చుంచు శ్రీనివాసరావు, జ్యోతి
తాడేపల్లిరూరల్/మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఓ యువతిని హత్యచేసి, యువకుడిని దారుణంగా కొట్టిన సంఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన ప్రేమికులు చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై సోమవారం రాత్రి అమరావతి స్టేడియం వద్ద గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడగా.. యువతిని అమానుషంగా హత్య చేశారు. దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ప్రాథమిక వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు శ్రీనివాసరావు చెప్పిన కథనం ప్రకారం.. శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు ఒప్పుకోకపోవడంతో అప్పుడప్పుడు రహస్యంగా కలిసేవారని సమాచారం. సోమవారం మధ్యాహ్నం శ్రీనివాసరావుకు జ్యోతి ఫోన్ చేసింది. సాయంత్రం మంగళగిరిలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో జ్యోతిని శ్రీనివాసరావు కలిశాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వెనుక నుంచి ఎవరో వచ్చి కొట్టారని శ్రీనివాసరావు తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం ఫోన్‌లో మాట్లాడకపోవడంతో స్నేహితులు అమరావతి టౌన్‌షిప్‌కు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ బాలాజీ సంఘటనా స్థలానికి వెళ్లి శ్రీనివాసరావును ఆసుపత్రిలో చేర్పించి, యువతి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
మందుబాబులా లేక కిరాయి హంతకుల పనా?
గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వచ్చి తమతో యువతిని పంపించాలని కోరారని శ్రీనివాసరావు చెబుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. జ్యోతి బంధువులు మాత్రం శ్రీనివాసరావే చంపాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువకులు, శ్రీనివాసరావు బంధువులు మాత్రం పక్కా మర్డర్ ప్లాన్‌తోనే ఈ సంఘటన జరిగిందని అంటున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాసరావును జ్యోతి బంధువులు బెదిరించడంతో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయాడని, మళ్లీ వచ్చాక స్థానికంగా ఉన్న కొంతమందితో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అమరావతి టౌన్‌షిప్‌లో ఉన్న మందుబాబులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేదా కిరాయి హంతకులతో పక్క ప్లాన్‌తో హత్య చేయించారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
వివిధ కోణాల్లో దర్యాప్తు వేగవంతం
ఈ సంఘటనపై అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి పట్టణ పరిధి, మంగళగిరి ప్రాంతంలోను మంగళవారం దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసరావు మహానాడు నుంచి బయలుదేరి జ్యోతిని ఎక్కడ బండి ఎక్కించుకున్నాడు, వారిని ఎవరైనా వెంబడించారా? లేదా శ్రీనివాసరావే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.
పోలీసుల అదుపులో అనుమానితుడు?
ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లి విచారించినట్లు తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీతో పాటు నూతనంగా ఎస్‌ఆర్‌ఎం, విట్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఈ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు, రాజధానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న పలువురు తమకు పరిచయస్తులైన మహిళలతో ఒంటరిగా గడిపేందుకు రాజధాని పొలాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్లేడ్‌బ్యాచ్ తరహాలో కొందరు యువకులు దాడిచేసి నగదు, బంగారం దోచుకోవడం, మహిళలపై అత్యాచారానికి పాల్పడడం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment