insecticides
-
చెరువు మట్టి.. భూమికి బలం
ఎల్.ఎన్.పేట: పంట దిగుబడి కోసం రైతులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుంటారు. దీని వలన భూసారం క్షీణిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూసారం పెంచాలంటే కొత్తమట్టిని వేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. చెరువుల్లోని పూడిక మట్టి వేస్తే పొలం సారవంతంగా మారుతుందని సూచిస్తున్నారు. ఈ మట్టి వేయడం ద్వారా భూసారంతో పాటు పోషక విలువలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూమి పొరల్లో ఉండే మిత్ర పురుగులు నశించడం వలన రైతుకు నష్టం ఉంటుందంటున్నారు. పూడిక మట్టిలో పోషకాలు చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరుతాయి. వేసవలి సమయంలో చెరువులు అడుగంటుతాయి. ఈ సమయంలో చెరువు పూడిక మట్టిలో తగినంత పాళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియకార్భన్ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి పొరల్లో తేమను ఎక్కువ రోజుల పాటు ఉండేలా చేసే గుణం ఈ మట్టికి ఉంది. కిలో పూడిక మట్టిలో నత్రజని 720 మి.గ్రా, భాస్వరం 320 మి.గ్రా, పోటాషియం 810 మి.గ్రా, సేంద్రియకార్భనం 308 మి.గ్రాలతో పాటు మైక్రోబియల్ బయోమాన్ కార్బన్లు ఉంటాయి. ఎరువుల ఖర్చు తక్కువ ఎకరా పొలంలో వరి పండించాలంటే తక్కువగా అనుకున్నా ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల యూరియా, బస్తా పోటాష్, బస్తా జింక్ తప్పనిసరి అవుతుంది. వీటితో పాటు పంటను ఆశించే తెగుళ్లను నివారించేందుకు పురుగు మందుల పిచికారీ తప్పటం లేదు. ఎరువులు, పురుగు మందుల కోసం సుమారు రూ. 6 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చెరువు మట్టి వేసుకోవటం వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గటంతో పాటు భూమి సారవంతం అవుతుంది. ఎరువులు, పురుగుల మందుల్లేని పంటను సాధించవచ్చు. చెరువు మట్టి వేసే వాళ్లం గతంలో చెరువుల్లో లభ్యమయ్యే పూడిక మట్టిని పొలాలకు వేసేవాళ్లం. దీంతో భూసారం పెరిగి పంటదిగుబడి బాగా వచ్చేది. వేసవిలో చెరువు మట్టిని నాటుబళ్ల పెరిగి పొలంలో వేసేవాళ్లం. వర్షాల తరువాత పొలంలో వేసిన మట్టి నేలలో కలిసేలా దుక్కి దున్నేవాళ్లం. ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగేది. ఇప్పుడు రైతులెవ్వరూ చెరువు మట్టి వేయటం లేదు. ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగిపోతుంది. భూసారం తగ్గిపోతుంది. లావేటి నర్సింహులు, రైతు, కృష్ణాపురం భూసారం పెరుగుతుంది చెరువు మట్టి వేసుకోవటం వలన భూమి సారవంతంగా మారుతుంది. చౌడు భూముల్లో కూడా పచ్చని పంటలు పండించవచ్చు. చెరువు మట్టిలో తేమ ఎక్కువగా ఉండటం వలన పంటకు నీటినిల్వలు బాగా ఉంటాయి. సేంద్రియ శాతం ఎక్కువగా ఉండటంతో ఎరువులా ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం చెరువు మట్టి వేయటం వలన మూడేళ్ల వరకు భూమి సారవంతంగా ఉంటుంది. పంటకు మేలు చేస్తుంది. పైడి లతశ్రీ, ఏఓ, ఎల్.ఎన్.పేట -
సస్య రక్షణ ఔషధ షేర్లు క్రాష్..!
సస్య రక్షణ ఔషధ కంపెనీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సుమారు 27రకాల పురుగుమందుల అమ్మకం, వాడకం, దిగుమతులను నిషేధిస్తూ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ మే14వ తేదిన ముసాయిదా ఉత్తర్వులు జారీ చేయడం ఈ రంగ షేర్ల పతనానికి కారణమైంది. ఈ రంగానికి చెందిన యూపీఎల్, రాలీస్ ఇండియా, అతుల్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీల షేర్లు 10శాతం నుంచి 4శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇప్పటికే యూపీఎల్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 47శాతం నష్టపోయింది. "ఈ ఆర్డర్ ప్రచురించిన తేదీ(మే 14) నుండి షెడ్యూల్ లో పేర్కొన్న పురుగుల మందులను ఏ వ్యక్తి కూడా దిగుమతి, తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వియోగం లాంటి చేయకూడదు" అని నోటిఫికేషన్లు తెలిపాయి. కేంద్రం రూపొందిచిన ముసాయిదా అమల్లోకి వస్తే.., నిషేధిత పురుగుమందుల ఉత్పత్తులను తయారు చేసే యూపీఎల్, రాలీస్ ఇండియా, అతుల్, కోరమాండల్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలపై నిషేధం ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. -
సాలీడు 'సాగు మిత్రుడు'..
(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) :వ్యవసాయంలో మిత్రపురుగుల ప్రాధాన్యం తెలియనిది కాదు. పంటలకు మేలు చేసే ఈ కీటకాల జాబితాలోకి సాలీడును కూడా చేర్చాలని అంటున్నారు డాక్టర్ అతుల్ భోడ్కే. మహారాష్ట్రలోని లోనార్ క్రేటర్ అభయారణ్యంలో సరికొత్త సాలీడు జాతిని గుర్తించిన అతుల్.. దశాబ్దానికిపైగా వీటిపై పరిశోధనలు చేశారు. ప్రభుత్వాలు పులుల సంరక్షణ కోసం ఎంతో సొమ్ము ఖర్చు పెడుతున్నాయని, సాలీడులను సంరక్షించుకోవడం ద్వారా పులుల సంతతిని పెంచడమూ సాధ్యమని గుర్తించడం లేదని అతుల్ ‘సాక్షి’కి తెలిపారు. ప్యూరోరిథిడీ జాతి సాలీడును పదేళ్ల క్రితం తాను గుర్తించానని, అప్పటివరకూ దేశంలో 60 సాలీడు కుటుంబాలు ఉండగా, 61వ కుటుంబాన్ని చేర్చామని ఆయన వివరించారు. జీవావరణాన్ని కాపాడేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. ‘‘గడ్డిలో పెరిగే ప్యూరోరిథిడీ సాలీడు గడ్డిలో దొరుకుతుంది. ఇది హానికారక సూక్ష్మజీవులను తింటూ బతుకుతుంది. ఫలితంగా ఈ సాలీళ్లు ఉన్న చోట గడ్డి ఏపుగా పెరుగుతుంది’’అని అతుల్ వివరించారు. సాలీళ్లలో గూడు అల్లేవి ఒక రకమైతే.. నేలపై తిరుగుతుండేవి రెండో రకమని చెప్పారు. ఈ రెండు రకాల సాలీళ్లూ కీటకాలను నాశనం చేస్తాయని తెలిపారు. దురదృష్టవశాత్తూ ప్రభుత్వాలు సాలీళ్ల ప్రాముఖ్యతను గుర్తించడం లేదని వాపోయారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సాలీడులను కీటక వర్గీకరణకు మినహా మరే ఇతరాలకు వాడుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో కీటక నాశినుల వాడకం ఎక్కువ అవుతుండటంతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు అధికం అవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సాలీడులను సహజసిద్ధ కీటక నాశినులుగా ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరమని స్పష్టం చేశారు. సాలీడుల పెంపు ఇలా.. రైతులు పొలంలో కనిపించే ఏదైనా సాలీడును గుర్తించి వాటికి ‘డ్రోసఫిలా’అనే లార్వేను అం దిస్తే చాలని, అవి బాగా పెరుగుతాయని అతుల్ తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాలీడు అవసరాన్ని గుర్తించారని, వారి పొలాల్లో సాలీడు గూళ్లను తొలగించడం మానేశారని చెప్పారు. ఇళ్లల్లో దోమల నియంత్రణకూ సాలీళ్లు బాగా పనిచేస్తాయన్నా రు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని సాలీడులపై విస్తృత పరిశోధనలను చేపట్టాలని సూచించారు. తద్వారా కీటక నాశినుల వాడకం తగ్గడంతోపాటు ఆహారంలోకి చేరుతున్న విషతుల్యకాలుష్యాలను నివారించవచ్చన్నారు. -
అడియాశలైన ఆశలు..
వర్షాభావం.. గిట్టుబాటు ధరల లేమి.. పేరుకుపోయిన అప్పులు ముప్పేట దాడితో రైతుకుటుంబాన్ని పూర్తిగా కుంగదీశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లోపించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బడాయి దేవేంద్ర (28) పురుగుల మందు తాగి 2018 ఆగస్టు 29న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఒకటిన్నర ఎకరా భూమి ఉంది. అదనంగా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. వర్షాల్లేక పత్తి పైరు గిడసబారిపోయింది. సేద్యం కోసం ఏటా అప్పులు చేస్తూ వచ్చాడు. పైవాడు కరుణిస్తాడని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. పంటలకోసం దాదాపు రూ.5 లక్షలు అప్పులు చేశాడు. పంట చేతికి రాదన్న దిగులుతో రైల్వే గేటు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న దేవేంద్రను కర్నూలు తీసుకెళ్లి వైద్యచికిత్సలు చేయించగా రెండు రోజుల తర్వాత కన్నుమూశాడు. భార్య నాగవేణి, తల్లి లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు నారాయణ, నరసింహులు ఉన్నారు. నారాయణ 2వ తరగతి చదువుతుండగా, నరసింహులు అంగన్వాడీకి వెళ్తున్నాడు. దేవేంద్ర భార్య, తల్లి కాయకష్టం చేసి బతుకు సాగిస్తున్నారు. కష్టంలో కొంత అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కడు దయనీయ స్థితిలో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. – కె. పరశురాం, సాక్షి, మంత్రాలయం, కర్నూలు జిల్లా -
అనాథలుగా బతకలేమని..
పటాన్చెరు టౌన్: ముగ్గురు కొడుకులున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు భోజనంలో పురుగుల మందు కలుపుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్చెరు మండల పరిధిలోని నందిగామకు చెందిన పిచ్చకుంట్ల లక్ష్మీనారాయణ (65), అక్కమ్మ (61) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు కావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అనాథలుగా బతకాల్సి వస్తోందని మనస్తాపం చెందిన ఆ వృద్ధ దంపతులు శనివారం అర్ధరాత్రి కూరలో పురుగుల మందు కలుపుకొని తిన్నారు. ఇద్దరికీ వాంతులు కావడంతో పక్కింట్లో ఉంటున్న చిన్న కోడలు రేణా గమనించి 108కి సమాచారం అందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం ఉదయం మృతిచెందారు. తమను చూసే వారు ఎవరూ లేరని తమ తల్లిదండ్రులు తరచూ బాధపడుతుండే వారని, చనిపోవాలని ఉందని అనేవారని, ఇలా చేస్తారని అనుకోలేదని పెద్ద కొడుకు పెంటయ్య పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విదేశీ పురుగు మందుల దాడి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పురుగు మందుల తయారీలో ఉన్న భారతీయ కంపెనీలకు ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్లు– 2017’ రూపంలో కొత్త కష్టాలు వచ్చాయి. బహుళజాతి సంస్థల వ్యాపారానికి మరింత ఊతమిచ్చే ఈ బిల్లు అమలులోకి వస్తే దేశీ కంపెనీల మనుగడ కష్టమేనని పరిశ్రమ చెబుతోంది. విదేశీ కంపెనీల మార్కెటింగ్ వ్యూహం ధాటికి ఇప్పటికే భారతీయ కంపెనీలు పోటీలో వెనుకపడ్డాయి. ఇక్కడి మార్కెట్లో ఎమ్మెన్సీలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. కీలకాంశం ఏమంటే 2007 తర్వా త దేశంలో కొత్తగా ఏ ప్లాంటూ ఏర్పాటు కాలేదు. ఆ స్థా యిలో విదేశాల నుంచి నేరుగా పురుగు మందులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా భారత్‌లోకి వచ్చిపడుతున్నాయి. నమోదు కాకున్నా విక్రయం.. ఇన్సెక్టిసైడ్స్ యాక్టు–1968 ప్రకారం భారత్‌లో పురుగు మందులు విక్రయించాలంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీలో మాలిక్యూల్ (రసాయనం) నమోదు తప్పనిసరి. సెక్షన్ 9(3) కింద ఈ నమోదు జరుగుతుంది. ఇదే మాలిక్యూల్‌ను భారత కంపెనీ తయారు చేయాలంటే సెక్షన్ 9 (4) కింద దరఖాస్తు సమర్పించాలి. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సెక్షన్ 9(4) కట్టడి చేస్తోంది. భారతీయ కంపెనీలు అదే ఉత్పాదనను తయారు చేయడంతో పోటీ పెరిగి ధర తగ్గేందుకు ఈ సెక్షన్ దోహదం చేస్తోంది. అయితే 2007 నుంచి బోర్డులో రిజిస్ట్రేషన్ చేయకుండానే విదేశీ కంపెనీలు తమ ఉత్పాదనలను నేరుగా విక్రయిస్తున్నాయి. మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు చేస్తూ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రయోగాలు లేకుండానే.. ఒక్కో మాలిక్యూల్ పనితీరును విశ్లేషించేందుకు ప్రతి కంపెనీ మూడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు సీజన్లు వివిధ పంటలపై ప్రయోగం చేయాలి. ఈ ఫలితాలనుబట్టి మాలిక్యూల్ విక్రయానికి బోర్డు అనుమతినిస్తుంది. విదేశాల్లో తయారై భారత్‌కు వస్తున్న ఉత్పాదనలకు ఇటువంటి విధానం అమలు కావడం లేదు. వాటి నాణ్యత ప్రశ్నార్థకమనేని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా స్మాల్, మీడియం పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజమహేందర్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. పైపెచ్చు ప్రొడక్టు ధర ఉత్పాదననుబట్టి 10 రెట్ల దాకా ఎక్కువని, దీంతో రైతులపై భారం పడుతోందని వివరించారు. దేశీయ కంపెనీలకు అండగా ఉన్న ఇన్సెక్టిసైడ్స్ యాక్టులో ఉన్న నిబంధనలు బిల్లులోనూ పొందుపరచాలని డిమాండ్ చేశారు. కొత్త ప్లాంటు ఊసే లేదు.. భారత్‌లో 2007 తర్వాతి నుంచి కొత్తగా ఒక్క ప్లాంటూ ఏర్పాటు కాలేదు. 10 విదేశీ సంస్థలు ఇక్కడి తయారీ ప్లాంట్లను ఇతర కంపెనీలకు విక్రయించి కేవలం మార్కెటింగ్‌కు పరిమితమయ్యాయని పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్, ఫార్ములేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ దవే చెప్పారు. ఎమ్మెన్సీలు 127 తుది ఉత్పాదనలనే నేరుగా భారత్‌లో అమ్ముతున్నాయి. ఇవన్నీ కూడా కొత్త మాలిక్యూల్సే కావడం విశేషం. ప్రస్తుతం 170 వరకు మాలిక్యూల్స్ దేశంలో అమ్ముడవుతున్నాయి. ఇందులో సుమారు 25 మాలిక్యూల్స్‌ను భారత కంపెనీలు తయారు చేస్తున్నాయి. మిగిలినవి కూడా ఉత్పత్తి చేసే సత్తా ఉన్నా, ఎమ్మెన్సీలు ఇందుకు సహకారం అందించడం లేదు. ఇదీ భారత మార్కెట్.. పురుగు మందుల ఉత్పత్తిలో కీలక రసాయనం అయిన మాలిక్యూల్స్ తయారు చేసే కంపెనీలు భారత్‌లో సుమారు 80 ఉంటాయి. ఫార్ములేషన్స్ (తుది ఉత్పాదన) రూపొందించే కంపెనీలు 2,000 ఉన్నాయి. దేశీయంగా రూ.18,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. ఇందులో దిగుమతుల వాటా రూ.7,000 కోట్లు. ఎగుమతులు రూ.15,000 కోట్లు ఉంటాయి. పరిశ్రమ ఏటా 7–10% వృద్ధి చెందుతోంది. 50 లక్షల మంది ఈ రంగంలో నిమగ్నం అయ్యారు. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో తయారీ లేదు. ఎమ్మెన్సీలు పూర్తిగా తమ ఉత్పాదనలతో చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఈ దేశాల సరసన భారత్ చేరడం ఖాయమని ఇక్కడి కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌లో పురుగు మందుల ధర 40% దాకా అధికం. -
వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు
జగిత్యాల అగ్రికల్చర్: వేప చెట్టును నీడనిచ్చే చెట్టుగానే కాకుండా, వేప ఉత్పత్తులు అద్భుత కీటకనాశనులుగా పనిచేస్తున్నాయి. పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల నివారణకు పురుగుమందులకు బదులు, వేప పిండి, వేప నూనెలు వాడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వేప ఉత్పత్తులు, వాటి పనితీరుపై పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వెంకటయ్య వివరించారు. వృక్ష సంబంధ రసాయనాలు అంతర్భాగమే.. సమగ్ర సస్యరక్షణ విధానంలో భాగంగా వృక్ష సంబంధ రసాయనాలు వాడటం జరుగుతుంది. ఉష్ణమండలపు వృక్షం అయిన వేప మన ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. పంటలను నాశనం చేసే 200 కీటకాలను వేప ఉత్పత్తులు అదుపు చేస్తాయి. వేప ఉత్పత్తులు వ్యవసాయంలో చక్కటి ఎరువుగా, ధాన్యం నిల్వ చేసే పదార్థంగా, పురుగు మందుల తయారీకి, నేరుగా పురుగులను అదుపు చేయడానికి, బయోమాస్ తయారీకి, పశువుల మేతగా, నేల కొత అరికట్టడానికి, భూములు చౌడుబారి పోకుండా, పర్యావరణంలో ఆక్సిజన్ లభ్యతను మెరుగుపరచడానికి, పక్షి స్థావరాలుగా, వాయు నిరోధకంగా.. చాల ప్రయోజనాలు ఉన్నాయి. వేపలో రసాయనాలు వేపలో లిమినాయిడ్స్ అనే తొమ్మిది రసాయనాలు ఉన్నాయి. వీటిలో అజాడిరక్టిన్, శలానిన్, నింబిన్, నింబిడిన్, మిలియాంట్రియోల్ ముఖ్యమైనవి. పోట్టు తీసిన ప్రతీ గ్రాము వేప గింజలో 2 నుంచి 4 మిల్టీగ్రాముల అజాడిరాక్టిన్ ఉంటుంది. వర్షం, తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగే వేప గింజల్లో అజాడిరాక్టిన్ తక్కువగా ఉంటుంది. సస్యరక్షణ చర్యలు.. 1930లో వేపపిండిని వరి, చెరకు పంటల్లో కాండం తొలుచు పురుగులు, చెదల నివారణకు వాడారు. 1937లో మిడతల దండు నివారణకు వేపాకుల రసాన్ని వాడినట్లుగా తెలుస్తోంది. వేప మందులు పిచికారీ చేస్తే పంటలపై కీటకాలు దరిచేరవు. వేపలోని చెడువాసన వల్ల కీటకాలు వికర్షింపబడతాయి. అజాడిరాక్టిన్ కీటకాన్ని లద్దెపురుగు దశ నుంచి కోశస్థ దశకు, రెక్కల పురుగు దశకు చెరకుండా అడ్డుకుంటుంది. దీంతో, వివిధ కంపెనీలు వేప సంబంధిత పురుగుమందులను మార్కెట్లో వివిద రూపాల్లో అమ్ముతున్నారు. వేపమందు దీపపు పురుగులు, పేను, తెల్ల ఈగలు, పిండి పురుగులు, తామర పురుగులు మొదలగు వాటిన్నింటినీ అదుపు చేస్తుంది. రైతులు పొలం గట్లపై, బంజరు భూముల్లో వేప చెట్లను విస్తారంగా పెంచితే ప్రత్యక్షంగా వచ్చే అదాయంతోపాటు, పరోక్షంగా పురుగుమందులు కూడా వచ్చినట్లే. వేప నూనె తయారీ.. వేప గింజలను చెట్టు నుంచి రాలిన వెంటనే సేకరించాలి. రాలిన గింజలను దాదాపు 12 గంటలపాటు ఆరబెట్టి, ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. గింజల్లో తేమ 7 శాతం ఉండేలా చూసుకోవాలి. గోనెసంచుల్లో నింపి తేమ తగలకుండా భద్రపరచాలి. వేప గింజల నుంచి పలుకులను వేరు చేసి, గ్రైండర్లో పొడి చేసి కొద్ది కొద్దిగా> నీటిని కలుపుతూ పేస్టులాగా తయారైన దాన్ని మూట కట్టి ఒక గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత రెండు చేతులతో గట్టిగా నొక్కితే వేప నూనె బయటకు వస్తుంది. పంటలపై పిచికారీ చేయుటకు 10–20 మి.లీ వేపనూనెను లీటర్ నీటిలో కలిపి 10 గ్రాముల సబ్బు జతచేసి బాగా కలిపిన తర్వాత పిచికారీ చేయాలి. వేప కషాయం తయారీ.. సాధారణంగా 5 శాతం ద్రావణాన్ని సిఫారసు చేస్తారు. కాబట్టి 50 గ్రా. వేప పలుకుల పొడిని ఒక లీటర్ నీటికి కలిపి ఒక రోజంతా నానబెట్టి, మరునాడు వడపోసి, సబ్బుపొడిని కలిపి పిచికారీ చేయాలి. పంటలపై పురుగుల కషాయంలోని ఆవిరిని పీల్చడం వల్ల పురుగుల శరీరంలో గ్రంథులు సక్రమంగా పనిచేయక చనిపోతాయి. -
కీటక నాశినుల తీరు మారుతోంది!
కీటక నాశినుల తీరు మారుతోంది! క్రిమి, కీటక నాశినులతో ఎన్ని తిప్పలో మనకు తెలియంది కాదు... మొక్కలకు హాని కలిగించే వాటితో పాటు మేలు చేసే వాటినీ మట్టుబెట్టేస్తాయి ఇవి. కానీ... మిషిగన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. కావలసిన కీటకాలను మాత్రమే చంపేసి... మిత్రపురుగులు తమ పనిని కొనసాగించగలిగేలా సరికొత్త రసాయనాల తయారీకి వీరు మార్గం సుగమం చేశారు. పైరిథ్రాయిడ్ రసాయనాన్ని తయారుచేసే పద్ధతిలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా దుష్ప్రభావాలను తొలగించవచ్చునని వీరు గుర్తించారు. కీటకాల నాడులు, కండర కణాలపై ప్రభావం చూపడం ద్వారా పైరిథ్రాయిడ్లు పనిచేస్తాయన్నది తెలిసిందే. తేనెటీగలతో పాటు రకరకాల ఇతర కీటకాల్లో అత్యధికం వీటి ప్రభావానికి లోనవుతాయి. అయితే టావ్– ఫ్లూవాలినేట్ అనే పైరిథ్రాయిడ్ మాత్రం తేనెటీగలపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఇదేవిధంగా కొన్ని ఇతర పైరిథ్రాయిడ్లు కొన్ని రకాల కీటకాలను చంపేయలేవని తెలిసింది. ఈ అంశంపై చేసిన పరిశోధనల ద్వారా నిర్దిష్ట అమినో యాసిడ్ అవశేషాల కారణంగా ఈ కీటకాలకు సహజ నిరోధకత ఏర్పడుతోందని స్పష్టమైంది. ఈ పరిశోధనల ఆధారంగా మనం కోరుకున్న శత్రు పురుగులను మాత్రమే చంపేయగల మందులను తయారు చేయడం వీలవుతుందని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త కీ డాంగ్ తెలిపారు. పరిశోధన వివరాలు అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమయ్యాయి. బ్యాక్టీరియాలతో మందుల ఫ్యాక్టరీలు.. యాంటీ బయాటిక్ నిరోధకత గురించి మీరు వినే ఉంటారు. చికిత్స కోసం మనం వాడే మందులకు బ్యాక్టీరియా తట్టుకోగలుగుతోందని, దీనివల్ల భవిష్యత్తులో వ్యాధులు విజృంభిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియా నిరోధకతనే ఆయుధంగా మార్చుకుని కొత్తకొత్త మందులు తయారు చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని సిద్ధం చేశారు. దీని పేరు ఎవల్యూషన్ మెషీన్. రకరకాల బ్యాక్టీరియాను నిర్దిష్ట పద్ధతుల్లో ఎదిగేలా, పరిణమించేలా చేయడం ద్వారా వాటితో వినూత్నమైన మందులు తయారు చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. భలే ఐడియా కదూ..! యూరోపియన్ యూనియన్ ఫ్యూచర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో బోలెడన్ని బయో రియాక్టర్లను వాడతారు. వాటిల్లో రకరకాల బ్యాక్టీరియాతో పాటు వీటిపై దాడి చేసి డీఎన్ఏలో మార్పులు చేయగల వైరస్‌ను కూడా చేరుస్తారు. ఒకపక్క వైరస్ దాడి చేస్తూంటే.. ఇంకోవైపు బ్యాక్టీరియా వాటిని తట్టుకుని బతికేందుకు కొత్త దారులు వెతుకుతూంటాయన్నమాట. ఈ క్రమంలో అవి రకరకాల రసాయన కణాలను విడుదల చేస్తూంటాయి కాబట్టి, వాటితో కొత్త మందులు తయారు చేయవచ్చునన్నది ఆలోచన. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం నడిచేందుకు శాస్త్రవేత్తలు వైరస్‌లను ప్రోగ్రామ్ చేశారు. బయో రియాక్టర్లో చేసే రసాయనిక మార్పులను బట్టి ఈ వైరస్లు ఒక్కోరకమైన బ్యాక్టీరియాకు అతుక్కుంటాయి. ఈ పని సమర్థంగా చేయగల వైరస్‌లను గుర్తించి వాటిని ఎక్కువగా పెరిగేలా చేస్తారు. ఈ క్రమంలో బ్యాక్టీరియాలను చంపేందుకు అవసరమైన వినూత్న మందులు కూడా లభిస్తాయని అంచనా. మళ్లీ దడ పుట్టిస్తున్న మలేరియా ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలంలో మలేరియా మహమ్మారికి చాలామంది పిట్టల్లా రాలిపోయేవారు. దోమకాటుతో సోకే ఈ వ్యాధికి ప్రపంచమంతా వణికిపోయేది. పంతోమ్మిదో శతాబ్దిలో క్వినైన్ కనుగొనడంతో మొదటిసారిగా మలేరియాకు ఒక విరుగుడు అందుబాటులోకి వచ్చింది. మలేరియాను నయం చేయడానికి ఆ తర్వాత మరిన్ని ఆధునిక ఔషధాలు కూడా అందుబాటులోకి రావడంతో మలేరియా వల్ల సంభవించే మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇటీవల మలేరియా మళ్లీ దడ పుట్టిస్తోంది. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్నజీవి ‘ప్లాస్మోడియమ్ ఫాల్సిపారమ్’ మందులకు లొంగని మొండిఘటంగా మారింది. ఆగ్నేయాసియాలో కొందరు దీని బారినపడ్డారు. ఆ రోగులపై మందులు పనిచేయకపోవడంతో వైద్యనిపుణులు రకరకాల పరీక్షలు జరిపి, మలేరియా కలిగించే పరాన్నజీవి మందులకు లొంగని మొండిఘటంగా మారిందని నిర్ధారించారు. ‘ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్ అక్టోబర్ సంచికలో దీని గురించి విపులంగా వివరించారు. ఇది ఇతర ప్రాంతాలకు పాకితే మలేరియా మళ్లీ మహమ్మారిలా విజృంభించే ప్రమాదం ఉందని, అందువల్ల ఆగ్నేయాసియాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని పలువురు అంతర్జాతీయ వైద్య నిపుణులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్ఓ) సూచిస్తున్నారు. వేపుళ్లతోనూ వానలు కురుస్తాయట! ఇకపై వానల కోసం మేఘమథనాల వంటి భారీ కార్యక్రమాలను తలపెట్టే బదులు ఆరుబయట వేపుడు వంటకాల జాతరలు మొదలుపెడితే బాగుంటుందేమో! ఎందుకంటారా? వాన కురుస్తున్నప్పుడు వేడి వేడిగా తినడానికే కాదు, వానలు కురవడానికి వేపుళ్లు కూడా దోహదపడతాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సంగతిని ఇటీవలే కనుగొన్నారు. వేపుళ్లు చేసినప్పుడు గాలిలో కలిసే కొవ్వు కణాలు వానలు కురిపించగల మబ్బులు ఏర్పడేందుకు దోహదపడతాయని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ క్రిస్టియన్ ఫ్రాంగ్ చెబుతున్నారు. వేపుళ్ల వల్ల గాలిలోకి చేరిన కొవ్వు కణాలు మబ్బులను ఆవరించుకుని ఉంటాయని, మబ్బులు నీటిచుక్కలను ఇముడ్చుకునేందుకు ఇవి సహకరిస్తాయని వివరిస్తున్నారు. పావు కిలో మించకూడదు డ్రోన్లను ఉపయోగించేవారు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని యునైటెడ్ కింగ్డమ్లో కొత్త చట్టం తీసుకువచ్చారు. 250 గ్రా. కంటె ఎక్కువ బరువు ఉన్న డ్రోన్లను విమానాశ్రయాల దగ్గర కాని, 400 మీ. ఎత్తుకు మించి గానీ ఎగరనివ్వకూడదని చట్టం చేసింది. చట్ట వ్యతిరేక కలాపాలకు డ్రోన్లను ఉపయోగించేవారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించే హక్కును పోలీసులకు కల్పించింది. డ్రోన్ల కారణంగా 2017లో ఇప్పటివరకు 81, 2015లో 29, 2016లో 71 దుర్ఘటనలు జరిగాయి. ఈ ఏడాది జూలైలో 130 మందితో ప్రయాణిస్తున్న ఒక విమానం లండన్ గత్విక్ విమానాశ్రయంలో లాండ్ అవుతుండగా, పెద్ద ప్రమాదమే తప్పింది. పర్యవసానమే ఈ కొత్త చట్టం. ఈ బిల్లు ప్రకారం 2018 ఏప్రిల్ నెలలోగా 250 గ్రా. కంటె ఎక్కువ బరువు ఉన్న డ్రోన్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. డ్రోన్ల వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ ఆఫ్ ద నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సెల్ సెరెనా కెన్నడీ అంటున్నారు. డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, మొబైల్ ఫోన్లను సంఘవిద్రోహక శక్తులకు, నేరస్థులకు అందచేశారని, ఇటువంటి సంఘటనలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే డ్రోన్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నాం అని యూరోపియన్ పబ్లిక్ పాలసీ అధికారి క్రిస్టియన్ స్ట్రూ అంటున్నారు. డ్రోన్లను ఎలా వాడాలనే నియమాలను ఎవ్వరూ సరిగా చదవట్లేదు, ఒకవేళ అవి సరిగా పనిచేయకపోతే ఏం చేయాలో కూడా తెలుసుకోవట్లేదు. కనీస మార్గదర్శకాలు చదవకుండా, వీటిని వినియోగించడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయట! -
మరిన్ని బ్రాండ్లను కొంటాం
ఇన్సెక్టిసైడ్స్ ఇండియా ఎండీ రాజేశ్ అగర్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెరుగైన వర్షపాతంతో వ్యవసాయం బాగుంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో సుమారు 20 శాతం వృద్ధి, రెట్టింపు లాభార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్సెక్టిసైడ్స్ ఇండియా (ఐఐఎల్) ఎండీ రాజేశ్ అగర్వాల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 988 కోట్లుగాను, లాభం దాదాపు రూ. 40 కోట్లుగాను నమోదైనట్లుతెలియజేశారు. మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా మరిన్ని బ్రాండ్లను కొనుగోలు చేయటంపై దృష్టి పెట్టామని, ఈ ఏడాదే మరో కొత్త బ్రాండ్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. అమెరికా, జపాన్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ఏడాది దాదాపు పది కొత్త ఉత్పత్తులను దేశీ మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు అగర్వాల్ చెప్పారు. వరి పంటకు సంబంధించిన ‘గ్రీన్ లేబుల్’ కలుపు నివారిణిని మంగళవారం ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ఈ కలుపు నివారిణిని జపాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీన్ని మేం తొలిసారిగా దేశీయంగా తయారు చేసి విక్రయిస్తున్నాం. దీనివల్ల ధర గణనీయంగా తగ్గుతుంది’’ అని అగర్వాల్ వివరించారు. ఉత్పత్తి ధరలు ఈ ఏడాది 15-20 శాతం మేర వచ్చే ఏడాది మరింతగాను తగ్గుతాయని తెలియజేశారు. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే.. 2015-16లో తెలంగాణ మార్కెట్లో రూ. 93 కోట్లు రాగా ఈసారి సుమారు 20% పైగా వృద్ధితో రూ. 115 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించుకున్నట్లు కంపెనీ జీఎం వీకే గర్గ్ తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ ఆదాయం గతేడాది రూ. 70 కోట్ల మేర ఉండగా.. ఈసారి రూ. 100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
నీళ్లనుకుని పురుగుల మందు తాగేశారు!
-
నీళ్లనుకుని పురుగుల మందు తాగేశారు!
నర్వ(మహబూబ్‌నగర్): తాగే నీళ్లు అనుకుని క్రిమిసంహారక మందు కలిసిన ద్రావణాన్ని తాగడంతో 16 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని గాజులయ్య తండాకు చెందిన 16 మంది కూలీలు, ధన్వాడ మండలం ఇబ్రహీంపట్టణంలో కూలీ పనులకు వెళ్లారు. అక్కడ పురుగులు మందు కలిపిన నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
నకి‘లీలలు’ తెలుసుకో.. రైతన్నా మేలుకో..
- ఖరీఫ్ సాగుపై జాగ్రత్తలు అవసరం - నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి - వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే.. ఆది నుంచే అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కి దున్నింది మొదలు.. పంట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. సాగుకు అవసరమయ్యే ప్రతి వస్తువు కొనుగోలులో, చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోళ్లలో అత్యంత జాగ్రత్తలు అవసరం. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలి. విత్తన ఎంపిక నుంచి, పంట దిగుబడి పొందే వరకు శాస్త్రీయంగా సేద్యపు పద్ధతులు అవలంభించడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే అన్నదాత పడ్డ ఆరుగాలం శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. రైతన్న మోమున ఆనందం వెల్లివిరుస్తుంది. అందుకే ఆ దిశగా అడుగులు వేయాలి. - నిజామాబాద్ వ్యవసాయం విత్తనాలు కొనే ముందే - వ్యవసాయ శాఖ లెసైన్సు పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. - సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి. - బస్తాపై రకం పేరు, లాట్ నంబరు, గడువు తేదీ తదితర వివరాలు గమనించాలి. - కొనుగోలు బిల్లుతో పాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. - పైవేటు విత్తన సంస్థలు పెద్ద ఎత్తున చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొనుగోలు చేయకూడదు. - విత్తనాన్ని ఎన్నుకొనే ముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం ఎంతో మంచిది. - మార్కెట్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ధ్రువీకరించన విత్తనాలు విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తాపై నీలి వర్ణం(బ్లూ) ట్యూగు ఉందో లేదో గమనించాలి. ఈ ట్యాగు బస్తాకు కుట్టి సీల్ చేసి ఉంటుంది. దీనిపై వివరాలు పూర్తిగా తెలుసుకొని కొనుగోలు చేయాలి. - ఫుల్ సీడ్ (లేబుల్ విత్తనం) కూడా మార్కెట్లో లభ్యమవుతోంది. వీటిని కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై లేత ఆకుపచ్చ ట్యాగ్ కుట్టి ఉంటుంది. - దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్తనాలను రైతులు కేవలం ఆయా కంపనీల నమ్మకం మీదే కొనుగోలు చేయాలి. ట్యాగుపైన వివరాలు పూర్తిగా తెలుసుకొని వ్యాపారి నుంచి సరైన బిల్లు తీసుకొని కొనుగోలు చేయాలి. - ఎలాంటి విత్తనం కొనుగోలు చేసినా తప్పక బిల్లు తీసుకోవాలి. బిల్లుపై పేరు, విత్తన రకం, తేదీ తదితర వివరాలు ఉన్నవో లేదో రైతులు సరి చూసుకోవాలి. - పంటసాగు పూర్తయ్యే వరకు తప్పని సరిగా బిల్లును దాచి ఉంచాలి. - బిడిల్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగు ఉందో లేదో చూడాలి. ఈ ట్యాగుపై విత్తనం భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే శాతం, జన్యు నాణ్యత వంటి వివరాలు ఉంటాయి. - గడువు దాటిపోయిన విత్తనాలు కొనుగోలు చేయకూడదు. - పంట మొలకెత్తే దశలో కానీ, పూత దశలో కానీ లోపం కనిపిస్తే వెంటనే మండల వ్యవసాయాధికారికి తెలియజేయాలి. - పత్తి విత్తనాల్లో జిన్నింగ్ చేసి ప్యాకింగ్ చేసిన వాటిని కొనుగోలు చేయరాదు. ఎరువుల విషయంలో.. - నాణ్యమైన ఎరువులనే వాడాలి. పంటల అధిక దిగుబడికి రసాయన ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. అక్కడక్కడ కొందరు దళారులు, వ్యాపారులు నాసిరకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు పెట్టుబడులు సైతం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే ఆస్కారం ఉంది. - లెసైన్సు దుకాణంలోనే ఎరువులు కొనుగోలు చేయాలి. - కొనుగోలు చేసిన ఎరువుకు సరైన బిల్లు పొందాలి. బిల్లును జాగ్రత్తగా దాచాలి. - డీలర్ బుక్కులో విధిగా రైతు సంతకం చేయాలి. మిషను కుట్టు ఉన్న ఎరువు సంచులను మాత్రమే కొనాలి. చేతితో కుట్టినట్లయితే దానిపై సీసంతో సీల్ ఉందో లేదో చూడాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుని వివరాలు ఉండాలి. - రైతు తప్పని సరిగా బస్తాను తూకం వేయించి తీసుకోవాలి. చిరిగిన, రంధ్రాలున్న బస్తాలను తీసుకోవద్దు. ఎరువు వినియోగం అనంతరం ఖాళీ సంచులను పడేయడం, అమ్మివేయడం చేయకూడదు. - ఇటీవల రైతులు సూక్ష్మ పోషకాలపై ఆసక్తి చూపుతున్నారు. అందమైన ప్యాకింగ్‌కు ఆకర్షితులు కాకుండా అధికారుల సిఫారసు మేరకు కొనాలి. - కొనుగోలు చేసిన ఎరువు విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అనుమానం ఉన్న ఎరువుల నమూనాలను రూ.10 డీడీ జత చేసి పరీక్షలకు పంపించాలి. కల్తీని ఇలా గుర్తించవచ్చు.. - చెమ్మగిల్లి ఉన్న ఎరువుల్లో ప్రామాణికం, నాణ్యత లోపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్ప ఒక ఎరువులోని గుళికలన్నీ ఒకే రంగులో ఉంటాయి. - అన్య పదార్థం ఎరువులో కనిపిస్తే దాన్ని కల్తీ ఎరువుగా గుర్తించాలి. - సాధారంగా యూరియా, సంకీర్ణ ఎరువులు, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ గుళికల రూపంలో ఉంటాయి. 15:15:15 లేదా 20:20:0 రేణువుల రూపంలోనూ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం సల్ఫేట్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. - 5 మి.లీ. పరిశుభ్రమైన నీరు (డిస్టిల్డ్ వాటర్) ఒక చెంచా ఎరువును బాగా కలిపిన తర్వాత అడుగున ఏమీ మిగలక స్వచ్ఛమైన ద్రావణం తయారవ్వాలి. ఈ ద్రావణం పరీక్ష యూరియా, అమ్మోనియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్లకు వర్తిస్తుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, అమ్మోనియం క్లోరైడ్ క్లోరైడ్ ఎరువులకు 10 మి.లీ. పరిశుభ్రమైన నీరు వాడాలి. - 15:15:15, 28:28:0, 19:19:19, 17:17:17, 14:28:14, యూరియా 24:24:0 ఎరువులను పరీక్షించడానికి 5 మి.లీ. పరిశుభ్రమైన నీటిలో ఒక చెంచా ఎరువును బాగా కలిపితే ఆ ద్రావణం మడ్డీగా ఉంటుంది. - కాంప్లెక్స్ ఎరువుల తయారీదారులు ఎరువుల తయారీలో మూల పదార్థ ఎరువుల పూత చుట్టేందుకు ఇసుక రేణువులను ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా డీఏపీ 17:17:17, 15:15:15: మొదలైన ఎరువులకు వాడతారు. ఈ ఎరువులు నీటిలో కరిగిన తర్వాత కనబడే ఇసుకను చూసి దీనిని కల్తీగా గుర్తించి ఉపయోగించకూడదు. పురుగుల మందుల్లో... - చీడపీడల నివారణలో వాడే క్రిమి సంహారక మందుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ సూచించే మందులనే కొనాలి. - లెసైన్సు లేని దుకాణాల నుంచి కొనరాదు. అవసరానికి మించి కొని నిల్వ చేసుకుంటే మందులు చెడిపోతాయి. - లేబుల్ లేని మందు సీసా, డబ్బా, ప్యాకెట్ సంచులను కొనరాదు. మందు లేబుల్ మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందు శాతం, పరిమాణం, విష ప్రభావం తెలిపే గుర్తులు, వాడకంలో సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్ నంబర్లు, వాడాల్సిన గడువు, తయారు చేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషను విషయాలు పరిశీలించాలి. - తప్పనిసరిగా అన్ని వివరాలతో బిల్లు పొందాలి. - ఎరువుల మందుల్లో విషపూరిత పదార్థం స్థాయిని తెలిపేందుకు డైమండ్ ఆకారంలో తెలుపుతో మరో రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణ ఇలా ఉంటుంది. అత్యంత విషపూరితం ఎరుపు రంగు, అతి విషపూరితం పసుపు రంగు, విషపూరితం నీలరంగు, స్వల్ప విషపూరితం ఆకుపచ్చ రంగు. - మందుల నిల్వలోనూ కొన్ని సూచనలు పాటించాలి. - వాడిన మందు సీసా,డబ్బా, ప్యాకెట్ సంచులను విధిగా ధ్వంసం చేసి లోతైన గుంటలో పూడ్చేయాలి. మందులు కలిపిన వాడిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు. సస్యరక్షణ మందులు - విచక్షణ రహితంగా సస్యరక్షణ మందులు వాడరాదు. - గడువు దాటిపోయిన సస్య రక్షణ మందులను కొనుగోలు చేయరాదు. - కారుతున్న, సీళ్లు సరిగా లేని మందులను కొనరాదు. - లెసైన్సు లేని డీలర్లు సస్యరక్షణ మందులు విక్రయిస్తుంటే వెంటనే సమీప వ్యవసాయాధికారికి తెలియజేయాలి. బిల్లులు పొందాలి రైతులు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ఏది కొనుగోలు చేసినా సంబంధిత దుకాణదారు నుంచి పూర్తి వివరాలతో తప్పకుండా బిల్లు పొందాలి. నకిలీదని తేలినప్పుడు ఈ బిల్లు ఆధారంగానే చర్యలు తీసుకోవచ్చు. కనుక విత్తనాలు, ఎరువుల కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఎలాంటి అనుమానం కలిగినా సమాచారం అందించాలి. - నర్సింహా, జేడీఏ, నిజామాబాద్