హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఐడీ కార్డులు చూపించాలని పాదయాత్రికులను అడుగుతున్న పోలీసులు
సాక్షి, రామచంద్రపురం: అమరావతి రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర గుట్టు రట్టయ్యింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్న పోలీసులకు ఐడీ కార్డులు చూపించటంలో పాదయాత్ర చేస్తున్న వారు విఫలమయ్యారు. దీంతో చేసేది లేక యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రకటించారు.
స్థానిక బైపాస్ రోడ్డులోని విజయ ఫంక్షన్ హాలులో బస చేసిన వారు శనివారం పాదయాత్రను ప్రారంభించేందుకు ఉదయం 9 గంటలకు గేటు బయటకు వచ్చారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని, వారి ఐడీ కార్డులు చూపించాలని అమలాపురం, రామచంద్రపురం డీఎస్పీలు మాధవరెడ్డి, బాలచంద్రారెడ్డిల నేతృత్వంలో పోలీసులు కోరారు. అయితే పాదయాత్రలో పాల్గొంటున్న వారిలో కనీసం వంద మందికి కూడా ఐడీ కార్డులు లేవు. ఎవ్వరూ ఐడీ కార్డులు చూపలేదు. దీంతో గత్యంతరం లేక వారందరూ ఫంక్షన్ హాలులోనే ఉండిపోయారు.
గుర్తింపు కార్డులు లేకుండా పాదయాత్రలో పాల్గొనేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు అక్కడకు చేరుకోవటంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఏం చేయాలనే దానిపై పాదయాత్ర చేస్తున్న వారు టీడీపీ నాయకులతో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మంతనాలు సాగించారు.
చివరకు పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ఐడీ కార్డుల విషయంలో కోర్టును ఆశ్రయించి, తిరిగి ప్రారంభిస్తామని మీడియాకు చెప్పారు. ఇదిలా ఉండగా టీడీపీకి చెందిన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సంఘీభావం పేరుతో అక్కడకు చేరుకుని, వైఎస్సార్‌సీపీ నాయకులు కుట్ర పన్ని పాదయాత్రను ఆపేయించారని ఆరోపించారు.
దొంగ రైతులు పలాయనం
హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు.. పాదయాత్ర చేస్తున్న వారి ఐడీ కార్డులు చూపించాలని అడగ్గానే 600 మందికి గాను కనీసం 100 మంది కూడా చూపించలేదు. ఆ సమయంలో ఐడీ కార్డులు లేని వారు వెనుక వైపు నుంచి జారుకున్నారు. వీరి తీరుపై మొదటి నుంచీ అనుమానం వ్యక్తమవుతూనే ఉంది. గుడివాడలో, ఇతర ప్రాంతాల్లో వారి రెచ్చగొట్టే ప్రవర్తన వారిపై మరింతగా అనుమానం పెంచింది.
నిజమైన రైతులెవ్వరూ ఇలా ప్రవర్తించరని, తొడలుకొడుతూ, మీసాలు తిప్పుతూ ఉద్రిక్తతలు పెంచాలని చూడరని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. శనివారం నాటి ఘటనతో ఆ యాత్రలో రైతులు లేరని, చంద్రబాబు అనుచరులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని ఆధారాలతో స్పష్టమైంది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక పచ్చ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందని ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్ తప్ప ప్రజలంతా వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతుండగా, కేవలం వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే చంద్రబాబు రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారనేది అందరికీ తెలిసి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment