మరిన్ని బ్రాండ్లను కొంటాం
ఇన్‌సెక్టిసైడ్స్ ఇండియా ఎండీ రాజేశ్ అగర్వాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెరుగైన వర్షపాతంతో వ్యవసాయం బాగుంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో సుమారు 20 శాతం వృద్ధి, రెట్టింపు లాభార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్‌సెక్టిసైడ్స్ ఇండియా (ఐఐఎల్) ఎండీ రాజేశ్ అగర్వాల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 988 కోట్లుగాను, లాభం దాదాపు రూ. 40 కోట్లుగాను నమోదైనట్లుతెలియజేశారు. మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా మరిన్ని బ్రాండ్లను కొనుగోలు చేయటంపై దృష్టి పెట్టామని, ఈ ఏడాదే మరో కొత్త బ్రాండ్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.
అమెరికా, జపాన్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ఏడాది దాదాపు పది కొత్త ఉత్పత్తులను దేశీ మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు అగర్వాల్ చెప్పారు. వరి పంటకు సంబంధించిన ‘గ్రీన్ లేబుల్’ కలుపు నివారిణిని మంగళవారం ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ఈ కలుపు నివారిణిని జపాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీన్ని మేం తొలిసారిగా దేశీయంగా తయారు చేసి విక్రయిస్తున్నాం. దీనివల్ల ధర గణనీయంగా తగ్గుతుంది’’ అని అగర్వాల్ వివరించారు. ఉత్పత్తి ధరలు ఈ ఏడాది 15-20 శాతం మేర వచ్చే ఏడాది మరింతగాను తగ్గుతాయని తెలియజేశారు.
తెలుగురాష్ట్రాల విషయానికొస్తే.. 2015-16లో తెలంగాణ మార్కెట్లో రూ. 93 కోట్లు రాగా ఈసారి సుమారు 20% పైగా వృద్ధితో రూ. 115 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించుకున్నట్లు కంపెనీ జీఎం వీకే గర్గ్ తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ ఆదాయం గతేడాది రూ. 70 కోట్ల మేర ఉండగా.. ఈసారి రూ. 100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.