కామవరపుకోట: హత్య జరిగి మూడేళ్లు గడుస్తున్నా హతురాలి వివరాలు గానీ, హంతకుల ఆచూకీ గానీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్ 26న కామవరపుకోట మండలంలోని ఆడమిల్లి వద్ద పుంతలో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహం పడివున్న తీరును బట్టి ఆమెది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన మహిళ శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండవచ్చని పోలీసులు భావించారు.
మృతురాలి మెడ కింద తాడుతో బిగించిన గుర్తులున్నాయని, ఎక్కడో చంపి ఇక్కడ పడవేసి వుంటారని నిర్ధారణకు వచ్చారు. మృతురాలిని గుర్తు పట్టేందుకు నాలుగు పోలీసు బృందాలను పంపినట్టు అప్పట్లో జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపారు. ఇక్కడి ఫ్యాక్టరీలలో పని చేసేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు. ఈ కారణంగా మృతురాలి ఆచూకీ కనుగొనేందుకు ఫ్యాక్టరీలలోని కార్మికులను పోలీసులు విచారించారు. ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించి ఇప్పటికి మూడేళ్లు దాటినా ఇంతవరకు చనిపోయిన మహిళ వివరాలేవీ పోలీసులకు లభ్యం కాలేదు. ఈమె ఊరు, పేరు తెలిస్తే మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
1997లోనూ కేసును ఛేదించలేకపోయిన పోలీసులు
1997లో జరిగిన హత్య కూడా ఎటూ తేలకుండానే మరుగున పడిపోయింది. 1997 డిసెంబరు 27న టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెం అడవిలోని జెండా గట్టుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని చూసిన అప్పటి ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వ్యక్తిక్లి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని, ధృఢంగాను, ఆరోగ్యవంతంగాను ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి ముఖం గుర్తు పట్టేందుకు వీలు లేకుండా రాళ్లతో కొట్టారని తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశంలో బండరాయి, మద్యం సీసాలు, సిగరెట్లు, పేకలు, కాలిపోయిన తెల్లచొక్కా కాలర్ ముక్క, కాలిపోయిన పసుపు రంగు నైలాన్ తాడు, హవాయి చెప్ప్చును అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య జరిగి 21 సంవత్సరాలైనా హంతకులెవరో, హతుడెవరో ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment