భారతీయ కంపెనీల్లో పెరుగుతున్న నియామకాలు
58శాతం నుంచి 98శాతానికి పెరిగిన దేశీయ సంస్థల నియామకాలు
ఉద్యోగంతోపాటు సాధికారతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ
155 కంపెనీలపై ఎంఐసీఐ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగ ప్రపంచంలో పోటీ తట్టుకుని నిలబడాలన్నా, నిలిచి గెలవాలన్నా విభిన్న ప్రతిభావంతులకు ఒకింత కష్టం. దీంతో సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు సైతం అన్ని అవయవాలూ బాగున్నవారిని ఉద్యోగంలో చేర్చుకుంటే ఉత్పాదకత బాగుంటుందని భావిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశీయ కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా విభిన్న ప్రతిభావంతులకు కొలువుల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనేక విభాగాల్లోని పోస్టుల్లో వారి నియామకాన్ని వేగవంతం చేయడమే కాకుండా సాధికారత సాధించేలా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాయి.
దేశంలోని 155 భారతీయ కంపెనీలపై అవతార్ సంస్థ నిర్వహించిన ‘మోస్ట్ ఇన్‌క్లూజివ్ కంపెనీస్ ఇండెక్స్(ఎంఐసీఐ) సర్వే నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విభిన్న ప్రతిభావంతులకు అవకాశాలు ఇస్తున్న కంపెనీలు 2019లో 58శాతం ఉండగా తాజాగా 98శాతానికి పెరిగాయి. వీరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో మిడ్–క్యాప్ ఐటీ సేవల సంస్థ ఎంఫాసిస్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.
నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్(ఎన్‌సీపీఈడీపీ) అనే జాతీయ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగ నియామకాల్లో తన వంతు చొరవ చూపిస్తోంది. ఈ సంస్థ ‘ది మిస్సింగ్ మిలియన్’ ప్రాజెక్ట్‌లో దేశంలోని విభిన్న ప్రతిభావంతుల సంఖ్య, వారికి ఉన్న వైకల్య రకాలు, అవసరమైన నైపుణ్యం, అందించాల్సిన సహకారం వంటి వివరాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది.
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అన్ని రకాల వైకల్యాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా సర్వే నిర్వహిస్తే 10 కోట్లకుపైగా ఉంటారని అంచనా. వీరికి తగిన విద్యను అందించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఉద్యోగం..నైపుణ్యం
యువతతో పోటీపడి విభిన్న ప్రతిభావంతులు రాణించాలంటే వారు చదువు ద్వారా సాధించిన ఉద్యోగానికి తోడు సరైన నైపుణ్య శిక్షణ కూడా అవసరమని అనేక కంపెనీలు గుర్తించి ఆదిశగా దృష్టిపెట్టాయి. వారి విద్యకు తగిన ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఏ విధమైన శిక్షణ అవసరమో గుర్తించి అందిస్తున్నామని స్పార్కిల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్–కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ దీపా నాగరాజ్ తెలిపారు. సామాజిక బాధ్యతగా ఐటీసీ సంస్థ బెంగళూరులో విభిన్న ప్రతిభావంతులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఆ తర్వాత కోల్‌కతా, హౌరాల్లో నిర్వహించింది. ఇక్కడ సాంకేతిక నైపుణ్యంతోపాటు వ్యక్తిత్వ వికాసం, నిర్వహణ, నైపుణ్య శిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపు వంటి వాటిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పనిచేస్తున్న సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ సంస్థ గతేడాది గురుగ్రామ్‌లో గ్లోబల్ రిసోర్స్ సెంటర్(జీఆర్‌సీ)ని ప్రారంభించింది.
ఈ కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వారికి అవసరమైన సాయం, ఉద్యోగ అవకాశాలను అందించేలా తోడ్పడుతోంది. వినికిడిలోపం, దృష్టిలోపం, లోకోమోటర్ వైకల్యాలు ఉన్న వారికి తగిన శిక్షణ అందించి ఉపాధి చూపేలా దృష్టి సారించింది.
డ్రోన్ ఆపరేషన్‌లో శిక్షణ
గరుడ ఏరోస్పేస్ డ్రోన్ తయారీ కంపెనీ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈక్వాలిటీ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇటీవల చెన్నైలో పది రోజులపాటు వారికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించింది. అంధ సంఘాల నుంచి సేకరించిన సమాచారంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టిలోపం ఉన్న వారికి బ్రెయిలీ బీమా పాలసీని ప్రారంభించింది.
విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వారు నిలదొక్కుకునేలా నైపుణ్య శిక్షణ అందించడం సామాజిక బాధ్యతగా కంపెనీలు భావిస్తున్నాయి. – సౌందర్య రాజేష్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్
ఐటీసీ హోటల్స్‌తో పాటు అనుబంధ సంస్థల్లో 390 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇచ్చాం. వారికి తగిన శిక్షణ ఇస్తున్నాం, బ్రెయిలీ సంకేతాలు, సులభంగా వెళ్లి వచ్చేందుకు అనుకూలమైన ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
– అమిత్ ముఖర్జీ, ఐటీసీ హెచ్‌ఆర్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment