ప్రశాంత్ ఇంటి వద్ద బైఠాయించిన అర్చిత, నాయకులు
మోర్తాడ్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనను కాపురానికి తీసుకొని పోవడం లేదని ఆరోపిస్తూ మండలంలోని సుంకెట్‌లో అర్చిత అనే మహిళ తన కుటుంబ సభ్యులు, దళిత సంఘాల సహకారంతో బైటాయించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సుంకెట్‌కు చెందిన ప్రశాంత్, అర్చిత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి రెండేళ్ల కింద సికింద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహాన్ని వారి పెద్దలు అంగీకరించరని గోప్యంగా ఉంచారు.
అయితే రెండు నెలల కింద అర్చిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అర్చిత డెలివరి అయిన నుంచి ప్రశాంత్ సుంకెట్‌కు రావడం లేదు. అంతేకాక కనీసం ఫోన్‌లోనైనా మాట్లాడక పోవడంతో అర్చిత ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించింది. ప్రేమించి తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి రాకపోవడం, హైదరాబాద్‌లోనూ మకాం మార్చడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అర్చిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల సహకారంతో తన భర్త ఇంటి ముందు బైటాయించింది.
విషయాన్ని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రశాంత్ హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న మోర్తాడ్ ఎస్‌ఐ సురేష్ ఇరువర్గాలను స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ చేశారు. తప్పు తెలుసుకుని చక్కగా నడుచుకోవాలని ప్రశాంత్‌కు ఎస్‌ఐ సూచించారు. అర్చితకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా క్రిమినల్ కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment