మంగళవారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఖాళీగా దర్శనమిస్తున్న తహసీల్దార్ కార్యాలయంలో కుర్చీలు
సాక్షఙ, బిట్రగుంట (నెల్లూరు): బోగోలు మండలంలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన పక్కనపెట్టి చుట్టపుచూపుగా కార్యాలయాలకు వచ్చిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కార్యాలయాలైన రెవెన్యూ, మండల పరిషత్, డ్వాక్రా, తదితర కార్యాలయాల అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకూ రాకపోతుండటం, అసలు వస్తారో రారో కూడా తెలియకపోతుండటంతో ప్రజల అవస్థలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిలో ఒక్కరూ కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు.
అందరూ కావలి, నెల్లూరు నుంచి రావాల్సి ఉండటంతో తీరిగ్గా ప్రయాణ సౌలభ్యాన్ని చూసుకుని వస్తున్నారు. ఉదాహరణకు రైతులు, అర్జీదారులతో నిత్యం రద్దీగా ఉండే తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్‌లలో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు. వీఆర్వోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కలెక్టర్ అయినా కనిపిస్తాడేమో కానీ వీఆర్వోలు మాత్రం ఆచూకీ కూడా దొరకరు. దరఖాస్తుదారులు ఫోన్ చేస్తే సమాధానం చెప్పరు. ఫీల్డ్‌లో ఉన్నామని ఫోన్ పెట్టేస్తారు. గట్టిగా అడిగితే సోమవారం గ్రీవెన్స్‌లో కనిపించమని చెబుతున్నారు.
ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీలే..
వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినీ కుర్చీలు ఖాళీగా ఉంటాయని, అదేమని అడిగితే ఒకరేమో ఆర్డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, మరొకరేమో ఖజానాకు వెళ్లారని, ఇంకొకరేమో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారని వాపోతున్నారు. ఎప్పుడు వచ్చినా ఇవే సమాధానాలు చెబుతున్నారు తప్ప పనులు చేయడం లేదని వివరిస్తున్నారు. కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సరిగా ఉండటం లేదని, టైపిస్ట్ స్థానంలో వీఆర్‌ఓలు పనిచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ చిన్న పని అడిగినా సర్వర్ పనిచేయడం లేదని పంపిచేస్తున్నారని వాపోతున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఉద్యోగులు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. ప్రత్యేకాధికారులు మాత్రం గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు.
‘స్పందన’ను నీరుగార్చారు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అట్టహాసంగా నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని మండలంలో అధికారులు నీరుగార్చారు. తహసీల్దార్ కార్యాలయంలో స్పందన పేరుతో చిన్న ఫ్లెక్సీ కట్టి చేతులు దులుపుకున్నారే తప్ప కార్యక్రమాన్ని నిర్వహించలేదు. మిగిలిన కార్యాలయాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయలేదు. అసలు స్పందన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా గ్రామాల్లో దండోరా వేయించడం కానీ, ప్రెస్‌నోట్ విడుదల చేయడం కానీ చేయలేదు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని, గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. చిన్న పనికి కూడా పదేపదే తిప్పుకోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సరికాదు.
– మేకల శ్రీనివాసులు, ఎంపీటీసీ
Comments
Please login to add a commentAdd a comment