వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇంటిపై రాళ్లదాడి
ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచామన్న గర్వంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ వర్గాలపై దాడులకు తెగబడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని మురారి రాజకుమారి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. చంపేస్తామని బెదిరించారు. రావికంపాడు పంచాయతీకి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థినిగా తూర్పు యడవల్లికి చెందిన మురారి రాజకుమారి పోటీ చేశారు. ఈమెకు ప్రత్యర్థిగా వెంకటాపురానికి చెందిన కోటగిరి సామ్రాజ్యలక్ష్మి నిలబడ్డారు. ఎన్నికల్లో రాజకుమారి ఓటమి పాలయ్యారు.
ఏలూరులో కౌంటింగ్ కేంద్రం నుంచి వచ్చేసిన ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. తన భర్త వెంకటేశ్వరరావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కింద పడేసి జెండా కర్రలతో కొట్టారని రాజకుమారి తెలిపారు. కోటగిరి కుటుంబ సభ్యులపైనే పోటీ చేస్తారా.. మీ అంతు చూస్తామంటూ బెదిరించారని ఆమె చెప్పారు. 16వ తేదీ తర్వాత మిమ్మల్ని చంపేస్తాం.. ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మురారి వెంకటేశ్వరరావు, రాజకుమారి దంపతులు తెలిపారు.