former suicide
-
రైతు ఆత్మహత్యపై స్పందించిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం వేలూరులో నర్సింహులు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే అతని మృతికి ప్రభుత్వ అధికారుల వేధింపులే కారణమని ప్రతిపక్షాలు, మృతుని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. రైతు మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ఊరిలో ప్రభుత్వ భూమి ఉంటే అందులో నుంచి నర్సింహులు కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని అన్నారు. వాళ్ల అమ్మాయి చదువుకు కూడా ప్రభుత్వం తరఫున సాకారం అందిస్తామని వెల్లడించారు. (నర్సింహులు మృతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి) ఈ ఘటనకు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నర్సింహులు ఆత్మహత్యకు సంబంధించి విమర్శలు చేసేవారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలోనే అతని భూమి లాక్కున్నారని అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే అది వారిపై పడిందన్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు రాజకీయాలు చేయడం చాలా బాధకరమని పేర్కొన్నారు. (వారిపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం) కాగా, నర్సింహులుకు ఉన్న 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారనే ఆవేదనతో బుధవారం పురుగుల మందు తాగాడని అతని బంధువులు ఆరోపించారు. ఆ భూమిని రికార్డుల్లోకి కూడా ఎక్కించకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. సర్పంచ్, రెవెన్యూ అధికారుల ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తహసీల్ ఎదుట రైతు ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఉసురు తీసింది. భూ రికార్డుల ప్రక్షాళనలో దొర్లిన పొరపాటును సరిచేయకుండా ఏడాది కాలంగా తిప్పించుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి (60) తండ్రి మల్లారెడ్డికి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లోని ఊబకుంట కింద సర్వేనంబర్ 694/íసీలో 1.22 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఆ భూమిని రాజిరెడ్డి తన పేరిట విరాసత్ చేయించుకున్నాడు. ప్రభుత్వం జారీ చేసిన పాస్‌బుక్‌లో రాజిరెడ్డి తండ్రి మల్లారెడ్డి అని రావాల్సి ఉండగా.. నారాయణరెడ్డిగా నమోదు చేశారు. ఈ పొరపాటును సరి చేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో గురుమూర్తి కాలయాపన చేశాడు. హైదరాబాద్ తిరుమలగిరి తహసీల్దార్‌గా పనిచేస్తున్న తమ దాయాదులు మందల రాజిరెడ్డి కూతురు మాధవి, మందల రమేశ్‌రెడ్డి, మందల రాంరెడ్డిల ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు పేరు సరి చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుసుకున్నాడు. వారు రెవెన్యూ శాఖలో ఉన్నత స్థానంలో ఉండటం, ఆర్థికంగా కూడా బలంగా ఉండటంతో భూమి తనకు కాకుండా పోతోందని రాజిరెడ్డి ఆందోళన చెందాడు. ఈ క్రమంలో పట్టా పాస్‌పుస్తకంలో తన తండ్రి పేరు మారకుండా చేస్తున్నారంటూ దాయాదుల పేర్లు, ఒత్తిడికి తలొగ్గి తనకు అన్యాయం చేయాలని చూస్తున్న రెవెన్యూ అధికారుల పేర్లతో సూసైడ్ నోట్ రాసి, పురుగు మందు డబ్బాతో ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారులు వేణుగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజిరెడ్డి మృతదేహం (ఇన్సెట్లో) కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత రాజిరెడ్డి ఆత్మహత్యతో కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధ్యులైన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మృతుడి కుమారులు, స్థానికులు డిమాండ్ చేశారు. అలాగే.. అధికారులపై ఒత్తిడి పెంచిన తమ దాయాదులపై చర్యలు తీసుకోవాలని, అంతవరకు మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఉంచుతామని ఆందోళనకు దిగారు. పోలీసులు మాట్లాడి వారిని శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణం పోయాక పేరు మార్చారు పట్టా పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరిచేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా తిరిగినా స్పందించని అధికారులు.. అతడి ఆత్మహత్యతో ఒక్కసారిగా కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శంకర్‌కుమార్ హుటాహుటిన కాల్వశ్రీరాంపూర్‌కు చేరుకున్నారు. విచారణ జరిపి రాజిరెడ్డి పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరి చేయాలని తహసీల్దార్ వేణుగోపాల్‌ను ఆదేశించారు. రైతు బతికుండగా పట్టించుకోని అధికారులు.. ప్రాణం పోయాక పేరు మార్చడం గమనార్హం. మృతుడి కుమారులు మందల వేణుగోపాల్‌రెడ్డి, అనిల్రెడ్డిలకు ఒక్కొక్కరికీ 31 గుంటల భూమిని పట్టా చేశారు. ఈ విషయమై ఆర్డీవో శంకర్‌కుమార్ మాట్లాడుతూ బాధితుల అభ్యర్థన మేరకు గ్రామస్తుల సమక్షంలో మృతుడి కుమారుల పేరున పట్టామార్పిడి చేశామని తెలిపారు. విచారణ జరుపుతున్న ఆర్డీవో శంకర్‌కుమార్ బాధ్యులపై చర్యలు: ఆర్డీవో రాజిరెడ్డి మృతికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో శంకర్‌కుమార్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అంశాలపై విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు. పై అధికారులకు నివేదిస్తా: తహసీల్దార్ వీఆర్వో, వీఆర్ఏలు ఇబ్బందులకు గురి చేసినట్లు సూసైడ్ నోట్లో మృతుడు రాసిన విషయమై ఉన్నతాధికారులకు వివరించి తదుపరి చర్యలకు సిఫారసు చేయనున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. రైతులు తమ ఫిర్యాదులను నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. -
రామ్మోహన్ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం
సాక్షి, కడప : అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు పంతగాని రామ్మోహన్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు భార్య నాగరత్నమ్మకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ బుధవారం రైతు రామ్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం యావత్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందచేశారు. కాగా చిట్వేలు మండలం నాగవరం హరిజనవాడకు చెందిన రామ్మోహన్ సోమవారం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి మూడు ఎకరాల భూమి ఉంది. బొప్పాయి, అరటి పంటలను సాగు చేసుకుంటూ ఉండేవాడు. ఏటా ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తినడం, గిట్టుబాటు ధరలేక నష్టపోయాడు. ఆర్థికంగా దెబ్బతినడంతో మానసికంగా దిగులుపడుతూ ఉండేవాడు. అంతేకాకుండా నీటి సౌకర్యం తక్కువగా ఉండేది. బోరులో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో చిట్వేలిలోని సహకార బ్యాకులో లక్ష రుణం, నాగవరం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయల రుణం, గ్రామంలో ఓ రైతు వద్ద మరో లక్ష తీసుకుని మూడు బోర్లు వేశాడు. అయితే ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేక పంట పూర్తిగా ఎండిపోవడంతో ఆవేదన చెంది మొన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్మోహన్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కేరళ సీఎంకు రాహుల్ లేఖ
తిరువనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోగా.. వయనాడ్‌లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ నియోజకవర్గ సమస్యలపై స్పందించారు. ఈ నెల 25న వయనాడ్‌కు చెందిన ఓ రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన రాహుల్ గాంధీ.. పూర్తి స్థాయి విచారణ జరిపి సదరు రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. రైతు ఆత్మహత్య విషయం తనకు ఎంతో బాధ కల్గించిందని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యను పట్టించుకోకుండా ఇలానే వదిలేస్తే.. త్వరలోనే మరింత మంది రైతులు ఇదే మార్గాన్ని ఎన్నుకుంటారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు కేరళ ప్రభుత్వం కృషి చేయాలని అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. -
బీజేపీకి ఓటు వెయ్యవద్దని సూసైడ్ నోట్
డెహ్రాడూన్: అప్పుల బాధ తట్టుకోలేక ఉత్తరాఖండ్‌లో ఓరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘‘ బీజేపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో రైతులను మోసం చేసింది. ఎవ్వరూ కూడా బీజేపీకి ఓటు వెయ్యవద్దు. ఓటేస్తే మరోసారి మోసం చేస్తారు’ అని సూసైడ్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ఈశ్వర్ చంద్ శర్మ (65)గా గుర్తించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో గత కొంతకాలంగా అప్పులపాలైయ్యారని స్థానికులు తెలిపారు. -
వితంతు పింఛన్ కూడా ఇవ్వని ప్రభుత్వం
ఈ ఫోటోలో ఇద్దరు పిల్లలతో దిగాలుగా ఉన్న మహిళ పేరు పద్మావతి. వారిది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామం. పద్మావతి భర్త, చీనీ(బత్తాయి) రైతు తిరుపాల్‌రెడ్డి అప్పుల భాదతో విష గుళికలు మింగి ఆత్మహత్యచేసుకోవడంతో ఈ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చీనీ తోటను కాపాడుకోవడానికి నాలుగు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఏడు ఎకరాల్లో పప్పుశనగ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రూ.17 లక్షలకు అప్పు పెరిగిపోయింది. అప్పు తీర్చలేనన్న బాధతో 2018 అక్టోబర్ 6న తిరుపాల్‌రెడ్డి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ రైతు కుటుంబం అనాథగా మారింది. రెవిన్యూ అధికారులు విచారణ చేసి రూ.17 లక్షలు అప్పు ఉన్నట్లు నిర్థారించారు. అయినా తిరుపాల్‌రెడ్డి కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందలేదు. ప్రభుత్వం ద్వారా చిల్లి గవ్వ రాకపోవడంతో పాటు పద్మావతికి వితంతు పించన్ కూడా మంజూరు చేయలేదు. ‘ఆయన మమ్మల్ని వదిలి వెళ్లాడు. ఇద్దరు పిల్లలను ఎలా పోషించాలో అర్థం కావడం లేద’ని పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీసం వితంతు పింఛన్ కూడా ఇవ్వకపోతే ఎలా అని ఆమె కన్నీటి పర్యంతమౌతోంది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. – కాకనూరు హరినాథ్‌రెడ్డి, సాక్షి, పుట్లూరు, అనంతపురం జిల్లా -
అడియాశలైన ఆశలు..
వర్షాభావం.. గిట్టుబాటు ధరల లేమి.. పేరుకుపోయిన అప్పులు ముప్పేట దాడితో రైతుకుటుంబాన్ని పూర్తిగా కుంగదీశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లోపించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బడాయి దేవేంద్ర (28) పురుగుల మందు తాగి 2018 ఆగస్టు 29న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఒకటిన్నర ఎకరా భూమి ఉంది. అదనంగా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. వర్షాల్లేక పత్తి పైరు గిడసబారిపోయింది. సేద్యం కోసం ఏటా అప్పులు చేస్తూ వచ్చాడు. పైవాడు కరుణిస్తాడని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. పంటలకోసం దాదాపు రూ.5 లక్షలు అప్పులు చేశాడు. పంట చేతికి రాదన్న దిగులుతో రైల్వే గేటు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న దేవేంద్రను కర్నూలు తీసుకెళ్లి వైద్యచికిత్సలు చేయించగా రెండు రోజుల తర్వాత కన్నుమూశాడు. భార్య నాగవేణి, తల్లి లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు నారాయణ, నరసింహులు ఉన్నారు. నారాయణ 2వ తరగతి చదువుతుండగా, నరసింహులు అంగన్వాడీకి వెళ్తున్నాడు. దేవేంద్ర భార్య, తల్లి కాయకష్టం చేసి బతుకు సాగిస్తున్నారు. కష్టంలో కొంత అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కడు దయనీయ స్థితిలో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. – కె. పరశురాం, సాక్షి, మంత్రాలయం, కర్నూలు జిల్లా -
ఉల్లి రైతు కుటుంబాన్ని ఆదుకునేదెప్పుడు?
మూడేళ్లుగా పంటలు సక్రమంగా పండక, గిట్టు బాటు ధర లేక, పొలానికి పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో బోయ తలారి గిడ్డయ్య ఒకరు. అతనిది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ మండల పరిధిలోని దైవందిన్నె గ్రామం. గిడ్డయ్య(42) అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో రెండేళ్లు వరుసగా మిరప, ఉల్లి పంటల సాగు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పులపాయ్యాడు. దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పు తేలింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావటంతో కృంగిపోయాడు. ఆ నేపథ్యంలో 2018 ఆగస్టు 11న ఉల్లి పంట కోసి పొలంలో కుప్ప వేశాడు. ఉల్లికి ధర మరీ తక్కువగా ఉండటంతో కోసిన పంటను పొలంలోనే వదిలేసి నిర్వేదంతో గిడ్డయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య రామలక్ష్మి, కుమారులు చంద్రశేఖర్ నాయుడు(10 వ తరగతి), మల్లికార్జున(9వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణించటంతో చదువు మానేసి పొట్ట కూటి కోసం పనులకు వెళ్తున్నారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తుంటే, చిన్నకుమారుడు మల్లికార్జున తల్లికి తోడుగా పనికి వెళ్తున్నాడు. గిడ్డయ్య ఆత్మహత్య చేసుకొని ఆరు నెలలైనప్పటికీ అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. అప్పులిచ్చిన వారు డబ్బు కట్టమని గిడ్డయ్య భార్య, పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. పొలం అమ్మి అయినా అప్పులు తీర్చుదామనుకొని బేరం పెడితే.. కొనటానికి ఎవరూ ముందుకు రాలేదని రామలక్ష్మి వాపోయింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తమ కుటుంబం వీధిన పడినా ప్రభుత్వం కనికరించడం లేదని కళ్ల నీరు కుక్కుకుంటున్నదామె. ఎప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతోనే బతుకుతున్నామని తెలిపిందామె. – నాగరాజు సాక్షి, ఎమ్మిగనూరు రూరల్, కర్నూలు జిల్లా -
పొలం, స్థలం అమ్మినా తీరని అప్పులు
కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మంగళి పెద్ద ఎల్లనాగన్న అనే రైతు అప్పుల బాధతో 2014 ఆగస్టు 25న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య సావిత్రితోపాటు ముగ్గురు కుమార్తెలు (గీతాంజలి, రేణుక, శ్రీలక్ష్మి), కుమారుడు వీరేష్ ఉన్నారు. గీతాంజలి కస్తూర్బా గాంధీ వసతి గృహంలో ఉండి 6వ తరగతి చదువుతున్నది. రేణుక 5వ తరగతి, శ్రీలక్ష్మి 1వ తరగతి, వీరేష్ 4వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చిన్నారుల పోషణ భారమైనా ఐదేళ్లుగా పంటిబిగువున బాధను దిగమింగి సంసార నౌకను లాక్కొస్తున్నది సావిత్రి. కుటుంబపెద్ద మరణించినా బీమా అందలేదు. ఎన్.ఎఫ్.బి.ఎస్. పథకం కింద రావాల్సిన రూ. 20 వేలు కూడా అందలేదు. బాధితకుటుంబానికి ప్రభుత్వం ఇల్లు కూడా మంజూరు కాలేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. వితంతు పింఛన్ మాత్రమే మంజూరైంది. రెండున్నరెకరాల పొలం, ఇంటిస్థలం ఉండేది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో 2.5 ఎకరాల పొలంతోపాటు ఇంటి స్థలాన్ని కూడా అమ్మి అప్పులు తీర్చింది సావిత్రి. అయినా, ఇంకా రూ. 3 లక్షల అప్పు మిగిలింది. గ్రామంలో ఇల్లు కూడా లేకపోవడంతో బంధువుల ఇంటిలో తలదాచుకుంటూ పిల్లలను కడుపులో పెట్టుకొని జీవనం సాగిస్తున్నది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ నలుగురు పిల్లలను పోషించుకుంటున్నది. కరువు వల్ల వ్యవసాయ పనులు కూడా చేతినిండా లేవు. పని దొరకని రోజు మంచినీళ్లతో తల్లీ బిడ్డలు కడుపు నింపుకోవాల్సిన దుర్భర పరిస్థితులున్నాయి. ప్రభుత్వం, దాతలు సహకరించి ఆర్థికంగా ఆదుకోవాలని సావిత్రి కోరుతున్నది. – నీలం సత్యనారాయణ, సాక్షి, కల్లూరు, కర్నూలు జిల్లా -
ఏడాది గడచినా ఏ సాయమూ లేదు
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతు కురువ నారాయణ పంటలు పండక అప్పులపాలయ్యాడు. చంద్రబాబు హామీ ప్రకారం పూర్తిగా రుణ మాఫీ జరగలేదు. పేరుకుపోయిన అప్పుల భయంతో సొంత పొలంలోనే 2018 జనవరి 2న పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్ రూరల్ మండల పరిధిలోని తాడూరు. నారాయణ ఆత్మహత్య చేసుకొని ఏడాది గడచినా ప్రభుత్వం నుంచి అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందలేదు.నారాయణకు భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు మల్లికార్జున, కుమార్తె సుజాతమ్మ ఉన్నారు. అయితే, నారాయణ భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యం వల్ల చనిపోగా, కూతురు కుటుంబ కలహాల వల్ల అల్లుడి చేతిలో హతమైంది. కుమారుడు మల్లికార్జునకు పెళ్లయింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. నారాయణకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో నాలుగెకరాలు గుత్తకు తీసుకొని కంది, వేరుశనగ పంటలను వేసేవారు. పంటనే నమ్ముకున్న ఆయన తీవ్రంగా నష్టపోయారు. కొన్ని సీజన్లుగా పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆంధ్రా బ్యాంకులో రూ. లక్ష పంట రుణంతో పాటు బయటి వ్యక్తుల దగ్గర మరో రూ.4.80 లక్షలు అప్పులు మిగిలాయి. తొలి విడతలో రూ. 36 వేల వరకు మాత్రమే రుణ మాఫీ జరిగింది. పంటలు సరిగ్గా పండక, ప్రభుత్వం పట్టించుకోక, అప్పులు తీర్చే మార్గం లేక నారాయణ తీవ్ర మనస్తాపం చెందారు. పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి విచారణ చేసిన ఆర్డీఓ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని కుటుంబానికి హామీ ఇచ్చారు. అయినా, నేటి వరకు నయాపైసా సహాయం అందలేదని, దిక్కుతోచడం లేదని నారాయణ కుమారుడు మల్లికార్జున ఆవేదన చెందుతున్నారు. రామాంజినేయులు, సాక్షి, డోన్ రూరల్, కర్నూలు జిల్లా. -
కొండయ్య కుటుంబం బాధ తీరేదెన్నడు?
అప్పుల బాధతో కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం గోవిందిన్నె గ్రామానికి చెందిన వెంకట కొండయ్య(60) ఆత్మహత్యకు పాల్పడి ఆరు నెలలైనా ఇంతవరకు అధికారులెవరూ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే వెంకట కొండయ్య 18 ఎకరాల సొంత పొలంతో మరో 10 ఎకరాలు కౌలుకు సాగు చేసేవారు. ఇతనికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, తండ్రి చిన్న కొండయ్య(88) ఉన్నారు. ముగ్గురు కుమార్తెలతో పాటు పెద్ద కుమారుడు రమేష్‌కు వివాహం చేశారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్ల కోసం కొన్ని అప్పులు చేశారు. దీనికి తోడు నాలుగేళ్లుగా వరుసగా అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, వడ్డీలు పేరుకుపోయాయి. నాలుగెకరాల వ్యవసాయ భూమిలో గత సంవత్సరం వరి పంట వేయగా భూగర్భ జలాలు అడుగంటి బోరు ఎండిపోవడంతో మళ్లీ అప్పులు చేసి బోరు వేయించారు. కొద్దిగా నీరు పడినప్పటికీ వరి పంటకు చాలలేదు. పూర్తిగా ఎండిపోయింది. ఈ సంవత్సరం మళ్లీ కరువొచ్చింది. సొంత పొలంలో వేసిన జొన్న, ఆముదం, ప్రొద్దుతిరుగుడు పంటలు కూడా ఎండిపోయాయి. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం ప్రై వేట్ వ్యక్తుల వద్ద సుమారు రూ. 5 లక్షలు అప్పు చేశారు. అలాగే పలుకూరు ఆంధ్రా బ్యాంక్‌లో రూ. లక్ష, బనగానపల్లె ఎస్బిఐలో రూ. 40 వేలు పంట రుణం తీసుకున్నారు. కానీ నాలుగేండ్లుగా ఎదురు చూస్తే ప్రభుత్వం నుంచి రుణ మాఫీ జరిగింది కేవలం రూ. 60 వేలు మాత్రమే. అది అప్పుపై వడ్డీకి కూడా సరిపోలేదు. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందని వెంకటకొండయ్య పలువురి వద్ద ఆవేదన వ్యక్తపరిచే వారు. ఆ పరిస్థితుల్లో వెంకట కొండయ్య పరిస్థితి దుర్భరంగా తయారైంది. అప్పులు తీర్చే మార్గం కానరాక 2018 ఆగస్టు 5న ఇంటికి సమీపంలోని పశువుల పాకలో తెల్లవారుజామున ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగి చనిపోయాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన అతని కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. -
దస్తగిరి కుటుంబానికి దిక్కెవరు?
పంటల సాగుకు చేసిన అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం దుర్భరమైన జీవితం గడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి భార్య, నలుగురు పిల్లలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ గ్రామానికి చెందిన దస్తగిరి(40) అప్పుల బాధతో పొలంలో పురుగుల మందు తాగి 2016 సెప్టెంబర్ 12న మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను, ఒక కుమారిడిని పోషించుకునేందుకు అతని భార్య దానమ్మ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దస్తగిరికి రెండెకరాల పొలముంది. దీనికి తోడు మరో ఐదెకరాలను ఎకరా రూ. 30 వేలకు కౌలుకు తీసుకుని 2014, 2015, 2016 సంవత్సరాలలో వ్యవసాయం చేశాడు. ఏడెకరాలలో పత్తి పంట సాగు చేశారు. పంటల సాగుకు ఏడాదికి రూ. లక్ష అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. వచ్చిన అరకొర దిగుబడులతో రైతు దస్తగిరి కొంతమేర అప్పులు తీర్చుతూ వచ్చాడు. అయితే పంటల సాగు, ఇంటి నిర్మాణంకు, ఇద్దరు కూతుళ్ల వివాహానికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 3 లక్షలు అప్పు చేశాడు. అదేవిధంగా సి.బెళగల్‌ని బంగారు అంగళ్ళ దగ్గర రెండవ కూతురు లుదియాకు చెందిన రెండు తులాల బంగారాన్ని తాకట్టుపెట్టి రూ. 46 వేలు అప్పు తీసుకున్నాడు. తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, గ్రామస్తుల దగ్గర పంటలకు, కుటుంబ పోషణకు దస్తగిరి రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పలు ఎలా చెల్లించాలోనని మధనపడేవాడని భార్య దానమ్మ, కుమార్తెలు తెలిపారు. దానమ్మ కూలి పనులు చేసుకుంటూ నలుగురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమారుడు దీవనరాజు కోడుమూరులోని ఎస్సీ వసతి గృహంలో వదిలారు). అయితే రైతు చనిపోయి రెండేళ్లు పూర్తయినా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం తమను కరుణించి పరిహారం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు దానమ్మ కోరుతోంది. – బి.గోవిందు, సాక్షి రిపోర్టర్, సి.బెళగల్, కర్నూలు జిల్లా -
సీఎం కార్యక్రమంలో రైతు ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బహిరంగ సభలో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఈ సంఘటన గిర్ సోమ్‌నాథ్ జిల్లా ప్రాన్స్లీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మశ్రీ భాయ్ దోడియా అనే రైతు తన పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారని, దీన్ని తొలగించడంలో స్థానిక అధికారులు విఫలం చెందడంతో కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గిర్ సోమ్‌నాథ్ ఎస్పీ రాహుల్ త్రిపాఠి వెల్లడించారు. ‘ఆ రైతు పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆక్రమణను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు. దోడియాను వెంటనే వెరవల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
కేరళ వరదలు : రైతు ఆత్మహత్య
ఎర్నాకుళం : ఎడతెరపి లేకుండా కేరళలో కురిసిన భారీ వర్షాలు వందలాది మందిని పొట్టన పెట్టుకోగా.. లక్షలాది మందిని నిరాశ్రయులు చేసింది. ఇప్పుడే కాస్త వర్షాలు తగ్గుమఖం పట్టి, వరదలు తగ్గుతుండటంతో, ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు కళకళలాడిన ఇళ్లు.. ప్రస్తుతం వరద బురదకు కొట్టుకుని ఉండటాన్ని చూసుకుని కన్నీంటిపర్యంతమవుతున్నారు. సర్వం కోల్పోయామని కన్నీరు మున్నీరవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర మనో వేదనకు గురై, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. గత మూడు రోజుల్లో, ముగ్గుర వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎర్నాకులం జిల్లా వరపుజ్హలో ఓ 68 ఏళ్ల రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని కే రాఖీగా గుర్తించారు. పునరావాస కేంద్రం నుంచి మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన రాఖీ.. మంగళవారం వరద నీటితో దెబ్బతిన్న తన ఇంటిని చూసుకుని కుమిలిపోయాడు. ఇంటిలో పేరుకుపోయిన బురదను బయటికి నెట్టేయడానికి గంటల కొద్దీ శ్రమించాడు. కుటుంబ సభ్యులను తిరిగి పునరావాస కేంద్రానికి వెళ్లమని.. ఇంటిని శుభ్రం చేసి తర్వాతి రోజు ఉదయాన్నే అక్కడికి వచ్చి వారిని తీసుకెళ్తానని చెప్పాడు. వారిని తిరిగి క్యాంపుకు పంపించాడు. కానీ తర్వాత రోజు ఉదయం అల్పాహార సమయానికి రాఖీ అక్కడికి వెళ్లలేదు. వెంటనే కుటుంబ సభ్యులే ఇంటి వద్దకు వెళ్లారు. కానీ అక్కడ రాఖీ, ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనపడే సరికి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. వరదలతో అన్నీ కోల్పోయామని రాఖీ బాగా బాధపడేవాడని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగ, కొజికోడ్ జిల్లాలో ఓ 19 విద్యార్థి కూడా వరదల్లో తన 12వ తరగతి సర్టిఫికేట్లు కొట్టుకుని పోయాయని తీవ్ర మనో వేదనకు గురై, ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిసూర్‌లో మరో వ్యక్తి కూడా ఇలానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరదల్లో బాగా నష్టపోయిన వారికి కౌన్సిలింగ్ ఇప్పించడానికి సైకాలజిస్ట్‌లను కూడా ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు పంపిస్తోంది. ఈ వరదలతో కేరళలో ఎక్కువగా బలవన్మరణాలు సంభవించవచ్చని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసరావు(40) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి తన పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతంగా 2 ఎకరాలు, కౌలుకు రెండెకరాలు సాగుచేస్తున్నాడు. సాగునీరు సరిగా అందక, పంటల దిగుబడి లేక రూ.15 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించక తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సత్తెనపల్లి సీఐ నూర్జాన్ నిజిత్ బేగ్ సంఘటనస్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. -
దుగ్గొండిలో యువరైతు ఆత్మహత్య
సాగు కోసం చేసిన అప్పులు ఎక్కువకావడంతో వాటిని తీర్చేమార్గంలేక ఓ యువరైతు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని శ్రీనివాసరెడ్డి(40) పదవ తరగతి వరకు చదివిన అనంతరం తండ్రి స్వామిరెడ్డి చనిపోవడంతో వ్యవసాయాన్ని చేపట్టాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగ్గా పండక నష్టాలతోనే సాగు పనులు చేస్తున్నాడు. గతేడాది కరువు ప్రభావం వల్ల పంటలు సరిగ్గా పండలేదు. ఈ ఏడు రెండు ఎకరాల్లో పత్తి, మరో రెండు ఎకరాల్లో మొక్కజొన్న వేశాడు. తరచూ వర్షం ముసురులా కురవడంతో భూమిలో పదును క్కువై రెండు పంటలు జాలువారి చనిపోయే దశకు చేరుకున్నాయి. ఇప్పటికి ఆయనకు రూ.6లక్షల అప్పులు ఉన్నారుు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంటకు పురుగు మందు పిచికారీ చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అప్పు లెక్కలేసుకున్నాడు. రాత్రి పొద్దుపోయాక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కొంత సేపటి తర్వాత మెలుకువ వచ్చిన భార్య తలుపుతీసి చూడగా వాకిట్లో పడి ఉన్నాడు. దీంతో బోరున విలపింంచింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుని భార్య ఉమ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
కౌలు రైతు బలవన్మరణం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారం గ్రామానికి చెందిన సంతోషం బక్కమల్లు (48) అనే కౌలు రైతు నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. సాగు కోసం రూ.4 లక్షలు అప్పులు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చే దారిలేక మనస్తాపానికి గురైన బక్కమల్లు సోమవారం తెల్లవారుజామున పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
రైతు ఉసురు తీసిన రుణ భారం
రుణబారం మరో రైతు ఉసురు తీసింది. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం ఇస్సానగర్ గ్రామానికి చెందిన పొట్టెల్లి చంద్రయ్య(65) పొలంలో చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. చంద్రయ్యకు రెండెకరాల భూమి ఉంది. గత ఏడాది నీటి కోసం రెండు బోర్లు వెయ్యగా.. రెండూ ఫెయిల్ అయ్యాయి. ఈఏడాది మరో రెండు బోర్లు వేశాడు. వాటిల్లో ఒక దాన్లో మాత్రమే కొద్దిగా నీరు వస్తోంది. బోర్ల కోసం ప్రైవేటుగా, బ్యాంకుల్లో తెచ్చిన అప్పు మొత్తం మూడు లక్షలు తీర్చే మార్గం కానరాక తీవ్ర నిరాశకు గుయ్యాడు. ఉదయం పొలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురుకు ఇటీవలే వివాహం చేశాడు. -
రైతు బలవన్మరణం
తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటనష్టం తద్వారా అప్పుల పాలైన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన రైతు నున్నా కృష్ణారావు (40) ఆత్మహత్య వార్త ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. సోంత గ్రామం నుంచి మంగళవారం ఉదయం సత్తుపలి వెళ్తున్నాని చెప్పి బయలుదేరిన కృష్ణారావు.. బుధవారం లంకపల్లి శివారులోని వైజంక్షన్ సమీపంలోని జామాయిల్‌తోటలో బుధవారం విగతజీవిగా కన్పించాడు. మృతుడు.. తనకున్న ఎకరం పొలంతో పాటు మరో పదిఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. నాలుగు ఎకరాలలో వరి, మూడు ఎకరాలలో మిర్చి, మరో నాలుగు ఎకరాలలో చెరకు పంట సాగు చేశాడు. దిగుబడి సరిగా రాక ఈ ఏడాది పంటల్లో సుమారు రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లింది. వారం పదిరోజుల నుంచి అప్పులు తీర్చటంపై మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అదీగాక పెళ్లికి ఎదిగిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితిపై మదన పడినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం వెళ్లిన కృష్ణారావు సత్తుపల్లిలోని కూతురు వద్దకు వెళ్లకపోవటంతో అనుమానం వచ్చిన బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతుకులాట చేపట్టారు. వైజంక్షన్ సమీపంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించటంతో కృష్ణారావు మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువరైతు ఆత్మహత్య
అకాల వర్షంతో పంటను దెబ్బతీయడంతో మనస్తాపానికి లోనైన ఓ యువరైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఆరె రవి అనే యువరైతు తనకున్న రెండెకరాల వరిపంట సాగు చేస్తున్నాడు. రెండు రోజులుగు కురుస్తున్న ఆకాల వర్షాలతో వరిపంట పూర్తిగా నెలకొరిగింది. గత ఏడాది గల్ఫ్ కు వలస వెళ్లడంకోసం చేసిన లక్ష రూపాయలతోపాటు పంట ఖర్చులకు కొత్త అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
పంట ఎండిందని ప్రాణం తీసుకున్నాడు
కష్టంచేసి పండించిన పంట కళ్లెదుటే ఎండిపోతుండటం తట్టుకోలేక ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేశవ రాజయ్య(65) తన రెండెకరాల పొలంలో వరి, మొక్కజొన్న సాగుచేశాడు. పొలంలోని బోరులో నీరు తగ్గడంతో మరో బోరు వేశాడు. కాని అది ఫెయిలైంది. ఇంతకు ముందు రెండు బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. నీళ్లకోసం ఇప్పటి వరకు రూ.2 లక్షలు అప్పుచేశాడు. పంటలు చేతికొస్తే అప్పు కొంతైన తీరుతుందని ఆశపడ్డ రాజయ్యకు నిరాశే ఎదురైంది. కళ్ల ముందే పంట ఎండిపోతుండటంతో మానసిక వేదనకు గురై.. గురువారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్మ
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు...గ్రామానికి చెందిన సుభాష్(40)అనే రైతుకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఖరీఫ్‌లో మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. పంట ఎండిపోవడంతో నష్టం ఎదురైంది. ప్రస్తుతం కూరగాయల సాగు చేస్తున్నాడు. పంట సాగు కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు అప్పు చేసినట్టు సమాచారం. దిగుబడి లేకపోవడంతో అంత అప్పు తీర్చలేనేమోనన్న మనోవేదనతో శుభకార్యక్రమానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన సుభాష్ ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. (కొత్తూరు) -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
వరంగల్ : మండలంలోని అందనాలపాడు కొత్తతండాలో అప్పుల బాధతో ధరావతు రాజేష్(25) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.... రాజేష్ తన తండ్రితో కలిసి 7 ఎకరాల్లో పత్తి, మిరప సాగు చేశారు. పంట సరిగా పండకపోయే సరికి సుమారు రూ.5 లక్షల అప్పు అయింది. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజేష్ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే బంధువులు రాజేష్‌ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్ మరణించాడు. రాజేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. (డొర్నకల్) -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
బచ్చన్నపేట : పంటల కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన రైతు నీల నర్సయ్య(50) తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండు బోర్లు వట్టిపోయాయి. వరి పంట ఎండిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. అప్పులు రూ.4 ల క్షల వరకు పెరిగిపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందుతాగాడు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్), న్యూస్‌లైన్ : అప్పుల బాధ తాళ్లలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్తీక్ ఇంటర్నేషనల్ లాడ్జీలోని 304 గదిలో ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కందమూరుకు చెందిన డి.అంజయ్య (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల కిందట అంజయ్య తన కుమార్తె వివాహం కోసం రూ. నాలుగు లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు చెల్లిస్తూ ఉన్నాడు. రెండేళ్ల కిందట కుమారుడు వివాహం కోసం మరో రూ.2 లక్షలు బంధువుల వద్ద అప్పు తీసుకున్నాడు. ఇటీవల కుమారుడికి ఆరోగ్యం చెడిపోవడంతో వైద్యం కోసం మళ్లీ రూ.2 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పుల భారం పెరిగి..రుణదాతల నుంచి ఒత్తిడిలు ఎక్కువయ్యాయి. అప్పులు బాధలు తాళలేక సతమతమవుతున్నాడు. దిక్కు తోచక ఈ నెల 15వ తేదీ పనిమీద బయటకు వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి నెల్లూరుకు వచ్చాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్తీక్ ఇంటర్నేషనల్ లాడ్జీలో 304వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నాడు. 18వ తేదీ సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి తాను అత్యవసర పనిపై ఊరు వెళుతున్నానని, ఫోన్ చేయడం కుదరదని చెప్పాడు. రెండు రోజులుగా గదిలోనే ఉన్నాడు. 19వ తేదీ సాయంత్రం లాడ్జీ సిబ్బంది గది తలుపులు తట్టగా తెరవలేదు. లోపల నిద్రపోతున్నాడేమో అని భావించి వారు మిన్నకుండి పోయారు. గురువారం మధ్యాహ్నం అంజయ్య గది నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంను గమనించిన లాడ్జీ సిబ్బంది తలుపులు తట్టగా తెరవలేదు. దీంతో నాల్గో నగర సీఐ జి. రామారావు దృష్టికి తీసుకెళ్లారు. సీఐ తన సిబ్బందితో కలిసి లాడ్జీ వద్దకు చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా అంజయ్య ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకుని ఉన్నాడు. అతని జేబుల్లో ఉన్న అడ్రస్ కాగితాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. లాడ్జీ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రతాప్‌కుమార్ తెలిపారు.