నా కూతుర్ని దేవుడు నడిపిస్తాడు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి | Sakshi Personal Time With MLA Kancharla Bhupal Reddy | Sakshi
Sakshi News home page

నా కూతుర్ని దేవుడు నడిపిస్తాడు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

Published Sun, Apr 28 2019 9:01 PM | Last Updated on Sun, Apr 28 2019 9:01 PM

Sakshi Personal Time With MLA Kancharla Bhupal Reddy

నల్లగొండ : ‘నిత్యం ప్రజల్లో ఉండడం నాకిష్టం. మా ఊరు చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామం. మా నాన్న కంచర్ల మల్లారెడ్డి. గ్రామంలో ఏ పేద ఇంట్లో పెళ్లి అయినా, ఎవరికైనా ఆపద వచ్చినా వారిని మా నాన్న ఆదుకోవడం మా చిన్నతనం నుంచి చూస్తున్నా.. అప్పుడే నేను అందరిలోఒకడిగా ఉంటూ వారికి సాయం చేయాలనే ఆలోచన వచ్చింది.  చదువు పూర్తయిన తర్వాత రాజకీయాల వైపు మళ్లా.. అందుకు మా అన్న కంచర్ల కృష్ణారెడ్డి ప్రోత్సాహం, సహకారం అంతాఇంతా కాదు. అన్నీ తానై నడిపించాడు. నన్ను అర్థం చేసుకునే నా కుటుంబ సభ్యులంతా నాకు సహకారం అందించారు.

చిన్నప్పుడు మా నాన్న గ్రామంలో పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించేవారు. అదే ప్రస్తుతం మా గ్రామంలో కొనసాగిస్తున్నాం. 2008 నుంచి గ్రామంలో ఏ ఆడపిల్ల పెళ్లి అయినా రూ.20వేలు ఆర్థికసాయం మా కుటుంబం తరఫున అందజేస్తున్నాం. నా అభ్యున్నతికి మా అన్నయ్య ముందుండి  అన్నీ నడిపిస్తే నా భార్య రమాదేవి, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారు’ అని అంటున్నారు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. ఆయన శనివారం ‘సాక్షి’కి పర్సనల్‌ టైమ్‌ ఇచ్చారు.  తన చిన్ననాటి విషయాలు, విద్యాభ్యాసం మొదలుకొని కుటుంబంలో తన పాత్ర తదితర విషయాలను వెల్లడించారు.

సాక్షి : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ?
ఎమ్మెల్యే :  మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా నాన్న కంచర్ల మల్లారెడ్డి గ్రామంలో పేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవారు. ఏ సమస్య ఉన్నా  ప్రజలు మా ఇంటివద్దకే నిత్యం వచ్చేవారు. మా నాన్న వారికి సహకరిస్తూ వచ్చేవారు. నాన్న సేవాభావం చూసే రాజకీయాల్లోకి రావాలనే కోరిక నాలో మొదలైంది. నాటినుంచి నేటివరకు మా నాన్న మార్గంలోనే నడుస్తూ పేదలకు సహాయం చేస్తున్నా.
 
సాక్షి : మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది?
ఎమ్మెల్యే : 10వ తరగతి వరకు సొంత గ్రామం ఉరుమడ్లలోనే చదివాను. ఇంటర్మీడియట్‌ చిట్యాల రవి జూనియర్‌ కళాశాలలో చదివా. బీకాం డిగ్రీ హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో చేశాను.

సాక్షి : చిన్ననాటి పరిస్థితులు ఏమిటీ?
ఎమ్మెల్యే :  చిన్నప్పుడు మా మేనమామ ఊరు నెర్మట, వాళ్ల మేనమామ ఊరైన జైకేసారం వెళ్లి ఈత కొట్టేవాళ్లం. కబడ్డీ, క్యారమ్స్, ఇతర ఆటలు కూడా వేసవి సెలవుల్లో ఆడేవాళ్లం. గ్రామీణ ఆటలు జిల్లగోన బాగా ఆడేవాళ్లం.

సాక్షి : ఊరిలో దేవాలయం నిర్మించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది..?
ఎమ్మెల్యే : నా చిన్నతనంలో దేవాలయం మంచిగా ఉండేది. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేదు. దేవాలయంలో గేదెలను కట్టేసేవారు. అది చూసి గ్రామంలో దేవాలయం నిర్మించి పుణ్యక్షేత్రంగా మార్చాలన్న ఆలోచన వచ్చింది. రూ.3.50 కోట్లతో గ్రామంలో శివాలయంలో శ్రీ రామలింగేశ్వర, శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాలతో పాటు ఉపదేవాలయాలను నిర్మించాం. మాగ్రామంలో ఎంపీ, మంత్రి, ఇతర పెద్ద నాయకులైనవారు ఉన్నారు. దేవాలయం ఇలా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో దేవుని సంకల్ప బలంతోనే దేవాలయ నిర్మాణానికి పూనుకొని పూర్తి చేయించా.. శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతితో పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం చేయించా. ఇప్పుడు పుణ్యక్షేత్రంగా మారింది. ఇందుకు మా కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది.

 
సాక్షి : మీ జీవితంలో అత్యంత బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
ఎమ్మెల్యే : నా చిన్నతనంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేయి విరిగింది. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చెయ్యిని తొలగించారు. అప్పుడు చాలా బాధకలిగింది. రెండోసారి నాకు కూతురు పుట్టిన తర్వాత ఆమె నడవ లేదని తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది. కానీ నా జీవితంలో నా కూతుర్ని దేవుడు నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉంది.

సాక్షి : సంతోషకరమైన సంఘటన ఏమిటీ.?
ఎమ్మెల్యే : నల్లగొండ ఎమ్మెల్యేగా గెలవడమే నాకు అత్యంత సంతోషకరమైన సంఘటన.  

సాక్షి : వేసవిలో పాపతో కలిసి సందర్శనలకు వెళ్లారా..?
ఎమ్మెల్యే: నాకు దేవుడిపై నమ్మకం ఎక్కువ..అందుకే సెలవులు ఉంటే కుటుంబ సమేతంగా తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికే వెళ్తాం. ఇటీవల కుటుంబ సమేతంగా శ్రీనివాసుడిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నాం.

సాక్షి : రాజకీయంగా బిజీగా ఉంటారు కదా.. కుటుంబ వ్యవహారాల్లో ఎలా పాలు పంచుకుంటారు..?
ఎమ్మెల్యే: నిజమే.. రాజకీయాల్లో బిజీగా ఉంటాను. అయినప్పటికీ ఎంత రాత్రి అయినా పాపతో మాట్లాడే పడుకుంటాను. నాకంటే ఎక్కువగా నా భార్య రమాదేవే అన్నీ చూసుకుంటుంది. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. బయట అన్నయ్య చూసుకుంటాడు. ఇంట్లో నా భార్య చూసుకుంటుంది.

సాక్షి : మీ పెళ్లి అరేంజ్‌డ్‌.. ప్రేమ వివాహమా?
ఎమ్మెల్యే : మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2007 ఫిబ్రవరి 21న జరిగింది. మాకు ఒక కూతురు. ఆమె పేరు శ్రీలక్ష్మి, 4వ తరగతి చదువుతోంది.

సాక్షి : రోజువారీ కార్యక్రమాలు ఏమిటీ?
ఎమ్మెల్యే : ప్రతిరోజూ లేవగానే తయారై వివిధ పనులపై వచ్చేవారితో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుంటాను. ఇతర కార్యక్రమాలు ఉంటే గ్రామాలకు వెళ్లడం, పార్టీ, ప్రజా కార్యక్రమాలను చూసుకోవడమే. నేను ప్రతిరోజూ రాజకీయంగా బిజీగా ఉన్నా ఎంత రాత్రైనా ఇంటికి వచ్చిన తర్వాత మా కూతుర్ని మందలించే పడుకుంటాను. నా కూతురు నడవలేకపోయినా ఆమె స్కూల్‌కు బస్సులోనే వెళ్తుంది. అన్నెపర్తిలోని జీస్కూల్‌లో చదువుతుంది. ఆమె గొప్పగా చదవాలన్నదే నా కోరిక. ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాం.

భార్య రమాదేవి : ప్రతిరోజూ ఉదయం పాపను తయారు చేసి స్కూల్‌కు పంపడం, నా భర్త బయటికెళ్లే వరకు ఆయన పనులు చేసి పెడతాను. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమవుతుంటాను.  పాప పెంపకంలో ఇద్దరి పాత్ర ఒకే విధంగా ఉంటుంది. మావారు పాపలో ఇప్పటినుంచే తను ఏవిధంగా చదవాలి, ఎలా పనులు చేసుకోవాలనే విషయాల్లో ప్రోత్సహిస్తుంటారు. చదువు, పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement