స్వశక్తిని గుర్తించాల్సిన తరుణమిది
ఏఆర్‌సీఐ ద్విదశాబ్ది ఉత్సవాల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఇంటర్నే షనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల సహా య మంత్రి వై.సుజనా చౌదరి పేర్కొన్నారు. ఏఆర్‌సీఐ అభివృద్ధి చేసిన టెక్నాలజీలు, పదార్థాల ద్వారా దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలగనుం దన్నారు.
ఏఆర్‌సీఐ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపం చీకరణ భావన కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ స్వీయ శక్తిసామర్థ్యాలను గుర్తించి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ రంగంతోపాటు ఇతర రంగాలకు అవసరమైన టెక్నాలజీలు, పదార్థాలను అభివృద్ధి చేసిన ఏఆర్‌సీఐ.. అందుబాటులోని అవకాశాలను అందిపుచ్చు కునేందుకు స్వయంగా మార్కెటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం మేలని సూచించారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా కేంద్రం సరికొత్త పదార్థ విధాన ముసాయిదాను సిద్ధం చేస్తోందన్నారు.
విదేశీ కంపెనీలతో పోటీ పడేటప్పుడు స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ఏఆర్‌సీఐ అభివృద్ధి చేసిన టెక్నాలజీలతో ఏర్పాటు చేసిన ఏఆర్‌సీఐటెక్స్ 2017ను సుజనా ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు. సూపర్ కెపాసిటర్‌తో నడిచే సైకిల్‌ని ఆసక్తిగా పరిశీలించి దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌరశక్తి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఆర్‌సీఐ డీసీ కరెంట్‌తో నడిచే బల్బులు, ఫ్యాన్లు ఇతర పరికరాలను అభివృద్ధి చేయడాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్‌సీఐ మాజీ డైరెక్టర్లు పద్మవిభూషణ్ పల్లె రామారావు, పద్మశ్రీ సౌందరరాజన్‌లు, పద్మభూషణ్ వి.ఎస్.రామ్మూర్తి, ప్రస్తుత డైరెక్టర్ పద్మనాభన్ తదితరులు పాల్గొన్నారు.