నల్లగొండ : టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నామని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండలో దుబ్బాక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దుబ్బాకను మర్యాదపూర్వకంగా కలిసేందుకు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయన అనుచరులు వచ్చారు. సమావేశంలో దుబ్బాకతో పాటు కంచర్ల కూడా మీడియాతో మాట్లాడారు. కంచర్లరాకతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మరింత బలపేతం అవుతుందని దుబ్బాక ఆశాబావం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ బలోపేతం అయ్యిందన్నారు. ప్రస్తుతం భూపాల్‌రెడ్డి రాకతో మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సహకారంతో తామంతా సమష్టిగా పనిచేస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకు తీరుతామని దుబ్బాక స్పష్టం చేశారు.
నర్సన్న అడుగుజాడలో..
తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని కంచర్ల అన్నారు. నర్సన్న ఆధ్వర్యంలో నల్లగొండలో టీఆర్‌ఎస్ జెండా పాతుదామని పిలుపునిచ్చారు. ఎంపీ గుత్తాతో పాటు ఆనాడే పార్టీ మారాల్సి ఉన్నా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయన వెంటరాలేకపోయానని చెప్పారు. ఎంపీతో 27 ఏళ్ల అనుబంధం ఉందని, నేనూ ఆయన శిష్యుడినే అని కంచర్ల తెలిపారు. ఒకప్పుడు కోమటిరెడ్డి, దుబ్బాక ఇద్దరు ప్రాణమిత్రులేనని.. కోమటిరెడ్డిని తనుకు పరిచయం చేసిన వ్యక్తి కూడా దుబ్బాకే అని అన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, మాలె శరణ్యారెడ్డి, బొర్రా సుధాకర్, పిల్లి రామారాజు, లొడంగి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment