కామవరపుకోటలో భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న వివాహిత
సాక్షి, తూర్పుగోదావరి(కామవరపుకోట): తనకు న్యాయం చేయాలని కోరుతూ కామవరపుకోటలో గురువారం ఓ వివాహిత అత్తింటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, అత్తమామలు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించింది. అదనంగా కట్నం తీసుకువస్తేనే ఇంట్లోకి రానిస్తామని, లేకపోతే రావొద్దని తనను బిడ్డతో సహా కొట్టి బయటికి గెంటివేశారని వాపోయింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
లింగపాలెం మండలం కొత్తపల్లికి చెందిన రత్నదుర్గకు కామవరపుకోటకు చెందిన యన్నా దుర్గారావు, జ్యోతి కుమారుడు నరేంద్రతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.3 లక్షల కట్నం, మూడు ఎకరాల పొలం, 20 కాసుల బంగారం ఇచ్చారు. భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండటంతో వివాహం తరువాత అక్కడే కాపురం పెట్టారు. తరువాత ఆడపిల్ల పుట్టడంతో అత్తమామల నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
చదవండి: (పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య)
గత నెల 28న అత్త ఇంట్లో ఉన్న తనపై, తన కుమార్తెపై మామ దుర్గారావు మరో ముగ్గురితో కలిసి హత్యాయత్నానికి పాల్పడడంతో తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి అత్తారింట్లోనే ఉంటోంది. గురువారం అత్తమామలతో పాటు మరిది, అతని భార్య, మరి కొంతమంది మరోసారి తన తల్లి, కుమార్తెపై దాడి చేసి కొట్టడంతో గత్యంతరం లేక ఇంటి ముందు ఆందోళనకు దిగినట్లు తెలిపింది. పోలీసులు తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని, హత్యాయత్నం చేసినవారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరింది. తడికలపూడి ఎస్సై కె.వెంకన్న ఘటనా స్ధలానికి చేరుకుని మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment