ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్ చేయలేకపోయాడు. చివరికి... ఆచూకీ చెబితే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు కూడా. ఎలాగైతేనేం భారత్‌లో అతన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు ప్రేరేపించిన కారణం తెలిసి.. మన పోలీసులు కంగు తిన్నారు.
24 ఏళ్ల తోయా కార్డింగ్లీ.. అక్టోబర్ 21, 2018 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబం క్వీన్స్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చస్తే.. మరుసటి రోజు తోయా శరీరం అతిదారుణంగా.. బీచ్ ఇసుకలో పాతిపెట్టిన స్థితిలో పోలీసుల కంట పడింది. ఆమె పెంపుడు కుక్కను ఆ దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి ఉంచారు. ఉన్మాదంతో కూడిన, దారుణమైన హత్య.. అని తోయా హత్య కేసుపై ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటన చేశారు.
ఆపై దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. రాజ్విందర్ సింగ్ అనే మేల్ నర్స్‌పై అనుమానపడ్డారు. అయితే ఘటన జరిగిన 48 గంటల్లోపే భార్యాపిల్లలతో పాటు ఉద్యోగాన్ని వదిలేసి దేశం విడిచి పారిపోయాడు రాజ్విందర్ సింగ్. దీంతో రాజ్విందర్‌పై అనుమానం బలపడింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేముందు అతని ఫొటోను కూడా పోలీసులు ఆచూకీ కోసం ఉపయోగించుకున్నారు. కానీ, ఇండియాలో అతని ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ కష్టతరంగా మారింది. దీంతో మోస్ట్ వాంటెడ్ రాజ్విందర్ సింగ్ ఆచూకీ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కిందటి ఏడాది మార్చిలో భారత విదేశాంగ శాఖ సాయం కోరింది క్వీన్స్‌లాండ్ పోలీస్ శాఖ.
ఈ క్రమంలో.. తాజాగా రాజ్విందర్ గురించి సమాచారం అందించిన వాళ్లకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.5 కోట్లు) బహుమతి ప్రకటించింది క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం. అయితే తాజాగా రాజ్విందర్‌ను శుక్రవారం ఢిల్లీలోని జీటీ కర్నల్ రోడ్‌లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. క్వీన్స్‌లాండ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. అతన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగించే విషయంలో త్వరలో కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించారు.
అయితే హత్యకు దారి తీసిన పరిణామం గురించి రాజ్విందర్ చెప్పిన విషయంతో ఢిల్లీ పోలీసులు కంగుతిన్నారు. భారత సంతతికి చెందిన రాజ్విందర్ సింగ్.. ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసేవాడు. 2018 అక్టోబర్ 21వ తేదీన తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంలో కత్తి, కొన్ని పండ్లు తీసుకుని రిలాక్స్ అయ్యేందుకు బీచ్‌కు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో.. తోయా కార్డింగ్లీ తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చింది. ఆ కుక్క రాజ్విందర్‌ను చూసి పదేపదే మొరిగిందట. అసలే భార్యతో గొడవ పడిన చిరాకులో ఉన్న అతను.. ఈ విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అది చిలికి చిలికి హత్యకు దారి తీసిందని నేరం ఒప్పుకున్నాడు రాజ్విందర్.
తొలుత ఆమెను కత్తితో కసి తీరా పొడిచాడు. ఆపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను లాక్కెళ్లి.. ఇసుక దిబ్బల్లో పాతేశాడు. ఆ కుక్కను వెంటాడి పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆపై రక్తపు మరకలు ఉన్న కత్తిని నీళ్లలోకి విసిరేశాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ రోజంతా ఆందోళనగానే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా లగేజ్ సర్దుకుని భారత్‌కు పయనం అయ్యాడు. హత్య చేసి పారిపోయి వచ్చాక.. ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాడు రాజ్విందర్ సింగ్. అటు భార్యతోగానీ ఇటు తల్లిదండ్రులతో కానీ ఎలాంటి సంభాషణలు జరపలేదు. కానీ, పంజాబ్-ఢిల్లీ మధ్యే మార్చిమార్చి తిరుగుతూ వచ్చాడు. అధికారులు గుర్తు పట్టకుండా గెటప్ మార్చేస్తూ పోయాడు. ఇక ఇప్పుడు హత్యకు అతను కారణం చెప్పడంతో ఇక్కడి పోలీసుల వంతు పూర్తైంది. అతన్ని ప్రశ్నించడం పూర్తి కావడంతో.. కోర్టులో ప్రవేశపెడతాం అని ఓ ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపాడు.
రాజ్విందర్ సింగ్ మీద ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. మరోవైపు అప్పగింత చట్టం(extradition act) కింద నవంబర్ 21వ తేదీన పాటియాలా హౌజ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల గాలింపు ముమ్మరం అయ్యింది. అందిన కొద్దిపాటి సమాచారంతో అతనున్న గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు.. గడ్డం, తలపాగాతో ఉన్న రాజ్విందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment