విదేశీ సంస్థలకు రెడ్‌కార్పెట్Z
16 విభాగాల్లో పెట్టుబడులకు రంగం సిద్ధం
18 శాతం వరకు లాభాలకు గ్యారంటీ
సేవల రూపంలో పన్నుల బాదుడుకు గ్రీన్‌సిగ్నల్
‘వ్యాపారాలకు పర్మిట్.. వ్యవహారాలకు లెసైన్స్.. పేరుకు ప్రజలదే రాజ్యం.. పెత్తందార్లదే భోజ్యం..’ అంటూ గళమెత్తిన సినీ కవి ఆవేదన రాజధాని అమరావతి విషయంలో అచ్చంగా సరిపోతోంది. ప్రజా రాజధాని నిర్మిస్తామని చెబుతున్న రాష్ట్ర సర్కారు భూముల నుంచి సేవల వరకు విదేశీ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. రాజధానిని విదేశీ కార్పొరేట్ సంస్థల గుప్పెట్లో పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే అనుమానాలు కలగక మానవు.
విజయవాడ బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తోంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్, డిటైల్డ్ మాస్టర్‌ప్లాన్, రాజధాని డిజైన్ వంటి కీలక పనులన్నీ విదేశీ సంస్థలకే అప్పగించిన సర్కారు.. మరో అడుగు ముందుకేసి అభివృద్ధి పనుల పేరుతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందవచ్చంటూ విదేశీ సంస్థలను ఆహ్వానిస్తోంది. భూముల నుంచి సేవల వరకు అన్నీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
విదేశీ కార్పొరేట్‌కు అనుకూలంగా ప్రణాళిక...
కొద్దిరోజుల క్రితం సీఆర్‌డీఏ ప్రత్యేకంగా పీడబ్ల్యూసీ ప్రైవేటు లిమిటెడ్ ఇండియా అనే సంస్థతో ఒక ప్రత్యేక కార్యాచరణను తయారు చేయించింది. ‘ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యూకే ఇన్వెస్టర్స్ ఇన్ అమరావతి- ట్వంటీ ఫస్ట్ సెంచరీ కెపిటల్’ పేరుతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రతిపాదించింది. ఏపీ రాజధానిలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతితో పనిలేకుండా వెసులుబాటు కల్పించేందుకు సీఆర్‌డీఏ రూపొందించిన కార్యాచరణ నిబంధనావళిలో ప్రతిపాదన చేసింది. అమరావతిలో 2020 నాటికి 163 ప్రాజెక్టుల ద్వారా రూ.62,972 కోట్లు, 2050 నాటికి 2,579 ప్రాజెక్టుల ద్వారా రూ.1.94 లక్షల కోట్ల మేరకు విదేశీ సంస్థల పెట్టుబడులు రాబట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే.. ఆ పేరుతో భూములను విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తూ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుండటం, ఆనక ఆ సేవలను వినియోగించుకునే క్రమంలో రాజధాని ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తుండటం చూస్తే.. ఇది నిజంగా ప్రజా రాజధానా? విదేశీ ప్రైవేటు రాజధానా? అనే అనుమానం కలగక మానదు.
16 విభాగాల్లో విదేశీ పెట్టుబడులు...
ఇప్పటికే ఇండో-యూకే ఆస్పత్రి ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సంస్థకు అవసరమైన భూముల కేటాయింపునకు రంగం సిద్ధం చేసింది. లండన్‌కు చెందిన కార్పొరేట్ సంస్థకు 1200 ఎకరాలు కేటాయించేలా ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రాజధానిలో 16 విభాగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించి పెట్టుబడులపై దాదాపు 9 నుంచి 18 శాతం లాభాల గ్యారంటీ ఇస్తూ ఒప్పందాలు చేసుకోనుంది. మెట్రో, ఔటర్ రింగ్‌రోడ్డు, కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధి, డర్ట్ యుటిలిటీస్ (రోడ్డు పక్కన ఫైబర్ కేబుల్స్ వేసేందుకు నిర్మాణాలు), వరద నివారణ చర్యలు, వేస్ట్ వాటర్ కలెక్షన్-ట్రీట్‌మెంట్ సిస్టమ్, మంచినీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా, ప్రభుత్వ అధికారులకు గృహ నిర్మాణం, ప్రజలకు 14 వేల ఇళ్లు, 1300 హెక్టార్లలో పారిశ్రామిక జోన్ అభివృద్ధి, సిటీ ఎక్స్‌ప్రెస్ హైవే అభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వైద్య రంగం, నాలెడ్జ్ సిటీలో యూనివర్సిటీలు తదితర విద్యాసంస్థల అభివృద్ధి, మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్స్ ఎడ్యుకేషన్ (ఎంఐసీఈ) వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులను నేరుగాను, పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్), బీవోటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) పద్ధతుల్లో ప్రభుత్వం అవకాశం ఇస్తుండటం గమనార్హం. అదే జరిగితే రోడ్డు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టే రాజధానిలో విదేశీ సంస్థలు పెట్టుబడులు రాబట్టుకునేందుకు, సేవల పన్ను వసూళ్లకు ప్రభుత్వమే నేరుగా అవకాశం కల్పించడంతో రాజధాని ప్రజలపై అదనపు భారం తప్పదు.