చెరువులో మునిగి యువకుడి మృతి
Published Mon, Sep 5 2016 2:00 AM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM
కామవరపుకోట : గేదెను కడిగేందుకు చెరువులో దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటన ఆదివారం ఉప్పలపాడు పంచాయతీలో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్దన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గోపాల్‌నగర్ కాలనీకి చెందిన ఎస్.రవి (21) అనే యువకుడు గేదెను కడిగేందుకు గ్రామంలోని అలివేలుకుంట చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మునిగి అసువులు బాశాడు. వీఆర్వో ఎం.ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
దండగర్ర ఊర చెరువులో వ్యక్తి..
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం దండగర్ర ఊర చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దండగర్ర గ్రామానికి చెందిన అంజుర్తి రత్తయ్య (48) అనే వ్యక్తి ఆదివారం వేకువజామున బహిర్భూమికి వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఊరచెరువులో మృతదేహం తేలియాడటాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని కుమారుడు సూర్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిర్భూమికి వెళ్లి రత్తయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటాడని ఎస్సై పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Advertisement
Advertisement