దేవేంద్ర, పిల్లలతో నాగవేణి
వర్షాభావం.. గిట్టుబాటు ధరల లేమి.. పేరుకుపోయిన అప్పులు ముప్పేట దాడితో రైతుకుటుంబాన్ని పూర్తిగా కుంగదీశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లోపించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బడాయి దేవేంద్ర (28) పురుగుల మందు తాగి 2018 ఆగస్టు 29న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఒకటిన్నర ఎకరా భూమి ఉంది. అదనంగా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. వర్షాల్లేక పత్తి పైరు గిడసబారిపోయింది. సేద్యం కోసం ఏటా అప్పులు చేస్తూ వచ్చాడు. పైవాడు కరుణిస్తాడని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.
పంటలకోసం దాదాపు రూ.5 లక్షలు అప్పులు చేశాడు. పంట చేతికి రాదన్న దిగులుతో రైల్వే గేటు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న దేవేంద్రను కర్నూలు తీసుకెళ్లి వైద్యచికిత్సలు చేయించగా రెండు రోజుల తర్వాత కన్నుమూశాడు. భార్య నాగవేణి, తల్లి లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు నారాయణ, నరసింహులు ఉన్నారు. నారాయణ 2వ తరగతి చదువుతుండగా, నరసింహులు అంగన్‌వాడీకి వెళ్తున్నాడు. దేవేంద్ర భార్య, తల్లి కాయకష్టం చేసి బతుకు సాగిస్తున్నారు. కష్టంలో కొంత అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కడు దయనీయ స్థితిలో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు.
– కె. పరశురాం, సాక్షి, మంత్రాలయం, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment