ఉద్యోగమిస్తే నిరుద్యోగ భృతి ఎందుకు?
కామవరపుకోట: ఇంటింటికి ఉద్యోగం ఇస్తే ఇక నిరుద్యోగ భృతి ఎందుకని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేని దుస్థితితో చంద్రబాబు ఉన్నట్లు విమర్శించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. 2009లో నగదు బదిలీ అన్నారు, ఇప్పుడు కొత్తగా రుణమాఫీ అంటున్నారని చెప్పారు. ఆ నగదు బదిలీపై ఇప్పుడెందుకు మాట్లాడటంలేదు? అని ప్రశ్నించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత బాబుదేనన్నారు.
71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ది అని చెప్పారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ ఇచ్చి వారికి రాజకీయ భద్రత కల్పించారని గుర్తు చేశారు. అన్నగా, తండ్రిగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. గత నాలుగేళ్లుగా ప్రజల వెన్నంటి ఉన్నది వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌సీపీనేనని అన్నారు.
ఎంపీగా తోట చంద్రశేఖర్‌ను, ఎమ్మెల్యేగా దేవీప్రియను ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ పరిపాలన జగన్ పాలనలో చూస్తారని హామీ ఇచ్చారు.