భారత్ వృద్ధి 7.9 శాతం: గోల్డ్ మన్ శాక్స్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.9% నమోదవుతుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- గోల్డ్‌మన్ శాక్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. తగిన వర్షపాతం, వేతనాల పెంపు, కీలక సంస్కరణలు, ఎఫ్‌డీఐలు వంటి అంశాలు తమ అంచనాకు కారణంగా తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 7.9% వృద్ధి నమోదయినప్పటికీ, జూన్ త్రైమాసికంలో ఇది 7.8%కి తగ్గే అవకాశం ఉందని వివరించింది. జీఎస్‌టీ బిల్లు ఆమోదంసహా గడచిన రెండు నెలలుగా దేశంలో ఆర్థిక సంస్కరణల వేగం పుంజుకుంటోందని పేర్కొంది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు అవకాశాలు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన ప్రభావం, చైనా వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలనూ దేశీ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలుగా పేర్కొంది.