నిందితుడు కుమార్ రాజా మృతురాలు రాజేశ్వరి (ఫైల్)
తూర్పుగోదావరి, ఏపీత్రయం (పెదపూడి): పిన్ని వరుస మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, మరికొందరితోనూ సంబంధాలు నెరపుతోందన్న అనుమానంతో ఆమెకు మద్యం ఇచ్చి ఇనుప గొట్టంతో తల వెనుకభాగంలో మోది, ఊపిరాడకుండా ముక్కు, నోరు మూసి కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. డీఎస్పీ వర్మ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఏపీ త్రయం గ్రామానికి చెందిన వీరనాల సత్యనారాయణ పగటి వేషగాడు. అతడికి మొదటి భార్య అనారోగ్యంతో 2012లో మృతి చెందగా, రాజేశ్వరిని రెండో వివాహం చేసుకున్నాడు. ముందు భార్యతో ఐదుగురు పిల్లలను కన్నాడు. ఆ సంతానంలో ఒకడు కుమార్ రాజా. అతడు పిన్ని వరసైన రాజేశ్వరితో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరు ప్రత్యేకంగా ఉండడానికి కరప మండలం గురజనాపల్లి గ్రామం శివారు అడివిపూడిలో 18 నెలల క్రితం ఒక గది అద్దెకు తీసుకుని అప్పుడప్పుడు కలుస్తుండేవారు.
కాగా రాజేశ్వరికి ముగ్గురు సంతానం. సత్యనారాయణ, రాజేశ్వరి కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాలపై బుర్రకథలు చెబుతూ, గ్రామాల్లో పగటి వేషాలు వేస్తుంటారు. ఖాళీ సమయంలో రాజేశ్వరి విజయవాడ సమీపంలో ఉన్న ‘అమ్మ’ అనే స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పనిచేస్తోంది. అప్పుడప్పుడు ఆమె విజయవాడ వెళ్లి సంస్థ కోసం చందాలు కూడా వసూలు చేస్తుం టుంది. ఈ నేపథ్యంలో కుమార్ రాజా రాజేశ్వరిపై అనుమానం పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు పథకం పన్నాడు. వారు తరచూ గొడవపడుతున్నా ఇంట్లో ఏ మాత్రం తెలియనిచ్చేవారు కాదు. ఈ నెల 8న వారు తీసుకున్న అద్దె గదిలో కలుసుకున్నారు. అక్కడ ఆమెకు కుమార్ రాజా మద్యం ఇచ్చి, ఆమెకు మత్తు ఎక్కిన తరువాత పొయ్యి ఊదుకునే గొట్టంతో తల వెనుక భాగంలో బలంగా మోదాడు. అనంతరం ఊపిరి ఆడకుండా ముక్కు, నోరూ మూసి నోటిలో గుడ్డ కుక్కి హత్య చేశాడు. అనంతరం రాజేశ్వరి మృతదేహాన్ని గోనె సంచిలో చిన్నగా మడిచి మోటార్ బైక్‌పై ఏపీత్రయంలోని రేపూరు, కొవ్వూరు వెళ్లే ఏటి గట్టు ప్రాంతంలో పూడ్చాడు.
పథకం ప్రకారమే హత్య
రాజేశ్వరిని హత్య చేయాలనే తలంపుతోనే కుమార్ రాజా 8వ తేదీ ముందు నాలుగు రోజుల నుంచీ గొయ్యి కొద్దికొద్దిగా తవ్వేవాడు. వారి గదిలో చంపేందుకు అవసరమయ్యే సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. తరువాత కూడా సీసీ కెమెరాలు లేని రహదారులను ఎంచుకుని సాయం సమయంలో మోటారుబైక్‌పై వచ్చి పూడ్చాడు.
ఫిర్యాదు చేసినప్పటి నుంచి...
తన భార్య కనిపించడం లేదని 8వ తేదీ నుంచి భర్త సత్యనారాయణ, పిల్లలు, బంధువులు వెతుకుతుండగా వారితో పాటు కుమార్‌రాజా కూడా రాజేశ్వరి కోసం వెదకసాగాడు. ఈ నెల 10న పోలీసులకు భర్త సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనపై పోలీసులకు అనుమానం వచ్చిందేమోనన్న భయంతో కుమార్ రాజా స్థానిక వీఆర్వో రెడ్డిపల్లి సత్యనారాయణకు జరిగిన సంఘటన చెప్పాడు. వీఆర్వో ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీత్రయంలోనే పోస్టుమార్టం
ఏపీ త్రయం గ్రామంలో శుక్రవారం కాకినాడ డీఎస్పీ వర్మ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఇన్‌చార్జి సీఐ రాజశేఖర్, ఎస్సై కిషోర్‌బాబు వీఆర్వో, బంధువుల సమక్షంలో రాజేశ్వరి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె శరీరంపై చేతిపై ఉన్న వీరబ్రహ్మం అనే పచ్చబొట్టు, ముఖం ఆధారంగా బంధువులు రాజేశ్వరిని గుర్తించారు. శవ పంచానామా చేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడిపై హత్య, ఇతర కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment