లక్ష్మీనారాయణ, అక్కమ్మ మృతదేహాలు
పటాన్‌చెరు టౌన్: ముగ్గురు కొడుకులున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు భోజనంలో పురుగుల మందు కలుపుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండల పరిధిలోని నందిగామకు చెందిన పిచ్చకుంట్ల లక్ష్మీనారాయణ (65), అక్కమ్మ (61) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు కావడంతో విడివిడిగా ఉంటున్నారు.
ఈ క్రమంలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అనాథలుగా బతకాల్సి వస్తోందని మనస్తాపం చెందిన ఆ వృద్ధ దంపతులు శనివారం అర్ధరాత్రి కూరలో పురుగుల మందు కలుపుకొని తిన్నారు. ఇద్దరికీ వాంతులు కావడంతో పక్కింట్లో ఉంటున్న చిన్న కోడలు రేణా గమనించి 108కి సమాచారం అందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం ఉదయం మృతిచెందారు. తమను చూసే వారు ఎవరూ లేరని తమ తల్లిదండ్రులు తరచూ బాధపడుతుండే వారని, చనిపోవాలని ఉందని అనేవారని, ఇలా చేస్తారని అనుకోలేదని పెద్ద కొడుకు పెంటయ్య పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment