నింగి.. నేల .. నీరు.. ప్రసాద్
స్ఫూర్తి
విధి అతనికి ఒక్క కాలే ఇచ్చి, ఎలా జీవిస్తావో చూపమని శాసించింది. ఆత్మస్థైర్యమే ఆలంబనగా విధికే సవాల్ విసిరి విజయపథంలో దూసుకుపోతున్నారు సాయిప్రసాద్. మూడు పదుల సాయి ప్రసాద్ విశ్వనాథన్ తనలాంటి వారికే కాదు సకలాంగులకూ జీ- మ్యాట్‌లో శిక్షణనిస్తూ విదేశీ కంపెనీలలో ఉద్యోగవకాశాల కల్పనకు దారులు వేస్తున్నారు. నేల, నింగి, నీరు, అగ్ని, వాయువు.. పంచభూతాలను అనుభూతిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. సంకల్పం ఉంటే... అదే సమస్తాన్నీ ముంగిట్లోకి తెస్తుందని నిరూపిస్తున్నారు. ఈ హైద్రాబాదీ సాయిప్రసాద్ విజయగాథ...
‘‘నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని లాల్‌గుడి. మా అమ్మ వాసంతి, నాన్న విశ్వనాథన్. వారి అండదండలు ఉండడం వల్లే బాగా చదువుకోగలిగాను. నా చిన్నప్పుడు అవిటితనాన్ని హేళన చేసిన ఘటనలు చాలానే ఎదుర్కొన్నాను. ‘అవిటివాడినని, పక్కన కూర్చోవద్దు అని’ నా క్లాస్‌మేట్స్‌కు వారి తల్లితండ్రులు చెప్పేవారు. కానీ, మా అమ్మ నాలో ఆత్మన్యూనత పెరగకుండా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేది. అందువల్లే అవేవీ నేను పట్టించుకోలేదు. బాధపడనూ లేదు. అంధురాలైనా ఎంతో సాధించిన హెలెన్ కెల్లర్ జీవితగాథ నాలో స్ఫూర్తి నింపింది. ఆ స్ఫూర్తితోనే టెన్త్, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించా. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సిబిఐటిలో ఇంజినీరింగ్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించా. ఆ తర్వాత టోఫెల్, జిఆర్‌ఇ వంటి అన్ని పరీక్షల్లోనూ టాప్ స్కోర్ సాధించా. అమెరికాలో ఎమ్‌ఎస్, ఎంబిఎ పూర్తి చేశా. ఐఎస్‌బిలోనూ సీటు వచ్చింది. ప్రస్తుతం విదేశీ కంపెనీలకు కన్సల్టెంట్‌గా ఉన్నా. స్కై డ్రైవ్ కోసం అంటార్కిటికాకు వెళ్లినప్పుడు అక్కడ స్థితిగతుల్ని చూశాక మన దేశంలో అర్హత గలవారికి జీమ్యాట్‌లో శిక్షణ నిస్తే బాగుంటుందని అనుకున్నా. ఉన్న అనుభవంతో కొందరి భవిష్యత్తునైనా అందంగా మార్చగలను అనుకున్నాను. ఆ ఆలోచనే ‘సహస్ర’కు నాంది అయింది.
‘సహస్రా’వధానం
కనీసం వెయ్యిమంది విద్యార్థులకైనా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ‘సహస్ర’ పేరుతో సంస్థను నెలకొల్పాను. మూడేళ్లుగా ‘ఐఎస్‌బి’తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రముఖ కంపెనీలలో ఉద్యోగావకాశాలు పొందాలనుకుని దారీతెన్నూ తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు దిశా నిర్దేశం చేస్తున్నాను. కిందటేడాది 170 మందికి శిక్షణనిస్తే వారిలో 150 మందికి పైగా విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ కంపెనీలకు 60 అప్లికేషన్లు పంపిస్తే అన్నీ ఎంపిక అయ్యాయి. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన దారి తెలియకపోతే అవకాశాల్ని అందిపుచ్చుకోలేనివారు ఎందరో. వారిలో పేద విద్యార్థులూ ఉన్నారు. ధనిక, పేద తేడా లేకుండా ఏ విద్యార్థి అయినా డిగ్రీతో పాటు ఎంబిఎ చేసి ఉంటే చాలు. వారికి విదేశాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయో, వాటిలో ప్రవేశానికేం చేయాలో అన్ని టెక్నిక్స్ నేర్పడానికే ఈ సంస్థను నెలకొల్పాను.
పంచభూతాలతో ప్రపంచ రికార్డ్
మొదటిసారి ఓ వికలాంగుడు 14 వేల అడుగుల ఎత్తులో స్కై డ్రైవ్ చేశాడని నా పేరును లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. పాపకర్మల వల్ల అవిటి జీవితం రాదని, నింగి, నేల, నీరు, గాలి, అగ్ని - ఇలా పంచభూతాలే మానవాంశకు అసలు కారణం అని భగవద్గీత ద్వారా తెలుసుకున్నా. పంచభూతాలను పూర్తి గా అనుభూతించాలనుకున్నా. అమెరికాలోని గ్రాండ్ కానియన్ వద్ద స్కై వాక్, అంటార్కిటికాలో స్కై డ్రైవ్ చేశాను. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లోని అతి ఎత్తై అగ్నిపర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నా. అలాగే, అర్జెంటీనాలోని ఓ గుహలో కొన్నాళ్ల పాటు ఒక్కడినే జీవించాలనుకుంటున్నా. వికలాంగుడైనా సాహసకృత్యాలు చేయడంలో వెనకంజ వేయాల్సిన అవసరం లేదని నాలాంటి వారికి నిరూపించడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నా. చదువు ఒక్కటే సమస్త ప్రపంచాన్నీ చేరువ చేస్తుంది. అందుకే వికలాంగుల తల్లితండ్రులకు నాదో విన్నపం. వికలాంగులైనా మీ బిడ్డల్ని బాగా చదివించండి. అప్పుడు భవిష్యత్తులో వారు మీకు భారం కారు, భరోసాగా నిలుస్తారు’’ అన్నారు సాయిప్రసాద్. - నిర్మల చిల్కమర్రి