‘అగ్రి’ ఆస్తుల వేలానికి 58కి పైగా బిడ్లు దాఖలు | 'Agri' assets from the auction bid for 58 more | Sakshi
Sakshi News home page

‘అగ్రి’ ఆస్తుల వేలానికి 58కి పైగా బిడ్లు దాఖలు

Published Wed, Dec 28 2016 1:33 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

‘అగ్రి’ ఆస్తుల వేలానికి 58కి పైగా బిడ్లు దాఖలు - Sakshi

‘అగ్రి’ ఆస్తుల వేలానికి 58కి పైగా బిడ్లు దాఖలు

- కీసర ఆస్తులకు స్పందన నామమాత్రం
- సైదాపురం భూములకు అత్యధిక స్పందన
- నిర్ణయం నిమిత్తం విచారణ జనవరి 3కు వాయిదా
- మా కంపెనీలను టేకోవర్‌ చేసేందుకు ఓ విదేశీ కంపెనీ సిద్ధంగా ఉంది
- ముందస్తుగా రూ.1500 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది
- ధర్మాసనానికి అగ్రిగోల్డ్‌ తరఫు న్యాయవాది నివేదన

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి సంబంధించి మొత్తం 64 బిడ్లు హైకోర్టుకు అందాయి. వీటిలో ఆరు బిడ్లు గడువు తేదీ దాటడంతో వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మిగిలిన 58 బిడ్‌లలో 42 బిడ్లు పోస్టు ద్వారా, మిగిలిన బిడ్లు నేరుగా హైకోర్టు రిజిష్ట్రార్‌కు అందాయి. కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం, కీసర గ్రామంలో ఉన్న ఆస్తులకు నామమాత్రపు స్పందన రాగా, అత్యధికంగా సైదాపురం గ్రామంలోని భూములకు 16 బిడ్లు వచ్చాయి. అయితే కీసరలో వచ్చిన బిడ్లన్నీ కూడా కనీస రిజర్వు ధర కంటే ఎక్కువ ధరకే దాఖలు కావడం విశేషం. దాదాపు గంట పాటు ఈ బిడ్లు అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు, వీటి విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తదుపరి విచారణను ఈ జనవరి 3కు వాయిదా వేసింది.

ఆ రోజున కూడా బిడ్డర్లందరూ కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఆగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం నిమిత్తం ఇచ్చిన ప్రకటనకు స్పందనగా వచ్చిన బిడ్‌లను బిడ్డర్ల సమక్షంలోనే కోర్టు హాలులోనే తెరిచింది. దాదాపు గంటపాటు వాటిని పరిశీలించింది.

ప్రతీ ఆస్తి ధరను రికార్డ్‌ చేసుకుంది. అనంతరం గడువు దాటిపోయిన తరువాత వచ్చిన ఆరు బిడ్‌ల గురించి తెలియచేసింది. వాటిని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అని బిడ్డర్లను, సంబంధిత న్యాయవాదులను అడిగింది. గడువు ముగిసిన తరువాత వచ్చిన వాటిని తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని బిడ్డర్లందరూ చెప్పడంతో ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. దీంతో మిగిలిన బిడ్ల గురించి, ఒక్కో ఆస్తికి ఎన్ని బిడ్లు వచ్చాయో ధర్మాసనం వివరించింది

టేకోవర్‌కు ఓ విదేశీ కంపెనీ సిద్ధం
అంతకుముందు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ ఓ కొత్త విషయాన్ని ధర్మాసనం ముందుంచారు. ఓ విదేశీ కంపెనీ అగ్రిగోల్డ్‌ కంపెనీలన్నింటినీ టేకోవర్‌ చేసేందుకు సిద్ధంగా ఉందని, అందులో భాగంగా ముందస్తుగా రూ.1500 కోట్లు చెల్లించేందుకు సిర్వం సిద్ధం చేసుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జనవరి కల్లా ఈ రూ.1500 కోట్లు చెల్లించే అవకాశం ఉందని వివరించారు. అదే విధంగా నోట్ల రద్దు నేపథ్యంలో వేలం నిర్వహించడం చాలా తక్కువ మొత్తాలు వచ్చే అవకాశం ఉందని పలువురు బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు చెబుతున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... రూ.1500 కోట్లు వస్తాయన్న నమ్మకం ఏమిటంది. తాము వేలాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

ఈ సమయంలో తమిళనాడు అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సంఘం ఓ పిటిషన్‌ దాఖలు చేసిందని, కనీస రిజర్వు ధరలు చాలా తక్కువ ఉన్నాయని,  వేలం షరతులను కూడా మార్చాలని సంఘం తరఫు న్యాయవాది వి.పట్టాభి కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యాన్ని ఎవరో దాఖలు చేయించినట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement