గ్రామస్తులు పట్టుకున్న చైన్‌స్నాచర్‌లు
ఇద్దరు చైన్ స్నాచర్లు ఒకేరోజు ఇద్దరు మహిళల మెడల్లోంచి రెండు బంగారు గొలుసులను చోరీ చేశారు. వర్ని మండలం మోస్రాలో ఒకటి, నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. చివరకు ఎడపల్లి మండలం ఠాణాకలాన్ వద్ద గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు.
ఎడపల్లి(బోధన్): మండలంలోని ఠాణాకలాన్‌వాసులు మంగళవారం ఇద్దరు చైన్‌స్నాచర్‌లను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వర్ని మండలం మెస్రాలో రోడ్డుపై వెళుతున్న మహిళతోపాటు నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోంచి రెండు చైన్‌లను తెంపుకుని కుర్నాపల్లి మీదుగా ఠాణాకలాన్ వైపు బైక్‌పై పారిపోతున్న వారిని గ్రామస్తులు పట్టుకున్నారు. మోస్రా, కుర్నాపల్లి గ్రామస్తులు ఫోన్‌లో పారిపోతున్న చైన్‌స్నాచర్‌ల వివరాలను ఠాణాకలాన్‌వాసులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు చైన్‌స్నాచర్‌లను సాహసించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులతో ఎస్‌ఐ టాటాబాబు మాట్లాడి వర్ని పోలీసులకు చైన్‌స్నాచర్‌లను అప్పగించారు. సాహసంతో పట్టుకున్న ఠాణాకలాన్‌వాసులను పోలీసులు అభినందించారు.
వర్ని(బాన్సువాడ): మండలంలోని మోస్రాలో బస్టాండ్ వద్ద నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును మంగళవారం దుండగులు ఎత్తుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ మోస్రాలోని బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో బస్టాండ్ వద్దకు రాగానే ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మెడలోని గొలుసు తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. విషయం తెల్సుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment