Revenue Office
-
రెవెన్యూలో ఫోర్జరీ కలకలం
వికారాబాద్: ఓ ఫోర్జరీ కేసు రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బూర్గుపల్లి వద్ద సర్వే నంబర్ 18లో హైదరాబాద్‌కు చెందిన ఇంతియాజ్‌కు 7.12 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని ఆయన ఖలీల్ అనే వ్యక్తికి విక్రయించినట్లు కొందరు రియల్టర్లు, బ్రోకర్లు ఆర్డర్ కాపీ తయారు చేయించారు. గతంలో వికారాబాద్‌లో పనిచేసి వెళ్లిన తహసీల్దార్ అప్పలనాయుడు ఈ ఆర్డర్ ఇచ్చినట్లు ఫోర్జరీ కాపీ సృష్టించారు. తహసీల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించే మజ్జు అనే ఉద్యోగికి వారు ఈ కాపీ అందజేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్ రవీందర్ కళ్లుగప్పి ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో.. ఆధార్ సీడింగ్‌లో తన పేరు మారడాన్ని గమనించిన బాధితుడు ఇంతియాజ్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో విచారణ చేపట్టాలని కలెక్టర్, తహసీల్దార్ రవీందర్‌ను ఆదేశించటంతో ఆయన పాత ఫైళ్లను పరిశీలించారు. అందులో గత తహసీల్దార్ ఆర్డర్ జారీ చేసినట్లు లేకపోవడంతో ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. తన కళ్లుగప్పి కంప్యూటర్ ఆపరేటర్లు భూమిని వేరే వ్యక్తుల పేర్లమీదకు మార్చారని తహశీల్దార్ రవీందర్ నిర్ధారణకు వచ్చారు. నెలరోజుల క్రితం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన వికారాబాద్ పోలీసులు ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లు మజ్జు, పరశురాం, రెవెన్యూ కార్యాలయ ఉద్యోగి రవి, బ్రోకర్ రాజు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. గత శనివారం మజ్జు, రవి, పరశురాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ భూమి విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని, అక్రమ రిజి్రస్టేషన్ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. గతంలో కూడా వికారాబాద్‌లో తహసీల్దార్‌కు తెలియకుండా ఆర్డర్ కాపీ అప్లోడ్ చేసిన విషయంపై మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయంపై ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్‌కు తెలియకుండా పట్టామారి్పడి జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసుల విచారణలో కూడా కంప్యూటర్ ఆపరేటర్లు తప్పు చేసినట్లుగా తేలటంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించామని తెలిపారు. కాగా, బ్రోకర్ రాజు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకుంటే దీనివెనక ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
తహశీల్దార్ ఆఫీస్: నా తాళిబొట్టును లంచంగా తీసుకోండి.. కానీ
సాక్షి, రుద్రంగి (వేములవాడ): తన పేరిట భూమి పట్టా చేయాలంటూ రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోక పోవడంతో ఆ మహిళ వినూత్న నిరసన చేపట్టింది. మెడలో ఉండాల్సిన తాళిబొట్టును తీసి తహసీల్దార్ ఆఫీసు గుమ్మానికి తగిలించి అక్కడే బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస మంగ మామ పొలాస రాజలింగం పేరిట సర్వేనంబర్ 130/14లో రెండెకరాల వ్యవసాయ పొలం ఉండేది. మంగ భర్త పదేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి, తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ బతుకుతోంది. మామ నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిని ఆమెకు తెలియకుండానే ఆమె పెద్దమామ తన మనుమని పేరిట పట్టా మార్పిడి చేయించుకున్నారు. ఆ భూమి పట్టా మార్చాలంటూ రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. బుధవారం మరోసారి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చిన మంగ.. తన దగ్గర పైసలు లేవని, తాళిబొట్టును తీసుకొని పట్టా మార్చాలంటూ రోదిస్తూ కోరింది. తనకు న్యాయం చేసే వరకు వెళ్లేది లేదని బైఠాయించింది. పోలీ సులు వచ్చి సర్ది చెప్పారు. అక్రమంగా పట్టా చేసిన అధికారులపై, పట్టా చేసుకొ ని భూమిని చదును చేసుకుంటున్న వ్యక్తులపై ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. కావాలనే పట్టా మార్చిండ్రు మా మామ పొలాస రాజలింగం చనిపోయే వరకు ఆ భూమి అతని పేరు మీదనే ఉంది. మామ 2013లో చనిపోయిండు. 2014–15 వరకు మామ పేరు మీదనే ఉంది. అప్పుడున్న తహసీల్దార్, వీఆర్వో లంచం తీసుకొని మా పెద్దమామ మనుమని పేరు మీద పట్టా చేసిండ్రు. విచారణ కూడా చేయకుండానే పట్టా మార్చిండ్రు. నేను అన్ని పత్రాలు ఇచ్చినా పట్టా చేయడానికి ఇబ్బందులు పెడుతుండ్రు. – పొలాస మంగ, బాధితురాలు పట్టా మేం చేయలేదు మంగ భూమి పట్టాను మేము మార్చలేదు. మా కంటే ముందు ఉన్న తహసీల్దార్ పట్టా మార్పు చేశారని పొలాస మంగ ఆరోపిస్తోంది. విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్, రుద్రంగి -
తహసీల్ ఎదుట రైతు ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఉసురు తీసింది. భూ రికార్డుల ప్రక్షాళనలో దొర్లిన పొరపాటును సరిచేయకుండా ఏడాది కాలంగా తిప్పించుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి (60) తండ్రి మల్లారెడ్డికి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లోని ఊబకుంట కింద సర్వేనంబర్ 694/íసీలో 1.22 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఆ భూమిని రాజిరెడ్డి తన పేరిట విరాసత్ చేయించుకున్నాడు. ప్రభుత్వం జారీ చేసిన పాస్‌బుక్‌లో రాజిరెడ్డి తండ్రి మల్లారెడ్డి అని రావాల్సి ఉండగా.. నారాయణరెడ్డిగా నమోదు చేశారు. ఈ పొరపాటును సరి చేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో గురుమూర్తి కాలయాపన చేశాడు. హైదరాబాద్ తిరుమలగిరి తహసీల్దార్‌గా పనిచేస్తున్న తమ దాయాదులు మందల రాజిరెడ్డి కూతురు మాధవి, మందల రమేశ్‌రెడ్డి, మందల రాంరెడ్డిల ఒత్తిడితోనే రెవెన్యూ అధికారులు పేరు సరి చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుసుకున్నాడు. వారు రెవెన్యూ శాఖలో ఉన్నత స్థానంలో ఉండటం, ఆర్థికంగా కూడా బలంగా ఉండటంతో భూమి తనకు కాకుండా పోతోందని రాజిరెడ్డి ఆందోళన చెందాడు. ఈ క్రమంలో పట్టా పాస్‌పుస్తకంలో తన తండ్రి పేరు మారకుండా చేస్తున్నారంటూ దాయాదుల పేర్లు, ఒత్తిడికి తలొగ్గి తనకు అన్యాయం చేయాలని చూస్తున్న రెవెన్యూ అధికారుల పేర్లతో సూసైడ్ నోట్ రాసి, పురుగు మందు డబ్బాతో ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారులు వేణుగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజిరెడ్డి మృతదేహం (ఇన్సెట్లో) కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత రాజిరెడ్డి ఆత్మహత్యతో కాల్వశ్రీరాంపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధ్యులైన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మృతుడి కుమారులు, స్థానికులు డిమాండ్ చేశారు. అలాగే.. అధికారులపై ఒత్తిడి పెంచిన తమ దాయాదులపై చర్యలు తీసుకోవాలని, అంతవరకు మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఉంచుతామని ఆందోళనకు దిగారు. పోలీసులు మాట్లాడి వారిని శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణం పోయాక పేరు మార్చారు పట్టా పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరిచేయాలని రాజిరెడ్డి ఏడాది కాలంగా తిరిగినా స్పందించని అధికారులు.. అతడి ఆత్మహత్యతో ఒక్కసారిగా కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శంకర్‌కుమార్ హుటాహుటిన కాల్వశ్రీరాంపూర్‌కు చేరుకున్నారు. విచారణ జరిపి రాజిరెడ్డి పాస్‌పుస్తకంలో దొర్లిన పొరపాటును సరి చేయాలని తహసీల్దార్ వేణుగోపాల్‌ను ఆదేశించారు. రైతు బతికుండగా పట్టించుకోని అధికారులు.. ప్రాణం పోయాక పేరు మార్చడం గమనార్హం. మృతుడి కుమారులు మందల వేణుగోపాల్‌రెడ్డి, అనిల్రెడ్డిలకు ఒక్కొక్కరికీ 31 గుంటల భూమిని పట్టా చేశారు. ఈ విషయమై ఆర్డీవో శంకర్‌కుమార్ మాట్లాడుతూ బాధితుల అభ్యర్థన మేరకు గ్రామస్తుల సమక్షంలో మృతుడి కుమారుల పేరున పట్టామార్పిడి చేశామని తెలిపారు. విచారణ జరుపుతున్న ఆర్డీవో శంకర్‌కుమార్ బాధ్యులపై చర్యలు: ఆర్డీవో రాజిరెడ్డి మృతికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో శంకర్‌కుమార్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అంశాలపై విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు. పై అధికారులకు నివేదిస్తా: తహసీల్దార్ వీఆర్వో, వీఆర్ఏలు ఇబ్బందులకు గురి చేసినట్లు సూసైడ్ నోట్లో మృతుడు రాసిన విషయమై ఉన్నతాధికారులకు వివరించి తదుపరి చర్యలకు సిఫారసు చేయనున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. రైతులు తమ ఫిర్యాదులను నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. -
పురుగుల మందు డబ్బాతో నిరసన
సాక్షి, ఖమ్మం: తాహసీల్దార్ కార్యాలయాల్లో నిరసనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు ఇవ్వటంలో జాప్యం చేయటం, భూ వివాదాల్లో చేతివాటం ప్రదర్శించటంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలాంటి వ్యతిరేకత రైతుల్లో పెరగటంతో కొంతమంది రైతులు పెట్రోల్ బాటిల్‌తో రెవెన్యూ ఆఫీసులకు వచ్చి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. తమ పాసుపుస్తకాల కోసం మరికొంత మంది రైతులు అధికారుల కాళ్లవేళ్ల పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జిల్లాలోని కొణిజర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతులు పురుగుల మందు డబ్బాలను చేతిలో పట్టుకొని నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండ.. రైతులు తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేశారు. పాసుపుస్తకాల కోసం రైతులు ఆందోళన చెపట్టినట్టు తెలుస్తోంది. -
లంచం ఇస్తేనే ఎల్ఐసీకి ఫైల్
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం అమలులో కొందరు ఉద్యోగుల తీరు కారణంగా అప్రతిష్ట వస్తోంది. ఇప్పటికే రెవెన్యూ శాఖపై పుట్టెడు కోపంతో ఉన్న రైతులు.. ప్రస్తుతం వ్యవసాయ శాఖపై కూడా అదే భావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు బాసటగా నిలుస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలకు రైతుల్లో మంచి పేరు ఉన్నా... అధికారుల తీరు దీనిని పలుచన చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఏఈఓ ఒకరు రైతులకు చెల్లించాల్సిన రైతు బంధు పథకం డబ్బును సొంత ఖాతాలో జమ చేసుకుని సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే. ఇక రైతు బీమా విషయంలో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి.. తాను అడిగినంత డబ్బు ఇస్తేనే పరిహారం ఫైల్‌ను ఎల్ఐసీకి సమర్పిస్తానంటూ నాన్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై విచారణ జరపగా నిజమేనని తేలినా... చర్యలు తీసుకోకుండా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. పరిహారం కోసం లంచం అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వమే బీమా ప్రీమియంను ఎల్ఐసీకి చెల్లించింది. ఏదేని జరగరాని సంఘటన జరిగి రైతు మృతి చెందితే ఆయన కుటుంబానికి బీమా సంస్థ ద్వారా రూ.5లక్షల పరిహారం అందుతుంది. అయితే, రైతు కుటుంబ సభ్యులు లంచం ఇవ్వనిదే ఉద్యోగులు జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఫైల్ పంపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) ఒకరు ఇదే తరహాలో పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయగా అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే, సదరు ఉద్యోగిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. ఆ ఉద్యోగి మాకొద్దు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ విస్తరణ అధికారి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని రైతులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అనేక ఆరోపణలు ఉండడంతో అధికారులు చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో వేరో చేటకు బదిలీ చేయాలని స్థానికంగా ఉండే ఓ అధికారి.. జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. మా దృష్టికి వచ్చింది... వ్యవసాయ విస్తరణాధికారి ఒకరు అవినీతికి పాల్పడుతున్నాడనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాము. ఆయన వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు తదుపరి చర్యల కోసం జిల్లా అధికారికి నివేదిక సమర్పించాం. – దామోదర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు -
క్యాష్ కొట్టు.. ఫిట్నెస్ పట్టు
పారదర్శకపాలన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పరితపిస్తున్నారు. అవినీతిలేని సమాజాన్ని సృష్టించాలని తపన పడుతున్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజలకు నీతివంతమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ ఇంకా రవాణాశాఖ కార్యాలయంలో మాత్రం ఆ జాఢ్యం వీడటం లేదు. ఆఫీసులోకి రాకున్నా... ఏజెంట్లు బయటినుంచే దందా నడిపిస్తున్నారు. నేరుగా వాహన యజమానులు వెళ్తే జరగని పనులు దళారుల ద్వారా చిటికెలో అయిపోతున్నాయన్న ప్రచారం సాగుతోంది. సాక్షి, విజయనగరం : జిల్లాకేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఇంకా దళారీలే చక్రం తిప్పుతున్నారు. ప్రతి పనికీ వారిని ఆశ్రయించి... ఎంతోకొంత సొమ్ము ముట్టజెబితే చిటికెలో పనులు జరిగిపోతున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ నుంచి లైసెన్సులు వంటివి జారీ చేయడానికి చేతులు తడిపితే చాలు పనులు జరిగిపోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు, గూడ్సు వాహనాలకు ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఫిట్ నెస్ సర్టిఫికెట్(సామర్థ్య ధ్రువీకరణ పత్రం) జారీ చేస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి పూర్తి స్థాయి కండిషన్‌తో తీసుకుని వెళ్లాలి. సీట్లు, టైర్లు, పెయింటింగ్, ఇంజిన్ అన్నీ కండిషన్లో ఉండాలి. రవాణా శాఖ కార్యాలయంలో వెహికల్ ఇన్స్పెక్టర్ ఆ వాహనానికి ఫొటో తీసి పూర్తి స్థాయి కండిషన్ ఉన్నట్టు గుర్తిస్తే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలి. అయితే ఈ సర్టిఫికెట్ కావాల్సిన వాహనయజమానులు నేరుగా వెళితే అధికారులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ ద్వారా వెళితే వాహనం కండిషన్ కాస్త అటు, ఇటుగా ఉన్నా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. వాహనం కండిషన్‌గా ఉన్నప్పటికీ నేరుగా వెళ్తే ఏదో ఒక వంక పెట్టి తిప్పి పంపుతున్నట్టు ఆరోపిస్తున్నారు. వాట్సాప్ ద్వారానే ఫిట్నెస్ సర్టిఫికెట్ విజయనగరంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కార్యాలయం ఉంది. సాలూరు, పార్వతీపురంలో వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. కొంతమంది అధికారులు వాహనం కార్యాలయానికి తీసుకుని రాకపోయినా వాట్సాప్ ద్వారా గానీ, దళారీ ద్వారా గానీ పత్రాలు పంపిస్తే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు దళారులను లోపలికి రానివ్వడం లేదని చెబుతున్నా... వారు కార్యాలయం బయటినుంచే దందా కొనసాగిస్తున్నారు. ప్రతీ ఎజెంట్‌కు ఒక కోడ్ పెట్టుకుని వాహనయజమాని దరఖాస్తుపై ఆ కోడ్ వేసి అధికారుల దగ్గరకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్ల కోడ్ చూసి వాహనయజమానులకు ఎల్ఎల్ఆర్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ , డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరు, ఇద్దరు ఏజెంట్లు మాత్రం కార్యాలయంలో తిరుగుతూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. వసూళ్లలోనూ రెట్టింపే... రవాణా శాఖ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి వాటికోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజుల కంటే ఏజెంట్లు రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఎందు కంత ఇవ్వాలని వాహనయజమాని అడిగితే అధికారులకు ఇచ్చుకోవాలి కదా అంటూ దర్జాగా చెబుతున్నారు. ఆటోకు, ట్రాక్టర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.760లే. కాని ఏజెంట్లు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్కూలు బస్సులు, లారీలు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.960లు ఏజెంట్లు రూ.4 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. టూవీలర్ ఎల్‌ఎల్‌ఆర్‌కు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.260లు అయితే ఏజెంట్లు రూ.600ల నుంచి రూ.800లు వసూలు చేస్తున్నారు. ఫోర్ వీలర్ ఎల్ఎల్ఆర్ ఫీజు రూ. 310లు కాగా వసూలు చేస్తున్నది రూ.500 నుంచి రూ.900లు. టూ వీలర్ లైసెన్సు ఫీజు రూ. 960లు కాగా రూ. 1600 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఫోర్ వీలర్ లైసెన్సుకు రూ.1260లు ఫీజు కాగా రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు వసూలు చేస్తున్నారు.హెవీ లైసెన్సుకు ఫీజు రూ.1260లు కాగా రూ. 4 వేలు వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మూడు రవాణా శాఖ కార్యాలయాలకు ఎల్ఎల్ఆర్ కోసం 150 మంది, డ్రైవింగ్ లైసెన్సుల కోసం 100 మంది వరకు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం 100 మంది, ఇతర పనులు నిమత్తం 100 నుంచి 120 మంది వరకు వస్తారు. దళారులను కట్టడి చేశాం ఏజెంట్లను కార్యాలయంలోకి రానివ్వకుండా కట్టడి చేశాం. వాహన యజమానుల కోసం హెల్ప్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఏ పనికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నాం. కార్యాలయానికి వాహనం రాకుండా వాట్సాప్ ద్వారా పేపర్లు తెప్పించి ఎఫ్‌సీలు జారీ చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కారేపల్లి: సింగరేణి తహసీల్దార్ కార్యాలయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ అర్వీ కర్ణన్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలతో సమావేశమయ్యారు. మండలంలో రెవెన్యూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, సాదాబైనామాల పరిస్థితి సమీక్షించారు. సమావేశం అనంతరం కార్యాలయం వెలుపలికి వచ్చిన కలెక్టర్‌కు బాధితులు భారీగా వినతులు సమర్పించారు. గిరిజనేతరులతో పాటు గిరిజనుల భూములకు పట్టాలు కావడం లేదని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనేతరులు 1970కు ముందు రెవెన్యూ రికార్డుల్లో ఉండాలని, గిరిజనులు ఏ సమయంలోనైనా రికార్డుల్లో ఉంటే వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. వారసత్వ పట్టాలకు తప్పని సరిగా కుటుంబం అంతా కలిసి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పట్టా కల్పిస్తారని చెప్పారు. పోడుదారుల బైఠాయింపు హక్కు ఉన్నా పోడును సాగు చేయనీయకుండా ఫారెస్టు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పాటిమీదిగుంపునకు చెందిన పోడు మహిళా రైతులు తిరుగు ప్రయాణం అయిన కలెక్టర్ కారు ముందు బైఠాయించారు. సెక్యూరిటీ సిబ్బంది మహిళలను కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లగా వారు తమ సమస్యను విన్నవించారు. హక్కు పత్రాలు ఉన్నాయని పత్రాలను కలెక్టర్‌కు చూపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎఫ్‌బీఓపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు.. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌కు పలు సమస్యలను సర్పంచ్, ప్రజా సంఘాల నాయకులు వివరించారు. కారేపల్లిలో ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని, గుర్తించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని సర్పంచ్ ఆదెర్ల స్రవంతి విన్నవించారు. పోడు సాగుదారుల సమస్యపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు అజ్మీర శివనాయక్ వినతిపత్రం సమర్పించారు. కారేపల్లిలోని పోలీస్ క్వార్టర్ ప్రాంత మినీ అంగన్వాడీ కేంద్రం భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, దాని నిర్మాణానిక్రి పభుత్వ భూమి కేటాయించాలని సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు తురక నారాయణ వినతిపత్రం అందజేశారు. -
రెవెన్యూలో అవినీతి జలగలు.!
సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట మండలంలో గత 20 ఏళ్లుగా కొందరు వీఆర్ఓలు రెవెన్యూ గ్రామాలు మారుతూ ఇక్కడే తిష్ట వేశారు. దీంతో వచ్చిన తహసీల్దార్లను మచ్చిక చేసుకుని అంతా తామై నడిపిస్తున్నారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించారు. దాని ప్రకారం రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ముట్టజెప్పిన రైతులు నెలల తరబడి వారి చుట్టూ తిరిగినా పనులు జరగడం లేదు. పనులు చేయిస్తామని భారీగా వసూళ్లు ఖాజీపేట మండలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ పార్వతితో పాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి మరికొందరు వీఆర్ఓలు భూ సమస్యలు పరిష్కరిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా తుడుమలదిన్నె, తిమ్మారెడ్డిపల్లె, సన్నపల్లె, పుల్లూరు తదితర గ్రామాల్లో అధికంగా వీఆర్ఓల బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన ప్రతి రైతు నుంచి వారి అవసరాన్ని బట్టి రూ.10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేశారని రైతుల ఆరోపణ. అలాగే ఆన్లైన్ నమోదు, పాసుపుస్తకాల కోసం, డీకేటీ పట్టా పొందిన రైతుల భూముల ఆన్లైన్ పేరుమార్పు, ఇతరుల పేరుతో ఉన్న ఆన్‌లైన్‌ను తొలగించి తిరిగి భూమి కలిగిన రైతు పేరున మార్చేందుకు ఇలా అనేక రైతుల సమస్యలకు రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. తహసీల్దార్ పార్వతితో పాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి తదితరులు డబ్బులు గుంజారు. బదిలీపై అధికారులు ఖాజీపేట మండలంలో తహసీల్దార్ గా పనిచేసిన పార్వతి తోపాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి బదిలీ అయ్యారు. వీరు రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసి పనులు చేయకుండా తిరిగి రైతులకు డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పనులు చేయలేదు, కనీసం తమ డబ్బయినా తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినా వీఆర్ఓలు పట్టించుకోక పోవడంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తీరు మారదంతే.. ఖాజీపేట రెవెన్యూ కార్యాలయంలోని అధికారుల తీరు ఎంత చేసినా మారడంలేదు. గతంలో పనిచేసిన తహసీల్దార్ శివరామయ్య దొంగ పట్టాలు ఇచ్చారు. ఆన్లైన్లో ఒకరికి తెలియకుండా ఒకరి భూముల పేర్లు మార్చారు. ఇలా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. అలాగే గతంలో పనిచేసిన అధికారుల్లో తహసీల్దార్ కృష్ణయ్య తోపాటు ఆర్ఐ రాధాకృష్ణ, వీర్‌ఓలు, సర్వేయర్ ఏసీబీకి దొరికారు. మరో వీఆర్ఓ చెన్నూరు మండలానికి వెళ్లి అక్కడ ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బు వసూలు చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. సా...గుతున్న విచారణ వీఆర్ఓల అక్రమాలపై అప్పటి కలెక్టర్ బాబూరావు నాయుడుకు 2018లోనే రైతులు ఫిర్యాదు చేశారు. ఆమేరకు విచారణ అధికారిగా ప్రత్యేక కలెక్టర్ రోహిణిని నియమించారు. విచారణ అధికారికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున రాతపూర్యకంగా ఫిర్యాదులు ఇచ్చారు. అయితే విచారణకు కావాల్సిన రికార్డులు ఇచ్చేందుకు తహసీల్దార్ పార్వతి సహకరించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులు ఇవ్వని కారణంగా నివేదిక ఆలస్యం విచారణకు వచ్చిన నాకు ఖాజీపేట తహసీల్దార్ రికార్డులు ఇవ్వలేదు. 95 రికార్డులు అడిగితే 60 రికార్డులు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి ఉన్నాయో లేదో తెలియదు. లేక పోతే మా వద్ద లేవు అని రాతపూర్వకంగా ఇవ్వాలని తహసీల్దార్‌ను అడిగాను. ఇదే విషయమై అనేక నోటీసులు ఇచ్చినా తహసీల్దార్ స్పందించ లేదు. అసంపూర్తిగా నివేదిక ఇవ్వలేం. తహసీల్దార్ రాతపూర్వకంగా ఇస్తే కలెక్టర్‌కు నివేదిస్తాను. – రోహిణి, ప్రత్యేక కలెక్టర్ -
అధికారులా.. అతిథులా..!
సాక్షఙ, బిట్రగుంట (నెల్లూరు): బోగోలు మండలంలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన పక్కనపెట్టి చుట్టపుచూపుగా కార్యాలయాలకు వచ్చిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కార్యాలయాలైన రెవెన్యూ, మండల పరిషత్, డ్వాక్రా, తదితర కార్యాలయాల అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకూ రాకపోతుండటం, అసలు వస్తారో రారో కూడా తెలియకపోతుండటంతో ప్రజల అవస్థలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిలో ఒక్కరూ కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు. అందరూ కావలి, నెల్లూరు నుంచి రావాల్సి ఉండటంతో తీరిగ్గా ప్రయాణ సౌలభ్యాన్ని చూసుకుని వస్తున్నారు. ఉదాహరణకు రైతులు, అర్జీదారులతో నిత్యం రద్దీగా ఉండే తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్లలో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు. వీఆర్వోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కలెక్టర్ అయినా కనిపిస్తాడేమో కానీ వీఆర్వోలు మాత్రం ఆచూకీ కూడా దొరకరు. దరఖాస్తుదారులు ఫోన్ చేస్తే సమాధానం చెప్పరు. ఫీల్డ్‌లో ఉన్నామని ఫోన్ పెట్టేస్తారు. గట్టిగా అడిగితే సోమవారం గ్రీవెన్స్‌లో కనిపించమని చెబుతున్నారు. ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీలే.. వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినీ కుర్చీలు ఖాళీగా ఉంటాయని, అదేమని అడిగితే ఒకరేమో ఆర్డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, మరొకరేమో ఖజానాకు వెళ్లారని, ఇంకొకరేమో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారని వాపోతున్నారు. ఎప్పుడు వచ్చినా ఇవే సమాధానాలు చెబుతున్నారు తప్ప పనులు చేయడం లేదని వివరిస్తున్నారు. కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సరిగా ఉండటం లేదని, టైపిస్ట్ స్థానంలో వీఆర్ఓలు పనిచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ చిన్న పని అడిగినా సర్వర్ పనిచేయడం లేదని పంపిచేస్తున్నారని వాపోతున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఉద్యోగులు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. ప్రత్యేకాధికారులు మాత్రం గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ‘స్పందన’ను నీరుగార్చారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అట్టహాసంగా నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని మండలంలో అధికారులు నీరుగార్చారు. తహసీల్దార్ కార్యాలయంలో స్పందన పేరుతో చిన్న ఫ్లెక్సీ కట్టి చేతులు దులుపుకున్నారే తప్ప కార్యక్రమాన్ని నిర్వహించలేదు. మిగిలిన కార్యాలయాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయలేదు. అసలు స్పందన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా గ్రామాల్లో దండోరా వేయించడం కానీ, ప్రెస్‌నోట్ విడుదల చేయడం కానీ చేయలేదు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని, గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. చిన్న పనికి కూడా పదేపదే తిప్పుకోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సరికాదు. – మేకల శ్రీనివాసులు, ఎంపీటీసీ -
అభిమానికి హరీశ్‌రావు బాసట
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు బాసటగా నిలిచారు. అధికారుల చుట్టూ తిరిగినా ఏ ప్రయోజనం లేకపోవడంతో తన సమస్యను విన్నవించుకునేందుకు వారం కింద సైకిల్ యాత్ర చేపట్టి శుక్రవారం నేరుగా హరీశ్ నివాసంలో ఆయనను కలిశాడు. ములుగు జిల్లాకు చెందిన 19 ఏళ్ల బిల్ల తరుణ్.. సైకిల్‌పై హైదరాబాద్‌లోని హరీశ్ నివాసానికి వచ్చి కలిశాడు. ‘నేను మీ అభిమానిని అన్న. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ. అమె భూమిని వెంకటాపురానికి చెందిన కొంతమంది కబ్జా చేశారు. ఎన్నోసార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మిమ్మల్ని కలవాలని గత వారం క్రితం వెంకటాపురం నుంచి సైకిల్ యాత్రతో బయలుదేరి వచ్చాను. మీరే నన్ను ఆదుకోవాలి..’అని విన్నవించాడు. దీనిపై హరీశ్ వెంటనే స్పందించారు. అక్కడి సీఐ, ఎమ్మార్వోలతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పారు. తరుణ్ సమస్య పరిష్కారానికి హరీశ్ భరోసానిచ్చారు. రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. హరీశ్ ఆదేశాలతో ములుగు ఆర్డీవో వెంటనే స్పందించారు. తరుణ్ ఫిర్యాదు అంశంపై పత్రికా ప్రకటన జారీ చేశారు. విచారణ జరిపి తాజా పరిస్థితిని వివరించారు. దుర్గమ్మ భూమి విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు. -
వెయ్యి కోసం ఎన్ని కష్టాలో
సాక్షి, పెద్దారవీడు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వానికి రైతులపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. నాలుగున్నరేళ్లుగా రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం ఓట్ల కోసం ఒక్క సారిగా వరాల జల్లు కురిపించింది. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా రూ. 6 వేలు ప్రకటిస్తే దాన్ని తప్పుదోవ పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించింది. కేంద్రం కంటే తామే ఎక్కువ రైతుల కష్టాలు తీరుస్తాన్నామంటూ ప్రకటించుకుంటోంది. రుణమాఫీ అంశాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేశారని రైతులు వాపోతున్నారు. కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఈ పథకానికి 19 పంచాయతీలలో 7,153 మంది రైతులను అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటికీ రూ. 1,000 జమకాని రైతులు మండలంలో 950 మంది రైతులు ఉన్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 15 వేలు చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సుఖీభవ పథకం ద్వారా రూ. 1,000, కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న రూ. 1,000 చాలా మందికి రైతుల ఖాతాలో పడని పరిస్థితి. ఈ పరిస్థితి ఎక్కువగా బ్యాంకు అకౌంట్‌కు, రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు అనుసంధానం కాని రైతుల ఖాతాలకు నగదు జమ కావడంలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నగదు జమ కాని రైతులు వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. దీని కన్నా గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తమకు రుణ బాధలు తప్పేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అర్హులందరికీ న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఒక్క రూపాయి జమ కాలేదు అన్నదాతా సుఖీభావ పథకం ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకూ బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదు. అధికారులను అడిగితే భూమికి సంబంధించిన ఆన్లైన్, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జీరాక్స్ కాగితాలు ఇస్తే ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. త్వరలో నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. – శిరసాని కాశిరెడ్డి, రైతు, రేగుమానిపల్లె గ్రామం తప్పులు సరి చేస్తున్నాం రైతులకు సంబంధించి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడంతో మండల వ్యాప్తంగా 950 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమకాలేదు. ఇందులో 390 మంది రైతుల వివరాలు సరిచేసి అప్లోడ్ చేశాం. ఇంకా 560 మంది రైతుల వివరాలు సరిచేయాలి. మిగత రైతులు కూడా త్వరగా వచ్చి అప్లోడ్ చేసుకోవాలని సంబంధిత ఎంపీఈఓలకు గ్రామాల్లో రైతులకు తెలియజేయాలని చెప్పాం. అప్లోడ్ చేసిన వారానికి నగదు జమ అవుతుంది. –బుజ్జీబాయి, ఇన్చార్జి వ్యవసాయాధికారి, పెద్దారవీడు -
ఏసీబీ వలలో వీఆర్వో
శ్రీకాకుళం ,రాజాం సిటీ/రూరల్: రాజాం రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఊడలు పాతుకుపోతున్నాయి. రెండేళ్ల క్రితం ఈ శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుపడగా.. తాజాగా ఇదే శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. మ్యుటేషన్ నిమిత్తం ఆశపడిన ఓ వీఆర్వో ఏసీబీకి పట్టుపడ్డాడు. ఓ వైపు ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా అవినీతి అ«ధికారులు వెనక్కుతగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం నగరపంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న అలజంగి ఈశ్వరరావు, ఇదే మండలంలోని కంచరాం గ్రామానికి ఇన్చార్జి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. కంచరాం గ్రామానికి చెందిన కలిశెట్టి చిన్నంనాయుడుకు గ్రామంలో 1.81 ఎకరాల సాగుభూమి ఉంది. పంటరుణం నిమిత్తం ఆంధ్రాబ్యాంకును ఆశ్రయించగా పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలు ఉన్నప్పటికీ వెబ్అడంగల్లో పూర్తి భూమి చూపించకపోవడంతో జూలై 24న మీ సేవా కేంద్రంలో మ్యుటేషన్ నిమిత్తం ఇతడు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో ఆ దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వీఆర్వో వద్దకు చేరుకోగా అధికారులు పట్టించుకోలేదు. మరోవైపు గడువు కూడా ముగిసింది. దీంతో విసుగుచెందిన రైతు అధికారులను సంప్రదించగా మరోదఫా మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాధిత రైతు నవంబర్ 28న మ్యుటేషన్ నిమిత్తం రెండోదఫా దరఖాస్తు చేసుకోగా నెలరోజులు కావస్తున్నా ఫలితం కనిపించలేదు. ఈ దఫా కూడా గడువు ముగుస్తుండడంతో రైతు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారులను సంప్రదించాడు. ఈ తంతు వీఆర్వో ఈశ్వరరావు వద్దకు చేరగా, వీఆర్వో బాధిత రైతుకు ఫోన్‌చేసి మ్యుటేషన్ కావాలంటే రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినిపించుకోకుండా ముందుగా రూ.6 వేలు చెల్లించాలని, పని పూర్తయ్యాక మిగతా రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భూ యజమాని కలిశెట్టి చిన్నంనాయుడు తన మనుమడు కలిశెట్టి మురళితో విషయం చెప్పడంతో ఈ నెల 26న మురళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం మురళి వీఆర్వో ఈశ్వరరావుకు రూ.5 వేలు అందించగా తీసుకున్న ఈశ్వరరావు వాటిని జేబులో పెట్టుకొని తన బండి వద్దకు వెళ్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం లోపలకు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడిని విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర విలేకరులకు తెలిపారు. విసిగిపోయి... ఈ సందర్భంగా బాధిత రైతుకుటుంబానికి చెందిన మురళి విలేకరులతో మాట్లాడుతూ తన తాత సాగుభూమి మ్యుటేషన్ నిమిత్తం వీఆర్వో డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపాడు. పేద కుటుంబానికి చెందినవారమని, తక్కువ ఇస్తామని చెప్పినా వినలేదని, ప్రతీ దఫా మీసేవా కేంద్రంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేయడం, సమయం గడిచిపోవడం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశాడు. చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించామన్నారు. రెండేళ్ల క్రితం సరిగ్గా రెండేళ్ల క్రితం 2016 ఆగస్టు 19న ఇదే రాజాం తహసీల్దార్ కార్యాలయానికి చెందిన కంచరాం వీఆర్వో కృష్ణ భూసంబంధిత విషయంలోనే ఏసీబీకి చిక్కాడు. అదే ఏడాదిలో సంతకవిటి మండలంలో మోదుగులపేట గ్రామానికి చెందిన అప్పట్టి పంచాయతీ కార్యదర్శి కూడా ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటనలు మరువకముందే మళ్లీ ఏసీబీ దాడులుకు వీఆర్వో చిక్కాడు. ఇప్పుడు కూడా రాజాం మండలంలో ఇదే కంచరాం గ్రామానికి చెందిన వీఆర్ఓ ఏసీబీకి చిక్కడం కొసమెరుపు. -
జనన నమోదు ఆలస్యమైతే చిక్కులే
సాక్షి, అమరావతి: తెలిసో, తెలియకో సకాలంలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోనివారు అష్టకష్టాలు పడుతున్నారు. ఆలస్యంగా జనన ధ్రువీకరణ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఎక్కువగా అధికారులు తిరస్కరిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఆలస్యంగా జనన నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 19,230 అర్జీలను అధికారులు తిరస్కరించారు. గత ఏడాది జులై 15 నుంచి ఈనెల 15వ తేదీ వరకూ మొత్తం 90,929 అర్జీలు రాగా తిరస్కరించినవి కాకుండా మరో 14,163 అర్జీలను అధికారులు పెండింగులో పెట్టారు. అర్జీలు తిరస్కరణకు గురైన వారు జనన ధ్రువీకరణ పత్రాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఈ కష్టాలు పడకుండా ఉండాలంటే సకాలంలో జననాల నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బాబునైనా, పాపనైనా పాఠశాలలో చేర్పించాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అంతేకాదు జీవితంలో ఎక్కడ ఏ పనికావాలన్నా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కావాల్సిందే. ఇంతప్రాధాన్యం ఉన్నందునే ప్రసవం జరగ్గానే పిల్లల పుట్టిన తేదీని నమోదు చేసి పంచాయతీలు/మున్సిపాలిటీలు/ నగరపాలక సంస్థలకు (ఆస్పత్రి ఏ పరిధిలో ఉంటే అక్కడికి) పంపించి రికార్డు చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఇళ్లలో పుట్టిన పిల్లలకు మాత్రం ఈ సదుపాయంలేదు. ఆస్పత్రుల్లో కాకుండా ఇళ్లలో పిల్లలు పుట్టిన వెంటనే వారు ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి జనన ధ్రువీకరణ పత్రం పొందాలి. నమోదు ఎలాగంటే... ఒకవేళ పిల్లలు పుట్టిన ఏడాదిలోగా జనన నమోదు చేయించుకోనిపక్షంలో ఈ విషయం ధ్రువీకరణ కోసం నాన్ అవైలబులిటీ సర్టిఫికేట్ కోసం మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేసుకున్న దరఖాస్తులను వారు పరిశీలించి ఎక్కడా జనన నమోదు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏడాది తర్వాత జనన నమోదు కావాలంటే మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా మీసేవ ద్వారా వచ్చిన అర్జీలను తహసీల్దార్లు పరిశీలించి వారి జననాలు నమోదు కాలేదని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇలా నిర్ధారించిన తర్వాత వారికి డివిజనల్ రెవెన్యూ అధికారి జనన నమోదు ధ్రువీకరణకు ఆమోదిస్తారు. ఇలా నమోదైన తర్వాత ఎప్పుడైనా మీసేవ నుంచి జనన ధ్రువీకరణ పత్రం పొందవచ్చు. ఏడాది తర్వాత జనన నమోదు కోసం మీసేవలో దరఖాస్తు చేసిన వారు నగర నివాసులైతే నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి పుట్టిన తేదీ నమోదు కాలేదని (నాన్ అవైలబులిటీ) సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకోవడం చాలా కష్టమని, అధికారులు ఎన్ని సార్లు తిరిగినా ఎందుకు నమోదు చేయించుకోలేదంటూ తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. -
కదిలిస్తే కన్నీరు..!!
కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద పడుకుని..లేవలేక ఇబ్బంది పడుతున్న ఈమె పేరు చెప్పలి సుబ్బమ్మ. దాదాపు 80 ఏళ్ల వయస్సు. చెన్నూరు గ్రామం. ఏళ్ల తరబడి అక్కడి రెవెన్యూ కార్యాలయంలో స్వీపర్‌గా నెలకు రూ. 500 జీతంతో కాలం వెల్లదీస్తోంది.దాదాపు నాలుగైదు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడంతో అధికారులను కలవాలని వచ్చింది. భర్త పెద్ద యల్లయ్య, కుమారులు రామసుబ్బయ్య, చిన్న యల్లయ్యలు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. ఎన్నిమార్లు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేక పెద్ద సార్‌ను కలవాలని వచ్చింది. కలెక్టర్ సారూ లేరని తెలిసి..పాదరక్షలు కూడా లేని వృద్ధురాలు. బయటికి నడవలేక అక్కడే మెట్లపైనే కూర్చుంది. కడపకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి ఎందరో ఇలాంటి సమస్యలతోనే వస్తున్నారు. కనీసం ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి, కడప 50 సార్లు తిరిగా.. నా పేరు అంకాలమ్మ. మాది రాజంపేట సమీపంలోని బోయనపల్లె. నా బిడ్డ అంజిని ఎత్తుకుని ప్రతిసారి ఇక్కడికి వస్తున్నా. రానుపోను ఛార్జీలు రూ. 80 అవుతున్నాయి. గుడిసెల్లో ఉంటున్నాం. ఇల్లు కావాలని ఎన్నిమార్లు మొరపెట్టుకుంటున్నా మా బాధ వినే వారు లేరు. పప్పులు, ఎర్రగడ్డలు, ఇనుప, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికి కడపలోని కలెక్టర్ దగ్గరకు మూడుసార్లు వచ్చినా ఇంతవరకు ఇంటికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కలిసినా ఇస్తామంటున్నారు. కానీ ఇవ్వలేదు. రాజంపేట తహసీల్దార్ ఆఫీసుకు 50 సార్లకు పైగా పోయి బాధ చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పింఛన్ ఇప్పించండి మహాప్రభో... నా పేరు ఇమాంబీ. మాది రాయచోటి మాసాపేట. నాకు 70 ఏళ్లు. నేనొక్కదాన్ని రాలేక మా బంధువుల పాప హసీనాను వెంట బెట్టుకుని వచ్చాను. ఇటీవలె కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఫించన్ కోసం తిరుగుతూనే ఉన్నా. ఎప్పుడిస్తారో తెలియదుగానీ అవస్థలు మాత్రం పడుతూనే ఉన్నాం. పలుమార్లు ఎమ్మార్వో ఆఫీసులో ఇచ్చాం. ఇక్కడ కూడా ఇద్దామని కలెక్టరేట్‌కు ఇచ్చా. మామిడి చెట్లు ఎండిపోతున్నాయి... నాపేరు రామచంద్రయ్య. మాది చిట్వేల్ మండలం కేసీ ఆగ్రహారం. నాకు 4.99 ఎకరాల పొలం ఉంది. నాకు ఎస్సీ కార్పోరేషన్ తరుపును ప్రభుత్వం బోరు మోటారు మంజూరు చేసింది. కానీ అధికారులు వచ్చి సర్వే చేసి పక్క పొలంలో ఉన్న బోరుకు మీ బోరుకు తక్కువ దూరం ఉందని వెళ్లిపోయారు. దీంతో నా పంట పొలంలోని మామిడిచెట్లు ఎండిపోతున్నాయి. సంబంధిత విషయం గురించి అధికారుల దృష్టికి తెచ్చేందుకు వచ్చాను. సబ్సిడీ మంజూరు కాలేదని రుణానికి కొర్రీ.. నా పేరు ఎం. నరసింహులు. నాది రామాపురం మండలం. నేను జీవనాధారం కోసం అంగడి ఏర్పాటు చేసుకోవడానికి స్టేట్ బ్యాంకులో లక్ష రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాను. బీసీ కార్పొరేషన్ నుంచి సగం సబ్సిడీ వస్తుంది. మార్చి 29వ తేది బీసీ కార్పొరేషన్ అధికారులు సబ్సిడీ మొత్తాన్ని స్టేట్ బ్యాంకుకు పంపించారు. ఈ మేరకు నాకు సమాచారం వచ్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం సబ్సిడీ మొత్తం తమకు అందలేదని రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. పెన్షన్ మంజూరు చేయాలి.. నాపేరు విజయలక్ష్మి. నాది సీకే దిన్నె మండలం. నా భర్త సంవత్సరం క్రితం మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. నేను కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. కుటుంబ యజమాని మరణించినప్పటికీ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం రాలేదు. మాకు ఇంటి స్థలం కూడా లేదు. ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేస్తే మా కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుంది. నా స్థలం అమ్ముకున్నారు.. నాపేరు రామక్రిష్ణయ్య. మాది మాధవరం మండలం ఉప్పరపల్లె గ్రామం. నాకు ప్రభుత్వం 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది. దానిని వేరే వాళ్లు అమ్ముకున్నారు. దానిని గురించి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. అడంగల్‌లో పేరున్నా అడ్డుకుంటున్నారు.. నాపేరు సి. ఈశ్వరయ్య. బి.మఠం మండలంలోని నరసన్నపల్లెలో 189 సర్వే నెంబర్లలో నాకు 17 సెంట్ల స్థలముంది. అందుకు సంబం ధించి నా పేరు మీద అడంగల్ కూడా అయితే, అక్కడ సర్వే జరగకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాను. అయితే అధికారులు విచారణ చేయడం లేదు. ఎన్నిసార్లు తిరగాలి.. నా పేరు సిట్టేలుగాళ్ల గంగమ్మ. మాది మైదుకూరు మండల పరిధిలోని నంద్యాలంపేట పంచాయతీలోని కొత్త విపురాపురం. ప్రభుత్వం నాకు, నా చెల్లెలుకు మూడు ఎకరాల భూమిలో బోరు వేశారు. కానీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత ట్రాన్స్‌కో, ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వలేదు. ఇప్పటికి కలెక్టర్‌కు చెప్పడానికి పదిసార్లు వచ్చాను. భూమి కొనుగోలు చేసి అందించాలి... నా పేరు ఓబయ్య. నాది దువ్వూరు. మా మండలంలోని గొల్లపల్లెలో భూమి ఎస్సీలకు కేటాయించారు. అధికారికంగా కేటాయించాల్సి ఉంది. అందుకు అధికారులు ఈరోజు, రేపు వచ్చి పరిశీలిస్తామంటున్నారు. ఇంతవరకు రాలేదు. హద్దుల వద్ద జెండాలు కూడా నాటారు. కానీ ఇంతవరకు అధికారులు వచ్చి పరిశీలించకపోవడంతో ఎప్పుడు భూమి ఇస్తారో తెలియడం లేదు. సీఎం సహాయ నిధి ఇచ్చి ఆదుకోండి... నాపేరు ప్రకాశం. మాది కమలాపురం మండలం పైడికాల్వ గ్రామం. నేను ఇటీవలే తిరుపతిలోని స్విమ్స్‌లో ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చుల గురించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. సంబంధిత విషయం గురించి అ«ధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రజావాణికి వచ్చి అర్జీ ఇచ్చాను. సిమెంట్ ఇవ్వకపోవడం ఏమిటి... నాపేరు పెంచలయ్య. మాది రాజంపేట మండలం పోలీ పంచాయతీ చిండ్రిగాయపల్లె గ్రామం. నాకు ప్రభుత్వ ఎన్టీఆర్ గృహ పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఇంటికి స్లాబ్‌ను వేసుకునేందుకు 35 బస్తాల సిమెంట్‌ను మంజూరు అయ్యింది. సంబంధిత సిమెంట్‌ను గోడౌన్ ఇన్చార్జు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. స్లాబ్ నిలిచిపోయింది. ఇలా చాలామందికి సిమెంట్ ఇవ్వడం లేదు. పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు.. నాపేరు వెంకటరమణారెడ్డి, వేంపల్లి మండలం ఆలిరెడ్డిపల్లె ఎంపీటీసీని. మాగ్రామ పొలాల్లో నుంచి కడప నుంచి బెంగుళూరుకి వెళ్లే రైల్వేట్రాక్ మంజూరైంది. కానీ మా పొలాలకు రైల్వేశాఖ ఎంతనష్టçపరిహారం ఇస్తుందో అర్థం కావడం లేదు. సర్వే కోసం వచ్చిన అధికారులు కూడా చెప్పడం లేదు. మా పంట పొలాలు మూడు కార్లు పండుతాయి. దీంతోపాటు మార్కెట్ విలువ కూడా ఎక్కువగా ఉంది. మరి రైల్వేశాఖ వారు నష్టపరిహారం కింద ఎంత డబ్బులిస్తారో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చా. భూమి అభివృద్ధికి చేయూత ఇవ్వండి.. నాపేరు పెద్ద సుంకన్న. నాది మైలవరం మండలం. తొర్రివేముల గ్రామ పొలం సర్వే నెంబరు 679–2బిలో నాకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి పట్టాగా మంజూరు చేసింది. ఆ భూమిని వ్యవసాయానికి యోగ్యంగా చదువును చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా తలమంచిపట్నం చెరువు నుంచి 500 ట్రిప్పుల మట్టి అవసరమవుతుంది. అధికారులు చెరువుమట్టిని ఉచితంగా నా భూమికి తోలించాలి. కంపచెట్లు తొలగించేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. 500 ఎకరాల భూమి అంతా ఆక్రమణలే! నా పేరు బి.వెంకట సుబ్బారెడ్డి. బద్వేలు పరిధిలోని భాకరాపేట మా ఊరు. 1914లో సుమారు 547 ఎకరాల భూమి మా అబ్బబ్బ గారి పేరుమీద రిజిష్టర్లు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో చాలా భూమిని డీకేటీగా మార్చారు. తర్వాత అంతో ఇంతో మిగిలిందంతా కూడా ఆక్రమణలు అయిపోయింది. నా భూమి సర్వే చేయించాలని సీఎం చంద్రబాబుతోసహా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. 2000 నుంచి ఇప్పటివరకు నా పోరాటం ఆగలేదు. కనీసం ఒక ఎకరా అయినా చూపించాలని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో కనిపించడం లేదు.. మా పేర్లు వై.లక్ష్మి దేవి, సి.సునీత. మాది చెన్నూరు. మా అమ్మ పద్మావతి రుద్రభారతి పేటలో 1.14 సెంట్ల భూమిలో కూతుర్లు అయిన మా ఇద్దరికీ ఎకరా...మరో 14 సెంట్లు కుమారుడికి ఇచ్చింది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో చేర్చాలని ఎన్నిమార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. -
ప్రక్షాళనకు పక్కా మార్గం
మూడు విభాగాలు.. ఆరు దశల్లో భూ రికార్డుల ప్రక్షాళన - ఆన్లైన్లో పరిశీలనతో పాటు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు - ప్రతీ ఇంటికీ సర్వే స్టిక్కర్లు.. వీఆర్వోలు, తహసీల్దార్లదే బాధ్యత - ఆన్లైన్ పహాణీలలో మార్పులు, చేర్పులు - 1బీ రికార్డుల సవరణ.. రిజిస్టర్లో నమోదు - మార్పులు, చేర్పులతో తహసీల్దార్ ఉత్తర్వులు - వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన - తర్వాత మాన్యువల్ పహాణీ.. ఆన్లైన్లో నమోదు - ఈ రికార్డుల ఆధారంగానే ఎకరానికి రూ.8 వేల సాయం అమలు - ప్రతి గ్రామానికి రెవెన్యూ ప్రొఫైల్ కూడా ఏర్పాటు ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తున్న మాట ‘భూ రికార్డుల ప్రక్షాళన’.. రైతులకు ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం తోపాటు.. రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించడం, అక్రమాలకు తావు లేకుం డా పక్కాగా రికార్డు లను అప్డేట్ చేయడం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రక్షాళనను చేపట్టారు. ఈనెల 15వ తేదీ నుంచి డిసెం బర్ 31 వరకు.. రాష్ట్రం లోని 10 వేలకుపైగా రెవెన్యూ గ్రామాల్లో జరిగే భూ రికార్డుల ప్రక్షాళన కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ యంత్రాంగం సిద్ధ మవుతోంది. అయితే ఈ భూ రికార్డుల ప్రక్షాళనలో ఏం చేస్తారు.., ఏ రికా ర్డులను, ఎలా ప్రక్షాళన చేస్తారు.. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారా.. రికార్డు ల్లో ఉన్నది ఉన్నట్టు రాసేస్తారా.. మార్పులు చేర్పులు చేస్తారా.. ఇలాంటి ఎన్నో సందేహాలు రాష్ట్ర రైతాంగంలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన సాగే తీరు, వివరాలపై ‘సాక్షి’ ఫోకస్.. ప్రతి గ్రామానికి రెవెన్యూ ప్రొఫైల్ భూ రికార్డుల ప్రక్షాళనలో భా గంగా ప్రతి గ్రామానికి రెవెన్యూ ప్రొఫైల్ కూడా రూపొందించను న్నారు అందులో మొత్తం 29 రకాల వివరాలను పొందుపరుస్తారు. గ్రామ భౌగోళిక విస్తీర్ణం, పట్టా భూములు, ప్రభుత్వ భూములు, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, ప్రాజెక్టుల కింద సేకరించిన భూ వివరాలు, మొత్తం సర్వే నంబర్లు, 18 ప్రకారం ఉన్న ఖాతాలు, ప్రస్తుత పహాణీకి ఉన్న మొత్తం ఖాతాలు, రైతు సమగ్ర సర్వే ప్రకారం తేడా ఉన్న ఖాతాల సంఖ్య, మొత్తం పట్టాదారులు, ఫౌతి చేయాల్సిన పట్టాదారులు, వ్యవసాయ విస్తీర్ణం, నాలా విస్తీర్ణం, ఇంటి స్థలం మరియు ఇళ్ల విస్తీర్ణం, ఇళ్ల స్థలాలకు, ప్రజావసరాలకు సేకరించిన భూమి విస్తీర్ణం, పరిశ్రమలకు ఎలినేషన్ చేసిన భూ విస్తీర్ణం, గ్రామంలో మొత్తం ప్రభుత్వ భూ విస్తీర్ణం, ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, అసైన్ చేయబడిన భూ విస్తీర్ణం, అసైనీదారుల సంఖ్య, పీవోటీ విస్తీర్ణం, సేద్యం చేయడానికి వీలుకాని అసైన్డ్ భూమి, పరిష్కారం కాని ఇనాం భూముల విస్తీర్ణం, నోటిఫైడ్ చెరువుల సంఖ్య, గుర్తింపులేని చెరువుల సంఖ్య, శిఖం భూముల విస్తీర్ణం, ఖస్రాకు, ప్రస్తుత పహా ణీకి సరిపడని సర్వే నంబర్ల సంఖ్య, వివాదంలో ఉన్న భూ సర్వే నంబర్ల సంఖ్య, ఆన్లైన్ పహాణీలో నమోదు చేయాల్సిన పట్టాదారుల సంఖ్య, పట్టాదారు, అనుభవదారు కాలమ్‌లకు సరిపడని సర్వే నంబర్ల సంఖ్య, డబుల్ బెడ్రూం ఇళ్లకు గుర్తించబడిన భూమి విస్తీర్ణం, దళితులకు మూడెకరాల పంపిణీ కోసం రిజిస్టర్ చేసిన, సేకరించిన భూ విస్తీర్ణం, ఎవాక్యూ ప్రాపర్టీ విస్తీర్ణం వివరాల్ని గ్రామ రెవెన్యూ ప్రొఫైల్‌లో పొందుపరుస్తారు. దీన్ని ఆన్లైన్లో కూడా నమోదు చేస్తారు. (మేకల కల్యాణ్ చక్రవర్తి) రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికే జరుగుతున్న భూ రికార్డుల సర్వే తరహాలో తాజా ప్రక్షాళన ప్రక్రియ జరుగనుంది. ఇటీవల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వ హించిన సమీక్షా సమావేశంలోనే దీనిపై స్పష్టత వచ్చింది. ఇంతకుముందు చేపట్టిన సర్వేలో నల్ల గొండ జిల్లా కలెక్టర్ అనుసరించిన విధానం బాగుం దని.. తాజాగా చేపట్టే ప్రక్షాళన ప్రక్రియలో దానినే అనుసరించాలని కేసీఆర్ ఆ భేటీలో సూచించారు. దీంతో ఉన్నతాధికారులు ఆ విధానం ప్రకారమే భూరికార్డుల ప్రక్షాళన చేపట్టేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. దాని ప్రకారం.. ఈ ప్రక్రియ 3 విభా గాలుగా ఆరు దశల్లో పూర్తి చేయనున్నారు. అయితే ఇంతకుముందు చేపట్టిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భూముల పరిశీలన జరిగింది. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో 98%, నల్లగొండలో 85% మేర ప్రక్రియను పూర్తికావడం గమనార్హం. అయితే సెప్టెంబర్ 15 నుంచి గ్రామాల్లోకి బృందాల వారీగా వెళ్లి పరిశీలించనున్న నేపథ్యంలో.. అన్ని చోట్లా మరోసారి పరిశీలన చేయనున్నారు. ఏవైనా తేడాలు కనిపిస్తే.. తాజా పరిశీలన మేరకు ఆన్లైన్ రికార్డులు నమోదు చేయనున్నారు. పరిగణనలోకి తీసుకునేవి ఇవే.. భూ రికార్డుల ప్రక్షాళన కోసం గతంలోని రెవెన్యూ రికార్డుల్లో సేత్వార్, ఖస్రా, చెస్సలా పహాణీలతో పాటు 2013–14 సంవత్సరం వరకు అందుబాటు లో ఉన్న మాన్యువల్ పహాణీలు, గత పదేళ్ల సవ రణల రిజిస్టర్లను పరిగణనలోకి తీసుకుంటు న్నారు. ఈ రికార్డుల్లో ఉన్న వివరాలను రైతుల వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చి మార్పులు చేర్పులు చేస్తారు. రైతు సమితుల పాత్ర నామమాత్రమే! ఎకరానికి రూ.8 వేల పథకం అమలుకు, భవిష్యత్‌లో భూ మార్పిడి లావాదేవీలకు కీలకమవు తాయని భావిస్తున్న రైతు చైతన్య సమితులకు.. ప్రక్షాళనలో నామమాత్ర పాత్రే ఉండనుంది. ఎందుకంటే రెవెన్యూ రికార్డుల ఆధారంగానే ప్రక్షాళన జరుగుతోందని, దీనివల్ల స్థానిక రైతు కమిటీల పాత్ర పెద్దగా ఉండక పోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి.. రికార్డుల్లో మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా భూమిపై ఇద్దరు రైతుల మధ్య వివాదం తలెత్తినప్పుడు మాత్రం రైతు సమితుల పాత్ర కీలకం కానుంది. రైతు సమితి సమక్షంలోనే గ్రామంలో విచారణ జరిపి.. భూముల వివాదాలను పరిష్కరించనున్నారు. ఇక తహసీల్దార్ తర్వాత కలెక్టరే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని రకాల రెవెన్యూ కోర్టు లను రద్దు చేసి కేవలం కలెక్టర్ కోర్టును మాత్రమే ఉంచనున్నారు. దాంతో భూ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభించనుంది. గతంలో ఏదైనా భూ వివాదం తలెత్తితే దానిని సంబంధిత తహసీల్దార్ వద్ద సవాల్ చేసేవారు. ఉదా హరణకు మ్యుటేషన్ ప్రక్రియలో అభ్యంతరాలుంటే ఫాం–8 ద్వారా నోటీసులిచ్చి తహసీల్దార్ విచారణ జరిపి ఉత్తర్వులిచ్చేవారు. అయితే ఈ ఉత్తర్వులను 30 రోజుల్లోగా ఆర్డీవో కోర్టులో సవాల్ చేసే వెసులుబాటు ఉండేది. తర్వాత ఆర్డీవోలు ఇచ్చిన ఉత్తర్వులను 45 రోజుల్లోగా జాయింట్ కలెక్టర్ (జేసీ) కోర్టులో సవాల్ చేసేందుకు అవకాశముండేది. జేసీ కోర్టు ఇచ్చినవి కూడా తుది ఉత్తర్వులు కాదని.. వాటిని హైకోర్టులో సవాలు చేసేవారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందునుంచీ కలెక్టర్ కోర్టులు ఉన్నా.. అవి నామమాత్రంగానే కొనసాగాయి. ప్రస్తుతం మళ్లీ కలెక్టర్ కోర్టులను క్రియాశీలం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్ కోర్టు తర్వాత నేరుగా కలెక్టర్ కోర్టుకే రావాల్సి ఉంటుంది. అయితే కలెక్టర్లు పనిఒత్తిడి నేపథ్యంలో తిరిగి ఈ కేసులను జాయింట్ కలెక్టర్లకే అప్పగించాల్సి వస్తుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. తొలిగ్రామం.. ముల్కలకాల్వ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ముల్కలకాల్వ గ్రామం వంద శాతం భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తొలి గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో సర్వే అనంతరం 258 సర్వే నంబర్లకుగాను 38 సర్వే నంబర్ల పరిధిలో మార్పులు చేర్పులు చేయాలని గుర్తించారు. గ్రామ పరిధిలో గతంలో ఉన్న భూ విస్తీర్ణాన్ని 1,262 ఎకరాలకు గాను 1,240 ఎకరాలుగా నిర్ధారించారు. మిగతా 22 ఎకరాలు వివాదంలో ఉండటంతో దాన్ని ఎటూ తేల్చలేదు. ఈ కొత్త పహాణీలన్నింటినీ గ్రామసభలో ప్రదర్శించి రైతులందరి ఆమోదం పొందారు. ఇదే విధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామసభలు నిర్వహించి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టనున్నారు. రైతులకు ఎంతో మేలు ‘‘భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా పహాణీలో ఉన్న ఎంట్రీలకు, రైతులు క్లెయిమ్ చేసుకునే వాటికి తేడా లేకుండా ఉంటుంది. 90–95 శాతం కన్నా ఎక్కువ రికార్డులు సరి అవుతాయి. మ్యుటేషన్లు, వారసుల పేర్లు నమోదు కాకపోతే ఈ కార్యక్రమంలో నమోదు చేస్తాం. చనిపోయిన వారి, భూములు అమ్ముకున్న వారి పేర్లు తొలగిస్తాం. సర్వే నంబర్ల వారీగా పూర్తి సమాచారాన్ని విస్తీర్ణంతో సహా పోలుస్తాం. ప్రభుత్వ భూములను పక్కాగా నిర్ధారిస్తాం. తద్వారా రైతులకూ మంచే జరుగుతుంది..’’ – సుందర్ అబ్నార్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నో ఇబ్బందులకు ఇది పరిష్కారం ‘‘భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా వాస్తవానికి ఉన్న భూమికి, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమికి తేడాలు సమసిపోతాయి. ప్రస్తుతం రికార్డుల్లో 30 శాతం మేర తేడాలు ఉన్నాయి. ప్రక్షాళన తర్వాత 95 శాతం వరకు భూ రికార్డులు సమగ్రమవుతాయి. పాస్‌బుక్, టైటిల్‌డీడ్ కోసం రైతులు రోజుల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. భూ వివాదాలు తగ్గుతాయి. అర్హులైన రైతులకే పెట్టుబడి సాయం అందుతుంది. ప్రభుత్వ ధనం వృథాకాకుండా ఉంటుంది..’’ – సి.నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆరు దశల్లో ప్రక్షాళన.. 1 ఆన్లైన్ పహాణీల తనిఖీ భూ రికార్డుల ప్రక్షాళన తొలి దశలో.. గ్రామాల్లోని సర్వే నం బర్ల వారీగా పహాణీలను పరిశీలిస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది.. సేత్వార్ లేదా ఖాస్రా, చెస్సలా పహాణీల్లోని భూ విస్తీర్ణంతో సరిపోతుందా లేదా పరిశీలిస్తారు. రికార్డుల్లో ఉన్న మేరకు ఆ భూమి స్వభావాన్ని కూడా సరిచూస్తారు. పట్టాదారు, అనుభవదారులు వివరాలు సరిపోలుతున్నాయా లేవా చూస్తారు. దీనికి అనుగుణంగా సాగుకు పనికిరాని, పనికి వచ్చే భూ విస్తీర్ణంలో మార్పులు, సర్వే నంబర్ల వారీగా విస్తీర్ణం పెరిగిందా.. తగ్గిందా..? తొలగించాల్సిన పేర్లేమైనా ఉన్నాయా? పేరు మార్పిడి.. పట్టా మార్పిడి.. కొత్త ఎంట్రీలు.. కొన్న వారి పేర్లు నమోదు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తారు. 2 ఆన్లైన్ 1బీ పరిశీలన ఆన్లైన్ పహాణీలో సర్వే నంబర్ల వారీ వివరా లుంటే.. 1బీలో రైతుల వారీ వివరాలుంటాయి. అంటే ఒక రైతుకు ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉన్నా ఒకే చోట అందుబాటులో ఉండే రికార్డును 1బీ అంటారు. ఈ రికార్డు పరిశీ లనలో భాగంగా అక్షర దోషాలు, పాస్ పుస్తకాల్లో తేడాలు, పట్టాదారు వివరాల్లో తేడాలు, అమ్మకం జరిగిన భూముల వివరాలు, డబుల్ ఖాతాల వివరాలను పరిశీలిస్తారు. రైతుల పట్టా పాస్ పుస్తకాల ఆధారంగా జరిగే ఈ పరిశీలన అనంతరం.. మార్పు చేర్పులను రైతులకు చూపించి, ప్రతి రైతు నుంచి సంతకం కూడా తీసుకుంటారు. 3 గ్రామ రిజిస్టర్ తయారీ ఆన్లైన్ పహాణీ, 1బీ రికార్డుల పరిశీలన తర్వాత గ్రామం యూనిట్‌గా రిజిస్టర్ తయారు చేస్తారు. ఇందులో సేత్వార్, ఖాస్రా, చెస్సలా పహాణీల ప్రకారం ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది.. ప్రస్తుత పహాణీలో ఎంత భూమి ఉంది.. తదితర వివరాలను నమోదు చేస్తారు. సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణంలో తక్కువ, ఎక్కువలుంటే వాటిని నమోదు చేస్తారు. ఇనాం పట్టాభూములు, ప్రభుత్వ, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్, భూదాన భూముల వివరాలను కూడా ఈ రిజిస్టర్లలో సర్వే నంబర్ల వారీగా పొందుపరుస్తారు. 4 మార్పులపై తహసీల్దార్ ఉత్తర్వులు భూ రికార్డుల ప్రక్షాళనలో తొలి మూడు దశలు పరిశీలనకు సంబంధించినవికాగా.. నాలుగో దశ మాత్రం మార్పులు చేపట్టేది. ఈ దశలోనే క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది గుర్తించిన తప్పు ఒప్పులు, మార్పులు చేర్పుల ఆధారంగా.. రెవెన్యూ రికార్డులను మార్చడానికి తహసీల్దార్లు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులపై గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)తో పాటు తహసీల్దార్ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. అసైన్దారులు, పట్టాభూముల తొలగింపులు, పట్టాదారు పేరు సవరణ, అనుభవదారు పేరు సవరణ, విస్తీర్ణం, ఖాతా నంబర్లు, భూ వర్గీకరణలో సవరణలను అధికారికం చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో చేర్చాల్సిన పట్టాదారుల జాబితాను కూడా తయారు చేస్తారు. 5 మాన్యువల్ పహాణీల తయారీ ఐదో దశలో కొత్త రికార్డుల తయారీ ప్రక్రియను చేపడతారు. మాన్యువల్ రికార్డులను తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచేం దుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఇందులో ఆన్లైన్ పహాణీ, 1బీ రికార్డుల్లో గుర్తించిన సవరణలు, గ్రామ రిజిస్టర్లో పొందుపరచిన ప్రతిపాదనల ఆధారంగా ఇచ్చిన తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు వివరాలను నమోదు చేస్తారు. ప్రస్తుతానికి గతంలో ఉన్న పహాణీలో ఉన్న కాలమ్లన్నింటినీ భర్తీ చేస్తున్నారు. కాలమ్‌ల సవరణపై అధికారిక నిర్ణయం వచ్చిన తర్వాత ఆ మేరకు నమోదు చేస్తారు. 6 ఆన్లైన్ పహాణీల తయారీ రికార్డుల ప్రక్షాళనలో చివరిదైన ఆరో దశలో కొత్త భూ రికార్డులన్నింటినీ పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేస్తారు.ఈ వివరాలే ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయం పథకానికి కీలకం కానున్నాయి.అన్ని రకాల పరిశీలనల అనంతరం మాన్యువల్ పహాణీలో పేర్కొన్న వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో.. భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తవుతుంది. -
అడ్డొస్తే చంపేస్తాం..!
సిరిసిల్ల క్రైం: అడ్డదారిలో ఇసుక తరలిం చొద్దని సూచించిన వీఆర్వోను ఇసుకాసు రులు చంపుతామని బెదిరించారు. బాధిత వీఆర్వో సంతోష్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగు నుంచి స్థానిక అవసరాలకు ఇసుక తరలిం చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇసుక అవసరమైన వారు తొలుత మున్సిప ల్ అధికారులకు దరఖాస్తు చేయాలి. వారి చ్చిన నివేదిక ఆధారంగా బ్యాంకులో డీడీ చెల్లించి రెవెన్యూ కార్యాలయంలో సమర్పిం చాలి. అధికారులు దానిని పరిశీలించి ఇసుక తరలించడానికి అవసరమైన వేబిల్లులను వీఆర్వో ద్వారా ఇస్తారు. దీని ఆధారంగా వారంలో మంగళ, గురు, శనివారాల్లోనే రోజూ 200–400 ట్రిప్పుల వరకు ఇసుక తర లించేందుకు అవకాశం ఉంటుంది. కానీ, అధికారుల పర్యవేక్షణ లోపం, రద్దీని ఆసరా చేసుకున్న కొందరు ఇసుకాసురులు నిబంధ నలు అతిక్రమించి ఇసుక తరలిస్తున్నారు. గురువారం సైతం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక తరలిస్తూ సిరిసిల్ల వీఆర్వో సంతోష్ కంటప డ్డాడు. ఆ వాహనాన్ని ఆపిన వీఆర్వో వే బిల్లు చూపాలని ట్రాక్టర్ డ్రైవర్‌ను కోరగా... ట్రాక్టర్‌ను పక్కన పెడతానని చెప్పిన డ్రైవర్, కొంత దూరం వెళ్లి, ఇసుకను రోడ్డుపై పోసి ఉడాయించాడు. ఆ తర్వాత ట్రాక్టర్ యజ మానినంటూ అక్కడకొచ్చిన ఓ వ్యక్తి... ‘ఎవడివిరా నువ్వు.. నా ట్రాక్టర్‌నే ఆపుతా వా? అడ్డొస్తే... చంపేస్తా’ అని బెదిరించాడు. ఇతర ట్రాక్టర్ యజమానులు జోక్యం చేసుకోవడంతో వివాదం సమసిపోయింది. సదరు ట్రాక్టర్ యజమానిపై ఫిర్యాదు చేస్తానని వీఆర్వో సంతోష్ తెలిపారు. -
అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా?
గూడూరు : అధికారం ఉంటే ఎక్కడైనా, ఏదైనా ఏర్పాటు చేయెచ్చేమో మరి...అదెలా అనుకుంటున్నారా.. ఈ ఫ్లెక్సీలను చూస్తేనే ఆ అధికార దర్పమేమిటో తెలుస్తోంది. అవి రెండూ ప్రభుత్వ కార్యాలయాలు.. ఒకటి చిల్లకూరు పోలీస్‌స్టేషన్ కాగా, మరొకటి రెవెన్యూ కార్యాలయం. ఆ ప్రాంతంలో ఓ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా సామాన్య మానవుడు ఆయా కార్యాలయాల ముందు ఏదైనా అడ్డుగా పెడితే వారికి నరకం చూపిస్తారు. అలాంటి ఆ కార్యాలయాల ముందే అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలువురు ఔరా .. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారే ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారా.. లేక ఆయా శాఖలకు చెందిన అధికారులులే వాటిని ఏర్పాటు చేశారా.. అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ నాయకుడి జన్మదిన కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధులకన్నా, అన్ని శాఖల అధికారులే ఎక్కువగా హాజరయ్యారు. దీన్ని బట్టే అధికార పార్టీకి ఏ స్థాయిలో అధికార యంత్రాంగం కొమ్ము కాస్తోందో తెలియకనే తెలుస్తుంది మరి. -
రేషన్ ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం
నాలుగు నెలలుగా తనకు రేషన్ సరిగా ఇవ్వటం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా ఆగలి మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగేంద్ర(45)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని సోదరి వీరనాగమ్మ చనిపోవటంతో ఆమె ఇద్దరు పిల్లలు కూడా వారితోనే ఉంటున్నారు. అయితే, నాగేంద్ర రేషన్‌కార్డుపై అతని కుటుంబానికి మాత్రమే రేషన్ సరుకులు అందుతున్నాయి. తన చెల్లెలి పిల్లల పోషణ భారం తనపైనే ఉందని, వారికి కూడా రేషన్ ఇవ్వాలని అధికారులను కోరుతున్నా ఫలితం కనిపించడం లేదని.. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు. అతని డిమాండ్ మేరకు నాలుగు నెలల రేషన్ సరుకులను ఇచ్చి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పంపించి వేశారు. -
ఎయిర్‌ఫోర్స్ రాడార్ కేంద్రానికి భూమి అప్పగింత
పొదలకూరు: శ్రీపొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మరుపూరు వద్ద భారత వైమానిక దళానికి 63.6 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం అప్పగించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు వి.కృష్ణారావు చెన్నై వైమానిక స్థావరం వింగ్ కమాండర్ మణికి స్వాధీన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ... శత్రుదేశాల నుంచి ముప్పును పసిగట్టేందుకు మరుపూరు వద్ద రాడార్‌కు సిగ్నల్స్ బాగా అందుతుండటంతో నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. -
విజయనగరం రెవెన్యూ కార్యాలయం ముట్టడి
-
విద్యుత్ చార్జీల పెంపుపై ఆగ్రహం
కుందుర్పి (అనంతపురం) :రాష్ట్రప్రభుత్వం పెంచిన విధ్యుత్తు చార్జీలకు నిరసనగా గురువారం వైఎస్సార్సీపీ నాయకులు కుందుర్పిలో ర్యాలీ మరియు రెవిన్యూకార్యాలయం ముందు ధర్నా చేపట్టి ఆంధోళన చేపట్టారు.స్థానిక రామస్వామి ఆలయం నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక రెవిన్యూకార్యాలయం ముందు రెండుగంటలపాటు ధర్నా నిర్వహించారు.కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపి ప్రదాన కార్యాలయానికి తాళాలు వేసి బైటాయించి నిరసన తెలిపారు.అనంతరం మండల కన్వినర్ ఎస్‌కేఆంజినేయులు మరియు నాయకులు నరేష్,రామూర్తి,ఎన్‌బాబు,ఈరాము తదితరులు మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన 9నెలలు కాలంలోనే ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని రుణమాఫీ,పండ్లతోటల బిల్లులు,ఫించన్లు,తదితర పథకాలను అమలుచేయకపోగా రోజూ ప్రజలకు అపద్దప్రకటనలతో సీఎం చంద్రబాబు ముందుకుసాగుతున్నారని తెలిపారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాలనలో రూపాయి విధ్యుత్తు చార్జీలు పెంచకుండా రైతులకు మరియు సామాన్యప్రజల అభివృధ్దికి బాటలు వేశారని సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది గడువక ముందే విధ్యుత్తు చార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపారన్నారు.అనంతరం ఏపీఓ నీరజను అక్కడకు చేరుకున్న నాయకులు పలువురు ఉపాదికూలీలు బిల్లులు చెల్లించాలని నిలదీశారు.ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పెద్దప్పయ్య, అతావుల్లా, పాలాక్షి, బండారప్ప, స్టుడియో కిష్ట, తిమ్మ రాజు, ఎనుముల దొడ్డిరాముడు, పూలరామాంజి, మల్లి, శివలింగమూర్తి, శ్రీనివాసులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పహాణీలకు పరేషన్..!
మంచాల: ప్రభుత్వం పంట రుణాలు ఇస్తుండడంతో మండల రెవెన్యూ కార్యాలయం, బ్యాంకులు రైతన్నలతో కిటకిటలాడుతున్నాయి. గత రెండు,మూడు వారాలుగా రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో కుటుంబ సమగ్ర సర్వే తదితర పనులల్లో ఉండడంతో పహాణీలు ఇవ్వలేకపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయమే అధికారులు రాక బోసిపోయింది. ఇంక బోడకొండ,లింగంపల్లి వంటి కొన్ని గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పహాణీల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సర్వే పూర్తయిన రెవెన్యూ కార్యదర్శులు తహసీల్దార్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు సం బంధించిన పహాణీలు రాసి ఇస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడాన్నికి రైతులు పెద్ద సంఖ్యలో పహా ణీల కోసం వస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం సోమవారం రైతులతో కిటకిట లాడింది. రెవెన్యూ కార్యదర్శులకు తీరిక లేకుండా పోయింది. అదే విధంగా బ్యాంకుల్లోకి కూడా రైతులు అధిక సంఖ్యలో రావడంతో బ్యాంకు అధికారులకు తీవ్ర ఇబ్బందిగా మా రింది. దీంతో బ్యాంకు అధికారులు రుణాలు తీసుకోవడానికి వస్తున్న రైతులకు వరుసక్రమంలో దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో రాకుండా రోజుకు పరిమితి సంఖ్యలో మాత్రమే దరఖాస్తు ఫారాలు ఇచ్చి ఇబ్బందులు కలుగకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. తప్పని తిప్పలు.. బ్యాంకు రుణాలు తీసుకోవడానికి రెవెన్యూ కార్యాలయం వచ్చే రైతులకు ఇబ్బందులు తప్పడం లేవు. రైతులు పట్టాలో ఉండి రికార్డుల్లో ఉన్నా కూడా కంఫ్యూటర్ పహణీలో మాత్రం రావడం లేదు. మరికొంత మంది పట్టాల్లో ఉండి ఆ భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో మాత్రం పేర్లు రావడం లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కంప్యూటర్ పహాణీలో కొంత మంది ఖాతా నంబర్లు సక్రమంగా రావడం లేదు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో రెవె న్యూ రికార్డులు కంప్యూటరీకరణ కాలే దు. ఇలా అనేక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారులు అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా సక్రమంగా పనులు చేయించి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు
ఫిరంగిపురం : స్థానిక రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో జిల్లా ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు మూడు బృందాలుగా ఏర్పడి రాత్రి 6.30 గంటల వరకు 23 రకాల రిజిస్టర్లను పరిశీలించారు.తనిఖీలలో సీఐలు శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, యాదగిరి, సత్తెనపల్లి సాంఘిక సంక్షేమశాఖ ఏఎస్‌డబ్లు అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. రెంటచింతలలో... ఎస్సీ బాలికల హాస్టల్లో గురువారం ఏసీబీ డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీ నిర్విహ ంచారు. అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి, ఏసీబీ సీఐ కె.సీతారామ్, సత్తెనపల్లి తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ ఎన్.అల్లూరయ్య, 15 మంది బృంద సభ్యులు తనిఖీలో పాల్గొన్నారు. -
దరఖాస్తులకు మోక్షం లభించేనా!
పత్తికొండ అర్బన్ పత్తికొండలోని రెవెన్యూ కార్యాలయంలో విద్యార్థులు, రైతులు అందజేసిన దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఎంకిపెళ్లి సుబ్చిచావుకొచ్చిందన్నట్లుగా తహశీల్దారు బదిలీ విద్యార్థులు, రైతులకు తలనొప్పిగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమ కాలంలో పెండింగ్‌లో పడిన వందలాది అప్లికేషన్లు ఇటీవలే పూర్తి చేశారు. పత్తికొండ తహశీల్దారుగా పనిచేసిన రామక్రిష్ణ ఈనెల 23న సన్మానం ముగించుకుని కడప జిల్లాకు బదిలీపై వెళ్లారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అందజేసిన దరఖాస్తులు కొన్ని పెండింగ్‌లో పడగా మరికొన్ని వాటికి జత చేరాయి. స్కాలర్షిప్ రెన్యూవల్ గడువు ముగుస్తుందని కళాశాల, పాఠశాలల సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో విద్యార్థులు మీసేవ కేంద్రాలు, తహశీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. దీంతో సుమారు 300పైగా దరఖాస్తులకు పెండింగ్‌లో పడినట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. బదిలీల కారణంగా నూతన తహశీల్దారు పేరుమీద డిజిటల్ కీ సంతకం నమోదు కాకపోవడం వల్ల సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఒక్కరోజులో పరిష్కరిస్తాం: శివరామయ్య, తహశీల్దారు పత్తికొండ కొత్తగా బాధ్యతలు తీసుకున్నా. వచ్చి రెండురోజులే అయింది. ఆర్డీఓ, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసుకోవడానికి ఒకరోజు గడిచిపోయింది. సాంకేతిక కారణాలతో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. వీఆర్ఓల సమావేశం ఏర్పాటు చేసి ఒకరోజులో దరఖాస్తుల జారీకి చర్యలు తీసుకుంటాం. -
ఏసీబీ వలలో మరో చేప
ధర్మారం, న్యూస్‌లైన్ : రెవెన్యూ కార్యాలయంలో ప్రతి పనికి లంచం పుచ్చుకుంటూ రైతులను, ప్రజలను వేధిస్తున్నారు. గతం లో లంచం కోసం డిమాండ్ చేసిన ధర్మారం వీఆర్వో జుంజుపల్లి రాజ య్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా దొంగతుర్తి వీఆర్వో గా పనిచేస్తూ ధర్మారం ఇన్చార్జి వీఆర్వోగా వ్యవహరిస్తున్న నక్క రాజయ్యను శుక్రవారం రాత్రి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలి పిన వివరాలు.. దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల రమేష్ తన తండ్రి మల్లయ్య పేర ఉన్న 20 గుంటల భూమిని గిఫ్ట్‌డీడ్ చేయించుకున్నాడు. ఆ భూమిని జమాబందీ చేయాలని వీఆర్వో రాజయ్యను ఆశ్రయించగా రూ.5వేలు డిమాండ్ చేశాడు. రూ.2500 ఇస్తానని చెప్పిన రమేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు శుక్రవారం రాత్రి 8గంటలకు రమేష్ వీఆర్వో రాజయ్య ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వగా, ఆయన వాటిని జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌తోపాటు సిబ్బంది రాజయ్యను పట్టుకున్నారు. అతడు ధర్మారంలో ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ కార్యాలయంలో రమేష్‌కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. లంచం డబ్బులను స్వాధీనం చేసుకొని రాజయ్యపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వీవీ.రమణమూర్తి, శ్రీనివాస్‌రాజు, సిబ్బంది పాల్గొన్నారు. కావాలనే ఇరికించారు తనకు డబ్బులు అక్కరలేదని చెప్పినప్పటికీ రమేష్ బలవంతంగా జేబులో పెట్టాడని, ఇంతలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారని వీఆర్వో రాజయ్య పేర్కొన్నాడు. తమ శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తనను కావాలనే ఇరికించాడని ఆరోపించారు. సదరు ఉద్యోగి సూచన మేరకే జమాబందీ చేశానని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు.