అట్మోర్(అమెరికా): మూడు దశాబ్దాల క్రితం వేయి డాలర్ల సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలుచేసింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలాచేసి మరణశిక్షను అమలుచేసింది.
ఇలా నైట్రోజన్‌గ్యాస్‌ను వాడి దోషికి మరణశిక్షను అమలుచేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ శిక్షను స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమలుచేశారు. అమెరికాలో 1982 ఏడాది నుంచి విషం ఇంజెక్షన్‌తో దోషులకు మరణశిక్షను అమలుచేయం మొదలెట్టాక మరో నూతన శిక్షా విధానాన్ని అమల్లోకి తేవడం ఇదే తొలిసారి.
ఎలా అమలుచేశారు?: అట్మోర్ నగరంలోని హోల్‌మ్యాన్ కరెక్షన్ ఫెసిలిటీలో నైట్రోజన్ హైపోక్సియా శిక్ష అమలు ప్రక్రియను ఐదుగురు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి చూపించారు. నైట్రోజన్ గ్యాస్ నింపిన సిలిండర్ పైపును దోషి స్మిత్ ముక్కుకు బిగించిన మాస్క్ ద్వారా శరీరంలోకి పంపించారు. స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ అనేది ప్రాణాధారమైన ఆక్సీజన్‌ను శరీరకణాలకు అందకుండా చేస్తుంది. దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. రాత్రి 7.53 గంటలకు గ్యాస్‌ను పంపించారు. 8.25 గంటలలోపు అతను మరణించినట్లు ప్రకటించారు.
ఏమిటీ కేసు?: చార్లెస్ సెన్సెట్ అనే మతాధికారి 1980లలో భారీగా అప్పులుచేశాడు. భార్యను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని ఆమె హత్యకు పథకం వేశాడు. చార్లెస్ నుంచి సుపారీ తీçసుకుని జాన్ ఫారెస్ట్ పార్కర్, స్మిత్ ఆయన భార్య ఎలిజబెత్‌ను చంపేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చాత్తాపంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2010లో పార్కర్‌కు అమలు శిక్షను అమలుచేయగా తాను నిర్దోషినంటూ ఇన్నాళ్లూ స్మిత్ కోర్టుల చుట్టూ తిరిగారు.
జ్యూరీ జీవితఖైదు సిఫార్సుచేయగా జడ్జి ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతవరకూ లేని కొత్త విధానంలో శిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఇంతవరకు వాడని, క్రూరమైన, అసాధారణ శిక్షా విధానాన్ని ఎలా అమలుచేస్తారని స్మిత్ లాయర్లు వాదించినా శిక్ష అమలుకే కోర్టు పచ్చజెండా ఊపింది.
Comments
Please login to add a commentAdd a comment