డాక్టర్ రమణారావు ఆదర్శప్రాయుడు
కామవరపుకోట : పల్లె ప్రజలకు నిస్వార్ధంగా వైద్య సేవలు అందించి రోగుల పాలిట అపర ధన్వంతరి అయిన దివంగత డాక్టర్ పున్నమరాజు వెంకట రమణారావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంబీజేఆర్. ప్రసాదరావు అన్నారు.
కామవరపుకోట : పల్లె ప్రజలకు నిస్వార్ధంగా వైద్య సేవలు అందించి రోగుల పాలిట అపర ధన్వంతరి అయిన దివంగత డాక్టర్ పున్నమరాజు వెంకట రమణారావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంబీజేఆర్. ప్రసాదరావు అన్నారు. కామవరపుకోటలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ రమణారావు శతజయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంబీజేఆర్.ప్రసాదరావు మాట్లాడుతూ అప్పట్లో జ్వరం వస్తే ఐదారు లంఖణాలే తప్ప మరో చికిత్స ఉండేది కాదన్నారు. డాక్టర్ రమణరావు వచ్చే వరకు ఇంజక్షన్ అంటే ఏమిటో తెలియదని అన్నారు.
సేవలు మరువలేనివి
స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేఏ.సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందు నుంచీ కామవరపుకోట పరిసర ప్రాంత వాసులకు డాక్టర్ రమణారావు చేసిన వైద్య సేవలు మరవలేనివన్నారు. నేటి తరం వారు ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లిపోకుండా సొంత ఊరికి ఎంతో కొంత సేవ చేయాలని, ఈ విషయంలో రమణారావును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.పాండు రంగారావు మాట్లాడుతూ డాక్టర్ రమణారావు నేర్పిన విలువలను పాటిస్తూ అంతా కలిసిమెలిసి ఉండడం అభినందనీయమన్నారు. రమణారావు శత జయంతి సందర్భంగా స్థానిక పీహెచ్‌సీకి రోగుల సౌకర్యార్ధం మంచాలు అందజేయడంపై వైద్యాధికారి సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు.
ఆత్మీయ సమావేశం
డాక్టర్ రమణారావు శతజయంతి సందర్భంగా ఆదివారం మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులంతా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే వారితో పాటు విదేశాలలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్నందుకు వీరంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.