మరోసారి చిక్కాడు
కామవరపుకోట: అవినీతి కేసు విచారణలో ఉండగానే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కామవరపుకోట సబ్ రిజి స్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు. 2013లో వట్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఆయన పనిచేస్తుండగా కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు రూ.98 వేలు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరలా రెడ్ హ్యాండెడ్‌గా ఆయన ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి పీతల కృష్ణమూర్తి టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెంలో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కోసం కామవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా సబ్ రిజిస్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు రూ.10 వేలు డిమాండ్ చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు సోమవారం కృష్ణమూర్తికి రసాయనా లు పూసిన ఐదు రూ.2 వేల నోట్లను ఇచ్చి సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు పంపామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కృష్ణమూర్తి నుం చి సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు రూ.10 వేలు తీసుకుంటుండగా తాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. ఫిర్యాదుదారు గతంలో ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రాగా రూ.లక్ష డిమాండ్ చేశారని, దీంతో ఫిర్యాదుదారు రిజిస్ట్రేషన్ మానేశారని చెప్పారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ 2013లో వట్లూరులో పనిచేస్తుండగా దాడులు చేశామని లెక్కల్లో చూపని రూ.98 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై విచారణ ఇంకా సాగుతోందని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఏసీబీ సీఐ విల్సన్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. కక్షిదారు రిజిస్ట్రేషన్ చేయమన్న స్థలంపై వివాదం చింతలపూడి కోర్టులో నడుస్తుండటం తో వివాదం పరిష్కారమైనట్టు లేఖ తీసుకురావాలని సూచించానని సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు చెప్పారు. అయితే సోమవారం 1బి కాగితాలు తీసుకువచ్చి చూపిస్తుండగా, ఇవి అవసరం లేదని చెబుతుండగానే కృష్ణమూర్తి కాగితం చుట్ట తన ముఖం మీదకు విసిరేశాడన్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు వచ్చారని మధుసూదనరావు అంటున్నారు.