పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న సనా
సాక్షి, మదనపల్లె టౌన్: భర్త ఆచూకీ కోసం ఓ మహిళ సోమవారం మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. తన భర్తను అప్పగించాలని పోలీసులను వేడుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. తెలంగాణ, నల్గొండ జిల్లా చింతపల్లె మండలం కుడిమేకు గ్రామానికి చెందిన సనా, మదనపల్లె మండలం పోతబోలు గ్రామం గాండ్లపల్లెకి చెందిన రమేష్‌కుమార్ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లికి సనా పెద్దలు అంగీకరించడకపోవడంతో ప్రియుడి కోసం తల్లిదండ్రులను కాదనుకొని వచ్చేసింది.
జనవరి 4వ తేదీన మదనపల్లెలోని చెన్నకేశవస్వామి ఆలయంలో రమేష్ కుమార్ తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది. కొంత కాలం వీరి జీవితం బాగా సాగినా తరువాత అత్తింటి నుంచి వేధింపులు ప్రారంభమవడంతో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి భర్త కనిపించకపోవడంతో సనా, గాండ్లపల్లెలోని అత్తగారింటికి వెళ్లగా వారు రానివ్వలేదు. దీంతో తన భర్తను అత్తవారే దాచిపెట్టారని, భర్తను అప్పగించాలని కోరుతూ సనా సోమవారం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన చేపట్టింది. అందరినీ వదిలి భర్త కోసం వచ్చిన తనకు ఇప్పుడు ఎవరూ లేరంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.
చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..)
పెద్ద మనుషుల చిన్న బుద్ధి?
రమేష్ కుమార్ ఈ నెల 10 నుంచి కనిపించకపోవడంతో సనా అత్తగారింటి వద్ద నిరసన తెలిపి, రూరల్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను అత్త, కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ఫిర్యాదు చేసింది. అయితే కొందరు పెద్ద మనుషులు, పోలీసులు న్యాయం చేస్తామని ఆమెతో నిరసన విరమింపచేశారు. అయితే ఇప్పటి వరకూ రమేష్ ఆచూకీ తెలియకపోవడంతో సనా మరోసారి పోలీస్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. దీనిపై ఎస్‌ఐ సోమశేఖర్ స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment