ఆ రోజే.. అడ్డంగా బుక్కయ్యారు! | ACB Raids On Sub Registrar In Kurnool District | Sakshi
Sakshi News home page

ఆ రోజే.. అడ్డంగా బుక్కయ్యారు!

Published Tue, Dec 10 2019 10:09 AM | Last Updated on Tue, Dec 10 2019 10:09 AM

ACB Raids On Sub Registrar In Kurnool District - Sakshi

ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌ మహబూబ్‌ అలీ

సాక్షి, కర్నూలు: ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం రోజే కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ షేక్‌ మహబూబ్‌ అలీ అడ్డంగా బుక్కయ్యారు. ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించుకుని చేస్తున్న దందాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బట్టబయలు చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అరెస్టు చేశారు. అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400కు బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ ఈ దాడి చేయడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ పి.నాగభూషణం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు నగరానికి చెందిన పి.జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక పాతబస్టాండ్‌లో హిమాలయ మెడికల్‌ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. షాపు లీజు డీడ్‌కు సంబంధించి అన్ని దరఖాస్తులను సబ్‌ రిజిస్ట్రార్‌ మహబూబ్‌ అలీకి సమర్పించారు. లీజు డీడ్‌ కావాలంటే రూ.8 వేలు లంచం ఇవ్వాలని మొదట ఆయన డిమాండ్‌ చేశారు.

లంచం ఇవ్వడం ఇష్టంలేక బాధితుడు అవినీతి నిరోధక టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును నమోదు చేసుకున్న కాల్‌ సెంటర్‌ సిబ్బంది ఈ విషయాన్ని కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణానికి తెలియజేశారు. ఆయన ఫిర్యాదుదారుడిని ఆదివారం పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌తో రూ.8 వేలు ఇచ్చుకోలేనని, రూ.5 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని సోమవారం సబ్‌ రిజిస్ట్రార్‌ నియమించుకున్న ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ సమీర్‌బాషాకు అందజేశాడు. అతను సబ్‌ రిజిస్ట్రార్‌కు అందజేస్తుండగా.. మధ్యాహ్నం 2.10 గంటలకు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఎం.నాగభూషణం తెలిపారు. రోజుకు రూ.200 ప్రకారం చెల్లిస్తూ సమీర్‌బాషాను ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా నియమించుకుని సబ్‌రిజిస్ట్రార్‌ దందా నడుపుతున్నట్లు ఆయన వివరించారు.

ప్రైవేటు వ్యక్తుల హవా
జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల హవా నడుస్తోంది. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌ మహబూబ్‌ ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా దందా నడుపుతున్నట్లు ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఉదంతాలను బట్టి స్పష్టమవుతోంది. ఏసీబీ అధికారులు ఈ ఏడాది అక్టోబర్‌ 20న కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడి చేసి.. 17 మంది డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి రూ.1.58 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైవేట్‌ కంప్యూటర్‌గా పనిచేస్తూ సమీర్‌ బాషా అనే వ్యక్తి ఏసీబీకి పట్టుబడ్డారు. కల్లూరు, కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకున్నా ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకోవడం గమనార్హం. గతంలో కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌గా రమణరావు పనిచేసిన సమయంలోనూ ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించుకున్నారు. అప్పట్లో ఆయన తప్పుడు డాక్యుమెంట్లు చేశారన్న అభియోగాలపై ఇటీవల సస్పెండ్‌ అయ్యారు. అలాగే ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను తొలగించారు. ప్రస్తుతం కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమీర్‌ బాషాను ప్రైవేట్‌గా రోజుకు రూ.200 ఇచ్చి కంప్యూటర్‌ ఆపరేటర్‌గా నియమించుకోవడం దందా చేయడానికి తప్పా మరొకటి కాదని కార్యాలయ సిబ్బందే అంటున్నారు.

గతంలోనే ఏసీబీకి చిక్కిన మహబూబ్‌అలీ
మహబూబ్‌ అలీ గతంలోనూ కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. క్రైస్తవ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేశారన్న అభియోగంపై సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. తరువాత లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అంతేకాక గతంలో కర్నూలు జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసిన మాధవీలత, ఆమెతో పాటు సీనియర్‌ అసిస్టెంటుగా పనిచేసిన సర్వేశ్వరనాథ్‌ కూడా ఏసీబీకి చిక్కారు. అధికారుల అవినీతిలో పాలు పంచుకుంటే ప్రైవేట్‌ వ్యక్తులపైనా కేసు అవినీతి అధికారులకు అండగా నిలిచినా, వారి అవినీతిలో పాలుపంచుకున్నా ప్రైవేట్‌ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తామని, ఈ విషయం ఏసీబీ చట్టంలోనూ స్పష్టంగా ఉందని ఏసీబీ డీఎస్పీ పి.నాగభూషణం తెలిపారు. అవినీతి పరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ సహకరించరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు గానీ, సిబ్బంది గానీ లంచం డిమాండ్‌ చేస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400కు ఫోన్‌ చేసి తెలపాలని, అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement