catched
-
‘గుట్ట’ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ముగిసిన సోదాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు శుక్రవారం ముగిశాయి. మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.20 వేలు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దేవానంద్.. స్థానిక డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను మధ్యవర్తిగా పెట్టి లంచం తీసుకున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్న విషయం విదితమే. కాగా, దేవానంద్ ఇంట్లో రూ.76 లక్షలకుపైగా నగదు, 27 తులాల బంగారు ఆభరణాలు, 7.9 ఎకరాల పొలం, 200 గజాల ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, తొమ్మిది విదేశీమద్యం బాటిళ్లు, పలు ఇతర కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవానంద్, ప్రభాకర్‌లను ఏసీబీ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, మెదక్ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో విచారించారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. -
ఇద్దరు చైన్ స్నాచర్లకు దేహశుద్ధి..!
ఇద్దరు చైన్ స్నాచర్లు ఒకేరోజు ఇద్దరు మహిళల మెడల్లోంచి రెండు బంగారు గొలుసులను చోరీ చేశారు. వర్ని మండలం మోస్రాలో ఒకటి, నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. చివరకు ఎడపల్లి మండలం ఠాణాకలాన్ వద్ద గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఎడపల్లి(బోధన్): మండలంలోని ఠాణాకలాన్‌వాసులు మంగళవారం ఇద్దరు చైన్స్నాచర్లను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వర్ని మండలం మెస్రాలో రోడ్డుపై వెళుతున్న మహిళతోపాటు నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోంచి రెండు చైన్లను తెంపుకుని కుర్నాపల్లి మీదుగా ఠాణాకలాన్ వైపు బైక్‌పై పారిపోతున్న వారిని గ్రామస్తులు పట్టుకున్నారు. మోస్రా, కుర్నాపల్లి గ్రామస్తులు ఫోన్లో పారిపోతున్న చైన్‌స్నాచర్ల వివరాలను ఠాణాకలాన్వాసులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు చైన్స్నాచర్లను సాహసించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులతో ఎస్ఐ టాటాబాబు మాట్లాడి వర్ని పోలీసులకు చైన్స్నాచర్లను అప్పగించారు. సాహసంతో పట్టుకున్న ఠాణాకలాన్వాసులను పోలీసులు అభినందించారు. వర్ని(బాన్సువాడ): మండలంలోని మోస్రాలో బస్టాండ్ వద్ద నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును మంగళవారం దుండగులు ఎత్తుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ మోస్రాలోని బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో బస్టాండ్ వద్దకు రాగానే ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మెడలోని గొలుసు తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. విషయం తెల్సుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
‘కొండ’నాగులు
సాక్షి, తిరుమల : తిరుమల కొండపై ఆదివారం రెండు నాగుపాములు జనాన్ని హడలెత్తించా యి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆకాశగంగ సమీపంలో ఓ టీ దుకాణంలోకి నాగుపాము వెళ్లింది. ఈ సమాచారంతో స్థానికుడు మునస్వామి ఆ పామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇక స్థానికులు నివాసం ఉండే తిరుమల బాలాజీనగర్ ఈస్ట్‌లో 1012 నంబరు ఇంటికి సమీపంలో మరో నాగుపాము వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు దాన్ని చూసి పరుగులు తీశారు. ఈ సమాచారంతో మునస్వామి వెళ్లి ఆ పామును కూడా చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆయన పాము కాటుకు గురయ్యాడు. కుడిచేతికి కాటు పడడంతో రక్తం వచ్చింది. ఆ పామును అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. -
మరోసారి చిక్కాడు
కామవరపుకోట: అవినీతి కేసు విచారణలో ఉండగానే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కామవరపుకోట సబ్ రిజి స్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు. 2013లో వట్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఆయన పనిచేస్తుండగా కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు రూ.98 వేలు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరలా రెడ్ హ్యాండెడ్‌గా ఆయన ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి పీతల కృష్ణమూర్తి టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెంలో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కోసం కామవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా సబ్ రిజిస్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు రూ.10 వేలు డిమాండ్ చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు సోమవారం కృష్ణమూర్తికి రసాయనా లు పూసిన ఐదు రూ.2 వేల నోట్లను ఇచ్చి సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు పంపామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కృష్ణమూర్తి నుం చి సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు రూ.10 వేలు తీసుకుంటుండగా తాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. ఫిర్యాదుదారు గతంలో ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రాగా రూ.లక్ష డిమాండ్ చేశారని, దీంతో ఫిర్యాదుదారు రిజిస్ట్రేషన్ మానేశారని చెప్పారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ 2013లో వట్లూరులో పనిచేస్తుండగా దాడులు చేశామని లెక్కల్లో చూపని రూ.98 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై విచారణ ఇంకా సాగుతోందని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఏసీబీ సీఐ విల్సన్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. కక్షిదారు రిజిస్ట్రేషన్ చేయమన్న స్థలంపై వివాదం చింతలపూడి కోర్టులో నడుస్తుండటం తో వివాదం పరిష్కారమైనట్టు లేఖ తీసుకురావాలని సూచించానని సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు చెప్పారు. అయితే సోమవారం 1బి కాగితాలు తీసుకువచ్చి చూపిస్తుండగా, ఇవి అవసరం లేదని చెబుతుండగానే కృష్ణమూర్తి కాగితం చుట్ట తన ముఖం మీదకు విసిరేశాడన్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు వచ్చారని మధుసూదనరావు అంటున్నారు. -
మొదటి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు..
హైదరాబాద్: రెండు పెళ్లిళ్లు చేసుకుని ...ఇద్దరు భార్యలతో ఎలా తంటాలు పడేది,ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయడానికి హీరో పడే కష్టాలను చాలా సినిమాల్లో చూసి ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా ఓ ప్రబుద్ధుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఇందుకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వేదికైంది. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కల్యాణ్(28)కు అదే ప్రాంతానికి చెందిన దుర్గాదేవితో 2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం భార్యాభర్తలు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురంలో అనూహ్యంగా 2014లో కల్యాణ్ కనిపించకుండా పోయాడు. దీంతో దుర్గాదేవి భర్త కోసం గాలిస్తూ మాదాపూర్‌లో నివాసముంటోంది. 2014లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లిన కల్యాణ్ అక్కడ అపర్ణ అనే యువతిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండవ భార్యతో హైదరాబాద్ చేరుకుని బోరబండలో నివాసముంటున్నాడు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. మొదటి భార్య దుర్గాదేవి మంగళవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చింది. అదే సమయంలో కల్యాణ్ తన రెండో భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. మరో మహిళ, బిడ్డతో వచ్చిన కల్యాణ్‌ను దుర్గాదేవి నిలదీసింది. దీంతో కల్యాణ్ రెండో వివాహం చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దుర్గాదేవి భర్తను చితక్కొట్టి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కల్యాణ్‌పై కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు.