Mandal parishad office
-
అధికారులా.. అతిథులా..!
సాక్షఙ, బిట్రగుంట (నెల్లూరు): బోగోలు మండలంలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన పక్కనపెట్టి చుట్టపుచూపుగా కార్యాలయాలకు వచ్చిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కార్యాలయాలైన రెవెన్యూ, మండల పరిషత్, డ్వాక్రా, తదితర కార్యాలయాల అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకూ రాకపోతుండటం, అసలు వస్తారో రారో కూడా తెలియకపోతుండటంతో ప్రజల అవస్థలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిలో ఒక్కరూ కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు. అందరూ కావలి, నెల్లూరు నుంచి రావాల్సి ఉండటంతో తీరిగ్గా ప్రయాణ సౌలభ్యాన్ని చూసుకుని వస్తున్నారు. ఉదాహరణకు రైతులు, అర్జీదారులతో నిత్యం రద్దీగా ఉండే తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్లలో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు. వీఆర్వోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కలెక్టర్ అయినా కనిపిస్తాడేమో కానీ వీఆర్వోలు మాత్రం ఆచూకీ కూడా దొరకరు. దరఖాస్తుదారులు ఫోన్ చేస్తే సమాధానం చెప్పరు. ఫీల్డ్‌లో ఉన్నామని ఫోన్ పెట్టేస్తారు. గట్టిగా అడిగితే సోమవారం గ్రీవెన్స్‌లో కనిపించమని చెబుతున్నారు. ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీలే.. వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినీ కుర్చీలు ఖాళీగా ఉంటాయని, అదేమని అడిగితే ఒకరేమో ఆర్డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, మరొకరేమో ఖజానాకు వెళ్లారని, ఇంకొకరేమో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారని వాపోతున్నారు. ఎప్పుడు వచ్చినా ఇవే సమాధానాలు చెబుతున్నారు తప్ప పనులు చేయడం లేదని వివరిస్తున్నారు. కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సరిగా ఉండటం లేదని, టైపిస్ట్ స్థానంలో వీఆర్ఓలు పనిచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ చిన్న పని అడిగినా సర్వర్ పనిచేయడం లేదని పంపిచేస్తున్నారని వాపోతున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఉద్యోగులు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. ప్రత్యేకాధికారులు మాత్రం గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ‘స్పందన’ను నీరుగార్చారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అట్టహాసంగా నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని మండలంలో అధికారులు నీరుగార్చారు. తహసీల్దార్ కార్యాలయంలో స్పందన పేరుతో చిన్న ఫ్లెక్సీ కట్టి చేతులు దులుపుకున్నారే తప్ప కార్యక్రమాన్ని నిర్వహించలేదు. మిగిలిన కార్యాలయాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయలేదు. అసలు స్పందన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా గ్రామాల్లో దండోరా వేయించడం కానీ, ప్రెస్‌నోట్ విడుదల చేయడం కానీ చేయలేదు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని, గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. చిన్న పనికి కూడా పదేపదే తిప్పుకోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సరికాదు. – మేకల శ్రీనివాసులు, ఎంపీటీసీ -
పరిషత్ భవనానికి అవినీతి పగుళ్లు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిర్మాణంలో ఉన్న ఈ ప్రభుత్వ భవనాన్ని చూశారా? దీని కోసం రూ.77లక్షలు ఖర్చు పెట్టారంటే నమ్ముతారా? ఇందులో సందేహం ఉన్నా నమ్మి తీరాల్సిందే. పాచిపెంట మండల పరిషత్ కార్యాలయం కోసం చేపట్టిన ఈ భవన నిర్మాణంలో ఉండగానే లోపాలు బయటపడుతున్నాయి. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పగుళ్లు కన్పిస్తున్నాయి. అయినా ఇప్పటికే మంజూరు చేసిన రూ.77లక్షలు సరిపోలేదు. ఒక్క గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయాలంటేనే మరో రూ. 5 లక్షలు కావాలంటున్నారు. ఇక ఫస్ట్ ఫ్లోర్‌కు ఇంకెంత అడుగుతారో చూడాలి. అదే రూ.77లక్షలతో మన సొంతానికని నిర్మించుకుంటే ఇంతకన్న పెద్ద భవనమే కట్టుకోవచ్చు.. ప్రభుత్వ భవన నిర్మాణాలంటే ఇలాగే ఉంటాయా? నిర్మాణంలో ఉన్న ఈ భవనం చూసిన వారికి ఆ అభిప్రాయం కలగక మానదు. జెడ్పీ అధికారులకు ఇదే అనుమానం వచ్చిందేమో? తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులకు జెడ్పీ సీఈఓ రాజకుమారి లేఖ రాశారు. పాచిపెంట మండల పరిషత్ కార్యాలయ భవనం నిర్మించేందుకు 2012-13లో రూ.72 లక్షలు బీఆర్జీ నిధులు మంజూరు చేశారు. జీప్లస్ 1 తరహాలో నిర్మించేందుకు కాంట్రాక్ట్‌ను టీడీపీకి చెందిన ఓ నేత తీసుకున్నారు. సంవత్సర కాల పరిమితితో నిర్మాణం పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. కానీ పనులు సకాలంలో పూర్తి చేయలేదు. సరికదా మంజూరు చేసిన రూ.72లక్షలు సరిపోలేదంటూ నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. గ్రౌండ్ ప్లోర్లో అరకొర పనులు చేయగా, ఫస్ట్ ఫ్లోర్లో శ్లాబ్ మాత్రమే వేశారు. గ్రౌండ్ ప్లోర్లో పనులు పూర్తి చేయాలంటే మరో రూ.10 లక్షలు అవసరమని కాంట్రాక్టర్ తరఫున వకాల్తా పుచ్చుకుని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోరారు. ఇక, ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేయాలంటే ఇంకెంత అడుగుతారో చూడాలి. మొత్తానికి కాంట్రాక్టర్ అడిగారని, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోరారని తల ఊపుతూ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసేందుకని మరో రూ.10లక్షలు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.5 లక్షలు మంజూరు చేశారు. రావడమే తరువాయి... దాన్ని కూడా కాంట్రాక్టర్ ఖర్చు పెట్టేశారు. ఈ లెక్కన రూ.77లక్షలు ఖర్చు పెట్టినట్టయింది. అయినా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంత ఖర్చు పెడుతున్నా పనులు పూర్తికాకపోవడానికి కారణమేంటని జెడ్పీ సీఈఓ రాజకుమారి ఆరాతీశారు. పాచిపెంట భవనానికి కొన్ని నెలలకు ముందు మంజూరై నిర్మాణాలు పూర్తయిన చీపురుపల్లి, ఎస్‌కోట, బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయాల భవనాల్ని ఒక్కసారి పరిశీలించారు. అదే జీప్లస్-1 తరహాలో నిర్మించిన ఆ మూడు మండలాల భవనాలకు తొలుత ఒక్కొక్కదానికి రూ.55 లక్షలు మంజూరవగా, ఎస్ఎస్ఆర్ రేట్లు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా సరిపోదని డిమాండ్ చేయడంతో అదనంగా ఒక్కొక్కదానికి మరో రూ.16లక్షలు చొప్పున మంజూరు చేశారు. మొత్తానికి రూ.71లక్షల వ్యయంతో సకాలంలో పనులు పూర్తయ్యాయి. కానీ పాచిపెంటలో రూ.77లక్షలు మంజూరు చేసినా గ్రౌండ్ ఫ్లోరే పూర్తి కాలేదు. పైన కేవలం శ్లాబ్ కన్పిస్తోంది. ఇదేదో గందరగోళంగా ఉందన్న అభిప్రాయంతో ఇటీవల జెడ్పీ సీఈఓ రాజకుమారి పాచిపెంట వెళ్లారు. ఎక్కడికక్కడ కన్పిస్తున్న పగుళ్లు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర తనిఖీ చేసి, రిపోర్టు ఇవ్వాలని కోరుతూ క్వాలిటీ కంట్రోల్‌కు లేఖ రాశారు. మరీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులేమిస్తారో గాని ఆ భవనం పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కల్గక మానదు. ఒక్క గ్రౌండ్ ప్లోర్ పూర్తి చేయడానికి రూ.82లక్షలు అవుతుందని అధికారులు, కాంట్రాక్టర్లు చెబుతుంటే ఫస్ట్ ప్లోర్ పూర్తి చేయడానికి ఇంకెంత అడుగుతారో ? క్వాలిటీ కంట్రోల్‌కు లేఖ రాశా: జెడ్పీ సీఈఓ నిర్మాణ పనులపై అనుమానం ఉంది. ఎక్కడికక్కడ పగుళ్లు, అసంపూర్తి నిర్మాణాలపై అసంతృప్తి ఉంది. దానికోసమే తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులకు లేఖ రాశానని జెడ్పీ సీఈఓ రాజకుమారి తెలిపారు. -
టీడీపీ తమ్ముళ్ల ఢిష్యూం.. ఢిష్యూం..
ఎస్సీ రుణాల మంజూరులో వివాదం కళ్యాణదుర్గం : టీడీపీ తమ్ముళ్ల మధ్య అసంతృప్తి సెగలు ఒక్కసారిగా భగ్గుమని కొట్టుకునే స్థాయికి చేరాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ మండల కన్వీనర్ డీకే రామాంజినేయులు, పాలవాయి గ్రామానికి చెందిన టీడీపీ యువనాయకుడు రాముల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల మంజూరుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పాలవాయి గ్రామ పంచాయితీకి రెండు యూనిట్లు మంజూరయ్యాయి. పంచాయితీ పరిధిలోని పాలవాయి, మల్లాపురం గ్రామాలకు ఒకటి చొప్పున యూనిట్లు కేటాయించేలా టీడీపీ పెద్దలు తీర్మానం చేశారు. అదేతరహాలో టీడీపీ నియమించిన మండల కమిటీకి కూడా సిఫార్సు చేశారు. డీకే రామాంజినేయులు మల్లాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా పాలవాయి గ్రామంలో టీడీపీ నాయకుడిగా రాము వ్యవహరిస్తున్నారు. కాగా యూనిట్ల కేటాయింపు విషయంలో డీకే రామాంజినేయులు పాలవాయి యూనిట్‌కు అభ్యర్థిని కేటాయించడంలో జోక్యం చేసుకోవడాన్ని రాముతోపాటు ఎంపీటీసీ గోవిందప్ప వ్యతిరేకించారు. మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థుల ఎంపికకు నియమించిన మండల క మిటీ సమావేశానికి చేరుకున్న సదరు నాయకులు ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ చొక్కాలు పట్టుకుని ముష్టి యుద్ధాలకు దిగారు. కాళ్లతో తన్నుకొని, చివరకు చెప్పులు చేతికి తీసుకున్నారు. వెంటనే టీడీపీ నాయకులు వారిని అదుపుచేసి, వారిని అక్కడి నుంచి పంపించేశారు. -
సారూ..మా గోడు వినరూ!
ఎన్నో ఏళ్లుగా తీసుకుంటున్న పింఛన్లను ఒక్కసారిగా తొలగించి మా పొట్ట గొట్టడం భావ్యం కాదు.. అంటూ పింఛన్లు రద్దయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలూ ఉన్నా ఆసరా తీసేశారని, భరోసా కల్పిస్తామని చెప్పి.. వయస్సు మీదపడిన ఈ తరుణంలో తీరని వేదన మిగిల్చారని వాపోయారు. తమ గోడు ఆలకించి.. మళ్లీ పింఛన్లు ఇప్పించాలని వేడుకుంటూ వత్సవాయి మండలపరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. * పింఛన్ల రద్దుపై బాధితుల ఆవేదన * వత్సవాయి మండలపరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన వత్సవారు : తమకు ఆసరాగా ఉన్న పింఛన్లను సర్వేల పేరుతో తొలగించడంపై తీవ్ర ఆవేదనకు గురైన వృద్ధులు స్థానిక మండలపరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. వయసుడిగిన తరుణంలో తమ పొట్టకొట్టడం భావ్యం కాదంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని అర్హతలూ ఉన్న తమకు మళ్లీ పింఛన్లు ఇవ్వాలని వేడుకున్నారు. వీరంతా మండలంలోని భీమవరం వాస్తవ్యులు. ఇటీవల నిర్వహించిన పింఛన్ల సర్వేలో గ్రామానికి చెందిన 102 మంది అనర్హులని పేర్కొంటూ జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు. తొలగించిన వారిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కూడా ఉన్నారు. కొంతమందికి వయస్సు చాలలేదని, మరికొంతమందికి వారి పేరిట భూములున్నాయని కారణాలు చూపారు. వాస్తవానికి ఆందోళనకు వచ్చినవారిలో ఎవరికీ పొలాలు లేవు. వయస్సు చాలదంటూ తొలగించిన వారిలో దాదాపు 70 సంవత్సరాలు వయస్సున్న వారు కూడా ఉండటం గమనార్హం. జన్మభూమి కార్యక్రమానికి ముందే వీరి పేర్లు తొలగించిన విషయం తెలిసిందే. జన్మభూమి సభలో అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధితులు తమ గోడు వినిపించగా, గొడవ జరగకుండా ఉండటం కోసం వారికి సర్దిచెప్పారు. జాబితాలో పేరు లేనివారికి కూడా త్వరలోనే పింఛన్ అందజేస్తామని చెప్పి జన్మభూమి కార్యక్రమాన్ని ముగించారు. వారి మాటలు నమ్మి ఆ తర్వాత పింఛను గురించి అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగిన సమాధానం చెప్పడం లేదని గ్రామస్తులు వాపోయారు. దీంతో తప్పనిసరై తమ గోడు వెళ్లబోసుకోవడం కోసం ఆందోళన బాట పట్టినట్లు వివరించారు. సుమారు గంటసేపు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఏఎన్వీ నాంచారరావు మాట్లాడుతూ జాబితాలో లేని వారి పేర్లను గురించి గ్రామాల్లో సర్వే చేసినట్లు చెప్పారు. అర్హులకు త్వరలో పింఛన్లు అందుతాయనడంతో ఆందోళన విరమించారు. ఇరవయ్యేళ్లుగా తీసుకుంటున్నా.. దాదాపు ఇరవయ్యేళ్లుగా పింఛను తీసుకుంటున్నా. ఇప్పుడు వయస్సు చాలలేదంటూ జాబి తాలో నా పేరు తొల గించినట్లు అధికారులు చెప్పారు. ఇప్పుడు నా వయస్సు 80 సంవత్సరాలు. - పిల్లి నాగమ్మ -
గ్రామీణాభివృద్ధికి కృషి
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ధారూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉమాపార్వతి పాలకవర్గం పదవీబాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఎంపీపీ చాంబర్లో జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొని నూతనంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందిందని చెబుతున్నా గ్రామీణప్రాంతాలు ఇంకా అభివృద్ధికి దూరంగానే ఉన్నాయన్నారు. భవిషత్తరాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని, లేకుంటే వారు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నిధుల్లో ప్రతి పైసా పేదప్రజలకు చెందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ఉద్యోగులు సహకరించాలని కోరారు. పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తే మావంతుగా అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న ధారూరులోని సమావేశపు హాలు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ ఎంఎల్ఏ బి. సంజీవరావు మాట్లాడుతూ జిల్లాలో ధారూరు మండలం పూర్తిగా వెనుకబడి ఉన్నందున అభివృద్ధి పనులకు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను కోరారు. గతంలో రూ.5 కోట్లు మీరే మంజూరుచేశారని అయన గుర్తు చేశారు. సమావేశంలో సునీతారెడ్డిని ఎంఎల్ఏసంజీవరావు, జెడ్పీటీసీ పి.రాములు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉమా పార్వతి. ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ధారూరు సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ యూనూస్, పార్టీ నాయకులు రవీందర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, రాములు యాదవ్, కుమ్మరి శ్రీనివాస్, మల్లారెడ్డి, నాగార్జునరెడ్డి, వరద మల్లికార్జున్, అవుసుపల్లి అంజయ్య, కావలి అంజయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇది మా ప్రభుత్వం..మా మాటే వినాలి!
మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ నేతల హల్చల్ గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని రగడ ఎంసీతో వాగ్వాదం ఆదోని రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు హల్చల్ చేశారు. ఇది మా ప్రభుత్వం.. మా మాట వినకపోతే అంతే సంగతి అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. శనివారం స్మార్ట్‌కార్డు మండల కో-ఆర్డినేటర్ నరసింహారెడ్డితో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని పనులు చేయించుకున్నారని, ప్రస్తుతం తమకు అధికారం వచ్చినా మా పనులు చేయకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. గ్రామంలో సర్పంచ్‌కు తెలియకుండానే ఫినో కంపెనీ యాజమాన్యం గ్రామ కో-ఆర్డినేటర్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ బైచిగేరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ధనుసింగ్ ప్రశ్నించారు. గ్రామ కో-ఆర్డినేటర్ల ఎంపికలో తన ప్రమేయం లేదని ఎంసీ సమాధానం ఇచ్చినప్పటికీ శాంతించకుండా చిందులేశారు. కపటి గ్రామంలో కూడా నిబంధనలుకు విరుద్ధంగా కో-ఆర్డినేటర్లను ఎంపిక చేశారని ఆ గ్రామ నాయకుడు మాధవతో పాటు మరికొంతమంది అధికారులపై విరుచుకుపడ్డారు. నెట్టేకల్, దిబ్బనకల్, గోనబావి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఈరన్న, లక్ష్మన్న, వలమన్న తదితరులు గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని ఎంసీకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంసీ నర్సింహారెడ్డి ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్‌తో ఫోన్లో వివరిస్తుండగా అడ్డు తగిలిన దేశం నేతలు ప్రస్తుతం ఎంపికైన వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. నాయకులు డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్‌తో ఫోన్లో మాట్లాడుతూ అవసరమైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పింఛన్లు పంచాలని, కొత్తగా ఎన్నికైన వారితో పంపిణీ చేయించేది లేదని ఖరాకండీగా తేల్చి చెప్పారు. దాదాపు గంటపాటు ఎంపీడీఓ సలీంబాష సమక్షంలోనే టీడీపీ నాయకులు, మండల కో-ఆర్డినేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంసీ నర్సింహారెడ్డి విలేకరులకు చెప్పారు.