అవినీతి రిజిస్ట్రేషన్‌ | Sub Registrar Officer Arrest in ACB Ride | Sakshi
Sakshi News home page

అవినీతి రిజిస్ట్రేషన్‌

Published Tue, Apr 23 2019 12:05 PM | Last Updated on Tue, Apr 23 2019 12:05 PM

Sub Registrar Officer Arrest in ACB Ride - Sakshi

పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు Üబ్‌ రిజిస్ట్రార్‌–1 లక్ష్మీనారాయణ

నగదు.. బంగారం.. ఇళ్లు.. స్థలాలు.. తోటలు.. వాహనాలు.. కళ్లు చెదిరే అవినీతి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌–1 లక్ష్మీనారాయణ ఇళ్లపై ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అనంతపురం, ధర్మవరంలోని ఐదు చోట్ల చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, ఆస్తులను గుర్తించారు.

అనంతపురం సెంట్రల్‌: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టిన అనంతపురం అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ –1 లక్ష్మీనారాయణ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం మెరుపుదాడులు నిర్వహించారు. అనంతపురం, ధర్మవరంలో ఐదు చోట్ల ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఏసీబీ అనంతపురం డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో తొలి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణపై అక్రమాస్తులు కూడబెట్టినట్లు అభి యోగాలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ జయరామరాజు, సిబ్బంది సహకారంతో జిల్లాలో ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

బినామీ పేర్లతో ఆస్తులు
కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ 1994లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2001లో సీనియర్‌ అసిస్టెంట్‌గా, 2005లో సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2గా పదోన్నతి పొందారు. 2005 నుంచి 2007 వరకు మళ్లీ సీనియర్‌ అసిస్టెంట్‌గా డిమోషన్‌ పొందారు. 2007 అక్టోబర్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–1గా పదోన్నతి పొందారు. గుత్తి, ధర్మవరం, ఆడిట్‌ శాఖలో పనిచేశారు. ప్రస్తుతం ఈయన అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌–1గా మూడేళ్లుగా పనిచేస్తున్నారు. తొలినుంచి ఈయనపై అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో అక్రమంగా డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అనంతపురం రూరల్‌ పరిధిలోని పాపంపేటలో గల ఆయన ఇంటిపై తొలుత దాడి చేశారు. అనంతరం బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో ఆయన బినామీ ఆస్తులపై, వారి బంధువుల ఇళ్లలో సైతం తనిఖీ నిర్వహించారు. వీటిలో దాదాపు రూ.12 లక్షల నగదు, రూ.5 లక్షలు విలువజేసే 17.4 తులాల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. 

అక్రమ ఆస్తుల వివరాలు లభ్యం
సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు.. అనంతపురం రూరల్‌ ఎ.నారాయణపురం పంచాయతీ పాపంపేటలో మాత్రమే జీ ప్లస్‌ 1 ఇళ్లు మూడు ఉన్నాయి. 2010, 2012, 2016లో వీటిని నిర్మించుకున్నారు. విద్యారణ్యనగర్‌లో మరో ఇంటిని 2018లో నిర్మించారు. వీటితో పాటు పాపంపేట గ్రామ పరిధిలో నాలుగు ఇంటి స్థలాలు ఉన్నాయి. ఆత్మకూరు మండలం తలుపూరులో రెండు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే అనంతపురం రూరల్‌ మండలం కామారుపల్లిలో ఓ వ్యవసాయ తోట ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఒక మహింద్రా బొలెరో వాహనం, హీరో హోండా స్లె్పండర్, హోండా స్కూటీ ద్విచక్రవాహనాలు ఉన్నాయి. నిందితున్ని విచారించిన అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి, మోహన్‌రెడ్డి, ఖాదర్, బాషా, తేజేశ్వరరావు, ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement