రైతు మందల రాజిరెడ్డి (ఫైల్)
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఉసురు తీసింది. భూ రికార్డుల ప్రక్షాళనలో దొర్లిన పొరపాటును సరిచేయకుండా ఏడాది కాలంగా తిప్పించుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి (60) తండ్రి మల్లారెడ్డికి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లోని ఊబకుంట కింద సర్వేనంబర్ 694/íసీలో 1.22 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఆ భూమిని రాజిరెడ్డి తన పేరిట విరాసత్ చేయించుకున్నాడు. ప్రభుత్వం జారీ చేసిన పాస్‌బుక్‌లో రాజిరెడ్డి తండ్రి మల్లారెడ్డి అని రావాల్సి ఉండగా.. నారాయణరెడ్డిగా నమోదు చేశారు. ఈ పొరపాటును సరి చేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
వీఆర్వో గురుమూర్తి కాలయాపన చేశాడు. హైదరాబాద్ తిరుమలగిరి తహసీల్దార్‌గా పనిచేస్తున్న తమ దాయాదులు మందల రాజిరెడ్డి కూతురు మాధవి, మందల రమేశ్‌రెడ్డి, మందల రాంరెడ్డిల ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు పేరు సరి చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుసుకున్నాడు. వారు రెవెన్యూ శాఖలో ఉన్నత స్థానంలో ఉండటం, ఆర్థికంగా కూడా బలంగా ఉండటంతో భూమి తనకు కాకుండా పోతోందని రాజిరెడ్డి ఆందోళన చెందాడు. ఈ క్రమంలో పట్టా పాస్‌పుస్తకంలో తన తండ్రి పేరు మారకుండా చేస్తున్నారంటూ దాయాదుల పేర్లు, ఒత్తిడికి తలొగ్గి తనకు అన్యాయం చేయాలని చూస్తున్న రెవెన్యూ అధికారుల పేర్లతో సూసైడ్ నోట్ రాసి, పురుగు మందు డబ్బాతో ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారులు వేణుగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజిరెడ్డి మృతదేహం (ఇన్‌సెట్‌లో)
కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత
రాజిరెడ్డి ఆత్మహత్యతో కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధ్యులైన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మృతుడి కుమారులు, స్థానికులు డిమాండ్ చేశారు. అలాగే.. అధికారులపై ఒత్తిడి పెంచిన తమ దాయాదులపై చర్యలు తీసుకోవాలని, అంతవరకు మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఉంచుతామని ఆందోళనకు దిగారు. పోలీసులు మాట్లాడి వారిని శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రాణం పోయాక పేరు మార్చారు
పట్టా పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరిచేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా తిరిగినా స్పందించని అధికారులు.. అతడి ఆత్మహత్యతో ఒక్కసారిగా కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శంకర్‌కుమార్ హుటాహుటిన కాల్వశ్రీరాంపూర్‌కు చేరుకున్నారు. విచారణ జరిపి రాజిరెడ్డి పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరి చేయాలని తహసీల్దార్ వేణుగోపాల్‌ను ఆదేశించారు. రైతు బతికుండగా పట్టించుకోని అధికారులు.. ప్రాణం పోయాక పేరు మార్చడం గమనార్హం. మృతుడి కుమారులు మందల వేణుగోపాల్‌రెడ్డి, అనిల్‌రెడ్డిలకు ఒక్కొక్కరికీ 31 గుంటల భూమిని పట్టా చేశారు. ఈ విషయమై ఆర్డీవో శంకర్‌కుమార్ మాట్లాడుతూ బాధితుల అభ్యర్థన మేరకు గ్రామస్తుల సమక్షంలో మృతుడి కుమారుల పేరున పట్టామార్పిడి చేశామని తెలిపారు.
విచారణ జరుపుతున్న ఆర్డీవో శంకర్‌కుమార్
బాధ్యులపై చర్యలు: ఆర్డీవో
రాజిరెడ్డి మృతికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో శంకర్‌కుమార్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అంశాలపై విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు.
పై అధికారులకు నివేదిస్తా: తహసీల్దార్
వీఆర్వో, వీఆర్‌ఏలు ఇబ్బందులకు గురి చేసినట్లు సూసైడ్ నోట్‌లో మృతుడు రాసిన విషయమై ఉన్నతాధికారులకు వివరించి తదుపరి చర్యలకు సిఫారసు చేయనున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. రైతులు తమ ఫిర్యాదులను నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment