగిల్లుతుంది. గుడ్లు పొదగవు.
లార్వా దశ ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది.
పురుగు సంతతి పెరగదు.
మేలు చేసే సహజక్రిమి శత్రువులు, పరాన్న జీవులకు ఎలాంటి హానీ ఉండదు.
ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లుకోవచ్చు.
వేప ఉత్పత్తులను ఎప్పుడు చల్లాలి..?
పైరు విత్తిన 15, 30, 40 రోజుల్లో చల్లుకోవాలి. రెక్కల పురుగు దశ, గుడ్డు దశ, మొదటి లార్వా దశల్లో చల్లితేనే వేప నూనె సమర్థవంతంగా పురుగులను నివారిస్తుంది. పెరిగిన పురుగులపై వేప నూనె ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. సాయంత్రం పూట పొలంలో ఎగిరే రెక్కల పురుగులు కనిపించినపుడు, ఆకులపై గుడ్ల సముదాయాన్ని గమనించినపుడు మరోసారి, పిల్ల లార్వా దశలో ఉన్నపుడు ఇంకోసారి.. ఇలా మూడుసార్లు వేప నూనె చల్లితే పురుగులను నివారించవచ్చు. వేప నూనెను చల్లితే పురుగు చావదు కానీ పైరును ఆశించదు.
ఇతర ప్రయోజనాలు...
వేప పిండిని యూరియాలో కలిపి వాడితే 50శాతం యూరియాను ఆదా చేయవచ్చు. 2-3 కిలోల వేప నూనెను 50కిలోల యూరియాలో బాగా కలిపి 12గంటల తర్వాత పైరుపై చల్లితే యూరియా త్వరగా కరిగిపోకుండా చాలా రోజులపాటు చేనుకు అందుతుంది. చేపలు, రొయ్యల చెరువుల్లో వేపపిండి, వేపనూనె వాడితే వాటికి వచ్చే వ్యాధులు తగ్గుతాయి. నాచు పెరగదు. వారానికోసారి వేపనూనె చల్లి ఇంట్లో, దొడ్డిలో, కోళ్లఫారాల్లో దోమలు, గోమార్లు, నల్లుల బెడదలను నివారించుకోవచ్చు.
నకిలీలపై దృష్టి పెట్టండి...
ఎంపిక చేసిన చెట్టు నుంచి నాణ్యమైన వేప కాయలను సేకరించుకొని, గింజలు తీసేసి ఎండబెట్టి రైతులే నిల్వ చేసుకొని అవసరమున్నప్పుడు పైర్లపై వాడుకోవడం ఉత్తమం. ఇప్పటికే వాణిజ్యపరంగా ఎన్నో రకాల వేప సంబంధ ఉత్పత్తులు అనేక పేర్లతో మార్కెట్‌లోకి వచ్చాయి. నకిలీలపై దృష్టిసారించి నాణ్యతను గమనించి వాడుకోవాలి.
వేపసాయం!
Published Thu, Nov 27 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement