kamavarapukota
-
నా తల్లి, కుమార్తెపై దాడి చేసి కొట్టారు.. గత్యంతరం లేకే ఇలా..
సాక్షి, తూర్పుగోదావరి(కామవరపుకోట): తనకు న్యాయం చేయాలని కోరుతూ కామవరపుకోటలో గురువారం ఓ వివాహిత అత్తింటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, అత్తమామలు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించింది. అదనంగా కట్నం తీసుకువస్తేనే ఇంట్లోకి రానిస్తామని, లేకపోతే రావొద్దని తనను బిడ్డతో సహా కొట్టి బయటికి గెంటివేశారని వాపోయింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లింగపాలెం మండలం కొత్తపల్లికి చెందిన రత్నదుర్గకు కామవరపుకోటకు చెందిన యన్నా దుర్గారావు, జ్యోతి కుమారుడు నరేంద్రతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.3 లక్షల కట్నం, మూడు ఎకరాల పొలం, 20 కాసుల బంగారం ఇచ్చారు. భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండటంతో వివాహం తరువాత అక్కడే కాపురం పెట్టారు. తరువాత ఆడపిల్ల పుట్టడంతో అత్తమామల నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. చదవండి: (పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య) గత నెల 28న అత్త ఇంట్లో ఉన్న తనపై, తన కుమార్తెపై మామ దుర్గారావు మరో ముగ్గురితో కలిసి హత్యాయత్నానికి పాల్పడడంతో తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి అత్తారింట్లోనే ఉంటోంది. గురువారం అత్తమామలతో పాటు మరిది, అతని భార్య, మరి కొంతమంది మరోసారి తన తల్లి, కుమార్తెపై దాడి చేసి కొట్టడంతో గత్యంతరం లేక ఇంటి ముందు ఆందోళనకు దిగినట్లు తెలిపింది. పోలీసులు తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని, హత్యాయత్నం చేసినవారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరింది. తడికలపూడి ఎస్సై కె.వెంకన్న ఘటనా స్ధలానికి చేరుకుని మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. -
వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కామవరపుకోట(పశ్చిమగోదావరి) : కామవరపుకోటలోని కోటగట్టు ప్రాంతానికి చెందిన కె.రత్నశ్రీ (18) ఆకతాయి వేధింపులు తాళలేక శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుందని తడికలపూడి ఎస్ఐ కె.సతీష్ కుమార్ తెలిపారు. రత్నశ్రీ నాయనమ్మ వీరవెంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం..రత్నశ్రీ స్థానిక వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రత్నశ్రీ తల్లి చిన్నతనంలోనే చనిపోగా, ఇటీవలే తండ్రి కూడా మరణించాడు. దీంతో నాయనమ్మ ఆలనాపాలనా చూస్తోంది. కోటగట్టు ప్రాంతానికి చెందిన వామిశెట్టి నాగు గత ఏడాదిగా రత్నశ్రీ వెంటపడి వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రత్నశ్రీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు తాళలేక మనస్తాపంతో శనివారం ఉదయం విషం తాగింది. మనవరాలిని నిద్ర లేపటానికి వెళ్ళిన నాయనమ్మ వీరవెంకమ్మకు పురుగుల మందు వాసన రావడం, రత్నశ్రీ అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రత్నశ్రీ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏళ్లు గడుస్తున్నా.. వీడని మిస్టరీ
కామవరపుకోట: హత్య జరిగి మూడేళ్లు గడుస్తున్నా హతురాలి వివరాలు గానీ, హంతకుల ఆచూకీ గానీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్ 26న కామవరపుకోట మండలంలోని ఆడమిల్లి వద్ద పుంతలో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహం పడివున్న తీరును బట్టి ఆమెది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన మహిళ శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతురాలి మెడ కింద తాడుతో బిగించిన గుర్తులున్నాయని, ఎక్కడో చంపి ఇక్కడ పడవేసి వుంటారని నిర్ధారణకు వచ్చారు. మృతురాలిని గుర్తు పట్టేందుకు నాలుగు పోలీసు బృందాలను పంపినట్టు అప్పట్లో జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపారు. ఇక్కడి ఫ్యాక్టరీలలో పని చేసేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు. ఈ కారణంగా మృతురాలి ఆచూకీ కనుగొనేందుకు ఫ్యాక్టరీలలోని కార్మికులను పోలీసులు విచారించారు. ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించి ఇప్పటికి మూడేళ్లు దాటినా ఇంతవరకు చనిపోయిన మహిళ వివరాలేవీ పోలీసులకు లభ్యం కాలేదు. ఈమె ఊరు, పేరు తెలిస్తే మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 1997లోనూ కేసును ఛేదించలేకపోయిన పోలీసులు 1997లో జరిగిన హత్య కూడా ఎటూ తేలకుండానే మరుగున పడిపోయింది. 1997 డిసెంబరు 27న టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెం అడవిలోని జెండా గట్టుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని చూసిన అప్పటి ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వ్యక్తిక్లి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని, ధృఢంగాను, ఆరోగ్యవంతంగాను ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి ముఖం గుర్తు పట్టేందుకు వీలు లేకుండా రాళ్లతో కొట్టారని తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశంలో బండరాయి, మద్యం సీసాలు, సిగరెట్లు, పేకలు, కాలిపోయిన తెల్లచొక్కా కాలర్ ముక్క, కాలిపోయిన పసుపు రంగు నైలాన్ తాడు, హవాయి చెప్ప్చును అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య జరిగి 21 సంవత్సరాలైనా హంతకులెవరో, హతుడెవరో ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు. -
మరోసారి చిక్కాడు
కామవరపుకోట: అవినీతి కేసు విచారణలో ఉండగానే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కామవరపుకోట సబ్ రిజి స్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు. 2013లో వట్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఆయన పనిచేస్తుండగా కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు రూ.98 వేలు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరలా రెడ్ హ్యాండెడ్‌గా ఆయన ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి పీతల కృష్ణమూర్తి టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెంలో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కోసం కామవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా సబ్ రిజిస్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు రూ.10 వేలు డిమాండ్ చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు సోమవారం కృష్ణమూర్తికి రసాయనా లు పూసిన ఐదు రూ.2 వేల నోట్లను ఇచ్చి సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు పంపామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కృష్ణమూర్తి నుం చి సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు రూ.10 వేలు తీసుకుంటుండగా తాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. ఫిర్యాదుదారు గతంలో ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రాగా రూ.లక్ష డిమాండ్ చేశారని, దీంతో ఫిర్యాదుదారు రిజిస్ట్రేషన్ మానేశారని చెప్పారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ 2013లో వట్లూరులో పనిచేస్తుండగా దాడులు చేశామని లెక్కల్లో చూపని రూ.98 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై విచారణ ఇంకా సాగుతోందని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఏసీబీ సీఐ విల్సన్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. కక్షిదారు రిజిస్ట్రేషన్ చేయమన్న స్థలంపై వివాదం చింతలపూడి కోర్టులో నడుస్తుండటం తో వివాదం పరిష్కారమైనట్టు లేఖ తీసుకురావాలని సూచించానని సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు చెప్పారు. అయితే సోమవారం 1బి కాగితాలు తీసుకువచ్చి చూపిస్తుండగా, ఇవి అవసరం లేదని చెబుతుండగానే కృష్ణమూర్తి కాగితం చుట్ట తన ముఖం మీదకు విసిరేశాడన్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు వచ్చారని మధుసూదనరావు అంటున్నారు. -
మంత్రుల కాన్వాయ్‌కు ప్రమాదం
జంగారెడ్డిగూడెం / కామవరపుకోట : రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతల కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి వస్తుండగా, కామవరపుకోట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రులిద్దరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్ జంగారెడ్డిగూడెం వస్తుండగా, కామవరపుకోట సమీపంలో రోడ్డుకు అడ్డుగా మేకలు రావడంతో ముందుగా వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీనిని వెనుక వస్తున్న వాహనాల డ్రైవర్లు గమనించలేదు. ఫలితంగా ఎస్కార్ట్ జీపును ఒక కారు ఢీకొంది. వెంటనే దాని వెనుక ఉన్న కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలో ఉన్న ఆరుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రులిద్దరూ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుంచి మరో వాహనం ఢీకొనడంతో వెనుక వైపు ఉన్న డిక్కీ డోరు లోపలికి చొచ్చుకుపోయింది. పలు వాహనాల ముందుభాగాలు దెబ్బతిన్నాయి. -
డాక్టర్ రమణారావు ఆదర్శప్రాయుడు
కామవరపుకోట : పల్లె ప్రజలకు నిస్వార్ధంగా వైద్య సేవలు అందించి రోగుల పాలిట అపర ధన్వంతరి అయిన దివంగత డాక్టర్ పున్నమరాజు వెంకట రమణారావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంబీజేఆర్. ప్రసాదరావు అన్నారు. కామవరపుకోటలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ రమణారావు శతజయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంబీజేఆర్.ప్రసాదరావు మాట్లాడుతూ అప్పట్లో జ్వరం వస్తే ఐదారు లంఖణాలే తప్ప మరో చికిత్స ఉండేది కాదన్నారు. డాక్టర్ రమణరావు వచ్చే వరకు ఇంజక్షన్ అంటే ఏమిటో తెలియదని అన్నారు. సేవలు మరువలేనివి స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేఏ.సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందు నుంచీ కామవరపుకోట పరిసర ప్రాంత వాసులకు డాక్టర్ రమణారావు చేసిన వైద్య సేవలు మరవలేనివన్నారు. నేటి తరం వారు ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లిపోకుండా సొంత ఊరికి ఎంతో కొంత సేవ చేయాలని, ఈ విషయంలో రమణారావును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.పాండు రంగారావు మాట్లాడుతూ డాక్టర్ రమణారావు నేర్పిన విలువలను పాటిస్తూ అంతా కలిసిమెలిసి ఉండడం అభినందనీయమన్నారు. రమణారావు శత జయంతి సందర్భంగా స్థానిక పీహెచ్‌సీకి రోగుల సౌకర్యార్ధం మంచాలు అందజేయడంపై వైద్యాధికారి సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఆత్మీయ సమావేశం డాక్టర్ రమణారావు శతజయంతి సందర్భంగా ఆదివారం మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులంతా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే వారితో పాటు విదేశాలలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్నందుకు వీరంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. -
చెరువులో మునిగి యువకుడి మృతి
కామవరపుకోట : గేదెను కడిగేందుకు చెరువులో దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటన ఆదివారం ఉప్పలపాడు పంచాయతీలో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్దన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గోపాల్‌నగర్ కాలనీకి చెందిన ఎస్.రవి (21) అనే యువకుడు గేదెను కడిగేందుకు గ్రామంలోని అలివేలుకుంట చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మునిగి అసువులు బాశాడు. వీఆర్వో ఎం.ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. దండగర్ర ఊర చెరువులో వ్యక్తి.. తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం దండగర్ర ఊర చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దండగర్ర గ్రామానికి చెందిన అంజుర్తి రత్తయ్య (48) అనే వ్యక్తి ఆదివారం వేకువజామున బహిర్భూమికి వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఊరచెరువులో మృతదేహం తేలియాడటాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని కుమారుడు సూర్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిర్భూమికి వెళ్లి రత్తయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటాడని ఎస్సై పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
భర్త చేతిలో భార్య హతం
-
భర్త చేతిలో భార్య హతం
ఆడమిల్లి (కామవరపుకోట) : అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కొట్టిన దెబ్బకు భార్య అక్కడికక్కడే మృతి చెందింది. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆడమిల్లి సంజీవనగర్ కాలనీలో నివాసముంటున్న ప్రొద్దుటూరి శ్రీను, కుమారి దంపతులకు వివాహమై పన్నెండు సంవత్సరాలైంది. అయితే భార్యపై అనుమానంతో భర్త శ్రీను శనివారం రాత్రి కర్రతో తలపై కొట్టగా కుమారి(30) అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు డీఎస్పీ వెంకటరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసయాదవ్, తడికలపూడి ఏఎస్సై దీక్షితులు డీఎస్పీ వెంట ఉన్నారు. -
వరకట్న దాహానికి మహిళ బలి
కామవరపుకోట : వరకట్న దాహానికి ఓ మహిళ బలయిపోయింది. కట్నం డబ్బు చాలలేదని, పుట్టింటి నుంచి ఇంకా తేవాలంటూ అత్తింటివారు పెట్టిన ఆరళ్లకు ఆమెకు నిండు నూరే ళ్లు నిండిపోయాయి. కామవరపుకోట బీసీ కాలనీకి చెందిన తులసీదుర్గ(24) బుధవారం మృతి చెందింది. తడికలపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్ల మండలం ముసుళ్లకుంటకు చెందిన తులసీదుర్గకు కామవరపుకోటకు చెందిన నిట్టా రామకృష్ణతో 2011లో వివాహమైంది. రామకృష్ణ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. తరువాత తులసీదుర్గను చేసుకున్నాడు. వారికి మూడేళ్లు, రెండేళ్ల వయసు కుమారులు ఇద్దరు ఉన్నారు. వివాహ సమయంలో దుర్గ పుట్టింటి వారు కట్నం కింద రూ.25 వేలు ఇచ్చారు. అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్తమామలు, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా తండ్రికి చెప్పేది. ఇదిలా ఉండగా తులసీదుర్గ చనిపోరుుందని ఆమె తండ్రికి అత్తింటివారు బుధవారం తెలిపారు. వారు వచ్చిన వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా తులసీదుర్గ తలపై గాయం కనిపించింది. దీంతో ఆమెది సహజ మరణం కాదని భావించి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, చింతలపూడి సీఐ దాసు ఆ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. తహసిల్దార్ డీఏ నరసింహరాజు పంచనామా చేశారు. తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్దన్ కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి చిరింగుల చినవెంకట సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఆమెభర్త రామకృష్ణ, అత్తమామలు, మరిదిపై ఐపీసీ 304బి, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.మృతదేహాన్ని డాక్టర్ల బృందం పోస్టుమార్టం చేస్తుందని చెప్పారు. -
రాష్ట్రంలో దుష్టపాలన
కామవరపుకోట : రాష్ట్రంలో సాగుతున్న దుష్ట పరిపాలన నుంచి పేద ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలన్న ఆలోచనలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తాను ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఆళ్ల నాని అన్నారు. స్థానిక కార్యకర్త కిలారు సత్యనారాయణ ఇంటి ఆవరణలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భగా మాట్లాడుతూ ైరె తు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు.ఆధార్ వ్యవస్థ అన్యాయమని పోరాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి పథకానికి ఆధార్ కావాలంటూ ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రుణాలను ఎలా రద్దు చేస్తారు? ఎర్రచందనం అమ్మితే వచ్చే రూ.ఐదు వేల కోట్లు, కార్పొరేషన్లో జమ చేసిన రూ.ఐదువేల కోట్లు మొత్తం రూ. పదివేల కోట్లతో రూ.లక్షా ఎనిమిది వేల కోట్ల రుణాలను ఎలా రద్దు చేస్తారని నాని ప్రశ్నించారు. మహిళల రుణాల పై ఒక్కమాట కూడా మాట్లాడని దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ధర్నాలు చేస్తున్న టీడీపీ శ్రేణులకు ఎన్నికల హామీలు అమలు చేసి పార్టీ పరువు కాపాడాలని ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఆందోళన చేపట్టాల్సిందిగా ఎంపీ మాగంటి బాబు, మంత్రి సుజాత హితవు చెప్పాలన్నారు. వచ్చే నెల 5న ఏలూరులో జరిగే రైతు ధర్నాలో రైతులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్, ఐడీసీ చైర్మన్ ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పథకాలకే టీడీపీ నాయకులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. మరో కన్వీనర్ మద్దాల రాజేష్ మాట్లాడుతూ ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మండల కన్వీనర్ మిడతా రమేష్ మాట్లాడుతూ చక్కగా నడుస్తున్న ఘంటా హనుమంతరావు ఎర్రకాల్వ ఎత్తిపోతల పథకాన్ని రాజకీయ కారణాలతో పాడు చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వాటిని అడ్డుకోవాలని నాని దృష్టికి తీసుకువచ్చారు. మహిళా విభాగం జిల్లా కన్వీనర్ వందనపు సాయిబాల పద్మజ, ఏఎంసీ చైర్మన్ తూతా లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుడు చిలుకూరి సుబ్బారావు, ఎర్రకాల్వ ఎత్తిపోతల పథకం చైర్మన్ కంఠమనేని సత్యనారాయణ, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.బాలస్వామి, వై శ్రీను పాల్గొన్నారు. ఇన్ని ఆంక్షలా? లింగపాలెం : ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీని అమలు చేసేందుకు ఆరు నెలలుగా ఇన్ని ఆంక్షలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నావంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు. శనివారం రాత్రి లింగపాలెం మండలం భోగోలులో పార్టీ నాయకుడు దయ్యాల నవీన్‌బాబు ఇంటి ఆవరణలో నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతసేపు రేషన్‌కార్డు, మరికాసేపు ఆధార్‌కార్డు తీసుకురమ్మని, తరువాత బంగారానికి లేదు, పంట రుణాలకే అంటున్న చంద్రబాబు రాను రాను తెల్ల పంచె ధరించి, మెడలో తెల్లకండువా వేసుకునేవారికే రుణమాఫీ చేస్తానని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కార్యకర్తల జోలికొస్తే ఎదుర్కొంటాం చింతలపూడి : టీడీపీ అధికార బలంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ నాని హెచ్చరించారు. చింతలపూడి వైఎస్సార్ సీపీ మండల కార్యకర్తల సమావేశం శనివారం మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు గృహం వద్ద జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని ప్రసంగిస్తూ జిల్లాలో కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, అధైర్య పడవద్దన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కంక ణబద్ధులు కావాలని చెప్పారు. మరో కోఆర్డినేటర్ ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయపెట్టి పబ్బం గడుపుకుందామని టీడీపీ చూస్తోందని విమర్శించారు. అంతకుముందు పలువురు కార్యకర్తల నుంచి అభిప్రాయాలను నాని సేకరించారు. టీపీ గూడెం మాజీ జెడ్పీటీసీ ఎం. సంపత్‌కుమార్, సర్పంచ్ మారిశెట్టి జగన్, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు జె.జానకిరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ గంధం చంటి, మండలంలోని సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీల ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజలను మోసగించి బాబు గద్దెనెక్కారు జంగారెడ్డిగూడెం రూరల్ : అమలు కాని హామీలు ఇచ్చి రైతులను, మహిళలను మోసం చేసి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం పేరంపేట పార్టీ నాయకులు ఇర్ల శ్రీనివాసరెడ్డి బ్యారన్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఈ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీస్తే రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మళ్లీ మాట తప్పి పంట రుణాలు చేస్తానని, పామాయిల్, కొబ్బరి, అరటి తోటలు తనకు సంబంధం లేదని పొంతన లేకుండా మాట్లాడుతూ రైతులను ఇంకా మోసం చేస్తున్నారన్నారు. -
''అలాంటి రుణాలు మాఫీ చేయడం కష్టం''
-
అలాంటి రుణాలు మాఫీ చేయడం కష్టం: చంద్రబాబు
ఏలూరు: బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకుని వేరొకదానిపై ఖర్చుచేస్తే, అట్లాంటివి మాఫీ చేయడం కష్టం అని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు కామవరపుకోటలో మాట్లాడుతూ రైతుల అందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అయితే ఇంటికి ఒక రుణానికి మాత్రంమే మాఫీ వర్తిస్తుందన్నారు. ఇతర ఖర్చుల నిమిత్తం బంగారు రుణాలు తీసుకుంటే అటువంటి వాటికి మాఫీ వర్తించడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో రుణమాఫీపై ఆయన స్పష్టత ఇవ్వలేకపోయారు. సమస్యలు ఉన్నాయి, సమయం పడుతుందని మాత్రం చెప్పారు. -
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇంటిపై రాళ్లదాడి
ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచామన్న గర్వంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ వర్గాలపై దాడులకు తెగబడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని మురారి రాజకుమారి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. చంపేస్తామని బెదిరించారు. రావికంపాడు పంచాయతీకి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థినిగా తూర్పు యడవల్లికి చెందిన మురారి రాజకుమారి పోటీ చేశారు. ఈమెకు ప్రత్యర్థిగా వెంకటాపురానికి చెందిన కోటగిరి సామ్రాజ్యలక్ష్మి నిలబడ్డారు. ఎన్నికల్లో రాజకుమారి ఓటమి పాలయ్యారు. ఏలూరులో కౌంటింగ్ కేంద్రం నుంచి వచ్చేసిన ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. తన భర్త వెంకటేశ్వరరావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కింద పడేసి జెండా కర్రలతో కొట్టారని రాజకుమారి తెలిపారు. కోటగిరి కుటుంబ సభ్యులపైనే పోటీ చేస్తారా.. మీ అంతు చూస్తామంటూ బెదిరించారని ఆమె చెప్పారు. 16వ తేదీ తర్వాత మిమ్మల్ని చంపేస్తాం.. ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మురారి వెంకటేశ్వరరావు, రాజకుమారి దంపతులు తెలిపారు. -
వైసీపీ అభ్యర్థిని ఇంటిపై రాళ్లతో దాడి
తూర్పు యడవ ల్లి (కామవరపుకోట), న్యూస్‌లైన్ : కామవరపుకోట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని మురారి రాజకుమారి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడిచేశారు. చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం ఆమె విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నారుు.. మండలంలోని రావికంపాడు పంచాయతీకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థినిగా తూర్పు యడవల్లికి చెందిన మురారి రాజకుమారి పోటీ చేశారు. ఈమెకు ప్రత్యర్థిగా వెంకటాపురానికి చెందిన కోటగిరి సామ్రాజ్య లక్ష్మి నిలబడ్డారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో రాజకుమారి ఓటమి పాలయ్యారు. దీంతో ఏలూరులో కౌంటింగ్ కేంద్రం నుంచి వచ్చేసిన ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి కి దిగారు. తన భర్త వెంకటేశ్వరరావు బయటకు వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కింద పడేసి జెండా కర్రలతో విచక్షణారహితంగా కొట్టారని రాజకుమారి తెలిపారు. కోటగిరి కుటుంబ సభ్యులపైనే పోటీ చేస్తారా.. మీ అంతు చూస్తామంటూ బెదిరించారని ఆమె చెప్పారు. 16వ తేదీ తర్వాత మిమల్ని చంపేస్తాం.. ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు. వెంకటాపురానికి చెందిన కోటగిరి వెంకట నరసింహారావు (రాజబాబు), ఆయన కుమారుడు అన్వేష్, శ్రీకాంత్, బేతిన జగన్నాథం, వేముల రాంబాబు తండ్రి గంగరాజు, మద్దిపట్ల నరసింహారావు, యడవల్లికి చెందిన మానెం సుబ్బయ్య, డొక్కా సూరి, వేముల నాగయ్య, మరీదు వెంకటరావు, మరీదు పుల్లంరాజు, మరీదు మహాలక్ష్మయ్య, మరీదు సుబ్బారావు, మరీదు రాజు దాడిలో పాల్గొన్నారని మురారి వెంకటేశ్వరరావు, రాజకుమారి దంపతులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. దాడి అమానుషం మురారి కుటుంబంపై టీడీపీ కార్యకర్తల దాడి ని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మిడతా రమేష్, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యం బాబు, ఏఎంసీ చైర్మన్ తూతా లక్ష్మణరావు ఖండించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారిపై దాడులు అమానుషమన్నారు. మురారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. దాడిని ఖండించిన వారిలో రావికంపాడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ మీరా సాహెబ్(ఏసు), రావికంపాడు గ్రామ వైసీపీ నాయకులు కె.అంజిరెడ్డి, ప్రసాదరెడ్డి, దొరబాబు, మోర్ల సత్యనారాయణ, ఎం.బాలస్వామి, జగదీష్, ఎం.నాగయ్య, రవి ఉన్నారు. -
ఉద్యోగమిస్తే నిరుద్యోగ భృతి ఎందుకు?
కామవరపుకోట: ఇంటింటికి ఉద్యోగం ఇస్తే ఇక నిరుద్యోగ భృతి ఎందుకని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేని దుస్థితితో చంద్రబాబు ఉన్నట్లు విమర్శించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. 2009లో నగదు బదిలీ అన్నారు, ఇప్పుడు కొత్తగా రుణమాఫీ అంటున్నారని చెప్పారు. ఆ నగదు బదిలీపై ఇప్పుడెందుకు మాట్లాడటంలేదు? అని ప్రశ్నించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత బాబుదేనన్నారు. 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ది అని చెప్పారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ ఇచ్చి వారికి రాజకీయ భద్రత కల్పించారని గుర్తు చేశారు. అన్నగా, తండ్రిగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. గత నాలుగేళ్లుగా ప్రజల వెన్నంటి ఉన్నది వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీనేనని అన్నారు. ఎంపీగా తోట చంద్రశేఖర్‌ను, ఎమ్మెల్యేగా దేవీప్రియను ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ పరిపాలన జగన్ పాలనలో చూస్తారని హామీ ఇచ్చారు. -
కామవరపుకోట ఎంపీడీవో సస్పెన్షన్
కామవరపుకోట, న్యూస్‌లైన్ : కామవరపుకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె.శిల్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యూయి. ఈనెల 15న జిల్లా కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌కు హాజరు కాని కారణంగా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఎంపీడీవో శిల్పకు ఈ ఏడాది మే 26వ తేదీతో ప్రొబేషన్ కాలం ముగియనున్నది. మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకుడు ఎ.రాంబాబు ఇన్చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తారు. ఏలూరులో ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పత్తి శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ జి.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఆయనను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. -
ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఉప్పలపాడు (కామవరపుకోట), న్యూస్‌లైన్ : ఎరువుల కోసం వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్తుండగా ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... టి.నరసాపురం మండలం సాయంపాలెంకు చెందిన సూరం దేవరాజు(33), బట్రు నాగరాజు అనే వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి మోటార్ సైకిల్‌పై ఎరువుల నిమిత్తం కామవరపుకోట వచ్చాడు. పని ముగించుకుని ఇద్దరూ సాయంపాలెం వెళ్తుండగా ఉప్పలపాడు వద్ద ఎదురుగా వచ్చిన ట్రక్కు ఆటో బలంగా ఢీకొనడంతో దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును, స్వల్ప గాయాలైన ఆటో డ్రైవర్‌ను 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నాగమణి, కుమార్తె అనూష ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి. ఈ దుర్ఘటనపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.