Foreign Company
-
నిధుల వేటలో సక్సె(య)స్!
న్యూఢిల్లీ: నిధుల కొరత, మొండిపద్దులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌కు భారీ ఊరట లభించింది. 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,500 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఓ ఇన్వెస్టర్ ముందుకొచ్చారు. కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకి ప్రతిగా ఈ మేరకు ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్ నుంచి ఆఫర్ వచ్చినట్లు యస్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. బ్యాంకు బోర్డు, నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులకు లోబడి తాజా పెట్టుబడులు ఉంటాయని తెలిపింది. ‘మరిన్ని పెట్టుబడుల కోసం ఇతర దేశ, విదేశ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు కొనసాగుతాయి‘ అంటూ బ్యాంకు వివరించింది. వ్యాపార వృద్ధికి దోహదపడేలా మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తున్నామని, పలు విదేశీ సంస్థలతో పాటు దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని యస్ బ్యాంకు గత నెలలో స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఆగస్టులో యస్ బ్యాంక్ రూ. 1,930 కోట్లు సమీకరించింది. నియంత్రణ సంస్థ ఏం చేస్తుందో.. పెట్టుబడుల వార్త వెల్లడి కావడానికి ముందు యస్ బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వద్ద తిరుగాడింది. ఆ ప్రకారం చూస్తే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి చాలా భారీ మొత్తమే కానుంది. సంస్థ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకమున్నందుకే ఇన్వెస్టర్లు కాస్త ఎక్కువ రేటు ఇచ్చేందుకు కూడా సిద్ధపడి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రూ. 100 వద్ద షేరు కేటాయించిన పక్షంలో విదేశీ ఇన్వెస్టరుకు 25 శాతం వాటా లభించవచ్చు. అంతకు మించి 26 శాతం వాటా తీసుకున్న పక్షంలో మైనారిటీ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మొత్తం వ్యవహారం జటిలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో ఏ ఒక్క ఇన్వెస్టరుకు 10 శాతానికి మించి వాటాలు తీసుకోవడానికి లేదు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సడలించే అంశాన్ని పరిశీలించవచ్చని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం యస్ బ్యాంకు దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో క్యాథలిక్ సిరియన్ బ్యాంకులో ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా ఇదే తరహాలో మెజారిటీ వాటాలు తీసుకునేందుకు అంగీకరించినందున.. తాజాగా అదే తరహా యస్ బ్యాంకు డీల్ విషయంలో ఆర్బీఐ కాదనకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. 24 శాతం ఎగిసిన షేరు.. విదేశీ ఇన్వెస్టరు పెట్టుబడుల వార్తలతో గురువారం యస్ బ్యాంక్ షేరు భారీగా ఎగిసింది. బీఎస్ఈలో ఒక దశలో ఏకంగా 35% పెరిగి రూ.76.65 స్థాయిని తాకింది. చివరికి 24% పెరిగి రూ. 70.45 వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో 39% (రూ.78.70కి) ఎగిసిన షేరు ఆ తర్వాత సుమారు 24 శాతం లాభంతో రూ.70.30 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3,500 కోట్లు ఎగిసి రూ.17,967 కోట్లకు చేరింది. -
వాటాదారుల ప్రయోజనాలకు పూర్తి భద్రత
న్యూఢిల్లీ: ఆంగ్లో అమెరికన్ పీఎల్‌సీలో తన విదేశీ సంస్థ కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్ చేసిన పెట్టుబడి పరిపాలనా అనుమతులకు లోబడే ఉన్నాయని, ఇది వాటాదారుల ప్రయోజనాలను కాపాడుతుందని వేదాంత లిమిటెడ్ వివరణ ఇచ్చింది. వేదాంత షేర్లు గత శుక్రవారం 20 శాతం వరకు నష్టపోయిన నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ‘‘ఈ పెట్టుబడి ఇప్పుడు పూర్తి మూలధనంగా ఉంది. డౌన్‌సైడ్ రక్షణతోపాటు వేదాంత వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణకు భరోసానిస్తుంది’’ అని వేదాంత లిమిటెడ్ స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన వివరణలో తెలియజేసింది. ఆంగ్లో అమెరికన్ కంపెనీలో ఉన్న వృద్ధి అవకాశాల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్ లిమిటెడ్ వద్ద ఉన్న మిగులు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు వోల్కన్ ఆఫర్ చేసినట్టు తెలిపింది. ఇతర విదేశీ నగదు నిర్వహణ పెట్టుబడులతో పోలిస్తే దీనిపై అధిక రాబడులు వస్తాయని, సాధారణంగా 2% రాబడులొస్తాయని పేర్కొంది. రిస్క్ ఆధారిత రాబడుల అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదటే తన నగదు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓటింగ్ హక్కులు మాత్రం వోల్కన్ వద్దే ఉంటాయని స్పష్టం చేసింది. స్వతంత్ర వాల్యూయర్ చేసిన మదింపు అనంతరం, కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్, వేదాంత లిమిటెడ్ బోర్డుల ఆమోదం అనంతరమే ఇన్వెస్ట్ చేసినట్టు వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో ఈ విషయాన్ని స్వచ్చందంగానే వెల్లడించినట్టు తెలిపింది. -
కమోడిటీ ట్రేడింగ్ సమయం పెరిగింది
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ విభాగంలో ట్రేడింగ్ సమయం మరింతగా పెరగనుంది. అంతే కాకుండా ట్రేడింగ్‌లో పాల్గొనడానికి రైతు సంఘాలను, విదేశీ సంస్థలను కూడా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సవరించిన వేళల ప్రకారం, వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి గం.11.55 నిమిషాల వరకూ కొనసాగుతుంది. గతంలో ట్రేడింగ్ సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి గం.11.55 వరకూ ఉండేది. ఇక వ్యవసాయ, వ్యవసాయ ప్రాసెస్డ్ కమోడిటీల ట్రేడింగ్ ఉదయం 9 గంటలకు మొదలై రాత్రి 9కి ముగుస్తుంది. గతంలో ఈ సెగ్మెంట్ ట్రేడింగ్ ఉదయం 10 నుంచి రాత్రి 9.30 వరకూ ఉండేది. ఈ మేరకు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్చంజ్‌లు తమ కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ ట్రేడింగ్ వేళలను సరిచేసుకోవాలని సెబీ పేర్కొంది. సవరించిన ట్రేడింగ్ వేళలు ఈ సర్క్యులర్ వెలువడిన నెల రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని, స్టాక్ ఎక్సే్చంజ్‌లు తమ నియమ నిబంధనల్లో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సెబీ సూచించింది. కమోడిటీ డెరివేటివ్స్ అడ్వైజరీ కమిటీ సూచనలు ఆధారంగా ఈ తాజా నిర్ణయం తీసుకున్నామని సెబీ తెలిపింది. -
విదేశీ పురుగు మందుల దాడి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పురుగు మందుల తయారీలో ఉన్న భారతీయ కంపెనీలకు ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్లు– 2017’ రూపంలో కొత్త కష్టాలు వచ్చాయి. బహుళజాతి సంస్థల వ్యాపారానికి మరింత ఊతమిచ్చే ఈ బిల్లు అమలులోకి వస్తే దేశీ కంపెనీల మనుగడ కష్టమేనని పరిశ్రమ చెబుతోంది. విదేశీ కంపెనీల మార్కెటింగ్ వ్యూహం ధాటికి ఇప్పటికే భారతీయ కంపెనీలు పోటీలో వెనుకపడ్డాయి. ఇక్కడి మార్కెట్లో ఎమ్మెన్సీలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. కీలకాంశం ఏమంటే 2007 తర్వా త దేశంలో కొత్తగా ఏ ప్లాంటూ ఏర్పాటు కాలేదు. ఆ స్థా యిలో విదేశాల నుంచి నేరుగా పురుగు మందులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా భారత్‌లోకి వచ్చిపడుతున్నాయి. నమోదు కాకున్నా విక్రయం.. ఇన్సెక్టిసైడ్స్ యాక్టు–1968 ప్రకారం భారత్‌లో పురుగు మందులు విక్రయించాలంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీలో మాలిక్యూల్ (రసాయనం) నమోదు తప్పనిసరి. సెక్షన్ 9(3) కింద ఈ నమోదు జరుగుతుంది. ఇదే మాలిక్యూల్‌ను భారత కంపెనీ తయారు చేయాలంటే సెక్షన్ 9 (4) కింద దరఖాస్తు సమర్పించాలి. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సెక్షన్ 9(4) కట్టడి చేస్తోంది. భారతీయ కంపెనీలు అదే ఉత్పాదనను తయారు చేయడంతో పోటీ పెరిగి ధర తగ్గేందుకు ఈ సెక్షన్ దోహదం చేస్తోంది. అయితే 2007 నుంచి బోర్డులో రిజిస్ట్రేషన్ చేయకుండానే విదేశీ కంపెనీలు తమ ఉత్పాదనలను నేరుగా విక్రయిస్తున్నాయి. మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు చేస్తూ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రయోగాలు లేకుండానే.. ఒక్కో మాలిక్యూల్ పనితీరును విశ్లేషించేందుకు ప్రతి కంపెనీ మూడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు సీజన్లు వివిధ పంటలపై ప్రయోగం చేయాలి. ఈ ఫలితాలనుబట్టి మాలిక్యూల్ విక్రయానికి బోర్డు అనుమతినిస్తుంది. విదేశాల్లో తయారై భారత్‌కు వస్తున్న ఉత్పాదనలకు ఇటువంటి విధానం అమలు కావడం లేదు. వాటి నాణ్యత ప్రశ్నార్థకమనేని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా స్మాల్, మీడియం పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజమహేందర్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. పైపెచ్చు ప్రొడక్టు ధర ఉత్పాదననుబట్టి 10 రెట్ల దాకా ఎక్కువని, దీంతో రైతులపై భారం పడుతోందని వివరించారు. దేశీయ కంపెనీలకు అండగా ఉన్న ఇన్సెక్టిసైడ్స్ యాక్టులో ఉన్న నిబంధనలు బిల్లులోనూ పొందుపరచాలని డిమాండ్ చేశారు. కొత్త ప్లాంటు ఊసే లేదు.. భారత్‌లో 2007 తర్వాతి నుంచి కొత్తగా ఒక్క ప్లాంటూ ఏర్పాటు కాలేదు. 10 విదేశీ సంస్థలు ఇక్కడి తయారీ ప్లాంట్లను ఇతర కంపెనీలకు విక్రయించి కేవలం మార్కెటింగ్‌కు పరిమితమయ్యాయని పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్, ఫార్ములేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ దవే చెప్పారు. ఎమ్మెన్సీలు 127 తుది ఉత్పాదనలనే నేరుగా భారత్‌లో అమ్ముతున్నాయి. ఇవన్నీ కూడా కొత్త మాలిక్యూల్సే కావడం విశేషం. ప్రస్తుతం 170 వరకు మాలిక్యూల్స్ దేశంలో అమ్ముడవుతున్నాయి. ఇందులో సుమారు 25 మాలిక్యూల్స్‌ను భారత కంపెనీలు తయారు చేస్తున్నాయి. మిగిలినవి కూడా ఉత్పత్తి చేసే సత్తా ఉన్నా, ఎమ్మెన్సీలు ఇందుకు సహకారం అందించడం లేదు. ఇదీ భారత మార్కెట్.. పురుగు మందుల ఉత్పత్తిలో కీలక రసాయనం అయిన మాలిక్యూల్స్ తయారు చేసే కంపెనీలు భారత్‌లో సుమారు 80 ఉంటాయి. ఫార్ములేషన్స్ (తుది ఉత్పాదన) రూపొందించే కంపెనీలు 2,000 ఉన్నాయి. దేశీయంగా రూ.18,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. ఇందులో దిగుమతుల వాటా రూ.7,000 కోట్లు. ఎగుమతులు రూ.15,000 కోట్లు ఉంటాయి. పరిశ్రమ ఏటా 7–10% వృద్ధి చెందుతోంది. 50 లక్షల మంది ఈ రంగంలో నిమగ్నం అయ్యారు. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో తయారీ లేదు. ఎమ్మెన్సీలు పూర్తిగా తమ ఉత్పాదనలతో చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఈ దేశాల సరసన భారత్ చేరడం ఖాయమని ఇక్కడి కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌లో పురుగు మందుల ధర 40% దాకా అధికం. -
స్వశక్తిని గుర్తించాల్సిన తరుణమిది
ఏఆర్‌సీఐ ద్విదశాబ్ది ఉత్సవాల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి సాక్షి, హైదరాబాద్: కేంద్రం పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇంటర్నే షనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల సహా య మంత్రి వై.సుజనా చౌదరి పేర్కొన్నారు. ఏఆర్‌సీఐ అభివృద్ధి చేసిన టెక్నాలజీలు, పదార్థాల ద్వారా దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలగనుం దన్నారు. ఏఆర్‌సీఐ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపం చీకరణ భావన కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ స్వీయ శక్తిసామర్థ్యాలను గుర్తించి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ రంగంతోపాటు ఇతర రంగాలకు అవసరమైన టెక్నాలజీలు, పదార్థాలను అభివృద్ధి చేసిన ఏఆర్‌సీఐ.. అందుబాటులోని అవకాశాలను అందిపుచ్చు కునేందుకు స్వయంగా మార్కెటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం మేలని సూచించారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా కేంద్రం సరికొత్త పదార్థ విధాన ముసాయిదాను సిద్ధం చేస్తోందన్నారు. విదేశీ కంపెనీలతో పోటీ పడేటప్పుడు స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ఏఆర్‌సీఐ అభివృద్ధి చేసిన టెక్నాలజీలతో ఏర్పాటు చేసిన ఏఆర్సీఐటెక్స్ 2017ను సుజనా ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు. సూపర్ కెపాసిటర్‌తో నడిచే సైకిల్ని ఆసక్తిగా పరిశీలించి దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌరశక్తి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఆర్‌సీఐ డీసీ కరెంట్‌తో నడిచే బల్బులు, ఫ్యాన్లు ఇతర పరికరాలను అభివృద్ధి చేయడాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్‌సీఐ మాజీ డైరెక్టర్లు పద్మవిభూషణ్ పల్లె రామారావు, పద్మశ్రీ సౌందరరాజన్‌లు, పద్మభూషణ్ వి.ఎస్.రామ్మూర్తి, ప్రస్తుత డైరెక్టర్ పద్మనాభన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అగ్రి’ ఆస్తుల వేలానికి 58కి పైగా బిడ్లు దాఖలు
- కీసర ఆస్తులకు స్పందన నామమాత్రం - సైదాపురం భూములకు అత్యధిక స్పందన - నిర్ణయం నిమిత్తం విచారణ జనవరి 3కు వాయిదా - మా కంపెనీలను టేకోవర్ చేసేందుకు ఓ విదేశీ కంపెనీ సిద్ధంగా ఉంది - ముందస్తుగా రూ.1500 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది - ధర్మాసనానికి అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది నివేదన సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి మొత్తం 64 బిడ్లు హైకోర్టుకు అందాయి. వీటిలో ఆరు బిడ్లు గడువు తేదీ దాటడంతో వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మిగిలిన 58 బిడ్లలో 42 బిడ్లు పోస్టు ద్వారా, మిగిలిన బిడ్లు నేరుగా హైకోర్టు రిజిష్ట్రార్‌కు అందాయి. కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం, కీసర గ్రామంలో ఉన్న ఆస్తులకు నామమాత్రపు స్పందన రాగా, అత్యధికంగా సైదాపురం గ్రామంలోని భూములకు 16 బిడ్లు వచ్చాయి. అయితే కీసరలో వచ్చిన బిడ్లన్నీ కూడా కనీస రిజర్వు ధర కంటే ఎక్కువ ధరకే దాఖలు కావడం విశేషం. దాదాపు గంట పాటు ఈ బిడ్లు అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు, వీటి విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తదుపరి విచారణను ఈ జనవరి 3కు వాయిదా వేసింది. ఆ రోజున కూడా బిడ్డర్లందరూ కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఆగ్రిగోల్డ్ ఆస్తుల వేలం నిమిత్తం ఇచ్చిన ప్రకటనకు స్పందనగా వచ్చిన బిడ్లను బిడ్డర్ల సమక్షంలోనే కోర్టు హాలులోనే తెరిచింది. దాదాపు గంటపాటు వాటిని పరిశీలించింది. ప్రతీ ఆస్తి ధరను రికార్డ్ చేసుకుంది. అనంతరం గడువు దాటిపోయిన తరువాత వచ్చిన ఆరు బిడ్ల గురించి తెలియచేసింది. వాటిని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అని బిడ్డర్లను, సంబంధిత న్యాయవాదులను అడిగింది. గడువు ముగిసిన తరువాత వచ్చిన వాటిని తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని బిడ్డర్లందరూ చెప్పడంతో ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. దీంతో మిగిలిన బిడ్ల గురించి, ఒక్కో ఆస్తికి ఎన్ని బిడ్లు వచ్చాయో ధర్మాసనం వివరించింది టేకోవర్‌కు ఓ విదేశీ కంపెనీ సిద్ధం అంతకుముందు అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ ఓ కొత్త విషయాన్ని ధర్మాసనం ముందుంచారు. ఓ విదేశీ కంపెనీ అగ్రిగోల్డ్ కంపెనీలన్నింటినీ టేకోవర్ చేసేందుకు సిద్ధంగా ఉందని, అందులో భాగంగా ముందస్తుగా రూ.1500 కోట్లు చెల్లించేందుకు సిర్వం సిద్ధం చేసుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జనవరి కల్లా ఈ రూ.1500 కోట్లు చెల్లించే అవకాశం ఉందని వివరించారు. అదే విధంగా నోట్ల రద్దు నేపథ్యంలో వేలం నిర్వహించడం చాలా తక్కువ మొత్తాలు వచ్చే అవకాశం ఉందని పలువురు బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు చెబుతున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... రూ.1500 కోట్లు వస్తాయన్న నమ్మకం ఏమిటంది. తాము వేలాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో తమిళనాడు అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం ఓ పిటిషన్ దాఖలు చేసిందని, కనీస రిజర్వు ధరలు చాలా తక్కువ ఉన్నాయని, వేలం షరతులను కూడా మార్చాలని సంఘం తరఫు న్యాయవాది వి.పట్టాభి కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యాన్ని ఎవరో దాఖలు చేయించినట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. -
నింగి.. నేల .. నీరు.. ప్రసాద్
స్ఫూర్తి విధి అతనికి ఒక్క కాలే ఇచ్చి, ఎలా జీవిస్తావో చూపమని శాసించింది. ఆత్మస్థైర్యమే ఆలంబనగా విధికే సవాల్ విసిరి విజయపథంలో దూసుకుపోతున్నారు సాయిప్రసాద్. మూడు పదుల సాయి ప్రసాద్ విశ్వనాథన్ తనలాంటి వారికే కాదు సకలాంగులకూ జీ- మ్యాట్‌లో శిక్షణనిస్తూ విదేశీ కంపెనీలలో ఉద్యోగవకాశాల కల్పనకు దారులు వేస్తున్నారు. నేల, నింగి, నీరు, అగ్ని, వాయువు.. పంచభూతాలను అనుభూతిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. సంకల్పం ఉంటే... అదే సమస్తాన్నీ ముంగిట్లోకి తెస్తుందని నిరూపిస్తున్నారు. ఈ హైద్రాబాదీ సాయిప్రసాద్ విజయగాథ... ‘‘నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని లాల్గుడి. మా అమ్మ వాసంతి, నాన్న విశ్వనాథన్. వారి అండదండలు ఉండడం వల్లే బాగా చదువుకోగలిగాను. నా చిన్నప్పుడు అవిటితనాన్ని హేళన చేసిన ఘటనలు చాలానే ఎదుర్కొన్నాను. ‘అవిటివాడినని, పక్కన కూర్చోవద్దు అని’ నా క్లాస్‌మేట్స్‌కు వారి తల్లితండ్రులు చెప్పేవారు. కానీ, మా అమ్మ నాలో ఆత్మన్యూనత పెరగకుండా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేది. అందువల్లే అవేవీ నేను పట్టించుకోలేదు. బాధపడనూ లేదు. అంధురాలైనా ఎంతో సాధించిన హెలెన్ కెల్లర్ జీవితగాథ నాలో స్ఫూర్తి నింపింది. ఆ స్ఫూర్తితోనే టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు సాధించా. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సిబిఐటిలో ఇంజినీరింగ్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించా. ఆ తర్వాత టోఫెల్, జిఆర్ఇ వంటి అన్ని పరీక్షల్లోనూ టాప్ స్కోర్ సాధించా. అమెరికాలో ఎమ్ఎస్, ఎంబిఎ పూర్తి చేశా. ఐఎస్బిలోనూ సీటు వచ్చింది. ప్రస్తుతం విదేశీ కంపెనీలకు కన్సల్టెంట్‌గా ఉన్నా. స్కై డ్రైవ్ కోసం అంటార్కిటికాకు వెళ్లినప్పుడు అక్కడ స్థితిగతుల్ని చూశాక మన దేశంలో అర్హత గలవారికి జీమ్యాట్‌లో శిక్షణ నిస్తే బాగుంటుందని అనుకున్నా. ఉన్న అనుభవంతో కొందరి భవిష్యత్తునైనా అందంగా మార్చగలను అనుకున్నాను. ఆ ఆలోచనే ‘సహస్ర’కు నాంది అయింది. ‘సహస్రా’వధానం కనీసం వెయ్యిమంది విద్యార్థులకైనా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ‘సహస్ర’ పేరుతో సంస్థను నెలకొల్పాను. మూడేళ్లుగా ‘ఐఎస్బి’తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రముఖ కంపెనీలలో ఉద్యోగావకాశాలు పొందాలనుకుని దారీతెన్నూ తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు దిశా నిర్దేశం చేస్తున్నాను. కిందటేడాది 170 మందికి శిక్షణనిస్తే వారిలో 150 మందికి పైగా విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ కంపెనీలకు 60 అప్లికేషన్లు పంపిస్తే అన్నీ ఎంపిక అయ్యాయి. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన దారి తెలియకపోతే అవకాశాల్ని అందిపుచ్చుకోలేనివారు ఎందరో. వారిలో పేద విద్యార్థులూ ఉన్నారు. ధనిక, పేద తేడా లేకుండా ఏ విద్యార్థి అయినా డిగ్రీతో పాటు ఎంబిఎ చేసి ఉంటే చాలు. వారికి విదేశాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయో, వాటిలో ప్రవేశానికేం చేయాలో అన్ని టెక్నిక్స్ నేర్పడానికే ఈ సంస్థను నెలకొల్పాను. పంచభూతాలతో ప్రపంచ రికార్డ్ మొదటిసారి ఓ వికలాంగుడు 14 వేల అడుగుల ఎత్తులో స్కై డ్రైవ్ చేశాడని నా పేరును లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. పాపకర్మల వల్ల అవిటి జీవితం రాదని, నింగి, నేల, నీరు, గాలి, అగ్ని - ఇలా పంచభూతాలే మానవాంశకు అసలు కారణం అని భగవద్గీత ద్వారా తెలుసుకున్నా. పంచభూతాలను పూర్తి గా అనుభూతించాలనుకున్నా. అమెరికాలోని గ్రాండ్ కానియన్ వద్ద స్కై వాక్, అంటార్కిటికాలో స్కై డ్రైవ్ చేశాను. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లోని అతి ఎత్తై అగ్నిపర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నా. అలాగే, అర్జెంటీనాలోని ఓ గుహలో కొన్నాళ్ల పాటు ఒక్కడినే జీవించాలనుకుంటున్నా. వికలాంగుడైనా సాహసకృత్యాలు చేయడంలో వెనకంజ వేయాల్సిన అవసరం లేదని నాలాంటి వారికి నిరూపించడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నా. చదువు ఒక్కటే సమస్త ప్రపంచాన్నీ చేరువ చేస్తుంది. అందుకే వికలాంగుల తల్లితండ్రులకు నాదో విన్నపం. వికలాంగులైనా మీ బిడ్డల్ని బాగా చదివించండి. అప్పుడు భవిష్యత్తులో వారు మీకు భారం కారు, భరోసాగా నిలుస్తారు’’ అన్నారు సాయిప్రసాద్. - నిర్మల చిల్కమర్రి -
ఏడాదిలో లక్ష ‘డబుల్ బెడ్రూమ్’లు
♦ నిర్మాణానికి ముందుకొచ్చిన రెండు విదేశీ కంపెనీలు ♦ పీపీపీ విధానంలో నిర్మిస్తామని సర్కారుకు ప్రతిపాదన ♦ రెడీమేడ్ విడిభాగాలతో ఇళ్లు కడతామని వెల్లడి ♦ పరిజ్ఞానంపై అధ్యయనానికి ప్రభుత్వ నిర్ణయం ♦ 13న సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న కంపెనీల ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగం పంచుకునేందుకు రెండు విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. కేవలం ఏడాది వ్యవధిలో రికార్థు స్థాయిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రతిపాదించాయి. విడి భాగాల (ప్యానల్స్) బిగింపుతో ఇళ్లు, బహుళ అంతస్తుల సముదాయాలను నిర్మించడంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ‘ఎం2-ఎమ్మాడ్యు’ అనే ఇటలీ కంపెనీ...స్వీడెన్కు చెందిన ‘కోలో గ్లోబల్’తో కలసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఓ దఫా చర్చలు జరిపిన ఈ కంపెనీల ప్రతినిధి బృందం...ఈ నెల 13న రెండోసారి సమావేశం కానుంది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో తొలుత సొంత నిధులతోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ఈ కంపెనీలు ఇప్పటికే అంగీకరించాయి. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా ఇళ్లు రాష్ట్రంలో కొత్త కావడంతో ఇక్కడి ప్రజలకు నచ్చుతాయా లేదా అనే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. పైలట్ ప్రాజెక్టుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 లేదా 50 ఇళ్లను నిర్మించాలని, ఈ ఇళ్లపై ప్రజలు ఆసక్తి చూపిస్తేనే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. సంప్రదాయ ఆర్సీసీ కాంక్రీట్ ఇళ్లతో పోల్చితే ఈ గృహాల మన్నిక కాలం ఎంత అనే అంశంపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. రాష్ట్రం నుంచి స్థిరాస్థి వ్యాపారుల బృందాన్ని త్వరలో విదేశాలకు పంపించి 20 ఏళ్ల క్రితం ఎమ్మాడ్యు నిర్మించిన ఇళ్ల స్థితిగతులపై అధ్యయనం చేయించాలనే నిర్ణయానికి వచ్చింది. ఎం2-ఎమ్మాడ్యు కంపెనీ ఈ తరహా పరిజ్ఞానంతో ఇప్పటికే వెనిజులా, పనామా సహా పలు దేశాల్లో విజయవంతంగా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించింది. ఈ భవనాలకు సంబంధించి సమాచారాన్ని కంపెనీ బృందం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన కోసం సమర్పించింది. రెడీమేడ్ ప్యానెల్స్‌తో 30 అంతస్తుల వరకు భవనాలను నిర్మించినట్లు అం దులో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థలాభావం నెలకొని ఉండడంతో 13 అంతస్తులతో డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను నిర్మించి లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ‘గ్రేటర్’ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7.6 లక్షలను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. అంతే వ్యయం లేదా అంతకన్నా తక్కువ వ్యయానికే తాము ఇళ్లను నిర్మించి ఇస్తామని ఈ 2కంపెనీలు ముందుకు రావడంతో ప్రభుత్వం సైతం ఆసక్తి కనబరుస్తోంది. ఈ తరహా ఇళ్లను ప్రజలు ఆమోదిస్తారని నిర్ణయానికి వస్తే ఈ కంపెనీలతో ఒప్పం దం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ మేర కు ప్రభుత్వం ఒప్పుకుంటే ఇళ్ల విడిభాగాల తయారీకి ‘ఎం2-ఎమ్మాడ్యు’ కంపెనీ స్థానికం గా ఓ కర్మాగారాన్ని నెలకొల్పనుంది. అక్కడ తయారైన విడిభాగాలను కాంక్రీట్ మిశ్రమం సాయంతో బిగించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ నెల 13న కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశంలో పురోగతి లభించే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
అమరావతి రాజధాని.. విదేశీ గుప్పెట్లో!
విదేశీ సంస్థలకు రెడ్‌కార్పెట్Z 16 విభాగాల్లో పెట్టుబడులకు రంగం సిద్ధం 18 శాతం వరకు లాభాలకు గ్యారంటీ సేవల రూపంలో పన్నుల బాదుడుకు గ్రీన్‌సిగ్నల్ ‘వ్యాపారాలకు పర్మిట్.. వ్యవహారాలకు లెసైన్స్.. పేరుకు ప్రజలదే రాజ్యం.. పెత్తందార్లదే భోజ్యం..’ అంటూ గళమెత్తిన సినీ కవి ఆవేదన రాజధాని అమరావతి విషయంలో అచ్చంగా సరిపోతోంది. ప్రజా రాజధాని నిర్మిస్తామని చెబుతున్న రాష్ట్ర సర్కారు భూముల నుంచి సేవల వరకు విదేశీ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. రాజధానిని విదేశీ కార్పొరేట్ సంస్థల గుప్పెట్లో పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే అనుమానాలు కలగక మానవు. విజయవాడ బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తోంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్, డిటైల్డ్ మాస్టర్‌ప్లాన్, రాజధాని డిజైన్ వంటి కీలక పనులన్నీ విదేశీ సంస్థలకే అప్పగించిన సర్కారు.. మరో అడుగు ముందుకేసి అభివృద్ధి పనుల పేరుతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందవచ్చంటూ విదేశీ సంస్థలను ఆహ్వానిస్తోంది. భూముల నుంచి సేవల వరకు అన్నీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విదేశీ కార్పొరేట్‌కు అనుకూలంగా ప్రణాళిక... కొద్దిరోజుల క్రితం సీఆర్డీఏ ప్రత్యేకంగా పీడబ్ల్యూసీ ప్రైవేటు లిమిటెడ్ ఇండియా అనే సంస్థతో ఒక ప్రత్యేక కార్యాచరణను తయారు చేయించింది. ‘ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యూకే ఇన్వెస్టర్స్ ఇన్ అమరావతి- ట్వంటీ ఫస్ట్ సెంచరీ కెపిటల్’ పేరుతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రతిపాదించింది. ఏపీ రాజధానిలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతితో పనిలేకుండా వెసులుబాటు కల్పించేందుకు సీఆర్డీఏ రూపొందించిన కార్యాచరణ నిబంధనావళిలో ప్రతిపాదన చేసింది. అమరావతిలో 2020 నాటికి 163 ప్రాజెక్టుల ద్వారా రూ.62,972 కోట్లు, 2050 నాటికి 2,579 ప్రాజెక్టుల ద్వారా రూ.1.94 లక్షల కోట్ల మేరకు విదేశీ సంస్థల పెట్టుబడులు రాబట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే.. ఆ పేరుతో భూములను విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తూ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుండటం, ఆనక ఆ సేవలను వినియోగించుకునే క్రమంలో రాజధాని ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తుండటం చూస్తే.. ఇది నిజంగా ప్రజా రాజధానా? విదేశీ ప్రైవేటు రాజధానా? అనే అనుమానం కలగక మానదు. 16 విభాగాల్లో విదేశీ పెట్టుబడులు... ఇప్పటికే ఇండో-యూకే ఆస్పత్రి ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సంస్థకు అవసరమైన భూముల కేటాయింపునకు రంగం సిద్ధం చేసింది. లండన్‌కు చెందిన కార్పొరేట్ సంస్థకు 1200 ఎకరాలు కేటాయించేలా ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రాజధానిలో 16 విభాగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించి పెట్టుబడులపై దాదాపు 9 నుంచి 18 శాతం లాభాల గ్యారంటీ ఇస్తూ ఒప్పందాలు చేసుకోనుంది. మెట్రో, ఔటర్ రింగ్‌రోడ్డు, కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధి, డర్ట్ యుటిలిటీస్ (రోడ్డు పక్కన ఫైబర్ కేబుల్స్ వేసేందుకు నిర్మాణాలు), వరద నివారణ చర్యలు, వేస్ట్ వాటర్ కలెక్షన్-ట్రీట్మెంట్ సిస్టమ్, మంచినీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా, ప్రభుత్వ అధికారులకు గృహ నిర్మాణం, ప్రజలకు 14 వేల ఇళ్లు, 1300 హెక్టార్లలో పారిశ్రామిక జోన్ అభివృద్ధి, సిటీ ఎక్స్‌ప్రెస్ హైవే అభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వైద్య రంగం, నాలెడ్జ్ సిటీలో యూనివర్సిటీలు తదితర విద్యాసంస్థల అభివృద్ధి, మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్స్ ఎడ్యుకేషన్ (ఎంఐసీఈ) వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులను నేరుగాను, పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్), బీవోటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో ప్రభుత్వం అవకాశం ఇస్తుండటం గమనార్హం. అదే జరిగితే రోడ్డు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టే రాజధానిలో విదేశీ సంస్థలు పెట్టుబడులు రాబట్టుకునేందుకు, సేవల పన్ను వసూళ్లకు ప్రభుత్వమే నేరుగా అవకాశం కల్పించడంతో రాజధాని ప్రజలపై అదనపు భారం తప్పదు. -
విదేశీ కంపెనీలకు భూముల ధారాదత్తం
పోలాకి:మండలంలోని థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాల్లో సీపీఐ నాయకులు ఆదివారం పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ అధ్యక్షతన తోటాడ, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, చీడివలస గ్రామాల్లో పర్యటించి థర్మల్ పవర్‌ప్లాంట్‌పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సన్యాసిరాజుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో విల్సన్ మాట్లాడుతూ విదేశీ కంపెనీల మోజులో రైతుల హక్కులకు భంగం కలిగే నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారన్నారు. రాజధానితో పాటు వివిధ పరిశ్రమల నిర్మాణంలో ప్రభుత్వ, రైతుల భూములు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పోలాకి థర్మల్ పవర్‌ప్లాంట్‌పై రహస్య సర్వేలు చేస్తున్నట్టు వ స్తున్న వార్తలపై కలెక్టర్ గాని, జిల్లాకు చెందిన మంత్రి గాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాపర సుందరలాల్ మాట్లాడుతూ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీ సంఘం నాయకులు లండ వెంకటరావు, గేదెల చిరంజీవులు, బి.త్రినాథరావు పాల్గొన్నారు.