Woman murder case
-
నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అట్మోర్(అమెరికా): మూడు దశాబ్దాల క్రితం వేయి డాలర్ల సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలుచేసింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలాచేసి మరణశిక్షను అమలుచేసింది. ఇలా నైట్రోజన్గ్యాస్ను వాడి దోషికి మరణశిక్షను అమలుచేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ శిక్షను స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమలుచేశారు. అమెరికాలో 1982 ఏడాది నుంచి విషం ఇంజెక్షన్‌తో దోషులకు మరణశిక్షను అమలుచేయం మొదలెట్టాక మరో నూతన శిక్షా విధానాన్ని అమల్లోకి తేవడం ఇదే తొలిసారి. ఎలా అమలుచేశారు?: అట్మోర్ నగరంలోని హోల్మ్యాన్ కరెక్షన్ ఫెసిలిటీలో నైట్రోజన్ హైపోక్సియా శిక్ష అమలు ప్రక్రియను ఐదుగురు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి చూపించారు. నైట్రోజన్ గ్యాస్ నింపిన సిలిండర్ పైపును దోషి స్మిత్ ముక్కుకు బిగించిన మాస్క్ ద్వారా శరీరంలోకి పంపించారు. స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ అనేది ప్రాణాధారమైన ఆక్సీజన్‌ను శరీరకణాలకు అందకుండా చేస్తుంది. దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. రాత్రి 7.53 గంటలకు గ్యాస్‌ను పంపించారు. 8.25 గంటలలోపు అతను మరణించినట్లు ప్రకటించారు. ఏమిటీ కేసు?: చార్లెస్ సెన్సెట్ అనే మతాధికారి 1980లలో భారీగా అప్పులుచేశాడు. భార్యను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని ఆమె హత్యకు పథకం వేశాడు. చార్లెస్ నుంచి సుపారీ తీçసుకుని జాన్ ఫారెస్ట్ పార్కర్, స్మిత్ ఆయన భార్య ఎలిజబెత్‌ను చంపేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చాత్తాపంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2010లో పార్కర్‌కు అమలు శిక్షను అమలుచేయగా తాను నిర్దోషినంటూ ఇన్నాళ్లూ స్మిత్ కోర్టుల చుట్టూ తిరిగారు. జ్యూరీ జీవితఖైదు సిఫార్సుచేయగా జడ్జి ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతవరకూ లేని కొత్త విధానంలో శిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఇంతవరకు వాడని, క్రూరమైన, అసాధారణ శిక్షా విధానాన్ని ఎలా అమలుచేస్తారని స్మిత్ లాయర్లు వాదించినా శిక్ష అమలుకే కోర్టు పచ్చజెండా ఊపింది. -
Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది..
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పరిధిలో మహిళ హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు. నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతుకుడు ఫ్రిడ్జ్‌లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. కాగా, మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసును ఛేదించారు. చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’ -
పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిందని దారుణం.. కుటుంబీకులే..!
సాక్షి, చెన్నై : తిరుచ్చికి చెందిన యువతి ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. ఆమె పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా విషం తాగించి పరువు హత్య చేసినట్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత వారం స్థానికులు తిరుచ్చి ముక్కొంబు వద్ద ముళ్ల పొదళ్లల్లో ఓ మగ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరలించారు. శిశువును ఎవరు పడేశారన్న విషయంపై జీఏ పురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ పరిస్థితులలో విషం సేవించిన స్థితిలో తిరుచ్చి ఆస్పత్రిలో చేరిన ఒక యువతి గురువారం రాత్రి మృతిచెందింది. ఆమె మరణంలో మిస్టరీ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వైద్యుల పరిశోధనలో ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని తేలింది. ఆ బిడ్డే ముళ్ల పొదళ్లలో పడేసిన శిశువుగా గుర్తించారు. విచారణలో కేసు పరువు హత్యగా మలుపు తిరిగింది. 19 ఏళ్ల ఈ యువతి ఓ కళాశాలలో బీకాం చదువుతోంది. కూలీ కారి్మకుడిని ప్రేమించి పెళ్లికి ముందే గర్భం దాల్చింది. కుటుంబీకులు కొన్ని నెలలుగా ఆమెను చిత్ర హింసలు పెడుతూ వచ్చారు. ఆ కూలి కార్మికుడి కోసం ఆరా తీస్తూ వేధించారు. గత వారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను ముళ్ల పొదల్లో పడేశారు. అనంతరం ఆమె చేత బలవంతంగా విషం తాగించినట్టు తేలింది. దీంతో యువతి తల్లిదండ్రులు, మేనత్త తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వార్నీ.. అందుకని ఆమెను హత్య చేశాడట!
ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్ చేయలేకపోయాడు. చివరికి... ఆచూకీ చెబితే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు కూడా. ఎలాగైతేనేం భారత్‌లో అతన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు ప్రేరేపించిన కారణం తెలిసి.. మన పోలీసులు కంగు తిన్నారు. 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ.. అక్టోబర్ 21, 2018 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబం క్వీన్స్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చస్తే.. మరుసటి రోజు తోయా శరీరం అతిదారుణంగా.. బీచ్ ఇసుకలో పాతిపెట్టిన స్థితిలో పోలీసుల కంట పడింది. ఆమె పెంపుడు కుక్కను ఆ దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి ఉంచారు. ఉన్మాదంతో కూడిన, దారుణమైన హత్య.. అని తోయా హత్య కేసుపై ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటన చేశారు. ఆపై దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. రాజ్విందర్ సింగ్ అనే మేల్ నర్స్పై అనుమానపడ్డారు. అయితే ఘటన జరిగిన 48 గంటల్లోపే భార్యాపిల్లలతో పాటు ఉద్యోగాన్ని వదిలేసి దేశం విడిచి పారిపోయాడు రాజ్విందర్ సింగ్. దీంతో రాజ్విందర్పై అనుమానం బలపడింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేముందు అతని ఫొటోను కూడా పోలీసులు ఆచూకీ కోసం ఉపయోగించుకున్నారు. కానీ, ఇండియాలో అతని ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ కష్టతరంగా మారింది. దీంతో మోస్ట్ వాంటెడ్ రాజ్విందర్ సింగ్ ఆచూకీ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కిందటి ఏడాది మార్చిలో భారత విదేశాంగ శాఖ సాయం కోరింది క్వీన్స్లాండ్ పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. తాజాగా రాజ్విందర్ గురించి సమాచారం అందించిన వాళ్లకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.5 కోట్లు) బహుమతి ప్రకటించింది క్వీన్స్లాండ్ ప్రభుత్వం. అయితే తాజాగా రాజ్విందర్ను శుక్రవారం ఢిల్లీలోని జీటీ కర్నల్ రోడ్లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. క్వీన్స్లాండ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. అతన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగించే విషయంలో త్వరలో కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించారు. అయితే హత్యకు దారి తీసిన పరిణామం గురించి రాజ్విందర్ చెప్పిన విషయంతో ఢిల్లీ పోలీసులు కంగుతిన్నారు. భారత సంతతికి చెందిన రాజ్విందర్ సింగ్.. ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసేవాడు. 2018 అక్టోబర్ 21వ తేదీన తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంలో కత్తి, కొన్ని పండ్లు తీసుకుని రిలాక్స్ అయ్యేందుకు బీచ్‌కు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో.. తోయా కార్డింగ్లీ తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చింది. ఆ కుక్క రాజ్విందర్ను చూసి పదేపదే మొరిగిందట. అసలే భార్యతో గొడవ పడిన చిరాకులో ఉన్న అతను.. ఈ విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అది చిలికి చిలికి హత్యకు దారి తీసిందని నేరం ఒప్పుకున్నాడు రాజ్విందర్. తొలుత ఆమెను కత్తితో కసి తీరా పొడిచాడు. ఆపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను లాక్కెళ్లి.. ఇసుక దిబ్బల్లో పాతేశాడు. ఆ కుక్కను వెంటాడి పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆపై రక్తపు మరకలు ఉన్న కత్తిని నీళ్లలోకి విసిరేశాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ రోజంతా ఆందోళనగానే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా లగేజ్ సర్దుకుని భారత్‌కు పయనం అయ్యాడు. హత్య చేసి పారిపోయి వచ్చాక.. ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాడు రాజ్విందర్ సింగ్. అటు భార్యతోగానీ ఇటు తల్లిదండ్రులతో కానీ ఎలాంటి సంభాషణలు జరపలేదు. కానీ, పంజాబ్-ఢిల్లీ మధ్యే మార్చిమార్చి తిరుగుతూ వచ్చాడు. అధికారులు గుర్తు పట్టకుండా గెటప్ మార్చేస్తూ పోయాడు. ఇక ఇప్పుడు హత్యకు అతను కారణం చెప్పడంతో ఇక్కడి పోలీసుల వంతు పూర్తైంది. అతన్ని ప్రశ్నించడం పూర్తి కావడంతో.. కోర్టులో ప్రవేశపెడతాం అని ఓ ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపాడు. రాజ్విందర్ సింగ్ మీద ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. మరోవైపు అప్పగింత చట్టం(extradition act) కింద నవంబర్ 21వ తేదీన పాటియాలా హౌజ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల గాలింపు ముమ్మరం అయ్యింది. అందిన కొద్దిపాటి సమాచారంతో అతనున్న గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు.. గడ్డం, తలపాగాతో ఉన్న రాజ్విందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చూసేయండి -
వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య
కొత్తకోట రూరల్ (పెద్దమందడి): ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసి చెరువులో పడేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమందడి మండలం చీకురుచెట్టుతండాకు చెందిన ముడావత్ దుబ్లీ (26) కి వనపర్తి మండలంలోని చిట్యాల–పడమటితండా వాసి వెంకటేష్‌తో సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జిల్లా కేంద్రంలో రోజువారీ కూలీగా పనికి వెళ్లొచ్చేది. ఎప్పటిలాగే ఈనెల 7న అక్కడికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. అనుమానం వచ్చిన తల్లి ముడావత్ ముత్యాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 10న పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గోపాల్పేట మండలం తాడిపత్రిలోని చెరువులో ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్ఐ హరిప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆమెతో తాడిపత్రికి చెందిన రమేష్, గోపాల్ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు బయటపడింది. ఈ క్రమంలోనే వీరి నుంచి డబ్బులు ఎక్కువ అడిగిందనే నెపంతో ఈనెల 7న కారులో తిరుమలాపూర్ శివారులోకి దుబ్లీని తీసుకెళ్లి గొంతునులిమి చంపి తాడిపత్రి చెరువులో పడేసినట్టు విచారణలో నిందితులు అంగీకరించారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
Crime News: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై ప్లాన్ చేసి..
డోంబివిలి(థానే.. ముంబై)లో కలకలం రేపిన సుప్రియ ఆంటీ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. కిరాతకంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని సోఫా కమ్ బెడ్లో కుక్కేసి వెళ్లిపోయాడు నిందితుడు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ కేసును చేధించడంలో నిందితుడి చెప్పులే కీలకంగా వ్యవహరించాయి. ముంబై: దావ్ది ఏరియా డొంబివిలో సంచలనం సృష్టించిన 33 ఏళ్ల గృహిణి హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు మాన్‌పాడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సుప్రియ భర్త క్లోజ్‌ఫ్రెండ్, ఆమె పొరుగింటి వ్యక్తి విశాల్ గెహావత్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసులో దర్యాప్తు కష్టతరంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజున(మంగళవారం), అంతకు ముందు రోజు నిందితుడు బాధితురాలి ఇంటి బయట చెప్పులు విడిచాడు. మరో పక్కింట్లో ఉండే మహిళ ఆ చెప్పుల ఆనవాళ్లు వివరించగా.. ఆ చిన్న క్లూతో నిందితుడిని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. అవి సుప్రియ భర్త కిషోర్ ఫ్రెండ్, పక్కఇంట్లో ఉండే విశాల్‌కి చెందినవిగా తేలడంతో.. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిందితుడు నిజం ఒప్పేసుకున్నాడు. లొంగలేదనే కోపంలో.. నిందితుడు విశాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాల్, సుప్రియ భర్త కిషోర్ షిండేలు చాలాకాలం నుంచి స్నేహితులు. కానీ, స్నేహితుడి భార్యపైనే విశాల్ కన్నేశాడు. కావాలనే కిషోర్ వాళ్ల పక్కింట్లోనే అద్దెకు దిగాడు. ఎలాగైనా సుప్రియను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆమె అతన్ని పట్టించుకోలేదు. సుప్రియకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఆ వంకతో ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఘటన జరిగిన ముందురోజు కూడా పుస్తకం కోసం సుప్రియ ఇంట్లోకి వెళ్లాడు విశాల్. భర్త కిషోర్, కొడుకుతో సుప్రియ ఆ టైంకి సుప్రియ భర్త ఆఫీసుకి, కొడుకు స్కూల్‌కి వెళ్లడం గమనించాడు. ఆ మరుసటి రోజూ సుప్రియ ఒంటరిగా ఉన్న టైంలో తలుపు తట్టాడు. పుస్తకం కావాలంటూ సుప్రియతో మాటలు కలిపి తన కోరికను బయటపెట్టాడు. దీంతో ఆమె అతని చెంప చెల్లుమనిపించింది. కోపంతో ఆమెను బలవంతం చేయాలని ప్రయత్నించాడు. ప్రతిఘటించేసరికి తల నేలకేసి బాది.. ఆపై నైలాన్ తాడును సుప్రియ మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఆపై శవాన్ని సోఫా కమ్ బెడ్లో కుక్కేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు. కొడుకును స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు ఆమె ఎంతకీ రాకపోవడంతో.. సుప్రియ కోసం వెతుకులాట మొదలైంది. కుటుంబ సభ్యులంతా సుప్రియ కోసం గాలిస్తున్న టైంలోనూ ఏమీ ఎరగనట్లు కిషోర్ పక్కనే ఉన్నాడు విశాల్. సుప్రియ ఎంతకీ కనిపించకపోయేసరికి కిషోర్‌తో కలిసి మరీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చి వచ్చాడు. ఈ లోపు సోఫా కుషన్ చినిగి ఉండడం అనుమానించిన చుట్టుపక్కల వాళ్లు.. పైకి ఎత్తి చూడగా అందులో నుంచి సుప్రియ షిండే మృత దేహం బయటపడింది. -
షేర్‌చాట్ ద్వారా పరిచయం.. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి..
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మహిళ హత్య కేసులో ఒకరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ తెలిపారు. అర్బన్ జిల్లా సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ, పట్టాభిపురం పీఎస్ సీఐ ఎస్.వి.రాజశేఖర్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ వెల్లడించారు. గుజ్జనగుండ్ల ఆంజనేయస్వామి గుడి రోడ్డులో నివసించే ఎన్.కోటేశ్వరి ఈనెల 19న ఇంట్లో హత్యకు గురైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పట్టాభిపురం పీఎస్ సీఐ ఎస్.వి.రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం బూర్గుంపాడు మండలం అంజనాపురానికి చెందిన జి.అఖిల్ అలియాస్ నాయక్‌కు కోటేశ్వరి మూడు నెలల కిందట షేర్‌చాట్ యాప్ ద్వారా పరిచయమైంది. చదవండి: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి, మరింతగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో అఖిల్‌ను కోటేశ్వరి డబ్బులు కావాలని అడిగింది. మిర్చి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో రూ.79 వేలు కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెకిచ్చాడు. డబ్బుల విషయమై అఖిల్‌ను కుటుంబ సభ్యులు అడిగారు. అతను కోటేశ్వరిని తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈనెల 19న గుంటూరు వస్తే డబ్బులు ఇస్తానని కోటేశ్వరి అతనితో చెప్పింది. 19న అతను ఇంటికి వచ్చి ఆమెతో మధ్యాహ్నం వరకు ఉన్నాడు. అనంతరం బంగారం కొందామని ఆమె అతనితో కలసి శంకర్‌విలాస్ సెంటర్‌కు చేరుకున్నారు. పాత జుంకీల రిపేరు, చంప సవరాలకు రూ.50 వేలు అవుతాయని దుకాణదారుడు చెప్పగా, మరలా డబ్బులు సర్దుబాటు చేయాలని అతన్ని అడిగింది. మరలా వస్తామని దుకాణదారునికి చెప్పి బయటకు వచ్చారు. అనంతరం ఓ చీర కొనుగోలు చేసి ఇంటికి వచ్చారు. డబ్బులు విషయమై వారి మధ్య వాదన జరిగింది. అఖిల్ కోటేశ్వరి తలను నేలకేసి పలుసార్లు కొట్టి, అనంతరం గొంతు నొక్కి హత్య చేశాడు. తదుపరి ఉంగరం, చెవిబుట్టలు, ఫోన్లతో ఉడాయించాడు. స్వస్థలానికి చేరుకున్న అతను దొంగిలించిన బంగారపు సొత్తుని పాల్వంచలోని ఓ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి రూ.72 వేలు తీసుకున్నాడు. ఆ నగదుని కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. సాంకేతిక పరిజ్ఞానం, ఫోన్ల ఆధారంగా గురువారం గుంటూరులో అఖిల్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సమావేశంలో పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ, పట్టాభిపురం పీఎస్ సీఐ ఎస్.వి.రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ షేక్.అబ్దుల్‌రెహ్మాన్, హెచ్‌సీ బీవీకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఎం.ఉమమహేష్, ఎం.అశోక్, బి.హనుమంతరావు, టి.విశ్వేశ్వరరావు అభినందించారు. అఖిల్ షేర్‌చాట్ ద్వారా పలువురిని మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో పోలీస్ అని చెప్పి మోసగించగా ఖమ్మం జిల్లా కూసుమంచి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించగా, బెయిల్‌పై విడుదలై వాయిదాలకు తిరుగుతున్నాడు. షేర్‌చాట్ యాప్ ద్వారా తెలియని వ్యక్తులతో ఛాటింగ్ చేయవద్దని అర్బన్ ఎస్పీ సూచించారు. -
అప్పు తీర్చాలన్నందుకు.. ముగ్గురు కలిసి ఒంటరి మహిళను..
అల్వాల్: తీసుకున్న అప్పు తీర్చాలన్నందుకు ముగ్గురు కలిసి ఒంటరి మహిళను హత్య చేశారు. అంతేకాక నిందితులు ఆ హత్యను మరొకరిపై వెళ్లేలా పథకం చేశారు. అల్వాల్‌పోలీసులు తెలిపిన మేరకు..వెంకటాపురం లోతుకుంటలో నివసించే పూలమ్మ(40) దినసరి కూలిగా పనిచేసేది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. గతనెల 25వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలితో సన్నిహితంగా ఉండే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాలు, ఇతరులు తెలిపిన వివరాల ప్రకారం నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు పూలమ్మ వద్ద సాయిలు(50) మంజుల (40) వినోద(49)లు అప్పుతీసుకున్నారు.అప్పు తిరిగి ఇవ్వమంటు పూలమ్మ ఒత్తిడి పెంచడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ హత్య మరొకరిపై మోపేలా ప్రణాళిక చేసుకున్నారు. గత 25న రాత్రి పూలమ్మతో సన్నిహితంగా ఉండే వ్యక్తి వచ్చి వెళ్ళిన అనంతరం గుడిసె వెనుక బాగం నుండి పొడగాటి పదునైన గడ్డపారతో మంచంపై నిద్రిస్తున్న పూలమ్మ తలపై పొడవడంతో నిద్రలోనే పూలమ్మ మృతి చెందింది. హత్య చేసిన అనంతరం నిందితుడు సాయిలు ఊరికి వెళ్లాడు. ఉదయం పూలమ్మ మృతి చెందిన సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. గుడిసె లోపల గడియ పెట్టి ఉండడం, మృతురాలు మంచం పై పడి ఉండడం, హత్య స్థలంలోఎలాంటి అనుమానస్థితి లేకపోవడం పోలీసులకు హత్య కేసు చేదించడం సవాల్‌లుగా మారింది. చివరకు పూలమ్మ ఇంటి పక్కన ఉండే సాయిలు, వినోద, మంజులలు హత్య చేశారని తేలడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో అల్వాల్ పోలీసుల పనితీరును ఉన్నత అధికారులు అభినందించారు. -
సెక్యూరిటీ గార్డుతో వివాహేతర సంబంధం, చీరతో గొంతు బిగించి
టీ.నగర్: చీరతో గొంతు బిగించి ప్రియురాలిని హతమార్చిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై రెడ్‌హిల్స్, గాంధీనగర్‌కు చెందిన నారాయణన్ (40) కట్టడ కార్మికుడు. భార్య మోహన (36). ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు దాస్‌తో మోహనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం సాయంత్రం మోహన, దాస్ మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన దాస్ ఇంటి తలుపులు మూసి వేగంగా బయలుదేరాడు. అతను ఆక్రోశంతో వెళ్లడం చూసిన ఇరుగుపొరుగువారు అనుమానంతో చోళవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి లోనికి వెళ్లగా చీరతో గొంతు బిగించిన స్థితిలో మోహన హత్యకు గురైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దాస్ కోసం గాలిస్తున్నారు. చదవండి: ఇంటి నిర్మాణంపై వివాదం: పెళ్లి రోజే విషాదం -
భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో..
తుని రూరల్(తూర్పుగోదావరి): ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఒక మహిళను ఆమె భర్త.. తల్లి కలిసి అంతమొందించిన వైనమిది. తుని మండలం కొత్త వెలంపేట శివారు మామిడి తోటలో బయటపడిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు తెలిపారు. లోవదేవస్థానంలో సన్నాయి వాయిద్యకారుడు చింతపల్లి సత్యనారాయణ 2004లో తన అక్క కుమార్తె ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి పదో తరగతి చదువుతున్న రమేష్ నాలుగో తరగతి చదువుతున్న మరో కుమారుడున్నారు. తుని మార్కండ్రాజు పేటలో ఈ కుటుంబం ఉండేది. ఆదిలక్ష్మి కొందరితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోందని ఆమె భర్త, తల్లి సత్తెమ్మ తరచూ మందలించేవారు. పరువుపోతోందని బాధపడేవారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో వీరిద్దరూ విసిగిపోయారు. ఈ నేపథ్యంలో గతనెల 28న సత్తెమ్మ, ఆమె అల్లుడు కలిసి ఆదిలక్ష్మి తలపై సుత్తితో బలంగా కొట్టారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని గోనె సంచిలోకి కుక్కి స్కూటీ వాహనం ముందు పెట్టుకుని సత్యనారాయణ కొత్తవెలంపేట శివారు మామిడి తోటకు తరలించాడు. అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎవరైనా చూస్తారని వెంటనే ఇంటికి వచ్చేశాడు. అయితే మృతదేహం సగంకాలి మిగిలినభాగం ఉండిపోయింది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. హైవే సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఈలోగా భయాందోళనకు గురైన సత్యనారాయణ, సత్తెమ్మ బుధవారం పోలీసులకు లొంగిపోయారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ వివరించారు. రూరల్ సీఐ కె.కిషోర్‌బాబు, ఎస్సై వై.గణేష్ కుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు. తల్లి హత్యకు గురికాగా తండ్రి, అమ్మమ్మ అరెస్టవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆదిలక్ష్మి హత్యతో కుటుంబం చిన్నాభిన్నమయ్యింది. చదవండి: అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు.. -
హంతకులెవరు?
తాడేపల్లిరూరల్/మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఓ యువతిని హత్యచేసి, యువకుడిని దారుణంగా కొట్టిన సంఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన ప్రేమికులు చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై సోమవారం రాత్రి అమరావతి స్టేడియం వద్ద గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడగా.. యువతిని అమానుషంగా హత్య చేశారు. దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ప్రాథమిక వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు శ్రీనివాసరావు చెప్పిన కథనం ప్రకారం.. శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు ఒప్పుకోకపోవడంతో అప్పుడప్పుడు రహస్యంగా కలిసేవారని సమాచారం. సోమవారం మధ్యాహ్నం శ్రీనివాసరావుకు జ్యోతి ఫోన్ చేసింది. సాయంత్రం మంగళగిరిలోని నవులూరు అమరావతి టౌన్షిప్లో జ్యోతిని శ్రీనివాసరావు కలిశాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వెనుక నుంచి ఎవరో వచ్చి కొట్టారని శ్రీనివాసరావు తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం ఫోన్లో మాట్లాడకపోవడంతో స్నేహితులు అమరావతి టౌన్‌షిప్‌కు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ బాలాజీ సంఘటనా స్థలానికి వెళ్లి శ్రీనివాసరావును ఆసుపత్రిలో చేర్పించి, యువతి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మందుబాబులా లేక కిరాయి హంతకుల పనా? గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వచ్చి తమతో యువతిని పంపించాలని కోరారని శ్రీనివాసరావు చెబుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. జ్యోతి బంధువులు మాత్రం శ్రీనివాసరావే చంపాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువకులు, శ్రీనివాసరావు బంధువులు మాత్రం పక్కా మర్డర్ ప్లాన్‌తోనే ఈ సంఘటన జరిగిందని అంటున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాసరావును జ్యోతి బంధువులు బెదిరించడంతో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయాడని, మళ్లీ వచ్చాక స్థానికంగా ఉన్న కొంతమందితో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అమరావతి టౌన్షిప్లో ఉన్న మందుబాబులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేదా కిరాయి హంతకులతో పక్క ప్లాన్‌తో హత్య చేయించారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వివిధ కోణాల్లో దర్యాప్తు వేగవంతం ఈ సంఘటనపై అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలతో దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి పట్టణ పరిధి, మంగళగిరి ప్రాంతంలోను మంగళవారం దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసరావు మహానాడు నుంచి బయలుదేరి జ్యోతిని ఎక్కడ బండి ఎక్కించుకున్నాడు, వారిని ఎవరైనా వెంబడించారా? లేదా శ్రీనివాసరావే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు? ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లి విచారించినట్లు తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీతో పాటు నూతనంగా ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఈ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు, రాజధానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న పలువురు తమకు పరిచయస్తులైన మహిళలతో ఒంటరిగా గడిపేందుకు రాజధాని పొలాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్లేడ్‌బ్యాచ్ తరహాలో కొందరు యువకులు దాడిచేసి నగదు, బంగారం దోచుకోవడం, మహిళలపై అత్యాచారానికి పాల్పడడం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. -
మహిళ హత్యకేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వడ్డీ వ్యాపారం చే స్తున్న అవివాహిత మహిళను హత్యచేసిన కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు నిందితులను అదుపులో తీసుకున్నారు. వారివద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు, నగలు స్వాధీ నం చేసుకున్నారు. శుక్రవా రం నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నెల్లూరులోని చిన్నబజారు (ఒకటో పట్ట ణ) పోలీసుస్టేషన్లో విలేక ర్ల సమావేశంలో వివరాల ను వెల్లడించారు. నగరంలోని కుమ్మరివీధికి చెందిన ఎస్కే అజీమున్నీసా అనే మహిళ తన కూతురు ఎస్కే తహసీన్ గత నెల 22వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని 28న చిన్నబజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచనలతో చిన్నబజారు సీఐ ఎండీ అబ్దుల్ సుభాన్ నేతృత్వంలో జరిపిన దర్యాప్తులో తహసీన్ హత్యకు గురైందని నిర్ధారించారు. హత్య చేసింది బాకీదారులే తహసీన్ వడ్డీ వ్యాపారంతోపాటు చిట్టీలు నిర్వహిస్తుండేది. ఆమె కాలేషా అనే వ్యక్తికి రూ.4 లక్షలు, ఇనామతుల్లాకు రూ.లక్ష, సాధిక్‌కు రూ.50 వేలు, ఫర్షాత్కు రూ.లక్ష వడ్డీకి ఇచ్చింది. వారి నుంచి ప్రామిసరీ నోట్లు రాయించుకుంది. కాగా వడ్డీ చెల్లించే క్రమంలో బాకీదారులతో తహసీన్‌కు గొడవలు జరిగాయి. దీంతో వారు తహసీన్‌ను హత్య చేస్తే బాకీ తీర్చే అవసరం ఉండదని భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. దైవభక్తిని ఆసరాగా చేసుకుని.. తహసీన్‌ను హత్య చేసేందుకు నిందితులు (బాకీదారులు) నలుగురు పన్నాగం పన్నారు. తహసీన్‌కు దైవభక్తి ఎక్కువగా ఉందని గుర్తించి గత నెల 22వ తేదీన తన ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నామని సాధిక్ చేత మిగిలిన ముగ్గురు ఫోన్ చేయించి తహసీన్‌ను పిలిపించారు. ఇంటికి వచ్చిన తహసీన్‌కు దైవ ప్రసాదం అని చెప్పి మిఠాయిలో సైనెడ్ కలిపి ఇచ్చారు. ఆమె వెంటనే మృతిచెందకుండా వాంతులు చేసుకుంది. తహసీన్ బతికితే తమ బండారం బయటపడుతుందని భావించిన బాకీదారులు ఆమె గొంతు నులిమి చంపివేశారు. మృతురాలి మెడలోని బంగారు చైను, చేతికి ఉన్న రెండు ఉంగరాలను దోచుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కారులో వెంకటాచలం మండలంలోని కాకుటూరుకు తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి పొలాల్లో గుంటలో పూడ్చివేశారు. ప్రామిసరీ నోట్లు అపహరణ నిందితులు 23వ తేదీ తహసీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలోకి ప్రవేశించి వారి బాకీ తాలూ కు ప్రామిసరీ నోట్లు, రూ.77 వేల నగదు, మూ డు సెల్ఫోన్లు అపహరించారు. మిస్సింగ్ కేసుపై పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి ఫర్షాత్పై అనుమానంతో అదుపులో తీసుకుని విచారించారు. అతను తాను ఎస్కే కాలేషా, ఇనామతుల్లా, సాధిక్లు కలసి తహసీన్‌ను హత్య చేసినట్లు వెల్లడించాడు. పోలీసులు ఫర్షాత్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించా రు. మిగిలిన ముగ్గురు నిందుతులు పరారీలో ఉండగా శుక్రవారం వారిని అయ్యప్పగుడి ప్రాం తంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి తహసీన్‌ను హత్య చేసే సమయంలో ఉపయోగించిన గ్లౌజు, దోచుకున్న రూ.45 వేల నగదు, సెల్ఫోన్లు, రెండు బంగారు ఉంగరాలు, చైన్, ప్రామిసరీ నోట్లు, బీరువా తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సై కరీముల్లా, రమణ, అల్తాఫ్, సురేష్, రాజా పాల్గొన్నారు. -
ఏళ్లు గడుస్తున్నా.. వీడని మిస్టరీ
కామవరపుకోట: హత్య జరిగి మూడేళ్లు గడుస్తున్నా హతురాలి వివరాలు గానీ, హంతకుల ఆచూకీ గానీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్ 26న కామవరపుకోట మండలంలోని ఆడమిల్లి వద్ద పుంతలో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహం పడివున్న తీరును బట్టి ఆమెది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన మహిళ శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతురాలి మెడ కింద తాడుతో బిగించిన గుర్తులున్నాయని, ఎక్కడో చంపి ఇక్కడ పడవేసి వుంటారని నిర్ధారణకు వచ్చారు. మృతురాలిని గుర్తు పట్టేందుకు నాలుగు పోలీసు బృందాలను పంపినట్టు అప్పట్లో జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపారు. ఇక్కడి ఫ్యాక్టరీలలో పని చేసేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు. ఈ కారణంగా మృతురాలి ఆచూకీ కనుగొనేందుకు ఫ్యాక్టరీలలోని కార్మికులను పోలీసులు విచారించారు. ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించి ఇప్పటికి మూడేళ్లు దాటినా ఇంతవరకు చనిపోయిన మహిళ వివరాలేవీ పోలీసులకు లభ్యం కాలేదు. ఈమె ఊరు, పేరు తెలిస్తే మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 1997లోనూ కేసును ఛేదించలేకపోయిన పోలీసులు 1997లో జరిగిన హత్య కూడా ఎటూ తేలకుండానే మరుగున పడిపోయింది. 1997 డిసెంబరు 27న టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెం అడవిలోని జెండా గట్టుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని చూసిన అప్పటి ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వ్యక్తిక్లి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని, ధృఢంగాను, ఆరోగ్యవంతంగాను ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి ముఖం గుర్తు పట్టేందుకు వీలు లేకుండా రాళ్లతో కొట్టారని తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశంలో బండరాయి, మద్యం సీసాలు, సిగరెట్లు, పేకలు, కాలిపోయిన తెల్లచొక్కా కాలర్ ముక్క, కాలిపోయిన పసుపు రంగు నైలాన్ తాడు, హవాయి చెప్ప్చును అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య జరిగి 21 సంవత్సరాలైనా హంతకులెవరో, హతుడెవరో ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు. -
పిన్ని వరసైన మహిళ హత్య
తూర్పుగోదావరి, ఏపీత్రయం (పెదపూడి): పిన్ని వరుస మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, మరికొందరితోనూ సంబంధాలు నెరపుతోందన్న అనుమానంతో ఆమెకు మద్యం ఇచ్చి ఇనుప గొట్టంతో తల వెనుకభాగంలో మోది, ఊపిరాడకుండా ముక్కు, నోరు మూసి కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. డీఎస్పీ వర్మ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఏపీ త్రయం గ్రామానికి చెందిన వీరనాల సత్యనారాయణ పగటి వేషగాడు. అతడికి మొదటి భార్య అనారోగ్యంతో 2012లో మృతి చెందగా, రాజేశ్వరిని రెండో వివాహం చేసుకున్నాడు. ముందు భార్యతో ఐదుగురు పిల్లలను కన్నాడు. ఆ సంతానంలో ఒకడు కుమార్ రాజా. అతడు పిన్ని వరసైన రాజేశ్వరితో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరు ప్రత్యేకంగా ఉండడానికి కరప మండలం గురజనాపల్లి గ్రామం శివారు అడివిపూడిలో 18 నెలల క్రితం ఒక గది అద్దెకు తీసుకుని అప్పుడప్పుడు కలుస్తుండేవారు. కాగా రాజేశ్వరికి ముగ్గురు సంతానం. సత్యనారాయణ, రాజేశ్వరి కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాలపై బుర్రకథలు చెబుతూ, గ్రామాల్లో పగటి వేషాలు వేస్తుంటారు. ఖాళీ సమయంలో రాజేశ్వరి విజయవాడ సమీపంలో ఉన్న ‘అమ్మ’ అనే స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పనిచేస్తోంది. అప్పుడప్పుడు ఆమె విజయవాడ వెళ్లి సంస్థ కోసం చందాలు కూడా వసూలు చేస్తుం టుంది. ఈ నేపథ్యంలో కుమార్ రాజా రాజేశ్వరిపై అనుమానం పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు పథకం పన్నాడు. వారు తరచూ గొడవపడుతున్నా ఇంట్లో ఏ మాత్రం తెలియనిచ్చేవారు కాదు. ఈ నెల 8న వారు తీసుకున్న అద్దె గదిలో కలుసుకున్నారు. అక్కడ ఆమెకు కుమార్ రాజా మద్యం ఇచ్చి, ఆమెకు మత్తు ఎక్కిన తరువాత పొయ్యి ఊదుకునే గొట్టంతో తల వెనుక భాగంలో బలంగా మోదాడు. అనంతరం ఊపిరి ఆడకుండా ముక్కు, నోరూ మూసి నోటిలో గుడ్డ కుక్కి హత్య చేశాడు. అనంతరం రాజేశ్వరి మృతదేహాన్ని గోనె సంచిలో చిన్నగా మడిచి మోటార్ బైక్‌పై ఏపీత్రయంలోని రేపూరు, కొవ్వూరు వెళ్లే ఏటి గట్టు ప్రాంతంలో పూడ్చాడు. పథకం ప్రకారమే హత్య రాజేశ్వరిని హత్య చేయాలనే తలంపుతోనే కుమార్ రాజా 8వ తేదీ ముందు నాలుగు రోజుల నుంచీ గొయ్యి కొద్దికొద్దిగా తవ్వేవాడు. వారి గదిలో చంపేందుకు అవసరమయ్యే సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. తరువాత కూడా సీసీ కెమెరాలు లేని రహదారులను ఎంచుకుని సాయం సమయంలో మోటారుబైక్పై వచ్చి పూడ్చాడు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి... తన భార్య కనిపించడం లేదని 8వ తేదీ నుంచి భర్త సత్యనారాయణ, పిల్లలు, బంధువులు వెతుకుతుండగా వారితో పాటు కుమార్‌రాజా కూడా రాజేశ్వరి కోసం వెదకసాగాడు. ఈ నెల 10న పోలీసులకు భర్త సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనపై పోలీసులకు అనుమానం వచ్చిందేమోనన్న భయంతో కుమార్ రాజా స్థానిక వీఆర్వో రెడ్డిపల్లి సత్యనారాయణకు జరిగిన సంఘటన చెప్పాడు. వీఆర్వో ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీత్రయంలోనే పోస్టుమార్టం ఏపీ త్రయం గ్రామంలో శుక్రవారం కాకినాడ డీఎస్పీ వర్మ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఇన్చార్జి సీఐ రాజశేఖర్, ఎస్సై కిషోర్‌బాబు వీఆర్వో, బంధువుల సమక్షంలో రాజేశ్వరి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె శరీరంపై చేతిపై ఉన్న వీరబ్రహ్మం అనే పచ్చబొట్టు, ముఖం ఆధారంగా బంధువులు రాజేశ్వరిని గుర్తించారు. శవ పంచానామా చేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడిపై హత్య, ఇతర కేసులు నమోదు చేశారు. -
వదిలించుకునేందుకే హత్య
కొయ్యూరు(పాడేరు): మండలంలోని డౌనూరు జీడితోటల్లో జరిగిన గుర్తుతెలియని వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం, ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హంతకులను పట్టుకున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకునే వ్యక్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి, హంతకులను పట్టుకున్నారు. ఆ వివరాలను సీఐ ఉదయ్‌కుమార్, ఎస్ఐ రుక్మాంగదరావు గురువారం విలేకరులకు తెలిపారు. మండలకేంద్రమైన కోటవురట్లకు చెందిన జనవేది రాంబాబు తాపీమ్రేస్త్రిగా హైదరబాద్‌లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ పటాన్ చెరువు సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న మైసపు శివమ్మతో పరిచ యం ఏర్పడింది. అక్కడే రోజూ టీ తాగి, భోజనం చేసేవాడు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శిమమ్మకు వివా హమైనా భర్త లేడు. రాంబాబుకు భార్య, కుమారుడు ఉన్నారు. తనతో పూర్తిగా ఉండిపోవాలని రాంబాబు ను శివమ్మ కోరేది. రాంబాబు కొడుకును కూడా ఇక్కడకు తీసుకువచ్చి ఉంచేయాలని అనేకసార్లు చెప్పింది. భార్య దగ్గరకు వెళ్లకుండా తనతో పూర్తిగా ఉండిపోవాలని పట్టుపట్టింది. సంక్రాంతి సందర్భంగా రాంబాబు,శిమమ్మ కలిసి కోటవురట్ల వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా భార్యను వదిలిపెట్టి కొడుకుతో కలిసి తనతో రావాలని గొడవ చేసింది. శివమ్మ దగ్గర నుంచి రూ.రెండు లక్షల వరకు రాంబాబు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదా కొడుకును తీసుకుని తనతో రావాలని పట్టుపట్టింది. ఈ విషయం గ్రామంలో కొందరికి తెలిసింది. ఈమెతో ఉంటే భార్యతో ప్రమాదం వస్తుందని రాంబాబు భావించాడు. స్నేహితుడు కర్రి నరేశ్‌తో కలిసి హత్యచేయాలని ప్లాన్ వేశాడు. జనవరి 22న శివమ్మను పర్యాటక ప్రాంతమైన చింతపల్లి మండలం తాజంగి తీసుకువచ్చాడు.అక్కడ సాయంత్రం వరకు ఆ ముగ్గురు ఉన్నారు.అయితే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ హత్యచేయడం కుదరలేదు. దీంతో డౌనూరు సమీపంలో జీడిమామిడి తోటలను ఎంచుకున్నారు. చీకటి పడిన తరువాత శిమమ్మ, రాంబాబు,నరేశ్‌లు జీడితోటల్లోకి వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. ఈ సందర్భంగా రాంబాబు,శివమ్మ మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శిమమ్మ మెడను రాంబాబు బ్లేడ్‌తో కోశాడు.దీనికి నరేశ్ సహకరించాడు. తరువాత రోజు ఏమి తెలియనట్టుగా వారిద్దరూ గ్రామంలోకి వచ్చారు. వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి, ఇద్దరు రావడంపై కొందరికి అనుమానం వచ్చింది. 24న జీడితోటల్లో మృతదేహాన్ని కనుగొన్న కొయ్యూరు పోలీసులు విచారణ చేపట్టారు. 25న అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో కోటవురట్లకు చెందిన కొందరు సీఐకు సమాచారం ఇచ్చారు.దాని ఆధారంగా విచారణ ప్రారంభించారు. హంతకుడు ఫోన్‌ను ట్రాప్ చేశారు. చివరకు అరెస్టు చేశారు. -
హత్యకేసులో నిందితుడి సంచలన వాంగ్మూలం
తిరువొత్తియూరు: మహిళా, అమె ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా నిత్తిరవిలై, వల్లవిలై తదేయుపురానికి చెందిన విజయదాసన్ కేరళలో జాలరిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య సంగీత (27). వీరికి సంజయ్ (7), బియూభూపర్ (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు నిత్తిరవిలై సమీపం కాంచీపురంలో అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. రెండు వారాల కిందట విజయదాసన్ చేపలు పట్టే పనికోసం కేరళ వెళ్లాడు. ఈ క్రమంలో గత 26వ తేదీ ఉదయం సంగీత, ఇద్దరు పిల్లలు గణపతియాన్ కడవు వంతెన సమీపం తామ్రభరణి నదిలో శవాలుగా తేలుతున్నారు. దీనిపై సంగీత తండ్రి మార్టిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిత్తిరవినై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శవపరీక్షలో ఈ ముగ్గురు హత్యకు గురైనట్టు తె లిసింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు హోమియోపతి డాక్టర్ ఇనయం, బుద్దనతురానికి చెందిన కలయరసన్ (27)లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచా రణలో కలయరసన్ ముగ్గురిని హత్య చేసినట్టు నేరం అం గీకరించాడు. అతను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. తాను విదేశంలో పని చేసి తిరిగి వచ్చిన తరువాత సంగీతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇలాగే ఇంటి సమీపంలో క్లినిక్ నిర్వహిస్తున్న హోమియోపతి డాక్టర్‌తోనూ సంగీతకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పలు సార్లు మందలించినప్పటికీ సంగీత హోమియోపతి డాక్టర్‌తో సంబంధాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలో గత 25వ తేదీ రాత్రి సంగీత ఇంటికి వెళ్లిన సమయంలో ఆమెతో వా గ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెంది ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి బైకుపై తీసుకెళ్లి తామ్రభరణి నదిలో పడవేశాను. తరువాత రోజు ఉదయం సంగీత ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న చిన్నారులను మేల్కొలిపి మీ తల్లి దగ్గరకు తీసుకెళతానని బైకుపై ఎక్కించుకుని వెళ్లి తామ్రభరణి నదిలో తోసి హత్యచేసినట్టు తెలిపాడు. కేసు విచారణ కొనసాగుతోంది. -
కొడుకే కాలయముడు
శ్రీకాకుళం,వజ్రపుకొత్తూరు: చిన్నమురహరిపురం గ్రామానికి చెందిన ఇల్లుమల్ల సాయమ్మ హత్య కేసులో మిస్టరీ వీడింది. పెద్దకుమారుడు ఇల్లుమల్ల మాధవరావు తన తల్లితో ఉన్న ఆస్తి తగాదాలు కారణంగా హత్య చేసినట్టు ఒప్పుకొని వజ్రపుకొత్తూరు పోలీ సుల ఎదుట బుధవారం లొంగిపోయా డు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎస్.తాతా రావు కేసు పూర్తి వివరాలను విలేకరులకు గురువారం వెల్లడించారు. హత్యకు గురైన సాయమ్మకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మాధవరావు ఉపాధి కోసం రాజమండ్రిలో ఉండగా, రెండో కుమారుడు ధనరాజ్ బీఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీనివాసరావు ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ తరుణంలో తనకు ఆస్తిలో వాటా కావాలని పెద్ద కుమారుడు మాధవరావు తరచూ తల్లి సాయమ్మతో గొడవలు పడేవాడు. ఆస్తి వాటా కోసం గ్రామానికి చెందిన పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. చిన్న కుమారుడు శ్రీనివాసరావుకు వివాహం అయిన వరకు వాటాలు ఇవ్వనని సాయమ్మ తెగేసి చెప్పింది. అయితే పెద్దమనుషులు ఒప్పించి సాయమ్మ నుంచి మాధవరావుకు రెండు చిన్న పల్లపు మడులుతో పాటు 15 జీడి, క్బొరి చెట్లును వాటాగా ఇప్పించారు. దీనికి మాధవరావు ఒప్పుకోక మూడున్నర ఎకరాల తోటలో వాటా కావాలంటూ కోరడంతో ఆమె ఒప్పకోలేదు. తోటవైపు కూడా రావద్దంటూ హెచ్చరించింది. దీంతో కోపంతో మాధవరావు ఇచ్చిన వాటా కూడా సాగు చేయలేదు. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో తనకు వాటా కావాలంటూ లాయర్ నోటీసులను పంపిన సాయమ్మ, మిగతా ఇద్దరు అన్నదమ్ములు నుంచి స్పందన కనిపించలేదు. ఈ తరుణంలో మాధవరావు కుటుంబ పోషణ కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్లి అక్కడ పోలవరం, ఏలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్ద కాలువ పనుల్లో చేరాడు. అయితే తనకు ఆస్తి ఉండి కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నానంటూ ఆవేదన చెంది, ఇదంతా తన తల్లివల్లేనని భావించి తల్లి సాయమ్మను చంపివేస్తే ఆస్తిలో వాటాతో పాటు తన పేరుమీద నామినీ ఉన్న ఎల్ఐసీ పాలిసీల సొమ్ము కూడా వస్తుందని ఆలోచించి గత నెల 20వ తేదీన పూరి–తిరుపతి రైలులో పూండి వచ్చి వారి తోట వద్ద మాటు వేశాడు. సాయమ్మ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన జీడి తోటలో వంట చెరకు కోసం కంపలు ఏరుతుండగా వెనుక నుంచి వచ్చిన మాధవరావు ఆమె తలపై కర్రతో బలంగా మోదాడు. ముందుకు పడిపోయిన ఆమె తలను భూమిలోకి ఆనించి చంపేసి తిరిగి రాజమండ్రి వెళ్లిపోయాడు. ఏమీ ఎరుగనట్టు మళ్లీ రాజమండ్రి నుంచి పూండి చేరుకున్నాడు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసి అటూ ఇటూ తిరిగి చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయాడని సీఐ తాతారావు చెప్పారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి టెక్కలి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం పాతపట్నం జైలుకు రిమాండ్‌కు తరలించినట్టు ఆయన చెప్పారు. -
మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని పెగడపల్లిలో భూ వివాదంతో అన్న భార్యను కర్రలతో దాడి చేసి హత్య చేసి న కేసులో ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ రూరల్ సీఐ గోవర్ధన గిరి శనివారం తెలిపారు. పది గుంటల భూమి వివాదంతోనే నిందితుడు వదినను హత్యకు చేసి నట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నర్సవ్వ–బాలయ్యకు ఎల్లప్ప, లక్ష్మణ్ అనే ఇద్దరు కొడుకులు, లక్ష్మి(గంగామణి) కూతురు ఉంది. ఇద్ద రు కొడుకులు పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరు గా ఉంటున్నారు. అయితే నర్సవ్వ పెద్ద కొడుకు ఎల్లప్ప 2014లో భార్య గోంటి సావిత్రి, గోంటి యోగేష్ చేతిలో హత్య కు గురయ్యాడు. నర్సవ్వ భర్త బాలయ్య చనిపోవడంతో చిన్న కొడుకు లక్ష్మణ్ వద్ద ఉంటోంది. కూతురు లక్ష్మి పెళ్లి అ యినా పెగడాపల్లిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే నర్సవ్వ పేరుపై ఉన్న 30 గుంటల భూమిలోనుంచి గ్రామ పెద్దలు చిన్న కొడుకు గోంటి లక్ష్మణ్‌కు 10 గుం టల భూమిని కేటాయించారు. మిగిలిన 20 గుంటల భూమిని నర్సవ్వను ఎవరు పోషిస్తే వారు సాగు చేసుకోవాలని సూచించారు. దీంతో లక్ష్మణ్ తల్లిని పోషిస్తూ, మంచి చెడులు చూస్తూ ఆ భూమి ని సాగు చేశాడు. అయితే పెద్ద కొడుకు ఎల్లప్ప భార్య సావిత్రి అందులో 10 గుంటల పొలం తమదని, దాన్ని ఇప్పిం చాలని అంటుండేది. దీంతో రెండు కుటుంబాలకు తరుచూ వివాదాలు అయ్యేవి. అయితే ఇటీవల లక్ష్మణ్ సాగు చేసిన పొలంలో పంటను నర్సవ్వ కోసి ఇంటికి తెచ్చుకుంది. దీంతో లక్ష్మణ్ తల్లి నర్పవ్వ, అక్క లక్ష్మి కలిసి శుక్రవారం సావిత్రి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగారు. వారి మధ్య మాటమాట పెరిగి లక్ష్మణ్ వదిన సావిత్రి, ఆమె కొడుకు యోగేష్లపై కర్రలతో దాడి చేశాడు. సావిత్రి తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. యోగేష్ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారని సీఐ తెలిపారు. సావిత్రి అన్న సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఈ కేసులో ఏ1 నిందితుడిగా గోంటి లక్ష్మణ్, ఏ2గా గోంటి లక్ష్మి, ఏ3గా గోంటి నర్సవ్వను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కాగా యోగేశ్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడని సీఐ తెలిపారు. -
ప్రియుడే యముడు..
♦ కోలమూరులో యువతి హత్య కేసును శోధించిన పోలీసులు ♦ ప్రధాన నిందితుడు రాజస్థాన్ వాసి ∙ఆర్థికపరమైన ఇబ్బందులే కారణం రాజానగరం : ప్రేమ పేరుతో ఆ యువతీయువకులు దగ్గరయ్యారు. సహజీవనం చేస్తున్నారు. అయితే ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా ఆ యువకుడు యువతిని హత్యచేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని బావిలో పడేసి తప్పించుకుందామనుకున్నాడు. పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధి కోలమూరులో జరిగిన ఈ సంఘటనలో అరెస్టయిన ముద్దాయిల వివరాలను బుధవారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి స్థానిక పోలీసు స్టేషన్ వద్ద విలేకర్లకు వెల్లడించారు. సిద్ధాంతిలా వచ్చి.. రాజస్థాన్‌కి చెందిన 29 ఏళ్ల యువకుడు మూడేళ్ల క్రితం సిద్ధాంతి మాదిరిగా తయారై కోలమూరు వచ్చాడు. అక్కడ చుండ్రు సత్యనారాయణ దంపతులతో పరిచయం పెంచుకుని, వారికి అబ్బాయిలు లేకపోవడంతో వారికి కొడుకుగా మారి, వారి ఇంటి పేరు, అడ్రసుతో ఆధార్ కార్డును పొందాడు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకుగా భావించిన ఆ దంపతులు అతడు చెప్పిన విక్రమాదిత్య పేరును నమ్మి ముద్దుగా ఆదిత్య అని పిలుచుకుంటున్నారు. సిద్ధాంతి వేషాన్ని తీసేసి స్థానికంగా దొరికే చిల్లరమల్లర పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న ఆదిత్య రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రంపచోడవరానికి చెందిన పళ్లాల పద్మ(25)కు చేసిన రాంగ్ కాల్‌తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అది క్రమేపీ ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల క్రితం కోలమూరులోనే ఒక ఇల్లు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆమె ఆరు నెలల క్రితం ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది. ఆర్థికపరమైన తగాదాతో చంపేశాడు సహజీవనం సాగిస్తున్న ఆదిత్య, పద్మల మధ్య తరచూ ఆర్థికపరమైన సమస్యలు వస్తుండేవి. ఈ క్రమంలో పద్మ అభద్రతాభానికిలోనై పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చేది. దీంతో ఆమె తన చెప్పుచేతల్లో ఉండడం లేదని భావించిన ఆదిత్య ఈనెల 10న అదే ప్రాంతంలోని బొమ్మన కాలనీకి ఆమెతో సహా మరో ఇంటికి మకాం మార్చాడు. అయినా వారి మధ్య ఆర్థికపరమైన గొడవలు తొలగిపోలేదు. ఈనెల 16వ తేదీ సాయంత్రం కూడా అదేవిధంగా గొడవ పడిన సమయంలో ఆదిత్య కోపంతో పద్మను కొట్టడం, ఆమె సృహ తప్పిపడిపోవడం, వెంటనే ఆమె మెడలో ఉన్న చున్నీని తీసి, గొంతుకు బిగించాడు. చనిపోయిందని గ్రహించి, తన తండ్రిగా ఉన్న చుండ్రు సత్యనారాయణ సహయంతో ఆ మృతదేహాన్ని ఒక గోనె సంచెలో కట్టి, బొమ్మన కాలనీలోని పోతురాజు బావిలో విరిగిపోయిన సిమెంటు దిమ్మలు కట్టి పడేశాడు. ఐదు రోజులకు (ఈనెల 21) ఆ సంచె పైకి తేలడంతోపాటు దుర్వాసన రావడంతో వీఆర్వో నిర్మలకుమారి ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, బావిలో సంచిలో కట్టి పడవేసిన యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. గుర్తు తెలియని యువతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో పరారీలో ఉన్న నిందితులు ఆదిత్య, సత్యనారాయణలను బుధవారం అరెస్టు చేసి, కోర్టు హాజరుపరిచామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఆదిత్య పుట్టపూర్వోత్తరాలపై ఆరా.. ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న విక్రమాదిత్య రాజస్థాన్ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు, చుండ్రు సత్యనారాయణ దంపతులను తల్లిదండ్రులుగా చెప్పుకుంటూ వారి అబ్బాయిగానే ఆధార్ కార్డుతోపాటు ఇతర సదుపాయాలు పొందడంలో ఉన్న మతలబుపై ఆరా తీస్తున్నామని అర్బన్ జిల్లా ఎస్పీ తెలిపారు. రాజస్థాన్‌కు తమ సిబ్బందిని పంపిస్తామన్నారు. ఈ కేసును శోధించి, నిందితులను పట్టుకోవడంలో అత్యంత చురుకుగా వ్యవహరించిన డీఎస్సీ కె.రమేష్‌బాబు, సీఐ వరప్రసాద్, రాజానగరం పోలీసులను ఆమె అభినందించారు. -
మహిళ హత్య కేసులో స్నేహితురాలి అరెస్టు
అన్నానగర్ : అదృశ్యమైన ఓ మహిళను ఆమె స్నేహితురాలు కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన సంఘటన తిరువట్టార్ సమీపంలో జరిగింది. తిరువట్టార్ సమీపంలో సారూర్ ప్రాంతానికి చెందిన కూలీ ఇన్సెంట్ (42). ఇతని భార్య శశికళ (36). వీరికి ఇద్దరు కుమారులు. 25న ఉదయం శశికళ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఇన్సెంట్ బంధువుల ఇళ్లు సహా పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో అతను తిరువట్టార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శశికళకు నాగర్‌కోవిల్‌కు చెందిన కళతో పరిచయమై ఉన్నట్లు తెలియడంతో ఆమెను పోలీసులు విచారణ చేశారు. విచారణలో నెల్లై జిల్లా దిసైయన్‌విలై శ్మశానంలో శశికళను సజీవదహనం చేశానని ఆమె ఒప్పుకుంది. అనంతరం శశికళ మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టిన చోటును పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కళను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
నిందితుల అరెస్ట్
ఓడీ చెరువు: వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఓడీ చెరువు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన సద్దల నారాయణరెడ్డి భార్య ఐశ్వర్య గత నెల 12న ఆత్మహత్యకు పాల్పడింది. ఐశ్వర్య భర్త నారాయణరెడ్డి, అత్తమామలు సద్దల రంగారెడ్డి, సద్దల వెంకటలక్ష్మమ్మ, మరిది మదన్‌మోహన్‌రెడ్డి వేధింపులు తాళలేకే కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి శివమ్మ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
పెంటపాడు : గతేడాది డిసెంబర్లో ప్రత్తిపాడు రైల్వేట్రాక్‌పై మృతి చెందిన మహిళది హత్య అని పెంటపాడు పోలీసులు తేల్చారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి, తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించారు. ఈ వివరాలను సీఐ మధుబాబు పెంటపాడు పోలీసుస్టేషన్ వద్ద విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత డిసెంబర్లో ప్రత్తిపాడు రైల్వేట్రాక్‌పై కామరాపు పూర్ణచంద్రిక (23) మృతదేహం లభ్యమైంది. అప్పట్లో తాడేపల్లిగూడెం రైల్వేపోలీసులు ఆమెది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె పుట్టిల్లు పాలకోడేరు మండలం గొల్లలకోడేరు కాగా.. అత్తవారిల్లు పెదవేగి మండలం కొప్పాక. కొప్పాకకు చెందిన దుర్గారావుతో ఆమెకు 2008లో పెళ్లైంది. పూర్ణచంద్రిక మృతి సమయంలో ఆమె తండ్రి పతివాడ పెదపైడియ్య తన కుమార్తె ప్రమాదవశాత్తూ చనిపోలేదని, భర్తే హత్యచేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అతనికి వివాహేతర సంబంధం ఉందని తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గూడెం రైల్వేపోలీసులు జిల్లా రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడినుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు హత్యకేసుగా నమోదు చేసిన పెంటపాడు పోలీసులు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మధుభాబు, పెంటపాడు ఎస్సై కె.గుర్రయ్య నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. పూర్ణచంద్రిక హత్యకు భర్త దుర్గారావు, అతని బంధువులే కారణమని తేల్చారు. పూర్ణచంద్రికకు పురుగుల మందు తాగించి ఆపై చీరతో ఉరివేసి హత్య చేశారని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రత్తిపాడు బ్రిడ్జి వద్ద కింద ఉన్న పట్టాలపై మృతదేహాన్ని పడవేశారని గుర్తించారు. దీంతో మృతురాలి భర్త దుర్గారావుతోపాటు పూళ్లగ్రామానికి చెందిన దుర్గారావు పిన్ని కుమారుడు అల్లురవి, ఆటో డ్రైవర్ రౌతు సింహాద్రిని అరెస్టుచేసి మంగళవారం కోర్టుకు పంపినట్లు సీఐ మధుబాబు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న దుర్గారావు చెల్లెలు రాజేశ్వరి పరారీలో ఉందని ఆమెను కూడా త్వరలో అరెస్ట్‌చేస్తామని సీఐ వెల్లడించారు. ఈ హత్యకేసు మిస్టరీని ఛేదించేందుకు సహకరించిన పెంటపాడు ఎస్సై కె.గుర్రయ్య, హెచ్‌సీలు సాంబశివరావు, ఎస్.ఎన్.భూషణం, కానిస్టేబుల్ గంగాధర్‌ను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
మృతురాలు.. యువతా? మహిళా?
తాడేపల్లిగూడెం : పెదతాడేపల్లిలో ఈ నెల 14న సజీవ దహనైంఘటనలో మృతి చెందినది యువతా, మహిళా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు బాలికగా భావించి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా ఈ కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. సజీవ దహనమైన వ్యక్తికి 15 నుంచి 18 ఏళ్లు ఉంటాయని, యువతి లేదా బాలిక అవుతుందని తొలుత పోలీసులు భావించారు. ఈ క్రమంలో కనిపించకుండా పోయిన బాలికల వివరాలను సేకరించి, ఆ దిశగా దర్యాప్తు సాగిస్తూనే, ఆధునిక సాంకేతిక సహకారంతో కేసు మిస్టరీని ఛేదిం చడంలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆధార్‌తో మృతురాలి వేలిముద్రలను సేకరించి క్రోఢీ కరిస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంలో లభించిన సమాచారం మేరకు సజీవ దహనం అయ్యింది యువ తి కాదు, మహిళ అయి ఉండవచ్చనే కోణంలో దర్యా ప్తు సాగిస్తున్నట్టు తెలిసింది. మృతురాలి జుట్టుకు హెన్నా వేసి ఉందని సమాచారం. బెంగాలీ, మార్వాడీ మహిళలు, అదీ వయసు పైబడ్డవారు జుట్టుకు హెన్నా వాడుతుంటారు. ఇటీవల ఫ్యాషన్లతో జుట్టుకు ఎర్రరంగు వేయించుకునే అలవాటు పెరిగింది. సూపర్ ఇంపోజిషన్ ప్రక్రియతో ముఖం రూపురేఖలు తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన మద్యం బాటిళ్లపై ఉండే బ్రాండ్, హాలోగ్రామ్, బ్యాచ్ నంబర్ల ఆధారంగా కూడా కొన్ని వివరాలు లభ్యమైనట్టు తెలిసింది.