సాక్షి, హైదరాబాద్: చార్జింగ్ చేస్తుండగా పేలిన స్కూటర్ బ్యాటరీ.. దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో తరచూ సంభవిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో 8 మంది మృతికి కారణం ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్ సమయంలో చెలరేగిన పేలుడేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఇటీవల నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకుంది. ఆ కమిటీకి హైదరాబాద్ బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ, న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) డైరక్టర్ (అదనపు చార్జి) తాతా నరసింగరావు నేతృత్వం వహించారు. ఆ కమిటీ సిఫారసులను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానుంది.
వాటి ప్రకారం నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే వాహనాలను తయారు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం బ్యాటరీ వాహనాలంటేనే ప్రజలు బెదిరిపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తాతా నరసింగరావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటి వాడకం, కేంద్రానికి చేసిన పలు సిఫార్సులను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
బ్యాటరీల ఎంపికలో రాజీ వల్లే..
ప్రస్తుతం విద్యుత్ వాహనాల బ్యాటరీలను కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే విద్యుత్ కార్లు తయారు చేసే బడా కంపెనీలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా మన్నిక ఉన్న బ్యాటరీలనే వాడుతున్నా స్కూటర్ల విషయంలో ఇది సరిగ్గా జరగట్లేదు. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఉండేందుకు తయారీ ఖర్చును తగ్గించుకుంటున్నాయి.
అందుకు బ్యాటరీల విషయంలో చాలా కంపెనీలు రాజీ పడుతున్నాయి. నాసిరకం బ్యాటరీలు వాడటంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాటరీలకు కంట్రోలింగ్ యూనిట్ ఉంటుంది. బ్యాటరీ వేడెక్కినా, చార్జింగ్ ఎక్కువైనా పవర్ కట్ చేస్తుంది. వేడెక్కి పొగలొస్తే థర్మల్ సెన్సర్లు గుర్తించి అలారం మోగిస్తాయి. ఇవన్నీ ఉండాలంటే బ్యాటరీ ప్యాక్ ధర పెరుగుతుంది. తక్కువ ధర వాటిల్లో ఇవి సరిగ్గా ఉండవు. ఫలితంగా వినియోగంలో జరిగే పొరపాట్లతో అవి పేలిపోతున్నాయి.
వినియోగదారులకు అవగాహన లేక..
ఎలక్ట్రిక్ వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ 100 శాతం చార్జింగ్ చేయకూడదు. 80 శాతం చార్జింగ్ పూర్తవ్వగానే ఆపేయాలి. ఒకవేళ చార్జింగ్ 20 శాతంకన్నా తక్కువ ఉంటే వాహనాన్ని ఎట్టిపరిస్థిత్లోనూ నడపొద్దు. అలాగే స్కూటర్ల చార్జింగ్‌కు కంపెనీ కొన్ని ప్రమాణాలు చూపుతుంది. దాని ప్రకారం కేటాయించిన చార్జింగ్ కేబుల్, సాకెట్‌నే వినియోగించాలి.
వేగంగా విద్యుత్ చార్జ్ చేసేందుకు హైస్పీడ్ కేబుల్స్, ఎక్కువ శక్తి (యాంప్స్)ఉన్న సాకెట్లను వినియోగించొద్దు. ముఖ్యంగా రాత్రిళ్లు గంటల తరబడి చార్జింగ్ పెట్టి వదిలేయడం అత్యంత ప్రమాదకరం. మెలకువతో ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టి దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఏమాత్రం తేడా కనిపించినా ఆపేయాలి. అలాగే ఇతర వాహనాల మధ్య చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయొద్దు.
గతుకుల రోడ్లపై ప్రమాదాలకు చాన్సెక్కువ..
చాలా మంది స్కూటర్లను ఇరుకైన రోడ్లు, ఎగుడుదిగుడు రహదారుల్లోనూ నడుపుతుంటారు. ఇలా గతుకుల రోడ్లపై వాహనం వేగంగా వెళ్లినప్పుడు బ్యాటరీ లోపల కదిలిపోయి లూజ్ కాంటాక్ట్‌కు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల బ్యాటరీ వేడెక్కి పేలేందుకు అవకాశం కలుగుతుంది.
కేంద్రానికి కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని..
►బ్యాటరీ ప్యాక్‌లో టెంపరేచర్ సెన్సర్లు అమర్చాలి. బ్యాటరీ ప్యాక్ వేడి 60 డిగ్రీలు దాటితే వెంటనే సెన్సర్లు గుర్తించి కంట్రోలింగ్ యూనిట్‌ను అప్రమ త్తం చేసేలా ఏర్పాటు చేయాలి. అప్పుడు అలారం మోగి వాహనదారులు అప్రమత్తమవుతారు.
►చార్జింగ్ అవుతున్నప్పుడు బ్యాటరీ వేడెక్కుతుంటే పవర్ నిలిచిపోయేలా సెన్సర్ల ఏర్పాటు ఉండాలి.
►బ్యాటరీలోని ప్రతి వరుసకు విడిగా ఒక ఫ్యూజు ఉండాలి.
►సెల్స్ దేశంలోనే తయారు కావాలి. దీనివల్ల ఆ కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
►ఇవన్నీ విద్యుత్ వాహనాలకు కనీస ప్రమాణాలుగా ఉండాలి.
►విద్యుత్ వాహనాల విక్రయం, వినియోగం విషయంలో డీలర్లు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment