
జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల భర్తీలో చంద్రబాబు తీవ్ర జాప్యం
200కి పైగా మార్కెట్ యార్డు చైర్మన్ పోస్టులు ఖాళీ
వెయ్యికి పైగా దేవస్థానం ట్రస్టు బోర్డుల పదవులూ ఉన్నాయి
పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల నియామకంపైనా సాగతీతే
చంద్రబాబు తీరుపై కార్యకర్తలు అసహనం
ఎమ్మెల్యేలు పేర్లు ఇవ్వడంలేదని తప్పించుకుంటున్న చంద్రబాబు
తమను పేర్లు అడుగుతూనే, వారే పేర్లు రాసుకుంటున్నారంటున్న ఎమ్మెల్యేలు
అనేక చోట్ల ఎమ్మెల్యేలు పదవులకు బేరం పెట్టినట్లు ప్రచారం
సాక్షి, అమరావతి: కార్యకర్తలతో ఎన్నికల్లో పని చేయించుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులిచ్చే విషయంలో నానా తిప్పలు పెట్టడం సీఎం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ప్రధానమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా సాగుతూనే ఉంది. ఇక జిల్లా, నియోజకవర్గస్థాయి పోస్టులు, దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకంలో ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా మార్కెట్ యార్డు చైర్మన్లు, వెయ్యికి పైగా దేవస్థానం ట్రస్టు బోర్డులు, పలు పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల నియామకంపై చంద్రబాబు సాగతీత వైఖరే అవలంబిస్తున్నారు. ఈ పదవుల కోసం కార్యకర్తలు ఎంతగా ఎదురు చూస్తున్నా త్వరితగతిన భర్తీ చేయకపోగా.. వాటి భర్తీలో జాప్యాన్ని ఎమ్మెల్యేలపై నెట్టేయడం అందరిలో అసహనం కలిగిస్తోంది.
పదవుల కోసం విజ్ఞాపనలు ఇస్తున్న క్యాడర్
పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన తమకు ఈ పదవుల్లో అవకాశం ఇవ్వాలని మధ్యస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలు పట్టించుకోకపోవడంతో చాలామంది మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.
టీడీపీ కార్యాలయంలో వారంలో నాలుగైదు రోజులు నిర్వహించే విజ్ఞప్తుల స్వీకరణలో సగం మంది పదవుల కోసం వచ్చిన వారే ఉంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పదవులు అందరికీ ఇవ్వలేమని పరోక్షంగా చెబుతున్నారు. పైపెచ్చు ఏ పదవైనా రెండేళ్లేనని, ఆ తర్వాత వేరే వారికి ఇస్తామని చెబుతున్నారు.
వీటితోపాటు పదవుల భర్తీకి ఎమ్మెల్యేలు సహకరించడంలేదని, పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లను సిఫారసు చేయమని అడిగితే వారు పట్టించుకోవడంలేదని ఇటీవల ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క తమను పేర్లు అడుగుతూనే, మరోపక్క వారికి ఇష్టం వచ్చిన వారి పేర్లను వారే రాసేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈమాత్రం దానికి తమను పేర్లు అడగడం ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల బేరసారాలతో మరింత ఆలస్యం
అనేక చోట్ల ఎమ్మెల్యేలు పదవులను బేరం పెట్టినట్టు టీడీపీ శ్రేణుల్లోనే ప్రచారం జరుగుతోంది. తమ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు సైతం ముడుపులు అడుగుతుండడం, వారు ఇవ్వలేమని చెబుతుండడంతో ఎవరి పేర్లనూ అధిష్టానానికి సిఫారసు చేయడంలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీ చేయడంలో తన తప్పు లేదంటూ ఎమ్మెల్యేలపై నెపం నెట్టివేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బేరాలు పెట్టిన ఎమ్మెల్యేలను నియంత్రించి, కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సిన సీఎం.. ఎమ్మెల్యేలు సహకరించడం లేదంటూ తప్పించుకోవడాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం, ముడుపుల లెక్కలు తేలకపోవడం వల్లే ఈ పదవుల భర్తీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పదవుల పంపకంపైనా ఏకాభిప్రాయం కుదరడంలేదని చెబుతున్నారు. టీడీపీకి 80 శాతం పోస్టులు, జనసేన, బీజేపీకి కలిపి 20 శాతం కేటాయించాలని మొదట్లో ఒప్పందం జరిగింది. అయితే ఇది సరిగ్గా అమలు కావడంలేదని క్షేత్ర స్థాయిలో జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ కేడర్‌లోనూ పదవుల పంపకంపై ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment