టి.నగరపాలెంలో అత్తింటి ముందు పిల్లలతో కలిసి ఆందోళన చేస్తున్న అరుణ కుమారి (ఇన్‌సెట్) బర్ల నరసింగరావు
తగరపువలస(భీమిలి): రెండో వివాహం చేసుకున్న భర్త ఇంటి ముందు ఓ వివాహిత తన పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. భీమిలి మండలం టి.నగరపాలెం పంచాయతీకి చెందిన బర్ల నరసింగరావు ఈ నెల 8న భోగాపురం మండలం చెరకుపల్లి పంచాయతీకి చెందిన అప్పలనారాయణ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఇతనికి మొదటి భార్య అరుణ, కుమార్తె షర్మిల(10), కుమారుడు హిమేష్(8) ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కె.నాగరాణి ఆధ్వర్యంలో పిల్లలతో కలిసి అరుణ ముందుగా జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డు బంగ్లామెట్టపైన అప్పలనారాయణతో ఉంటున్న భర్త ఇంటి ముందు, తరువాత టి.నగరపాలెంలోని అత్తింటి ముందు సోమవారం ఆందోళన చేపట్టారు.
అనంతరం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మేనత్త కుమారుడైన నరసింగరావుతో తనకు 2007లో వివాహం కాగా ఇద్దరు సంతానం కలిగారన్నారు. అయిదేళ్ల క్రితం అదనపు కట్నం తదితర కారణాలతో తనను భర్త నరసింగరావు వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన భర్త నరసింగరావు మరో మహిళను వివాహం చేసుకుని బంగ్లా మెట్టపై కాపురం పెట్టి తనను, పిల్లలను నిర్లక్ష్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త రెండో వివాహంపై పంచాయతీలో చర్చించినా న్యాయం జరగలేదన్నారు. తన నుంచి విడాకులు కోరుతూ మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఐద్వా కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ మొదటి భార్య అరుణ బతికి ఉండగా అప్పలనారాయణ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్న నరసింగరావును శిక్షించాలని డిమాండ్ చేశారు. అరుణకు, ఆమె పిల్లలకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా బంగ్లామెట్ట, టి.నగరపాలెంలో అరుణ ఆందోళన చేస్తున్నంతసేపూ నరసింగరావు, అతని తల్లిదండ్రులు అప్పన్న, ఎల్లయ్యమ్మ అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment