వైసీపీ అభ్యర్థిని ఇంటిపై రాళ్లతో దాడి
తూర్పు యడవ ల్లి (కామవరపుకోట), న్యూస్‌లైన్ : కామవరపుకోట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని మురారి రాజకుమారి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడిచేశారు. చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం ఆమె విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నారుు.. మండలంలోని రావికంపాడు పంచాయతీకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థినిగా తూర్పు యడవల్లికి చెందిన మురారి రాజకుమారి పోటీ చేశారు. ఈమెకు ప్రత్యర్థిగా వెంకటాపురానికి చెందిన కోటగిరి సామ్రాజ్య లక్ష్మి నిలబడ్డారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో రాజకుమారి ఓటమి పాలయ్యారు.
దీంతో ఏలూరులో కౌంటింగ్ కేంద్రం నుంచి వచ్చేసిన ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి కి దిగారు. తన భర్త వెంకటేశ్వరరావు బయటకు వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కింద పడేసి జెండా కర్రలతో విచక్షణారహితంగా కొట్టారని రాజకుమారి తెలిపారు. కోటగిరి కుటుంబ సభ్యులపైనే పోటీ చేస్తారా.. మీ అంతు చూస్తామంటూ బెదిరించారని ఆమె చెప్పారు. 16వ తేదీ తర్వాత మిమల్ని చంపేస్తాం.. ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు. వెంకటాపురానికి చెందిన కోటగిరి వెంకట నరసింహారావు (రాజబాబు), ఆయన కుమారుడు అన్వేష్, శ్రీకాంత్, బేతిన జగన్నాథం, వేముల రాంబాబు తండ్రి గంగరాజు, మద్దిపట్ల నరసింహారావు, యడవల్లికి చెందిన మానెం సుబ్బయ్య, డొక్కా సూరి, వేముల నాగయ్య, మరీదు వెంకటరావు, మరీదు పుల్లంరాజు, మరీదు మహాలక్ష్మయ్య, మరీదు సుబ్బారావు, మరీదు రాజు దాడిలో పాల్గొన్నారని మురారి వెంకటేశ్వరరావు, రాజకుమారి దంపతులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
దాడి అమానుషం
మురారి కుటుంబంపై టీడీపీ కార్యకర్తల దాడి ని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మిడతా రమేష్, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యం బాబు, ఏఎంసీ చైర్మన్ తూతా లక్ష్మణరావు ఖండించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారిపై దాడులు అమానుషమన్నారు. మురారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. దాడిని ఖండించిన వారిలో రావికంపాడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ మీరా సాహెబ్(ఏసు), రావికంపాడు గ్రామ వైసీపీ నాయకులు కె.అంజిరెడ్డి, ప్రసాదరెడ్డి, దొరబాబు, మోర్ల సత్యనారాయణ, ఎం.బాలస్వామి, జగదీష్, ఎం.నాగయ్య, రవి ఉన్నారు.