లుకలుకలు
ప్రజాభిమానానికి దూరమైన తెలుగుదేశం పార్టీలో ఎన్నికలు సమీపించే కొద్దీ అంతర్గత విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ఎవరికి వారుగా వ్యక్తిగత ఇమేజ్ కోసం పరితపిస్తున్నారు. ఈక్రమంలో ఆపార్టీలో అంతరం పెరుగుతూ వస్తోంది.
జిల్లాలో వైఎస్సార్‌సీపీకి విశేషంగా ప్రజాభిమానం ఉంది. ఆవిషయం కడప పార్లమెంటు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలల్లో నిర్వహించిన ఎన్నికల్లో తేటతెల్లమైంది. సహకారశాఖ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలల్లో కూడా అదే హవా నడిచింది. ఎన్నికలు ఏవైనా ప్రజల ఆదరణ వైఎస్సార్‌సీపీకేనని స్పష్టమైంది. తీవ్ర అవమాన భారంతో ఉన్న టీడీపీ పుంజుకునేందుకు ప్రజామద్దతును చూరగొనాల్సి ఉంది. రాష్ట్ర విభజన అంశంలో ద్వంద వైఖరిని ప్రదర్శించి తన వైఫల్యాన్ని వ్యక్తపర్చింది. ప్రస్తుతం నేతల మధ్య ఐక్యతా లేమితో ఆపార్టీ కొట్టుమిట్టాడుతోంది. అందులో భాగంగా అంతర్గత విభేదాలు తీవ్రత రం అయ్యాయి.
పులివెందులలో తీవ్రతరమైన విభేదాలు....
ముందే అత్తెసరు కేడర్ ఉన్న పులివెందులలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రతరం అయ్యాయి.
ఒకరంటే ఒకరికి గిట్టని
వ్యవహారంగా నేతలు మసలు కుంటున్నారు. పార్టీ టిక్కెట్ కోసం ఎవరి ఎత్తులు వారు వేసుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితంగా రైతులకు ఎటుతిరిగి పంటల బీమా త్వరలో అందుతుందని తెలుసుకున్న రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి వర్గీయులకు మింగుడు పడనట్లు సమాచారం. అందులో భాగంగా సోమవారం నుంచి ఇంటింటి టీడీపీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ చేపట్టినట్లు తెలుస్తోంది. పులివెందుల టిక్కెట్ తన కుటుంబ సభ్యులకే దక్కాలనే ఆకాంక్ష ఎమ్మెల్సీకి ఉంది, తనకూ ఓ అవకాశం దక్కాలని రాంగోపాల్‌రెడ్డి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇరువురి మధ్య ఈ వ్యవహారంలో తీవ్ర స్థాయిలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ‘పుట్టా’
మైదుకూరు నియోజకవర్గ పరిధిలో తాను సూచించిందే వేదం అన్న భావనలో ఒక సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పయనిస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఇందుకు ఇటీవల నియమించిన జిల్లా కార్యదర్శి పదవి మరింత ఆజ్యం పోసింది. జీవీ సత్రంకు చెందిన మల్లికార్జునయాదవ్‌ను జిల్లా కార్యదర్శిగా నియమించారు. తమకు కనీస సమాచారం లేకుండా ఏకపక్షంగా నియమించారని సీనియర్ నేతలు రామసుబ్బనాయుడు, కటారి కృష్ణ మదనపడుతున్నారు. ఈవ్యవహరంలో సుధాకర్ యాదవ్ పట్ల సీనియర్ నేతలు రగిలిపోతున్నట్లు సమాచారం.
కడపలో పుత్తా ప్రమేయంపై కినుక...
కడప నియోజకవర్గంలో ప్రతి చిన్న విషయానికి కమలాపురం నియోజకవవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి జోక్యం చేసుకోవడంపై కడప నేతలు కినుక వహిస్తున్నారు. పార్టీ బలోపేతం చేయాలని లక్ష్యంతో కాకుండా తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచనకు అనుగుణంగా వ్యవహరిస్తుండటంపై వారు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే రాష్ర్ట అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పలు ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కడప వాసిని మాత్రమే నియమించాలని అభ్యర్థించినట్లు సమాచారం. ఇదే పరిస్థితి రాజంపేట నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతమున్న టీడీపీ నేతలను కాదని కాంగ్రెస్ వారి వైపు పార్టీ చూడటాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్ల మధ్య అంతరం పెరిగిపోతూ వవస్తోంది.