ఇది మా ప్రభుత్వం..మా మాటే వినాలి!
- మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ నేతల హల్‌చల్
- గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని రగడ
- ఎంసీతో వాగ్వాదం
ఆదోని రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు హల్‌చల్ చేశారు. ఇది మా ప్రభుత్వం.. మా మాట వినకపోతే అంతే సంగతి అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. శనివారం స్మార్ట్‌కార్డు మండల కో-ఆర్డినేటర్ నరసింహారెడ్డితో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని పనులు చేయించుకున్నారని, ప్రస్తుతం తమకు అధికారం వచ్చినా మా పనులు చేయకపోతే ఎలా అంటూ మండిపడ్డారు.
గ్రామంలో సర్పంచ్‌కు తెలియకుండానే ఫినో కంపెనీ యాజమాన్యం గ్రామ కో-ఆర్డినేటర్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ బైచిగేరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ధనుసింగ్ ప్రశ్నించారు. గ్రామ కో-ఆర్డినేటర్ల ఎంపికలో తన ప్రమేయం లేదని ఎంసీ సమాధానం ఇచ్చినప్పటికీ శాంతించకుండా చిందులేశారు.
కపటి గ్రామంలో కూడా నిబంధనలుకు విరుద్ధంగా కో-ఆర్డినేటర్లను ఎంపిక చేశారని ఆ గ్రామ నాయకుడు మాధవతో పాటు మరికొంతమంది అధికారులపై విరుచుకుపడ్డారు. నెట్టేకల్, దిబ్బనకల్, గోనబావి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఈరన్న, లక్ష్మన్న, వలమన్న తదితరులు గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని ఎంసీకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంసీ నర్సింహారెడ్డి ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్‌తో ఫోన్‌లో వివరిస్తుండగా అడ్డు తగిలిన దేశం నేతలు ప్రస్తుతం ఎంపికైన వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.
నాయకులు డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అవసరమైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పింఛన్లు పంచాలని, కొత్తగా ఎన్నికైన వారితో పంపిణీ చేయించేది లేదని ఖరాకండీగా తేల్చి చెప్పారు. దాదాపు గంటపాటు ఎంపీడీఓ సలీంబాష సమక్షంలోనే టీడీపీ నాయకులు, మండల కో-ఆర్డినేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంసీ నర్సింహారెడ్డి విలేకరులకు చెప్పారు.