హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పురుగు మందుల తయారీలో ఉన్న భారతీయ కంపెనీలకు ‘పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్లు– 2017’ రూపంలో కొత్త కష్టాలు వచ్చాయి. బహుళజాతి సంస్థల వ్యాపారానికి మరింత ఊతమిచ్చే ఈ బిల్లు అమలులోకి వస్తే దేశీ కంపెనీల మనుగడ కష్టమేనని పరిశ్రమ చెబుతోంది. విదేశీ కంపెనీల మార్కెటింగ్ వ్యూహం ధాటికి ఇప్పటికే భారతీయ కంపెనీలు పోటీలో వెనుకపడ్డాయి. ఇక్కడి మార్కెట్లో ఎమ్మెన్సీలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. కీలకాంశం ఏమంటే 2007 తర్వా త దేశంలో కొత్తగా ఏ ప్లాంటూ ఏర్పాటు కాలేదు. ఆ స్థా యిలో విదేశాల నుంచి నేరుగా పురుగు మందులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా భారత్‌లోకి వచ్చిపడుతున్నాయి.
నమోదు కాకున్నా విక్రయం..
ఇన్‌సెక్టిసైడ్స్ యాక్టు–1968 ప్రకారం భారత్‌లో పురుగు మందులు విక్రయించాలంటే సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీలో మాలిక్యూల్ (రసాయనం) నమోదు తప్పనిసరి. సెక్షన్ 9(3) కింద ఈ నమోదు జరుగుతుంది. ఇదే మాలిక్యూల్‌ను భారత కంపెనీ తయారు చేయాలంటే సెక్షన్ 9 (4) కింద దరఖాస్తు సమర్పించాలి. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సెక్షన్ 9(4) కట్టడి చేస్తోంది. భారతీయ కంపెనీలు అదే ఉత్పాదనను తయారు చేయడంతో పోటీ పెరిగి ధర తగ్గేందుకు ఈ సెక్షన్ దోహదం చేస్తోంది. అయితే 2007 నుంచి బోర్డులో రిజిస్ట్రేషన్ చేయకుండానే విదేశీ కంపెనీలు తమ ఉత్పాదనలను నేరుగా విక్రయిస్తున్నాయి. మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు చేస్తూ వాటాను పెంచుకుంటున్నాయి.
ప్రయోగాలు లేకుండానే..
ఒక్కో మాలిక్యూల్ పనితీరును విశ్లేషించేందుకు ప్రతి కంపెనీ మూడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు సీజన్లు వివిధ పంటలపై ప్రయోగం చేయాలి. ఈ ఫలితాలనుబట్టి మాలిక్యూల్ విక్రయానికి బోర్డు అనుమతినిస్తుంది. విదేశాల్లో తయారై భారత్‌కు వస్తున్న ఉత్పాదనలకు ఇటువంటి విధానం అమలు కావడం లేదు. వాటి నాణ్యత ప్రశ్నార్థకమనేని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా స్మాల్, మీడియం పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజమహేందర్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. పైపెచ్చు ప్రొడక్టు ధర ఉత్పాదననుబట్టి 10 రెట్ల దాకా ఎక్కువని, దీంతో రైతులపై భారం పడుతోందని వివరించారు. దేశీయ కంపెనీలకు అండగా ఉన్న ఇన్‌సెక్టిసైడ్స్ యాక్టులో ఉన్న నిబంధనలు బిల్లులోనూ పొందుపరచాలని డిమాండ్ చేశారు.
కొత్త ప్లాంటు ఊసే లేదు..
భారత్‌లో 2007 తర్వాతి నుంచి కొత్తగా ఒక్క ప్లాంటూ ఏర్పాటు కాలేదు. 10 విదేశీ సంస్థలు ఇక్కడి తయారీ ప్లాంట్లను ఇతర కంపెనీలకు విక్రయించి కేవలం మార్కెటింగ్‌కు పరిమితమయ్యాయని పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్, ఫార్ములేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ దవే చెప్పారు. ఎమ్మెన్సీలు 127 తుది ఉత్పాదనలనే నేరుగా భారత్‌లో అమ్ముతున్నాయి. ఇవన్నీ కూడా కొత్త మాలిక్యూల్సే కావడం విశేషం. ప్రస్తుతం 170 వరకు మాలిక్యూల్స్ దేశంలో అమ్ముడవుతున్నాయి. ఇందులో సుమారు 25 మాలిక్యూల్స్‌ను భారత కంపెనీలు తయారు చేస్తున్నాయి. మిగిలినవి కూడా ఉత్పత్తి చేసే సత్తా ఉన్నా, ఎమ్మెన్సీలు ఇందుకు సహకారం అందించడం లేదు.
ఇదీ భారత మార్కెట్..
పురుగు మందుల ఉత్పత్తిలో కీలక రసాయనం అయిన మాలిక్యూల్స్ తయారు చేసే కంపెనీలు భారత్‌లో సుమారు 80 ఉంటాయి. ఫార్ములేషన్స్ (తుది ఉత్పాదన) రూపొందించే కంపెనీలు 2,000 ఉన్నాయి. దేశీయంగా రూ.18,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. ఇందులో దిగుమతుల వాటా రూ.7,000 కోట్లు. ఎగుమతులు రూ.15,000 కోట్లు ఉంటాయి. పరిశ్రమ ఏటా 7–10% వృద్ధి చెందుతోంది. 50 లక్షల మంది ఈ రంగంలో నిమగ్నం అయ్యారు. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో తయారీ లేదు. ఎమ్మెన్సీలు పూర్తిగా తమ ఉత్పాదనలతో చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఈ దేశాల సరసన భారత్ చేరడం ఖాయమని ఇక్కడి కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌లో పురుగు మందుల ధర 40% దాకా అధికం.
Comments
Please login to add a commentAdd a comment