యువకుడి ఇంటి ముందు దీక్ష చేస్తున్న మీనాక్షి
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: తనను నమ్మించి మోసం చేశాడంటూ పట్టణంలోని స్థానిక ఏవిఎస్‌ఎన్ కాలనీలో యువకుడి ఇంటి ముందు ఓ యువతి మంగళవారం బైఠాయించింది. యువతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన చీమకుర్తి మీనాక్షి పద్మ భాగ్యశ్రీకి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన సిద్ధపల్లి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో 2012లో వివాహమైంది. రెండేళ్లకు వారిద్దరి మధ్య గొడవలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. ఆ తర్వాత ఆమె 2016లో పాలకొల్లు వచ్చింది. ఇక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒక రూము తీసుకుని అద్దెకు ఉంటోంది.
ఖాళీ సమయాల్లో పెదగోపురంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆ సమయంలో శంకరశాస్త్రి అనే యువకుడు పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక అవసరం తీర్చుకున్నాడు. నీకు పెళ్‌లైంది కదా విడాకులు తీసుకుంటే లీగల్‌గా మనకు ఏ ఇబ్బంది ఉండదని యువతికి చెప్పాడు. 2019లో మొదటి భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోను నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ నిర్లక్ష్యం చేస్తున్నాడని యువతి వాపోయింది. శంకరశాస్త్రి నన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే నాకు చావే శరణ్యం అంటూ శాస్త్రి ఇంటి ముందు కూర్చుని విలపిస్తూ ఆందోళన చేస్తోంది. తనతో ఏం సంబంధం లేకున్నా తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని శంకరశాస్త్రి వివరణ ఇచ్చాడు. ఐసీడీఎస్ అధికారులతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment