
సాక్షి, అమరావతి: మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఫోరం, ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన బహిరంగ సభలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు పోలీస్ శాఖకు బుధవారం ఆదేశాలిచ్చింది. ఈ నెల 17న తిరుపతి సమీపంలోని దామినీడు గ్రామంలో బహిరంగ సభ నిర్వహణ నిమిత్తం అమరావతి పరిరక్షణ సమితికి అనుమతి ఇవ్వాలని తిరుపతి పోలీసులను ఆదేశించింది. 18వ తేదీన తిరుపతిలోని తుడా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు రాయలసీమ మేధావుల ఫోరానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
17వ తేదీన బహిరంగ సభ నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధం చేశామని, అందువల్లే అదే తేదీన సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలన్న రాయలసీమ మేధావుల ఫోరం అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఒకే రోజు తిరుపతి పట్టణ పరిధిలో రెండు బహిరంగ సభలు నిర్వహిస్తే పోలీసుల విధులకు ఇబ్బందిగా మారుతుందని పేర్కొంది. సభ నిర్వహించుకోవడం ప్రాథమిక హక్కులకు సంబంధించిన వ్యవహారమని, తాము ఆ హక్కులను కాలరాయడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో 18న నిర్వహించుకోవాలని చెబుతున్నామంది.
‘రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరూ చేయొద్దు’
అయితే, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం సభల నిర్వహణ విషయంలో సహేతుక ఆంక్షలు విధించవచ్చని పోలీసులకు సూచించింది. ఆంక్షలు ఎంతమాత్రం అహేతుకంగా ఉండరాదని స్పష్టం చేసింది. ఏ ఒక్కరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని ఆదేశిం చింది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడటం, అసభ్యంగా మాట్లాడటం వంటివి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సభలను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారో ప్రసంగాలను పూర్తిగా ఆ ఉద్దేశానికే పరిమితం చేయాలని నిర్వాహకులను హైకోర్టు ఆదేశించింది. సభను శాంతియుతంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించుకోవాలంది. ఈ ఆదేశాలను తూచా తప్పక పాటించి తీరాలని నిర్వాహకులకు తేల్చి చెప్పింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 17న తిరుపతిలో తాము తలపెట్టిన బహిరంగ సభలకు తిరుపతి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాయలసీమ మేధావుల ఫోరం, అమరావతి పరిరక్షణ సమితి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అమరావతి పరిరక్షణ సమితి తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సహేతుక కారణాలు చెప్పకుండా పోలీసులు సభకు అనుమతి నిరాకరించారని తెలిపారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పాదయాత్ర సందర్భంగా నిర్వాహకులు ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపారు. అడుగడుగునా కోర్టు ఆదేశాలను అగౌరవపరిచారని వివరించారు. మంగళవారం తిరుపతిలో అరాచకం సృష్టించారని, పోలీసులను కొట్టి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను న్యాయమూర్తికి ఇచ్చారు. వాటిని న్యాయమూర్తి జస్టిస్ రాయ్ పరిశీలించారు. పాదయాత్ర సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఏఏజీ చెప్పగా, ఆ విషయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు చేపట్టవచ్చని జస్టిస్ రాయ్ స్పష్టం చేశారు.